సీఏ ఫౌండేషన్, సీఏ ఇంటర్మీడియట్ కోర్సులకు సంబంధించి ఐసీఏఐ సీఏ జనవరి ఎగ్జామ్ 2025 తేదీల షెడ్యూల్ ను విడుదల చేశారు. విద్యార్థులు పూర్తి షెడ్యూల్ ను ఐసీఏఐ అధికారిక వెబ్సైట్ icai.org లో చూడవచ్చు.
జనవరి 12 నుంచి పరీక్షలు
అధికారిక షెడ్యూల్ ప్రకారం, 2024 జనవరి 12, 14, 16, 18 తేదీల్లో ఫౌండేషన్ కోర్సు పరీక్ష, గ్రూప్-1కు జనవరి 11, 13, 15 తేదీల్లో ఇంటర్మీడియెట్ కోర్సు పరీక్ష, గ్రూప్-2కు జనవరి 17, 19, 21 తేదీల్లో ఇంటర్మీడియెట్ కోర్సు పరీక్షలు నిర్వహించనున్నారు. ఫౌండేషన్ కోర్సు పేపర్ 1, 2 మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, పేపర్ 3, 4 అన్ని రోజుల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతాయి. అన్ని పేపర్లకు ఇంటర్మీడియెట్ కోర్సు పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి.
ఈ పేపర్లకు అడ్వాన్స్ రీడింగ్ టైమ్ ఉండదు
ఫౌండేషన్ ఎగ్జామినేషన్ పేపర్ 3, పేపర్ 4 లో అడ్వాన్స్ రీడింగ్ సమయం ఉండదన్న విషయం విద్యార్థులు గుర్తుంచుకోవాలి. అయితే పైన పేర్కొన్న అన్ని ఇతర పేపర్లు / పరీక్షల్లో, మధ్యాహ్నం 1.45 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు 15 నిమిషాల అడ్వాన్స్ రీడింగ్ సమయం ఇవ్వబడుతుంది. ఫౌండేషన్, ఇంటర్మీడియెట్ పరీక్షల అభ్యర్థులు పేపర్లకు సమాధానాలు రాయడానికి ఇంగ్లిష్/ హిందీ మాధ్యమాన్ని ఎంచుకోవచ్చు.
నవంబర్ 10 నుంచి అప్లికేషన్లు
ఈ ఐసీఏఐ (ICAI) సీఏ ఫౌండేషన్, ఇంటర్మీడియట్ ఆన్లైన్ పరీక్షల దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 10న ప్రారంభమై ఆలస్య రుసుము లేకుండా నవంబర్ 23, 2024న ముగుస్తుంది. ఆలస్య రుసుము రూ. 600/ లేదా 10 అమెరికన్ డాలర్లతో దరఖాస్తు ఫారాలను సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 26, 2024. ఫౌండేషన్, ఇంటర్మీడియట్ పరీక్షలకు అభ్యర్థులు eservices.icai.org వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవడంతో పాటు అవసరమైన పరీక్ష ఫీజును ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. కరెక్షన్ విండో నవంబర్ 27న ప్రారంభమై 2024 నవంబర్ 29న ముగుస్తుంది. అభ్యర్థులు మరిన్ని వివరాలకు అధికారిక ఐసీఏఐ వెబ్సైట్ icai.org ను చూడవచ్చు.