ఏపీ ఇంటర్ విద్యలో మార్పులకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త సంస్కరణలను తీసుకొచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ఇటీవలే విద్యాశాఖ మంత్రి లోకేశ్ కూడా ఇదే విషయం చెప్పారు. ఇంటర్మీడియట్ విద్యలో సమూల మార్పులు ఉంటాయని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా అడుగులు పడే అవకాశం ఉంది.
ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణలు తీసుకొచ్చే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే కొత్త నిర్ణయాలను అమలు చేయాలని భావిస్తోంది. పరీక్షల విధానంతో పాటు సిలబస్ ను కూడా మార్చేందుకు కసరత్తు జరుగుతోంది. కొత్తగా ఒక్క మార్కు ప్రశ్నలను కూడా తీసుకువచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది.
ఇటీవలే విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విద్యాశాఖ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఇంటర్మీడియట్ విద్యలో సమూల మార్పులు తీసుకువస్తామని కూడా చెప్పారు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎన్‌సీఈఆర్టీ బుక్స్ ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. అకడమిక్ కేలండర్, సిలబస్, అధ్యాపకుల పని విభజన, పరీక్షల షెడ్యూల్, పేరెంట్-టీచర్ మీటింగ్, అధ్యాపకులకు శిక్షణ, విద్యార్థుల అటెండెన్స్, విద్యార్థుల సామర్థ్యం పెంపు వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ నేపథ్యంలోనే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏపీ ఇంటర్ విద్యలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఆర్ట్స్‌లో కొన్ని సబ్జెక్టులు మినహా పూర్తిగా ఎన్‌సీఈఆర్టీ సిలబస్ ఉంటుందని తెలుస్తోంది. కేవలం సిలబస్ మాత్రమే కాకుండా… పరీక్షల విధానంలో కూడా మార్పులు రానున్నాయి.
ముఖ్యంగా ఫస్ట్ ఇయర్ లో ఒక మార్కు ప్రశ్నలను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇవి 20 వరకు ఉండేలా కసరత్తు జరుగుతోంది. సైన్స్ గ్రూప్ సబ్జెక్టుల్లో కూడా ప్రశ్నల సరళి మారే అవకాశం ఉంది. వచ్చే ఏడాది నుంచి అన్ని సబ్జెక్టుల్లోనూ 1, 2, 4, 8 మార్కుల ప్రశ్నలు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఆర్ట్స్ సబ్జెక్ట్ పరీక్షల్లోనూ మార్పులు ఉండనున్నాయి. ఇందుకు సంబంధించిన త్వరలోనే మరింత క్లారిటీ రానుంది.
ఉచిత శిక్షణ:
మరోవైపు ఏపీ ఇంటర్ బోర్డు విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని విద్యార్థులకు ఉచిత ఐఐటీ, నీట్ శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుంది. మొదటి విడతలో రాష్ట్రంలోని నాలుగు ముఖ్య పట్టణాల్లో ఈ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి, వాటి పరిధిలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.
అయితే గతంలో ఎంపిక చేసిన కాలేజీల్లో... అక్కడి జూనియర్ లెక్చరర్లు విద్యార్థులకు ఐఐటీ శిక్షణ ఇచ్చేవారు. ఈసారి నారాయణ కాలేజీలకు చెందిన ఐఐటీ, నీట్ సిలబస్ బోధించే సిబ్బందితో ఈ శిక్షణ ఇప్పించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది.
మొదటగా ఈ 4 కాలేజీల్లో….
మొదటి విడతలో గుంటూరు, కర్నూలు, నెల్లూరు, విశాఖ నగరాల్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ఈ నగరాలకు 5 లేదా 10 కి.మీ పరిధిలోని ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు ఈ అవకాశం కల్పిస్తారు.
ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు నారాయణ సిబ్బంది ప్రత్యేక పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఉచితంగా నీట్, ఐఐటీ శిక్షణ ఇస్తారు. ఈ పరీక్షలో ఎంపికైన విద్యార్థులు నిర్ణీత సెంటర్‌లో ఇంటర్ రెగ్యులర్ తరగతులతో పాటు ఐఐటీ, నీట్ శిక్షణను పొందుతారు.
ప్రత్యేక కేంద్రాల్లో శిక్షణకు హాజరయ్యే విద్యార్థులకు ఆన్‌లైన్‌లో హాజరు నమోదు చేస్తారు. దీంతో అటెండెన్స్ ఇబ్బందులు లేకుండా ఉంటుందని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. గతంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు ఇలాంటి తరహాలో నీట్, ఐఐటీ శిక్షణను ఇంటర్ బోర్డు ఇచ్చింది. ఆసక్తి ఉన్న ప్రభుత్వ లెక్చరర్లతో విద్యార్థులకు శిక్షణ ఇచ్చింది. అయితే ఈ విధానం అంతగా ఫలితాలు ఇవ్వకపోవడంతో ఈ ఏడాది శిక్షణ విధానం మార్చారు. ఆసక్తి గల విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించి ఎంపికైన వారికి ఐఐటీ, నీట్ శిక్షణను నారాయణ విద్యాసంస్థల సిబ్బంది ఇస్తారు.