జనకు జనకు నింట్ల ఉయ్యాలో
సత్యజనకు నింట్ల ఉయ్యాలో
సీత పూట్టినాది ఉయ్యాలో
పుట్తుతా ఆ సీత ఉయ్యాలో
పురుడే గోరింది ఉయ్యాలో
పెరుగుతా ఆ సీత ఉయ్యాలో
పెండ్లే గోరింది ఉయ్యాలో
చిన్న చిన్న మొంటెలల్ల ఉయ్యాలో
చెరగానెర్చినాది ఉయ్యాలో
చిన్న చిన్న బొమ్మరిండ్లు ఉయ్యాలో
కట్ట నెర్చీనాది ఉయ్యాలో
చిన్న బొమ్మల పెండ్లి ఉయ్యాలో
చెయ్య నెర్చినాది ఉయ్యాలో
వెండియచాటలల్ల ఉయ్యాలో
చెరగానెర్చింది ఉయ్యాలో
పెద్ద పెద్ద బొమ్మరిండ్లు ఉయ్యాలో
కట్తా నెర్చింది ఉయ్యాలో
పెద్ద బొమ్మల పెండ్లి ఉయ్యాలో
చెయ్యా నెర్చింది ఉయ్యాలో
తూరుపు రాజులు ఉయ్యాలో
సీతనడగొచ్చిరి ఉయ్యాలో
విల్లు విరిస్తెగాని ఉయ్యాలో
ఇత్తుము సీతను ఉయ్యాలో
విల్లు విరవామాని ఉయ్యాలో
వీగి పొయిరి ఉయ్యాలో
దక్షిణపు రాజులు ఉయ్యాలో
సీతనడగొచ్చిరి ఉయ్యాలో
విల్లు విరిస్తెగాని ఉయ్యాలో
ఇత్తుము సీతను ఉయ్యాలో
విల్లు విరవామాని ఉయ్యాలో
తరలి పోయిరి ఉయ్యాలో
పడమటి రాజులు ఉయ్యాలో
సీతనడగొచ్చిరి ఉయ్యాలో
విల్లు విరిస్తెగాని ఉయ్యాలో
ఇత్తుము సీతను ఉయ్యాలో
విల్లు విరవామాని ఉయ్యాలో
అలిగిపోయిరి ఉయ్యాలో
ఉత్తరపు రాజులు ఉయ్యాలో
రామన్న, లక్ష్మన్న ఉయ్యాలో
సీతనడగొచ్చిరి ఉయ్యాలో
విల్లు విరిస్తెగాని ఉయ్యాలో
ఇత్తుము సీతను ఉయ్యాలో
విల్లు విరిచినాడు ఉయ్యాలో
పెండ్లి అయ్యినాది ఉయ్యాలో