సీబీఎస్ఈ క్లాస్ 10, క్లాస్ 12 పరీక్షలు నేడు ప్రారంభంకానున్నాయి. ఈ బోర్డు పరీక్షలు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 26 దేశాలలో 7,842 కేంద్రాల్లో జరుగుతాయి. పూర్తి వివరాలు..

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షలను ఫిబ్రవరి 15 శనివారం ప్రారంభించనుంది. సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 26 దేశాలలో 7,842 కేంద్రాల్లో జరుగుతాయి.
సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు 2025..
ఈసారి 24,12,072 మంది విద్యార్థులు సీబీఎస్ఈ క్లాస్ 10 పరీక్షల్లో 84 సబ్జెక్టుల్లో పరీక్షలు రాయనుండగా.. 17,88,165 మంది క్లాస్ 12 విద్యార్థులు 120 సబ్జెక్టుల్లో పరీక్షలకు హాజరుకానున్నారు.
2025లో బోర్డు పరీక్షలకు హాజరయ్యే మొత్తం విద్యార్థుల సంఖ్య 42,00,237! గత సంవత్సరం మొత్తం 38,85,542తో పోలిస్తే ఈసారి విద్యార్థుల సంఖ్య 3,14,695 పెరిగింది.
సీబీఎస్ఈ బోర్డు పరీక్షల వివరాలు..
మొదటి రోజు ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఇంగ్లిష్ (కమ్యూనికేటివ్), ఇంగ్లిష్ (లాంగ్వేజ్ అండ్ లిటరేచర్) పేపర్లు జరుగుతాయి. అదే షిఫ్ట్‌లో 12వ తరగతి విద్యార్థులు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పేపర్‌కు హాజరుకానున్నారు.
సీబీఎస్ఈ బోర్డు పరీక్షల మార్గదర్శకాలు..
సీబీఎస్ఈ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 10 గంటల తర్వాత విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉండదు. మధ్యాహ్నం 1:30 గంటల లోపు ఎవరిని బయటకు పంపించరు
రెగ్యులర్ విద్యార్థులు తమ అడ్మిట్ కార్డులతో పాటు పాఠశాల గుర్తింపు కార్డులను తీసుకురావాలని, ప్రైవేట్ విద్యార్థులు తమ అడ్మిట్ కార్డులు, ప్రభుత్వం జారీ చేసిన ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్‌ను చూపించాలని సీబీఎస్ఈ స్పష్టం చేసింది. సాధారణ విద్యార్థులు పాఠశాల యూనిఫాం ధరించాలని, ప్రైవేటు విద్యార్థులు తేలికపాటి దుస్తులు ధరించాలని సూచించింది.
సీబీఎస్ఈ పరీక్షా కేంద్రాల్లో నిషేధిత వస్తువులు..
మొబైల్ ఫోన్లు, బ్లూటూత్ పరికరాలు, ఇయర్ ఫోన్స్, మైక్రోఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, వాలెట్లు, కళ్లజోళ్లు, హ్యాండ్ బ్యాగులు, పౌచ్‌లు వంటి వాటిని సీబీఎస్ఈ పరీక్షా కేంద్రాల్లో పూర్తిగా నిషేధం.
సీసీటీవీ నిఘాతో మెరుగైన భద్రతా చర్యలు..
సీబీఎస్ఈ పరీక్ష సమగ్రతను నిర్ధారించడానికి పరీక్షా కేంద్రాల్లో క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ (సీసీటీవీ) కెమెరాలను అమర్చనున్నట్లు సీబీఎస్ ఛైర్పర్సన్ భరద్వాజ్ వెల్లడించారు. ఒక్కో పరీక్ష గదిలో మొత్తం 24 మంది విద్యార్థులు కూర్చుంటారని, ఇద్దరు ఇన్విజిలేటర్లు పర్యవేక్షిస్తారని భరద్వాజ్ తెలిపారు.
పరీక్షల సమయంలో అన్యాయమైన పద్ధతులను నివారించడానికి, పరిష్కరించడానికి సీబీఎస్ఈ 2023 సెప్టెంబరులో సీసీటీవీ విధానాన్ని ప్రవేశపెట్టింది.
“పరీక్షా కేంద్రాల్లోని ప్రతి 10 గదులకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని అసిస్టెంట్ సూపరింటెండెంట్లు పర్యవేక్షిస్తారు. ఏవైనా అనుచిత సంఘటనలు జరిగితే నివేదించి చర్యలు తీసుకుంటాం. అభ్యర్థన మేరకు సీసీటీవీ ఫుటేజీలను అందించని పాఠశాలలు అన్యాయానికి పాల్పడినట్లుగా పరిగణిస్తాము,” అని భరద్వాజ్ తెలిపారు.
మార్కుల వెరిఫికేషన్, రీవాల్యుయేషన్..
సీబీఎస్ఈ మార్కుల వెరిఫికేషన్ ప్రక్రియను అప్డేట్ చేసింది. విద్యార్థులు తప్పులను సమీక్షించడానికి వారి ఆన్సర్ షీట్స్ ఫోటోకాపీలను నేరుగా అభ్యర్థించడానికి అనుమతిస్తుంది. ఫలితాల ఆధారంగా వారు తమ మార్కుల వెరిఫికేషన్ లేదా పునః మూల్యాంకనాన్ని అభ్యర్థించవచ్చు.
సీబీఎస్ఈ 10వ తరగతి బోర్డు పరీక్షలు మార్చ్ 18న, సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్షలు ఏప్రిల్ 4న ముగియనున్నాయి.