టీజీ ఈఏపీసెట్ - 2025 ఇంజినీరింగ్ స్ట్రీమ్ అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. వెబ్ ఆప్షన్లు ఎంచుకున్న అభ్యర్థులకు మాక్ సీట్లను కేటాయించారు. సెల్ ఫోన్లకు వచ్చిన సందేశాల ద్వారా లేదా tgeapcet.nic.in వెబ్ సైట్ ద్వారా వివరాలను చెక్ చేసుకోవచ్చు.

తెలంగాణ ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ ప్రక్రియ నడుస్తోంది. ఫస్ట్ వెబ్ ఆప్షన్లు పూర్తి కాగా… ఇవాళ మాక్ సీట్లను(ప్రాథమికంగా) కేటాయించనున్నారు. వెబ్ ఆప్షన్లు ఎంచుకున్న అభ్యర్థులు… తమకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో ప్రాథమికంగా తెలుసుకోవచ్చు. ఈ వివరాలను అభ్యర్థుల సెల్ ఫోన్లకు మేసేజ్ రూపంలో పంపించారు. అంతేకాకుండా… https://tgeapcet.nic.in/default.aspx వెబ్ సైట్ లోకి కాలేజీలు, బ్రాంచీల వారీగా చెక్ చేసుకోవచ్చు.
ఈనెల 18న తుది సీట్ల కేటాయింపు
ప్రాథమికంగా ఖరారు చేసిన సీటు విషయంపై అభ్యర్థి సంతృప్తి చెందకపోతే వెబ్ ఆప్షన్లను మార్చుకోవచ్చు. ఈ ప్రక్రియను జూలై 15వ తేదీలోపు పూర్తి చేసుకోవాలి. జూలై 18వ తేదీన ఫైనల్ గా సీటును ఖరారు చేస్తారు.
మాక్ సీట్లు కేటాయింపు విధానంతో విద్యార్థులు తమ ప్రాధాన్యతలను మెరుగుపరుచుకోవడానికి సహాయపడుతుందని టీజీ ఈఏపీసెట్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మాక్ సీట్లను ఖరారు చేయటంతో… విద్యార్థులు ప్రాధాన్యతలను మార్చుకునే అవకాశం కల్పించారు. అంటే జూలై 15వ తేదీలోపు ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.
సెల్ఫ్ రిపోర్టింగ్ తేదీలు…
జూలై 18వ తేదీన ఫస్ట్ ఫేజ్ కు సంబంధించి సీట్లు పొందిన విద్యార్థులు… జూలై 18 నుంచి 22వ తేదీలోపు వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్తారు. టీజీ ఈఏపీసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఫలితాలను చూస్తే... 2,20, 326 మంది దరఖాస్తు చేసుకోగా..2,07, 190 మంది హాజరయ్యారు. వీరిలో 1,51, 779 క్వాలిఫై కాగా... ఉత్తీర్ణత శాతం 73.26గా నమోదైంది. బాలికలు 65, 120 మంది ఉత్తీరులు కాగా... 86,659 మంది బాలురులు క్వాలిఫై అయ్యారు. బాలిక ఉత్తీర్ణత శాతం 73.88గా ఉండగా… బాలురది 72.79 శాతంగా నమోదైంది.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో మొత్తం 1 లక్షా 14 వేల సీట్లు అందుబాటులోకి వచ్చాయి. మొత్తం 21 ప్రభుత్వ కళాశాల్లలో 5,808 సీట్లు, 148 ప్రయివేటు కళాశాలల్లో 99,610 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే 2 ప్రయివేటు వర్శిటీలు కూడా 1,800 సీట్లు ఆఫర్ చేస్తున్నాయి. ఇవి కాకుండా 6,500 సీట్లు ఈడబ్ల్యూఎస్ కోటా సీట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఇంజినీరింగ్ బ్రాంచీల వారీగా కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉన్న సీట్లలో కంప్యూటర్ సైన్స్ సంబంధిత కోర్సులవే అధికం. సీఎస్ఈ 26,150, సీఎస్ఈ (ఏఐ-ఎంఎల్) 12,495 సీట్లు, సీఎస్ఈ (డేటా సైన్స్) కోర్సులో 6,996 సీట్లు, ఐటీ బ్రాంచ్ లో 3,681 సీట్లు, సీఎస్ఈ సైబర్ టెక్నాలజీ బ్రాంచ్ లో 1,439 సీట్లు ఉన్నాయి. అలాగే ఈసీఈలో 10,125 సీట్లు, ట్రిపుల్ ఈలో 4,301 సీట్లు, సివిల్ లో 3,129 సీట్లు, మెకానికల్ లో 3 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.