ఐసెట్ అభ్యర్థులకు శుభవార్త... ఏపీ ఐసెట్ కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని ఎంబిఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఐసెట్ 2024 ప్రవేశ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. ఇక, ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన కౌన్సిలింగ్ ప్రక్రియ నేటి (శుక్రవారం) నుంచి ప్రారంభమవుతుంది. దీనికోసం వచ్చే నెల (ఆగస్టు) 1వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఏపీ ఐసెట్ 2024 కౌన్సిలింగ్‌కు సంబంధించి ఈ నెల (జూలై) 27వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆగస్టు 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక ఉంటుందని అధికారులు తెలిపారు. ఆగస్టు 8వ తేదిన ఆప్షన్లను ఎడిట్ చేసుకునేందుకు అనుమతిస్తారని వివరించారు. ఐసెట్ 2024 మొదటి విడత సీట్ల కేటాయింపు ఆగస్టు10వ తేదిన చేపట్టనున్నట్లు అధికారులు వివరించారు.పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సుల్లో భాగంగా ఎంబిఏ, ఎంసిఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రతి ఏటా ఐసెట్ పరీక్షను నిర్వహిస్తారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్శిటీల పరిధిలో ఉన్న కన్వీనర్ కోటా, ప్రైవేట్, మైనార్టీ, అన్‌ఎయిడెడ్ కళాశాలల్లో ఎంబిఏ, ఎంసీఎ కోర్సులలో ప్రవేశాలు పొందొచ్చు.
ఇక, ఈ ఏడాదికి సంబంధించిన ఏపీ ఐసెట్ 2024 ఫలితాలు ఇప్పటికే వెలువడిన సంగతి తెలిసిందే. నేటి (జూలై 26) నుంచి ఐసెట్ 2024 స్కోర్ కార్డ్‌తో పాటు ఇతర పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఇందుకోసం ఓసీ, బీసీ అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు రూ.1200 చెల్లించాలి. అదే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులయితే రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్ ఫీజును కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లించాలి. అభ్యర్థులు కౌన్సిలింగ్ షెడ్యూల్‌కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఐసెల్ 2024 అధికారిక వెబ్‌సైట్‌ను https://cets.apsche.ap.gov.in/ICET/ICET/ICET_HomePage.aspx లో సంప్రదించగలరు.