బారిష్టరు పార్వతీశం పుట్టుపూర్వోత్తరాలు
1
నర్సాపురం దగ్గిర మొగలితుర్రు మా కాపుర స్థలము. మా ఇంటిపేరు వేమూరు వారు, నా పేరు పార్వతీశం. నేను టెయిలర్ హైస్కూలులో అయిదో ఫారము దాకా చదువుకున్నాను. ఒకటి రెండేళ్ళు ఆ క్లాసులోనే కారణాంతరాల చేత గడపవలసి వచ్చింది. ఆ పిమ్మట ఇక్కడ పాఠశాలలో విద్య ఏమీ బాగుంది కాదనీ, ఉపాధ్యాయులకు తాము చెప్పే సంగతు లేమిటో అవగాహన కావడము లేదనీ, నా అభిప్రాయము. అందుచేత వృధాగా ధనవ్యయమూ కాలవ్యయమూ కాలయాపనా ఎందుకని నేను చదువు మానివేసి మా పెద్దలు సంపాదించిన ఆస్తి కొంత ఉన్నది గనుక సుఖంగా నిర్వ్యాపారంగా, ఇంటి దగ్గిర కూర్చొని, దేశ కాల వైపరీత్యాలను గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని.
ఇలా ఉండగా ఒక రోజున మా స్నేహితు డొకడు వచ్చి మాటలమధ్య ఇంగ్లండు వెళ్ళి చదువుకోమని హితోపదేశము చేశాడు. అతడు వెళ్ళిపోయిన తరువాత ఇంగ్లాండు ప్రయాణమును గురించి చాలాసేపు ఆలోచించి అందులో మంచి చెడ్డలూ, కష్టసుఖాలూ, నాలో నేను తర్కించుకొని అన్ని విధముల చేతనూ దేశాటనము శ్రేయస్కరమని, పైగా మన అధికారుల దేశము వెళ్ళి, వాళ్ళ ఆచార వ్యవహారాలు చూచి, గుట్టూ మట్టూ తెలుసుకొంటే స్వరాజ్య సంపాదనకు వీలుగా ఉంటుందనీ ఆలోచించి, అక్కడకు వెళ్ళి బారిష్టరు చదువు దామని నిశ్చయము చేసుకొన్నాను.
మా తండ్రి వ్యవసాయదారుడు; ఏమీ చదువుకున్న వాడు కాడు; వట్టి అనాగరికుడు; అందుచేత ఇటువంటి విషయము ఆయనతో చెపితే దీని సారస్యము గ్రహించలేడని ఆయనతో చెప్పకుండా ఒక స్నేహితుని దగ్గర కొంత సొమ్ము బదులు పుచ్చుకొని నర్సాపురము వెళ్ళి నాల్గు రోజులలో వస్తానని ఇంటి దగ్గిర చెప్పి బయలుదేరాను.
ఇంగ్లాండు ప్రయాణమని చిన్నప్పుడు పుస్తకములో చదివిన పాఠమువల్లా, తరువాత చదివిన భూగోళ శాస్త్రమువల్లా, ఆ దేశానికి వెళ్ళే మార్గము నాకు తెలుసును. కాని అక్కడికి తీసుకొని వెళ్ళవలసిన సాధన సామగ్రి ఏమిటో, అక్కడ ఎలా నడుచుకోవాలో, తెలుసుకుందా మంటే చెప్పడానికి ఎరిగివున్న వాళ్ళూ ఎవ్వరూ లేకపోయినారు. నరసాపురములో ఉన్న దొరల నెవరినైనా అడుగుదామా అంటే నా అజ్ఞానాన్ని చూచి వాళ్ళు నవ్వుతారేమోనని వాళ్ళ నడగడము మానివేసి నాసహజ సూక్ష్మబుద్ధి ఉపయోగించి నాకు తోచిన వస్తువులు కొన్ని ఇక్కడనుంచి తీసుకు వెళ్ళితే ఇంకా కావలసినవి త్రోవలోనో, అక్కడకు వెళ్ళిన తరువాతనో, కొనుక్కోవచ్చుననుకున్నాను. అందుకని, అనవసరముగా విశేషంగా డబ్బు ఇక్కడ ఖర్చు పెట్టకూడ దనుకొని, సూక్ష్మములో తేల్చవలెనని కావలసినవి ఏమిటా అని జాగ్రత్తగా ఆలోచించాను.
ఎంతసేపు ఆలోచించినా సరిగా ఏమీ తోచలేదు. ఏదో ఒకచివరనుంచి ఆరంభిస్తే కావలసినవన్నీ తేలుతవికదా అనుకొన్నాను. అందుకని నిద్ర లేవడముతోనే కావలసిన సామాన్లు జాబితా వ్రాసుకొన్నాను. దంత ధావనానికి పది కచ్చికలు నలిపిన పొడుమూ, నాలుక గీసుకోవడానికి కాసిని తాటాకు ముక్కలూ, చిన్న ఇత్తడి చెంబూ, దంత ధావనమైన తరువాత స్నానముకదా అనుకొన్నాను. అందు కవసరమైనవి ఒళ్ళు తుడుచుకోటానికి రెండు అంగవస్త్రాలు; స్నానానంతరము తలకు రాసుకోడానికి సీసాలో పోసి కొంచెము కొబ్బరి నూనె; తల దువ్వుకోడానికి దేశవాళి దువ్వెన్న, బొట్టు పెట్టుకోడానికి కొబ్బరి చిప్పలో కొంచెము చాదు; ముఖము చూచుకోడానికి పావలాపెట్టి చిన్న అద్దము. తరువాత ఆలోచించవలసినది దుస్తుల విషయముకదా! అందుకు నాకవసరమని తోచినవి నాలుగు ట్విల్ షర్ ట్లూ; రెండు టైలూ; రెండు మేజోళ్ళ జతలూ (నూలువి); మూడున్నర పెట్టి బూడ్సుజోడూ; అక్కడ సూట్సు అవసరము గనుకనూ, చలిదేశము గనుకనూ, పదిహేను రూపాయలు ఖర్చుపెట్టినా గుడ్డ కొంచెము బాగుండడముచేత కుట్టువాడు తన అవసరానికి కొంత మిగుల్చుకొనడమువల్ల నాకు చాలీ చాలకుండా తయారైన ప్లానలు సూట్లు రెండు. ఇంగ్లండు వెళ్ళితే మట్టుకు మన వేషము పూర్తిగా ఎందుకు మానవలెనని సాధ్యమైనంతవరకూ స్వదేశ పద్ధతి అవలంబింతామని తలగుడ్డగా ఉపయోగించడానికి ఎనిమిది గజముల ఎర్రని జపాను సిల్కు. ఇంక ధరించవలసిన దుస్తులయిన తరువాత ఆలోచించవలసినది భోజనముకదా అనుకొన్నాను. అందు కవసరమైనది ముందు మంచి నీళ్ళు తాగడానికి మరచెంబు. అక్కడికి వెళ్ళిన తరువాత వాళ్ళచేతి మాలకూడు తినకుండా మనమే స్వయంపాకము చేసుకుంటే బాగుంటుందికదా అనుకొన్నాను. అక్కడగూడ అన్నము ఎలా దొరకదుకదా! రొట్టెలు కాల్చుకు తినవలసిందే గనుక కొంత గోధుమ పిండి; కొంచెము నెయ్యి! రొట్టెలో నంచుకోడానికి కొంచెము ఆవకాయ, రొట్టెలు కాల్చుకోడానికి చిన్న అట్లపెనము; స్టవ్, స్టవ్ లో పోసుకోడానికి కిరసనాయిలు, చిన్న సీసాలో స్పిరిటూ. భోజన సామగ్రి అయిన తరువాత పడకకు కావలసిన సామాన్లను గురించి ఆలోచించాను. వెళ్ళేది చలి దేశం కదా; కింద పడుకోడానికి కష్టముగా ఉంటుందని నర్సారావుపేట మడతమంచము; దానిమీద పక్కకి నేను మామూలుగా ఉపయోగించుకొనే బొంత--ఇంట్లో కుట్టినది--కప్పుకోడానికి నారింజపండు రంగు శాలువ.
ఇవిగాక యింకా ఏమి అవసర ముంటవని ఆలోచించగా మామూలుగా పగలు కూర్చోడానికి తుంగచాప తీసుకుని వెళ్ళితే బాగుంటుందని తోచింది. అక్కడికి వెళ్ళినా హిందూధర్మ విరుద్ధంగా ప్రవర్తించ దలుచుకోలేదు గనుక అక్కడ దొరకవనే భయముతో ఆరు యజ్ఞోపవీతాల జతలూ, మూడు పట్టు మొలతాళ్ళూ కూడ తీసుకొని వెళ్ళడము చాలా అవసరమని తోచింది. ఇంక ఎంతసేపు ఆలోచించినా తీసుకొని వెళ్ళవలసిన వేవీ కనపడలేదు. ఇదంతా చూసి కొందరికి చాదస్తముగా కనబడవచ్చు. కాని వెళ్ళేది దూరదేశము. ఏ చిన్న వస్తువు మరచిపోయినా అక్కడ ఇబ్బంది పడవలసి వస్తుందని, మొదటి నుంచీ ఎక్కువ జాగ్రత్త కలవాడిని కనుక చాలా దూరాలోచన చేసి ఇవన్నీ తీసుకొని వెళ్ళాను. ఇంక ఈ వస్తువులన్నీ పెట్టుకోడానికి ఎక్కడయినా కూలివాడు దొరికినా దొరకకపోయినా, నేను తీసుకు వెళ్ళడానికి తేలికగా ఉంటుందని, చిన్ని సీనా రేకు పెట్టె చేయించి చక్కని బంతిపూవు రంగు వేయించాను. ఈ సామగ్రి అంతా జాగ్రత్తగా పెట్టెలో సవరించుకొని, శుభదినము నిశ్చయించుకొని, వర్జము లేకుండా కూడా చూసుకొని శకునము మంచి దయ్యేవరకూ వాకిట్లో కూర్చుని బండి ఎక్కి పడవల రేవుకు వెళ్ళాను.
మొగలితుర్రు, నర్సాపురము, ఇంకా చుట్టుపట్ల గ్రామములు రెండు మూడు తప్ప ఎప్పుడూ ఎక్కడికీ వెళ్ళిన వాడిని కాను. ఇంత కాలము నర్సాపురములో ఉన్నా ఎప్పుడూ పడవలైనా ఎక్కవలసిన అవసరము లేకపోయింది. ఇవ్వాళ పడవలో కూర్చుని వెళ్ళుతూ ఉంటే మహా సరదాగా వుంది. స్టీమరు మీద వెళ్ళడ మన్నా యింతే కదా అనుకొన్నాను. రాత్రి దారిలో మినప రొట్టీ, సాతాళించిన సెనగలూ కొనుక్కుతింటూ ఇంగ్లండులో మినపరొట్టె ఉంటుందా, ఉండదా అని ఆలోచిస్తూ ఇంగ్లండు నుంచి తిరిగివచ్చిన తరువాత ఏ విధంగా దేశోపకారము చేద్దామా అనుకుంటూ, నిద్రపోయినాను. తెల్లవారేసరికి పడవ నిడదవోలు చేరింది.
మెళుకువ రావడముతోటే నేను తలపెట్టిన మహత్కార్యము జ్ఞప్తికి తెచ్చుకొని దీర్ఘ నిశ్వాసము విడిచి త్వరగా స్టేషనుకు వెళ్ళి అక్కడ నిలబడ్డ ఒక పెద్దమనిషిని సంబోధించి 'టిక్కెట్టు ఇవ్వండి త్వరగా' అన్నాను.
'ఏమిటా హడావిడి! ఎక్కడికి? ఏ రైలుకు?' అని ఆరంభించాడు ఆయన.
నేనెక్కడికి వెళ్ళితే ఎందు కాయనకు? నా వ్యవహారమంతా ఆయనతోటి చెప్పితే గుట్టు బయలు పడుతుందని--
'సరే అదంతా ఎందుకు లెండి ఇప్పుడు-టిక్కట్టు త్వరగా ఇప్పించండి ' అన్నాను. నన్ను ఎగాదిగా చూసి 'టిక్కట్టు ఇచ్చే ఆయన ఇంకా రాలేదు. కాస్సేపు ఉండ ' మన్నాడు.
కొంచం సేపైన తరవాత ఆయన వచ్చినట్లు తెలుసుకొని వెళ్ళి టిక్కట్టు ఇమ్మన్నాను. ఆయన కూడా 'ఎక్కడికి ' అన్నాడు.
'చెపుతాలెండి, టిక్కట్టు ఇవ్వండి.'
'ఏమయ్యా ఈ అళవు! యా వూరు పోతావయ్యా?'
'నే నేవూరు వెళ్ళితే మీకెందుకు? టిక్కట్టు ఇవ్వండి.'
దగ్గిర ఉన్న వాళ్ళందరూ నవ్వడము మొదలు పెట్టారు.
'ఇది ఎక్కడయ్యా! వట్టి నాటుపురము మాదిరి ఉండావే!
నీవు ఎక్కడ పూడ్చేది చెప్పకపోతే టిక్కట్టు ఎష్ట్లదా ఇచ్చేదయ్యా? పో అయ్యా, బుద్ధి లేదువలే ఉంది. వాండ్లంతా కాచుకున్నారు ' అని కేకలు వేశాడు.
దగ్గిర ఉన్నవాళ్ళంతా నన్ను మందలించారు.
'ఈ రైలు చాలా దూరము వెడుతుందండి; చాలా చోట్ల ఆగుతుంది. అందుచేత ఏ వూరు మీరు వెళ్ళాలో చెపితే ఆ వూరుకే టిక్కెట్టు ఇస్తారు' అని ఒక పెద్ద మనిషి నిమ్మళంగా హితోపదేశము చేశాడు.
ఆయన చెప్పిన మాటలు నాకు సబబుగానే ఉన్నట్టు తోచింది. అందుచేత టిక్కట్టు యిచ్చే ఆయనతోటి 'చెన్నపట్టణము వెళ్ళాలి' అని చెప్పాను.
అనేసరికి కండ్లెర్రజేసి 'ఎన్న అయ్యా యిది, ఈ పొద్దు ఎక్కడ వచ్చావయ్యా, వట్టి జంతువలె వుండావు! పో అయ్యా! జల్ది పో అయ్యా! వాళ్ళంతా కాసుకొన్నారు. పొమ్మంటే ఏందయ్యా అట్లా మూతి పెట్టి సూస్తావు? పట్నంబండి సాయంకాలం వరకూ రాదయ్యా, అప్పుడుదాకా యెక్కడనైనా పండుకొని తూంగు అయ్యా' అన్నాడు.
నా దగ్గిర వాళ్ళంతా నన్నవతలికి తోశేశారు. పోనీ కొంచెము సమ్మర్దము తగ్గిన తరువాత మళ్ళీ వద్దామని వెళ్ళాను. రైలుకు కాబోలు గంట కొట్టారు. అప్పుడు మళ్ళీ వెళ్ళి 'పట్నం బండి ఎప్పుడు వస్తుందండీ' అన్నాను.
'సాయంకాలము ' అన్నాడు ఆయన.
'అలాగా, సాయంత్రము దాకా వుండాలా! నాకు తొందర పని ఉందే!'
అప్పుడు నా మొఖము కేసి చూసి 'ఓ! తిరిగి వస్తివా! తొందరపని ఉంటే నడిచిపో ' అని కిటికీ తలుపు వేసుకుని చక్కా పోయినాడు, మాష్టరు.
నా మీద కోపముచేత ఇలా అంటున్నాడేమో, ఈసారి నెమ్మదిగా అడిగి నిజము తెలుసుకొందామని ముందుకు వెళ్ళి ఎదురుగా నిలబడి మాట్లాడుదామని నోరు తెరిచేసరికి ఆయనే, 'వస్తివా, పట్నంబండి ఎప్పుడు వచ్చేదీ తెలుసుకొనే దానికి వస్తివా! ఒకసారి చెపితే నీకు బుద్ధి లేదూ! అని ఆరంభించాడు. అసలే అరవవాళ్ళంటే నాకు కోపము, అందులో ఆయన ముఖము స్ఫోటకము మచ్చలతోటి నల్లగా మరీ అసహ్యంగా వున్నది. నే నూరికే తెలియని విషయము నెమ్మదిగా అడుగుతూ ఉంటే ఆయన అంత మర్యాద తెలియకుండా మాట్లాడుతా డేమని నాకు కోపం వచ్చింది. 'నేను ఇంగ్లండు వెడుతున్నాను, జాగ్రత్త!' అని చెబుదా మనుకొన్నాను. కాని ఆయనను ఇంతకంటే ఏడిపిస్తే బాగుండదని తోచింది. అందుకని 'అబ్బే నేను రై సంగతి అడగడానికి రాలేదండీ. మిమ్మలిని చూస్తే ఏమి జ్ఞాపకము వస్తుందో చెప్పడానికి వచ్చానండీ ' అన్నాను.
'ఏం జ్ఞాపకము వస్తున్నది?'
'మీ మొహము చూస్తే ఉలి ఆడిన తిరగటిరాయా, మీ తలకాయ చూస్తే సున్నపు పిడతా జ్ఞాపకము వస్తున్న ' వన్నాను.
అక్కడ ఉన్న నౌకరులు ఏకంగా పక్కున నవ్వారు. ఆయనకు ఉడుకుమోతు తనము వచ్చి నన్ను కొట్టడానికి వచ్చాడు. నేను పారిపోయాను.
అక్కడనుంచి తిన్నగా దగ్గిర వున్న హోటలుకు వెళ్ళి భోజనము చేసి కాస్సేపు పడుకున్నాను. లేచి ఒకసారి బజారు చూసివద్దా మని వెళ్ళాను అక్కడ అటూ యిటూ తిరుగుతూ ఉండగా అవసరమైన వస్తువులు రెండు మరిచి పోయినట్లు జ్ఞాపకము వచ్చింది. అవేమిటంటే, గదికి తాళము వేసుకోడానికి చిన్న ఇత్తడి తాళమూ, స్నానానంతరము బట్టలు ఆరవేసుకోడానికి కొబ్బరిపీచుచేంతాడూ, బట్టలు తగిలించుకోడానికి నాలుగు పెద్దమేకులూ. ఈ మూడు వస్తువులూ కొనుక్కుని మళ్ళీ బసకు చేరుకుని సాయంకాలము కాగానే పెందరాడే భోజనము చేసి స్టేషన్ కు వచ్చాను. టిక్కట్ల వేళ అయింది.
నేను వెళ్ళి చెన్నపట్నానికి టిక్కట్టు పుచ్చుకొన్నాను. ఇవతలకు వచ్చేటప్పటికి ఒక రైలు వచ్చింది. అక్కడ నౌకరు ఉంటే అతన్ని, ఈ రైలు ఎక్కవచ్చునా? అన్నాను.
'మీ రేఊరు వెడతారు?' అన్నాడు వాడు.
'నీ కెందు కా ప్రశంస?' అని చక్కా పోయాను.
అక్కడొక పద్దమనిషి ఉంటే, ఆయన్నే అడిగాను -ఈ రైలు ఎక్కవచ్చునా?' అని. ఆయనా అదేప్రశ్న వేశాడుమీరేఊరికి వెళ్ళుతారని, నాకు ఒళ్ళుమండి మాట్లాడకుండా తిన్నగా స్టేషన్ మాస్టరుగారి దగ్గిరకు వెళ్ళి ఆయన్ని అడిగాను. ఆయన కూడా 'ఎక్కడికి వెళ్ళా ' లన్నారు. టికెట్టు ఇవ్వడానికంటే ఊరుపేరు చెప్పితేనేకాని ఇవ్వడానికి వీలులేదంటే చెప్పాను. టిక్కట్టు కొన్న తరవాత కూడా వీళ్ళకీ పరీక్షలన్నీ ఎందుకూ? వీళ్ళరోగము కుదురుద్దామని 'రాజమహేంద్రవరాని ' కన్నాను. అయితే 'ఎక్కవచ్చు ' నన్నాడు. ఎక్కాను. రైలు కదలబోతూ ఉన్నది. స్టేషన్ మాష్టరు అక్కడే ఉన్నాడు. రైలు కదిలించి.
ఆయన్ని పిలిచి 'ఏమండోయ్, మీకు తగిన శాస్తి చేశాలెండి. నేను రాజమహేంద్ర వరము వెళ్ళడములేదు. చెన్నపట్నం వెళ్ళుతున్నాను ' అని నవ్వుతూ చెప్పాను.
ఆయన ఆపాళంగా ఈలవేసి రైలు ఆపి నన్ను దిగమన్నాడు. నేను దిగనన్నాను.
'త్వరగా దిగవయ్యా, ఆలస్య మవుతున్నది '
'నేనెందుకు దిగాలి?'
'ఈ రైలు చెన్నపట్నం వెళ్ళదు, వేరే వస్తుంది. వట్టి ఫూల్ లాగా ఉన్నావు. దిగు. '
'ఫూల్ గీల్ అని మాటలు మిగలకండి. నేను దిగను ' అంటే రైలులో వాళ్ళంతా నవ్వడము మొదలు పెట్టారు. ఇంతలోనే గార్డు వచ్చాడు. నన్ను బలవంతంగా దించారు. రైలు వెళ్ళి పోయింది. నా కళ్ళవెంబడి నీళ్ళు వచ్చినవి. స్టేషన్ మాష్టరు కొంచెము చీవాట్లువేసి పట్నంబండి యింకొక పావు గంటలో వస్తుం దని ధైర్యము చెప్పాడు. కొంచె మించు మించులో ఆయన చెప్పినట్టుగానే రైలు వచ్చింది. ఆగీ ఆగడములో ఎదురుగుండా వున్న పెట్టెలోకి నా సామానునెత్తినపెట్టుకుని ఎక్కబోయాను. ఒకమెట్టు ఎక్కి రెండమెట్టుమీద కాలు వెయ్యబోతూ వుంటే వెనక నుంచి ఎవరో తోశారు. ఆ అదురుకు నానెత్తిమీద ఉన్న సామాను, నావెనక ఉన్నవాడి నెత్తిమీద పడి అక్కడైనా ఆగకుండ కింద ఎవళ్ళో కాళ్ళమీద దభీ మని పడ్డది. నేను సామానుకోసము వెనుక్కు తిరిగి చూశాను. ఆపళంగా చెయ్యిజారి నావెనక వాడిమీద నేనూ, నావెనుకవాడు నా సహితంగా వాడి వెనుక వాళ్ళమీద విరుచుకు పడ్డాము. మేము కింద పడ్డామని జాలి పడడానికి బదులు మమ్మల్ని తిట్టడము మొదలు పెట్టారు. కొందరు మామీదనుంచి నడిచిపోయి రైలెక్కారు నేను లేచి నిమ్మళంగా సామాను సర్దుకుని ఎక్కడెక్కడ దెబ్బలు తగిలినవో సావకాశంగా రైలు ఎక్కిన తరువాత చూసుకోవచ్చునని ముందు రై లెక్కాను.
రైలెక్కి సామాను పైన పెట్టు కొంటున్నాను. హఠాత్తుగా రైలు కదిలించి. నావెనుక బల్లమీద కూర్చున్న ఆడమనిషి ఒళ్ళో పడ్డాను. ఆవిడ నాలుగు ఆశీర్వవచనముల తోటి ముందుకు గెంటింది నా ఎదుట బల్లమీద సుఖంగా చుట్ట కాల్చుకుంటూ, అరమోడ్పు కన్నులతో ఆనందపరవశుడై ఉన్న కాపుమీద పడ్డాను. ఆ చుట్ట నా బుగ్గకు తగిలి చురుక్కు మన్నది. నేను మొర్రో అన్నాను. ఆనందసమాధిలో నుంచి కొంచెము మెలుకువ తెచ్చుకుని అతను ఆనందము ఇంత బరువెక్కిందేమో అని చూచాడు కాబోలు, కెవ్వుమని కేకవేసి ఏపామో మీద పడితే తోసివేసినట్టు నన్ను తోసివేశాడు. ఎదుట ఉన్న చంటిపిల్లపైన పడబోయి ఆపిల్ల నలిగిపోతుందేమోననే భయముతో ఎలాగో తప్పించుకుని తల్లిమీద పడ్డాను. మళ్ళీ ఆవిడా తోసెయ్య పోతుంటే గట్టిగా ఆవిడ మెడ పట్టు కొన్నాను. రైలులో వాళ్ళంతా కడుపు చెక్కలయ్యేటట్టు నవ్వడము ఆరంభించారు. ఆ అమ్మాయి పెనిమిటి పక్కనే ఉన్నాడు. ఉగ్రుడై లేచి నన్నూ తనభార్యని ఎవళ్ళకి వాళ్ళని ప్రత్యేకముగా విడదీసి నన్ను తిట్టడము మొదలు పెట్టాడు. నా తప్పు ఏమీలేదని, అతని భార్య అన్న సంగతి నాకు తెలియలేదనీ, తెలిస్తే అలా కౌగిలించుకోక పోయేవాడినే ననీ, ఇదివర కెప్పుడూ అల్లా చెయ్యలేదనీ, ఇక ముందెప్పుడూ చెయ్యననీ, గజగజ వణకుతూ చేతులు జోడించి క్షమాపణ చెప్పాను. తక్కిన వాళ్ళంతా కూడా నన్ను చూచి జాలిపడి, నేను కౌగలించుకొన్న అమ్మాయి భర్తను మందలించి నా తప్పు ఏమీలేదనీ, పొరపాటున కౌగిలించుకొన్నాననీ, పొరపాటెవ్వళ్లకయినా వస్తుందనీ, ఇవ్వాళ ఈయన అయినాడు, రేపు ఇంకొకళ్ళు కౌగలించుకో వచ్చు(పొరపాటున) ననీ, ఈ మాత్రము దాని కాయన అంత కోపపడవలసిన పనిలేదనీ ఇత్యాది కోపోపశమన వాక్యాలతో ఆ పెద్దమనిషిని శాంతింప జేశారు.
ఇంకా నేను నిలబడి ఉంటే ఎవళ్ళని కౌగలించుకొంటానో అని భయపడి నాకు కూర్చోడానికి కొంచెము స్థలము ఇచ్చారు. పైబల్ల మీద నా పెట్టెపెట్టి దానిమీద మడత మంచమూ, చాపా, పెట్టి ఇవన్నీ కలిపి పైనగొలుసు కనబడితే, దానికీ వీట్లకీ, సాయంత్రము కొన్న చేంతాడు వేసి, లాగి, బిగించి కట్టాను. ఇంక సామాన్లకి ఫరవాలేదు గదా అని సుఖంగా కూర్చున్నాను.
ఇంతట్లోకే ఎందుకో రైలు ఆగింది. అంతా తొంగి చూశారు. ఇంకొక క్షణానికి గార్డులు ఇద్దరూ మాపెట్టెలోకి వచ్చి గొలుసు ఎవరు లాగా రన్నారు ఎవ్వరూ మాట్లాడలేదు. పైకి చూశారు. నా సామానుకేసి చూపించి 'ఈ సామానెవరిది ' అన్నారు. మళ్ళీ ఏమి పుట్టి మునిగిందో అని హడులుతూ, 'నాదేను ' అన్నాను.
'ఎందు కలా గొలుసుకు కట్టావు?'
'సామాను రైలు కుదుపునకు కింద పడిపోకుండాను, జాగ్రత్తగా ఉంటుందని అలా కట్టా.'
పెట్టెలో వాళ్ళంతా ఊరికే నవ్వడ మారంభించారు. గార్డు యాభైరూపాయిలు జరిమానా ఇవ్వమన్నాడు. 'నాదగ్గి రేమీ లేదు, ఇచ్చుకోలేను, క్షమించ ' మని ప్రాధేయ పడ్డాను. ఆఖరుకు ఎలాగైతే నేమి నా సామాను గొలుసుని విప్పివేయ మని వాళ్ళు చక్కా పోయినారు. వాళ్ళు వెళ్ళిన తరువాత నా అపరాధమేమిటని పక్కన ఉన్నవాళ్లనడిగి తెలుసు కున్నాను. అక్కడ గొలుసు కాస్త లాగితే రైలు అలా ఆగుతుందా అనుకున్నాను. యింక కాస్సేపటికి రైలు మళ్ళీ ఆగింది. నాపెట్టెలో కొందరు దిగారు. మరికొందరెక్కారు. కాస్సేపు ఉండి మళ్ళీ బండి బయలుదేరింది. నాపక్కన ఒక బ్రాహ్మణ వితంతువు సుమారు నలభై సంవత్సరముల మనిషి నావైపు వీపుపెట్టి, కాళ్ళు బల్ల మీదికి చాచుకొని కూర్చుంది. కొంతసేపటికి కునికి పాట్లు పడడము మొదలు పెట్టింది. మనదేశ దారిద్ర్యము, ప్రజల అజ్ఞానము, వితంతువుల దుర్భర అవస్థ, ఇత్యాది విషయాలను గురించి ఆలోచిస్తూ, ఈ దేశము ఎప్పుడు ఏ రీతిని బాగుపడుతుందా అనుకుంటూ- అయినా మంచికాలము సమీపిస్తున్నది. నేను మూడు నాలుగు సంవత్సరములలో స్వదేశానికి తిరిగివచ్చి ఈ కష్టాలను తొలగిస్తా ననుకొంటూ నేనూ నిద్ర పోయినాను. రకరకాల కలలు వచ్చినవి. కొంత సేపటికి మెళు కువ వచ్చింది. నాపక్కన ఉన్న బ్రాహ్మణ వితంతువు వీపున జార్లబడి ఇంతసేపూ నిద్రపోయినట్లు తెలుసుకున్నాను. ఆవిడ ఇంకా నిద్రపోతూనే ఉన్నది. ఆవిడ వీపున ఇంతసేపూ జార్లా బడ్డందుకు సిగ్గుపడి హఠాత్తుగా లేచి కూర్చున్నాను. పాపము ఆవిడ నన్నానుకొని నిద్రపోతూ ఉన్నది కాబోలు, ఆ సంగతి నా కేమితెలుసును? నేనులేపడముతోటే వెనుకకు ఆవిడ నా ఒళ్ళో పడ్డది. పడగానే ఆవిడ 'గోవిందా, గోవిందా ' అని లేవబోయి మళ్ళీ వెనుకకు పడ్డది. ఆవిడ లేవడానికి పునః ప్రయత్నము చేస్తూఉంటే, పాపము మళ్ళీ పడుతుందేమోనని నా చెయ్యి ఆవిడ వీపుకు బోటుపెట్టి ముందుకు కొంచెము తోశాను. లేచి నా సహాయమువల్ల లేచాను గదా అని సంతోషించడానికి బదులు, కోపంగా 'అదేమిటి అబ్బాయి, కొంచెము దూరంగా కూర్చో కూడదూ, ఊరికే మీదికి రాకపోతే? నీకు తోడబుట్టినవాళ్ళు లేరూ? ఇల్లు బయలుదేరి రావడమే చాలు నే ఒక్కతెనూ; నా బ్రతుకు అంతా ఇలాగనే వెళ్ళుతున్నది. దారిలో ఎరిగున్న వాళ్ళెవరై నా కనబడక పోతారా అని నేటికి తెగించి తిరుపతి వెడదామని బయలుదేరి నందుకు ఈ అవస్థలన్నీ పడవలసి వచ్చింది! ఆ మహారాజు ఉంటే ఇంత అవస్థ లేకపోయేది కదా! చచ్చి స్వర్గాన ఉన్నారు. ఎప్పుడు రాత్రిళ్ళు రైలులో ప్రయాణము చేసినా, ఒసేవ్ నీకు మేలుకుంటే జబ్బు చేస్తుంది, ఎలాగో కాస్త సందుచేసుకొని నడ్డివాల్చ మనేవారు ' అని ఒక మాటు కళ్ళద్దుకొని ఒక మాటు ముక్కు తుడుచుకొని మళ్ళీ ఆవిడ కునికి పాట్లు పడడము మొదలు పెట్టింది.
నేను లఘుశంకకు వెళ్ళవలసి వచ్చింది. ఎక్కడికి వెళ్ళడానికీ, ఏమి చేయడానికీ తోచింది కాదు. ఒక్కమాటు రైలు ఆపితే బాగుండును. దిగి వెళ్ళి రావచ్చు ననుకొన్నాను. గొలుసు లాగుదామా అనుకొని, ఏభైరూపాయలు జరిమానా మాట జ్ఞాపకం వచ్చి తిన్నగా కిటికీ దగ్గరికివెళ్ళి రైలు ఒక్క మాటు ఆపమని గార్డుగారిని కేకవేశాను. నాకేక ఎవళ్ళకీ వినపడ లేదు. కడుపు ఉబ్బుకు వస్తోంది. ఏమీ తోచింది కాదు. అక్కడ కూర్చున్న పెద్దమనిషి నొకాయనను పలకరించి, నా అవస్థ చెప్పి 'ఇలా కేకవేశాను. ఎవళ్ళూ పలకలేదు. ఎలాగు' అని అడిగాను. ఆయన నవ్వి 'అబ్బాయీ, వట్టి వెర్రివాడివలె వున్నావు. మనకు కావలసిన చోటల్లా రైలు ఆపరు. ఇక్కడే గది ఉంది. ఒకటికి వెళ్ళవలసి వచ్చినా, రెంటికి వెళ్ళవలసి వచ్చినా, ఆ గదిలోనికి వెళ్ళవచ్చునని' చెప్పి గది చూపించారు.
వెళ్ళి, వచ్చి కూర్చుని కాస్సేపు కునికిపాట్లు పడేసరికి తెల్ల వారింది. చక్కగా రైలు ప్రతి స్టేషనులోనూ ఆగడము, ఎక్కే జనానికి దిగే జనానికి తగిన సౌకర్యము, రైలులో కూర్చున్న వాళ్ళు మళ్ళీ దిగనక్కర లేకుండా అందులోనే పాయఖానా, ప్రతి స్టేషనులోనూ జనానికి అత్యవసరమైన పదార్థాలన్నీ అమ్మరావడము; అన్ని ఏర్పాట్లూ బహు బాగున్నవను కొన్నాను. అందుకనే ఇంగ్లీషువాళ్ళు అంత గొప్ప వాళ్లయినా రనుపించింది.
ఇలా ఉండగా ఉదయము తొమ్మిది గంటలయే సరికి బేసిన్ బ్రిడ్జి అనే స్టేషన్ వచ్చింది. నేను స్టేషన్ లో దిగేజనాన్ని చూస్తూ నిలబడ్డాను. ఒకాయన నల్లదొర నా దగ్గిరికి వచ్చి టిక్కట్టు ఇమ్మన్నాడు. ఇచ్చాను. చూచి మాట్లాడకుండా జేబులో వేసుకున్నాడు. ఇదేమిటిరా టిక్కట్టు తీసుకు పోతున్నాడు. ఏమన్నా గట్టిగా అడగ డానికైనా-నల్లగా ఉన్నా--దొర కూడాను! నా గతి ఏమికాను? ఎలాగని హడిలిపోయి వాడి వెంబడి పడ్డాను. నా టిక్కట్టు నా కిమ్మని ప్రాధేయ పడ్డాను. వాడు నన్ను కోపముతో పొమ్మన్నాడు. వాడు పొమ్మన్నంత మాత్రాన ఎంత అభిమానముగా ఉన్నా ఎలా పోను? టిక్కట్టు వాడి చేతిలో చిక్కుపడి పోయింది. అందుకని అభిమానము చంపుకొని వాడిని వెంబడించాను. ఆఖరుకు రైలు కదిలే వేళయింది. ఇంకొక నలుగురైదుగురు నల్లదొరలు చేరారు. 'దయచేసి నా టిక్కట్టు ఇప్పించండి ' అన్నాను.
'Get away man, you seem to be a fool' అన్నాడు.
'అయ్యా నాటిక్కట్టు యిప్పించి మీరెన్ని తిట్టినా పడతాను. నా టిక్కట్టు ఇవ్వరు, పైగా తిడతారేమండీ ' అన్నాను ఒళ్ళుమండి. రైలు కూసింది.
'Get in man. You have no bloody fear. Nobody will ask you' అని నన్ను రైలులోకి తోశారు.
రైలు కదిలింది-ఏమి చెయ్యడానికి గత్యంతరము తోచలేదు. స్టేషన్ లో ఆ దొరలంతా కడుపులు పట్టుకుని నవ్వు కుంటున్నారు-నేను దిగుదామా అని ప్రయత్నము చేశాను-నా పక్కనున్నాయన నన్ను ఆపి, ఏమిటి సంగతి అని అడిగాడు-ఆయన తోటి చెప్పాను, ఇలా టిక్కెట్టు తీసుకుపోయి ఇవ్వలేదని. అప్పుడాయన నవ్వి, వచ్చే స్టేషనే చెన్నపట్నము, అక్కడే అంతా దిగిపోవడము- అందుకని అక్కడ కంగారుగా ఉంటుందని; టిక్కట్లన్నీ ఇక్కడే వసూలు చేస్తారు- నీకే భయము లేదని అభయ మిచ్చాడు. సరే ఎటు పోయి ఎటు వచ్చినా అందరి దగ్గిరాకూడా టిక్కట్లు పుచ్చుకున్నారని చెప్పారు గనుక వారికి లేనిభయము నాకెందుకని ధైర్యము తెచ్చుకుని కూర్చున్నాను. ఇంతలోనె చెన్నపట్నము చేరాము.

2
రైలు ఆగీ ఆగడముతో వందమంది కూలీలు సామాను ఏమన్నా ఉందా అంటూ రైలులోకి వచ్చిపడ్డారు. పెట్టె నెత్తిన బెట్టుకొని నేనూ దిగాను. నా చుట్టూ ఇరవై మంది కూలీలు చేరి, నేను తీసుకు వస్తా నంటే నేను తీసుకు వస్తానని నా నెత్తిమీదివి లాక్కుని వాళ్లల్లో వాళ్లు దెబ్బలాడుకుని ఆఖరుకు ఒకడా సామాను పుచ్చుకొని పరుగెత్తాడు. సామాను తీసుకొని పారిపోతాడేమో నని గబగబ పరుగెత్తి వాడి నందుకున్నాను. ఆగ మంటే ఆగడు, ఎంత ఇవ్వాలంటే మాట్లాడడు. తిన్నగా బండ్ల దగ్గిరికి తీసుకు వెళ్ళి దింపాడు.
ఒక పాతిక మంది బండ్ల వాళ్ళు నా చుట్టూ మూగారు. ' ఎక్కడ పోవాలె సామీ ? రండిమీ, నేనుదా జల్దీగా కొంచు పోతా ' నంటూ రెక్కపట్టుకు లాగేవాళ్ళు, సామాను లాక్కు పొయ్యే వాళ్లూను. ఎక్కడికి వెళ్లడానికీ తోచదు. నే నెవళ్లనీ ఎరుగను. పోనీ ఏ హోటలుకైనా వెడదామా అంటే హోటలు పేరుగాని, వీథి పేరు గాని తెలియదు. ముందు వీళ్ల గోల వదలితే నయ మని నేనెక్కడికీ వెళ్లను, నాకు బండి అక్కరలే దని నా పెట్టెమీద కూర్చున్నాను. అయినా కానీ నా కేలాగూ బండి కావా లని వా ళ్లూహించిన ట్లున్నారు, వాళ్లుమట్టుకు నన్ను విడిచి పోలేదు. 'ఎందుకు సామీ, అంత కోపము చేస్తావు. మీ యిష్టము వచ్చిన బండిదా చేసుకొని పోండిమీ. ఈ ఎండలో ఎష్టదాపోతావు. మేము భద్రముగా కొంచుపోతాము సామీ ' అని అక్కడే నిలబడ్డారు. సామాను మోసుకు వచ్చినవాడు కూలి ఇమ్మని తొందర పెట్టాడు.
'ఏమి యివ్వాలి?'
'ఏమి సామీ, మీరు నన్నడుగుతారే, మీకు తెలియదా!'
'నాకు తెలియ' దన్నాను.
'ఏమి సామీ తమాషా చేస్తారు. యిచ్చెయ్యండి పోవాల.'
అర్ధణా అణా యిస్తే బాగుండ దని రెండు అణాలు తీసి పుచ్చుకో మన్నాను. నాకేసి ఒకమాటు, డబ్బుల కేసి ఒక మాటూ చూచి వాడు,
'ఏమి సామీ, ఏమిది, నేను ముష్టివా డనుకొంటివా ఏమి? బిచ్చము వేసినట్లు రెండు అణాదా తీసుకోమంటువే?' అన్నాడు.
నేను నిర్ఘాంతపోయి 'పోనీ అని ఎక్కువ యిస్తే ముష్టి అంటాడేమిటి? ఈ ఊళ్ళో ముష్టివాళ్ళకి అంతా బేడలూ పావలాలూ యిస్తారా ఏమిటి చెపుమా' అనుకుని,
'మరి అయితే ఎంత యిమ్మంటావు?' అన్నాను.
'ఒక రూపాయ.'
నా గుండె బద్ధలైంది! సరే తీసుకు పొమ్మని ఇంకో రెండు అణాలు తీసి చేతిలో పెట్టాను. వాడది నామీదికి గిరాటువేసి రూపాయకు ఒక దమ్మిడీ తక్కువైనా పుచ్చుకో నన్నాడు. పుచ్చుకోకపొతే మానివెయ్య మన్నాను. అంత దర్జాకు పోయిన వాడు పుచ్చుకోకుండా పోతాడేమో నను కున్నాను- పోలేదు. నన్ను తిట్టడము ఆరంభించాడు. చుట్టూ నిలబడ్డ బండ్లవాళ్ళు తీర్పు తీర్చడము మొదలుపెట్టారు. సరే వీడితో పేచీ ఎందుకని యింకొక పావలాకూడాయిచ్చాను. ముందు అదికూడా పుచ్చుకోనని నన్నూ, నా మొహాన్నీ, నా ముక్కునూ, నా మూతిని నా ధర్మగుణాన్నీ, తక్కిన ఆంధ్రులనీ, ఆంధ్రదేశాన్నీ కలిపి ఏకంగా తిట్టి ఆ అర్ధరూపాయి తీసుకొని చక్కా పోయినాడు.
ఒక దరిద్రము వదలింది కదా అని సంతోషించాను. ఇంక ఊళ్ళోకి వెళ్ళడముసంగతి ఎలాగా అనుకున్నాను. బండ్లవాళ్ళు ఇంకా కొంతమంది చుట్టూ నిలబడ్డారు. 'ఈ ఊళ్ళో బస చేయడానికి వీలుగా ఏదైనా హోటలైనా సత్రమైనా ఉందా " అన్నాను వాళ్ళతో.
'ఉంది సామీ, కిట్టనే రామసామి మొదలి సత్రము ఉంది సామి.'
'అక్కడ గదులూ అవీ ఉంటవా, స్నానానికి దానికీ వీలుగా ఉంటుందా?'
'అంతా ఉండును సామీ, నిండా సౌకర్యముగా ఉండును సామీ.'
'మరి భోజనము సంగతి ఏలాగు?'
'దుడ్డు తీసుకుని అక్కడే వేస్తరు.'
భోజనము సంగతి అడిగితే దుడ్డు తీసుకుని వేస్తారంటాడేమిటా అనుకొని 'అది కాదు. భోజనము హోటలు కూడా సత్రానికి దగ్గిర వుందా?' అన్నాను.
'అదిదా సామి, చెప్పితిని. సత్రములోదా అన్నముకూడా వేస్తరు. దుడ్డుమాత్రము తీసుకొందురు.'
అని అభినయరూపంగా వ్యాఖ్యానము చేసి నా బోటి అజ్ఞాను లకు అర్ధ మయ్యేటట్టు చెప్పాడు. అయితే బండికేమి యివ్వాలన్నాను.
'మూణు రూపాయి'
'ఇక్కడి కెంతదూరము ఉంటుంది?'
'రెండుమైలు సుమారు ఉండును.'
'అయితే రెండుమైళ్లకి మూడు రూపాయ లెవరిస్తారు? నేనివ్వను'
'మీదయ సామీ, మా మామూలు మేము చెప్పాము, నీ వేమి ఇస్తావో చెప్పూ.'
'ఒక్కరూపాయి ఇస్తా.'
'ఏమి సామీ, అట్లా చెపుతారు. ఇది నాటుపుర మనుకొంటివా మాటువండి అనుకొంటివా, పారు సామీ, అది కుధరె వండి. గుర్రము సూస్తివా, నిండా బాగా పోను '
ఇంకా మనకు బోలెడు పనిఉంది పోనీ, త్వరగా పోదామని ఇంకో అర్ధరూపాయి ఎక్కువిస్తానన్నాను.
'ఏమి సామీ, ఒక్క పెట్టి రైలులోనుంచి ఇక్కడ పెట్టినందుకే అర్ధరూపాయి యిస్తివే! రెండు మైలుదా పోవాలె, నేనూ గుర్రమూ బతకాలె ఎట్లా సామీ! ఊఁ మీతో బేరమెందుకు సామీ, మీకు తెలియదా రెండు రూపాయి ఇచ్చెయ్యండి, ఎక్కండి.'
నేను ఇవ్వనందా మనుకొంటూ ఉంటేనే పెట్టి బండిలో పెట్టి నన్నెక్క మన్నాడు. వాడు చెప్పింది సబబుగానే ఉందని ఆలోచించి, మాట్లాడ కుండా బండి ఎక్కాను. ఎక్కగానే తక్కిన బండ్ల వాళ్ళంతా రూపాయిన్నరకే బండ్లు కడతా మన్నారు. వీడు మోసము చేశాడు పోనీ దిగుదామా అనుకొంటూ ఉంటే వాళ్లందరినీ తిడుతూ వాళ్ల నెప్పుడూ నమ్మ వద్దని నాకు హితోపదేశము చేస్తూ నా బండివాడు గబగబ బండి తోలాడు: తోవ పొడుక్కీ కష్టము చాలదనీ ఆ రోజున ఉదయము నుంచీ, బేరము లేకపోవడా న్నుంచీ, తక్కిన వాళ్ళు కట్టి వేస్తారేమోననే ఆదుర్దా కొద్దీ, తక్కువకు ఒప్పుకున్నాననీ, ఇంకొక కాలు రూపాయి అయినా వాడి కష్ట మాలోచించి ఇమ్మనీ ప్రాధేయ పడుతూ, పదినిమిషాల్లో సత్రము దగ్గిర దింపాడు.
అప్పుడే రెండు మైళ్ళు వచ్చామా అనుకుంటూ, అయినా పట్నవాసములో దూరము అట్టే తెలియ దని సమాధానము చెప్పుకొని, గుర్రము బహుత్వరలో వచ్చిందని సంతోషించి బండివాడికి రెండుంబేడ ఇచ్చివేశాను. ఇంకోబేడ ఇమ్మని చాలాసేపు బతిమాలి, కోపపడి, తిట్టి, చక్క పోయినాడు.
సత్రములో జనము కిటకిట లాడుతున్నారు. ఇంతమంది పొరుగూరు జనమిక్కడి కెందుకు వచ్చారా అనుకున్నాను. లోపలికి వెళ్ళాను. గూడకట్టు కట్టుకుని అది మోకాలుపైకి మణిచి, జుట్టు కొప్పెట్టుకుని, నెత్తిమీద నుంచి చమురు మొహము మీదికి కారుతూ, నల్లగా లావుగా శిలావిగ్రహములాగా ఒక మనిషి కనపడ్డాడు. కాళ్ళు ఎడముగా పెట్టుకుని నిలబడి నాకేసి ఎగాదిగా చూసి 'ఎన్నా వేణుం' అన్నాడు.
'మీరన్న దేమిటో నాకు తెలియదు కాని నా కొకగది కావాలి ముందు.'
'ఓ అష్టనా! నీవు ఎవరు బ్రాహ్మణుడా కాదా? మీది యావూరు? ఎన్ని దినా లుండబోతావు? ఎక్కడ పోతావు? ఈ వూరెందుకు కొచ్చావు?' అని ఆరంభించాడు. 'మేము బ్రాహ్మణులమేను. ఇక తక్కిన సంగతంతా మీ కెందుకూ? గదివుంటే ఇవ్వండి, మీకు తెలియకపోతే ఎవరిని అడగాలో చెవ్పండి.'
'నిండా గట్టివాడుగా వున్నావే? ఎన్ని దినము లుండేదీ చెప్పక పోతే ఎష్టదా గది యిస్తును? మూడు దినాలు కంటే వుండేదానికి లేదు.'
'నేను మూడు రోజులుకూడా ఉండను. మళ్లీ ఈ రోజు సాయంత్రమో రేపో వెళ్ళి పోతాను.'
'అయితే సరే, ఈ గదిలో ఉండవచ్చు' నని ఒక గది చూపించాడు.
నే నాగదిలో ప్రవేశించి సామానక్కడ భద్రపరచుకొని బయటికివచ్చి స్నానముచేసి పట్టుబట్ట కట్టుకొని మొహాన్ని బొట్టు పెట్టుకొని చెంబు తీసుకుని భోజనాల సావిటిలోకి వచ్చాను. అక్కడంతా చొక్కాలతోటి, కోట్లతోటి భోజనాలు చేస్తున్నారు. కొందరు వడ్డించేవాళ్ళుకూడా బనియన్ తొడుక్కుని వడ్డిస్తున్నారు. ఈ అనాచారమంతా చూసి అక్కడ భోజనము చెయ్యబుద్ధి అయింది కాదు. అయినా గత్యంతరము లేక ఖాళీగా ఉన్న విస్తరి దగ్గిరికి వెళ్ళి కూర్చున్నాను. భోజనము చేస్తున్నవాళ్లూ వడ్డించేవాళ్లూ కూడా నన్ను చూసి లోపల నవ్వుకోడము మొదలు పెట్టారు. వాళ్ళతోటి మనకెందుకని యధావిదిగా పరిషించి భోజనానికి కూర్చున్నాను.
ఇంకా వడ్డన అవుతుండగానే నాపంక్తిని కూర్చున్న అరవ వాళ్ళు కూర ముక్కలు వట్టి నోటినే తినివెయ్యడము మొదలు పెట్టారు. వడ్డన అయ్యే అవడముతోటే గబగబా నెయ్యి, మనిషికి రెండు గరెటల చొప్పున, ఒకాయన వడ్డించుకు వెళ్ళాడు. నా పక్కని కూర్చున్న అరవవాళ్ళు కొంతమంది చెయ్యిపట్టి ఆ నెయ్యి దాహము పుచ్చుకున్నారు. ఏమిటా ఇలా పుచ్చుకుంటున్నా రనుకొన్నాను. కొందరు ఒక ముద్దలో వేసుకొని ఆ వట్టినెయ్యీ అన్నమూ తిన్నారు! నేనూ వేయించుకొన్నాను. నెయ్యి పాడువాసన. ఈ నెయ్యే తాగుతున్నారు మొగము వాచినట్లు; అప్పుడు కాచిన ఇంటినెయ్యి లభ్యమయితే వీళ్ళు చెంబుల తోటి మంచినీళ్లవలే దాహము పుచ్చుకుంటారు కాబోలుననుకొన్నాను.
నేతివడ్డన అవుతుండగానే ఇంకొకాయన పులుసు తీసుకు వచ్చాడు. ప్రతివాళ్లూ, ఒక పప్పు కలుపుకోడము లేదు. కూర కలుపుకోడము లేదు. పచ్చడి కలుపుకోడము లేదు; ఏమీలేదు. ముందుగా పులుసు పోసుకున్నారు, అందులో పప్పు కలుపుకున్నారు. నెయ్యిలేకుండా వట్టి అన్నము తింటూ అందులోనే కూరా, పచ్చడీ, నంజుకున్నారు. ఏమిటీ అడివి తిండి! పాపము, వీళ్ళు తిండి తినడముకూడా ఎరగరే అని జాలిపడ్డాను. నేను శుభ్రముగా పప్పు కలుపుకున్నాను; పులుసు వద్దనే సరికి అంతా తెల్లపోయి నాకేసి చూశారు. కాకులకు కోకిలరూపు చాలా అందవికారముగానూ, కంఠము కఠోరముగానూ ఉంటుందట. అలాగే ఈ అరవ వాళ్లకి నేను వట్టి అనాగరికుడుగా కనబడ్డాను. ఆశ్చర్య మేమిటి! పిచ్చివాడికి ప్రపంచమంతా పిచ్చిగా కనపడుతుంది.
తరువాత నేను కూర కలుపుకున్నాను. కలుపుకుని నెయ్యి తీసుకురమ్మన్నాను. ఏ కుళ్ళునెయ్యి అయినా వేసుకొనడము తప్పుతుంది గనకనా! తీసుకువచ్చి 'అది ఎక్ట్స్రా సార్!' అన్నాడు. 'ఏది ఎక్ట్స్రా?'
'ఈ నెయ్యి'
'ఎక్ట్స్రా ఏమిటి నీ పిండాకూడు!'
'ఇప్పుడు మళ్ళీ వేసుకుంటిరే ఒక స్పూన్, అది ఒక కాలణా అవును సార్?'
'అయితే ఏ మంటావు?'
'వేసేదా సార్?'
'వెయ్యి, మరి వెయ్యడానికి కాకపోతే నీ సౌందర్యాతి శయము చూచి ఆనందించడానికి పిలిచా ననుకొన్నావా!' నే నన్నదివాడికి పూర్తిగా అర్ధముకాలేదు. పాపము కొంచెము నవ్వుకుని, 'ఏమి సార్, అష్టా గేలి సేస్తారు!' అన్నాడు.
తన్నేదో స్తోత్రము చేశానుకున్నాడు కాబోలు పాపము. వెనుకటికి ఒక డిప్టీ కలక్టరుగారు ఒక అమాయకపు కరణాన్ని, ఏదో సందర్భములో, నువ్వు వట్టి బుద్ధిహీనుడులాగా ఉన్నావే అన్నారట. ఆ కరణము తన్నేదో మెచ్చుకుంటునారనుకుని 'చిత్తము, చిత్తం మహాప్రభో, ఏలినవారి కటాక్షము! తమబోటి పెద్దలందరిచేతా అలాగే అనిపించు కుంటున్నా' అన్నాడట. అలాగ్గా ఉంది ఈ వడ్డనవాడి సంగతి.
తక్కినవాళ్లంతా పులుసూ అన్నమూ తినగానే చారు వడ్డించుకున్నారు. నాకు ఊరికే నవ్వు వచ్చింది వాళ్ల తిండి వరసచూసి. పులుసో చారో, ఏదో ఒకటి కాని, రెండూ ఏమిటి వీళ్ళ తలకాయనుకొన్నాను. సరే! వీళ్లేలా తింటే నాకెందుకని త్వరగా రెండు మెతుకులు నోట్లో వేసుకుని లేచి వచ్చాను. అక్కడ వరసంతా చూస్తే భోజనము చేసినట్లే లేదు నాకు. అంతా అనాచారమే, అన్నము చేత్తోటే నేతి మజ్జిగలు ముట్టుకోడము, ఆచేత్తోటే మంచినీళ్ళు ఇవ్వడము. చేతులు కడుక్కునే చోటంతా మెతుకుల మయము. అంత అనాచారముగా ఉంటారు, వీళ్ళ కసహ్యము ఎలా లేదా అనుకున్నాను.
భోజనము చేసి నాగదిలోకి వచ్చి కాస్సేపు విశ్రమించి చొక్కాలు తొడుక్కుని ఊళ్లోకి బయలుదేరాను. నాకు జుట్టు ముడి, గిరజాలూ ఉండేవి. అవి తీసివేయించి దొరటోపీ ఒకటి కొనుక్కుని తరవాత రైలు సంగతి కనుక్కుని వద్దామని ఉద్దేశం.
వీధిలోకి రాగానే నడిరోడ్డుమీద ఇంజన్ లేకుండా రైళ్ళు పరుగెడు తున్నవి. పొద్దున బండివాడిని అవేమిటని అడిగితే ట్రాంకార్లు అని చెప్పాడు. వాట్లకు స్టేషనులూ అవి అక్కరలేదుట. ఎక్కడపడితే అక్కడ ఆగడమేను. ఈ ఏర్పాటు చాలా బాగుందను కున్నాను.
అక్కడొక పెద్ద మనిషిని పిలిచి 'మంచి షాపు లెక్కడుంటా ' యన్నాను. మౌంటురోడ్డులో వుంటా యన్నాడు. 'అయితే అక్కడికి వెళ్ళడ మెలాగ ' అన్నాను. 'ఇక్కడ ట్రాము యెక్కితే నేరుగా పూడ్చు' నన్నాడు. ఇలా మాట్లాడుతుండగానే ట్రాముకారొకటి వచ్చింది. దానిమీద రాయపురమని వ్రాసివుంది. అక్కడ ఆగకుండా అది వెళ్ళిపోతున్నది. అయ్యో పోతున్నదే అనే ఆదుర్దాకొద్దీ నాతో మాట్లాడుతున్నాయన మాట పూర్తిగా వినిపించు కోకుండానే, 'ఆపండి, ఆపండి ' అని కేకలువేస్తూ పరుగెత్తాను. బండి కొంత దూరాన ఆగింది. సరే నా కేక వినపడి ఆపారుగదా, వెళ్ళేదాకా ఆగుతుందనుకుని పరుగు కొంచెము తగ్గించాను. బండి మళ్ళీ బయలుదేరింది. 'ఆపండోయ్ ' అని మళ్ళీ కేకలు వేస్తూ పరుగెత్తాను. ఓ మాటు ఆగినట్లే ఆగడము, మళ్ళీ పరుగెత్తడము, ఈలాగ సుమారు మైలు పరుగెత్తి ఆఖరుకు ఎలాగైతే నేమి అందుకున్నాను. యెక్కి ఒక్క క్షణము ఆయాసము తీర్చుకునే లోపలనే ఏ రంగోకూడా తెలియని అలుకు గుడ్డ లాంటి కోటూ, యిజారూ, తొడుక్కుని జుట్టు ముడిమీద టోపీ పెట్టుకుని, మెళ్ళో తోలుసంచీ ఒకటి తగిలించుకుని 'టికాయట్ సార్, టికాయట్ సార్, యెక్కడ పోవాలా ' అని ఒకడు వచ్చాడు. ఒక పావలా అతని చేతిలోపెట్టి మౌంటు రోడ్డన్నాను. 'ఏందయ్యా, యిందుకా యింతదూరము వోడివస్తివి? నిండా గట్టివాడు. యెందుకయ్య, దిగు దిగు జల్ది. బండి వస్తోంది. అందులో పోవాలయ్యా ' అన్నాడు అంటూండగానే యెదురుగా ట్రాముకారు యింకొకటి వచ్చింది. అది తప్పిపోకుండా అందుకుందాము: యిప్పటికే చాలా ఆలస్యమైందని బండి అట్టే త్వరగా పోవడము లేదుకదా అనీ టిక్కట్టు యిచ్చే అతను ఆగమంటున్నా వినక కింద కురికాను. వురకడములో మొహము బద్దలయ్యేటట్టు ముందుకి పడ్డాను. ట్రాముకారు ఆపి వాళ్ళు వచ్చి లేవదీసి అంత తొందరపడి దిగినందుకు నాలుగు చివాట్లువేసి వాళ్ళదారిని వాళ్ళు చక్కాపోయినారు. వీథిలోకి వచ్చేటప్పుడు, పొద్దుటి ఆ నల్లటి అరవాయన యెదురుగుండా వచ్చాడు. అందుకే యిలాటి అవస్థలు వచ్చినాయి అనుకున్నాను.
ఇవ్వాళ మరి ట్రాముకారు ఎక్కకూడ దనుకొని నిమ్మళంగా బండి ఏదైనా చేసుకు వెళితే సావకాశంగా అన్నీ చూస్తూ వెళ్ళవచ్చు ననుకుని ఒంటెద్దుబండి ఒకటి కుదుర్చుకుని బయలు దేరాను. చెన్నపట్నము మొత్తముమీద చాల పెద్ద ఊరూ, అందమైన ఊరూను. ఆ రోడ్ల వైశాల్యము, షాపుల సౌందర్యము, అంతా చూసి చాలా సంతోషించాను. ఓహో ఎంతపట్టణ మనుకున్నాను. ఇంగ్లండులో ఇంత గొప్ప పట్టణా లుంటాయా, లండ నింతకంటే పెద్దదా, చిన్నదా? అని ఆలోచించాను. అయినా పెద్దదెలా అవుతుంది? ఇంగ్లండు చిన్న ద్వీపము కదా, ఇంగ్లండంతా కలిపి చెన్న పట్నమంత ఉంటుందేమో అని అలా తర్కించుకొంటూ నిమ్మళంగా బండిలో ఊగిసలాడుతూ వెడుతుండగా ఒక చోట 'పెరీజయన్ హేర్ కట్టింగ్ సెలూన్ ' అని కనపడ్డది. పుట్టు వెంట్రుకలు తీయించుకో వలసిన అవసరం వుంది కదా అనుకుని బండి ఆపమని దిగాను. దిగి గుమ్మము దగ్గిర నిలుచుని లోపలికి తొంగిచూశాను. కాళ్ళు ముందుకు సాగలేదు. గుండెలు గబగబా కొట్టుకోడ మారంభించినయి. ఇదివర కెప్పుడూ, నేను భోజనా నంతరము క్షౌరము చేయించుకో లేదు. నేటి కది సంప్రాప్త మయింది. పైగా ఈ బట్టలతోటి చేయించుకోడము, స్నానమైనా చేయకుండా అన్నీ ముట్టుకోడము, ఇదంతా మనసుకు చాల కష్టము తోచింది. ఏమి చెయ్యను, తప్పుతుందా. ఇదంతా ఊరికే తుంటరితనము కోసము కాదు కదా. దేశోపకారము కోసము కదా యింత తలపెట్టింది, ఇటువంటి కష్టములెన్ని లేకుండా కార్య సాధన అవుతుందా అని మనసుకు సమాధానము చెప్పుకున్నాను.
లోపలికి తొంగిచూస్తే నాకు బహు ఆశ్చర్యము వేసింది. గదంతా పరిశుభ్రముగా అద్దములాగా ఉంది. పైన ఎలక్ట్రిక్ దీపాలూ, గోడలో కమర్చి తెల్లని పెద్ద పింగాళి గిన్నెలూ, వాట్లలో చిన్న కుళాయిలూ, వాట్లపైన నిలువుటద్దాలు, వాట్లముందు మంచి పరుపులు వేసిన కుర్చీలూ వున్నాయి. గుమ్మము దగ్గిర ఒకాయన కుర్చీ వేసుకుని మేజామీద ఏదో వ్రాసుకుంటూ కూర్చున్నాడు. ఒక పెద్ద బీరువానిండా ఏవో సీసాలు చిన్న అట్ట పెట్టెలూ, రకరకాలు కనపడ్డయి. వీధి గుమ్మాని కెదురుగుండా గోడ కొక చక్కని రంగుల అద్దకపు గుడ్డతెర కట్టి ఉంది. ఒక గోడకి బట్టలు తగిలించుకునే వంకె లున్నయి. నా కిదంతా చూసేసరికి మంగలి దుకాణమవునా కాదా అనే సందేహము తోచింది. పొరపాటున ఏదైనా ఆఫీసులోకి రాలేదు కదా అనుకున్నాను; లేకపోతే ఇది ఏదో పెద్ద మందుల షాపై ఉండవచ్చు. అయితే పైన బల్ల అలా కట్టడానికి కారణ మేమిటి చెప్మా అనుకొని, ఒకవేళ మేడమీద ఉందేమో మంగలి దుకాణ మనుకుని మళ్ళీ వాకిట్లో వున్న బల్ల కేసి చూశాను. చూస్తే మేడమీదేమీ కనుపించలేదు. ఆ బల్ల దీనికి సంబంధించినట్లే తోచింది. ఇది మంగలి దుకాణ మవునా కాదా అని అక్కడ కూర్చున్న మనిషిని అడిగి తెలుసుకుందామని అనుకుంటూ ఉంటే, నా అవస్థ గ్రహించి కాబోలును, అతనే నన్ను పలకరించాడు.
నా కింగ్లీషు రాదనుకున్నాడు కాబోలు. అరవాన్ని మాట్లాడాడు. నా కరవము రాదన్నాను. 'ఓ రాదా, తెలుగువాడా మీరు. రండి ఏం కావాలా? షేవ్ కావాల్నా? ఎందు కక్కడనే నిలుస్తారు? లోన రండిమీ' అన్నాడు. దానితోటి అది మంగలి దుకాణమేనని నిశ్చయ పరచుకుని ఆశ్చర్య పోతూ నా కాళ్ళమట్టి అంటుకుని నేల మురికవుతుందేమోనని భయపడుతూ, లోపలికి వెళ్ళి నిలబడ్డాను. 'కూర్చోండి ' అని ఒక అద్దము ఎదర ఉన్న కుర్చీకేసి చూపించాడు. హడలిపోతూ దానిమీద కూర్చున్నాను. ఇంతలోకే గోడనున్న తెర వెనకాలనుంచి శుభ్రమైన బట్ట కట్టుకుని కోటు తొడుగుకున్న మనిషి ఒకడు వచ్చాడు. వచ్చి ఒక సబ్బు తీసుకొని ఒక కుంచె తీసుకుని నన్ను కుర్చీలో వెనక్కు జార్లా పడమని నా మెడ కొక తెల్లని ఇస్త్రీగుడ్డ కట్టి ఆ కుంచెతోటి సబ్బు నా గడ్డానికి రాయడము మొదలు పెట్టాడు. ఇలా ఎందుకు రాస్తాడా అని ఆశ్చర్యపోతూ, అయినా ఏం జరుగుతుందో చూద్దాము, అడగడమెందు కని లోపల ఒక దణ్ణము పెట్టుకుని నా ముఖము వాడి అధీనములో విడిచిపెట్టాను.
'వాడి చిత్తము వచ్చినట్లు సబ్బునురగ నా ముఖాన్ని అరిచేతి దళసరిని పామి, కత్తితీసుకువచ్చి రాతిమీద నూరకుండానే క్షౌరము చేయడ మారంభించాడు. కత్తి నూరకుండా చేస్తావేమి తెగుతుందా అని అడుగుదా మనుకుని తెగకపోతే అప్పుడే అడగవచ్చునని ఊరుకున్నాను. అదేమి కత్తోగాని నూరకపోయినా బహు చక్కగా తెగింది. పని చేయించుకున్నట్టే లేదు. సాపుగా వెళ్ళిపోయింది. అది సబ్బు విశేషమో కత్తి విశేషమో తెలియలేదు. మా ఊళ్ళో ఎప్పుడు పని చేయించుకున్నా మా మంగలి పనసకాయ చెక్కినట్టు చెక్కేవాడు. ఇటు తిప్పీ, అటుతిప్పీ నాకు మెడనరము పట్టించకుండానూ, నా రక్తము కళ్ళ చూడకుండానూ, వాడెప్పుడూ విడిచి పెట్టేవాడుకాదు. మళ్ళీ పక్షముదాకా జ్ఞాపక ముండేటట్లు చేసేవాడు. అలాంటిది క్షౌరమెంత సుఖంగా ఉంది! ఆ గదికి తగినట్టుంది.
గడ్డమయిన తరువాత మామూలు ప్రకారము ఇక్కడ కూడా సాపు చేయమని బాహుమూలాలు ప్రదర్శిద్దా మనుకున్నాను. అలాచేస్తే వాడికేమి కోపము వస్తుందో అనుకొని ఆ ప్రయత్నము మానివేసి లోపలినుంచి పొంగివస్తున్న దుఃఖాన్ని ఆపుకుని వేడి కన్నీటి బిందువు లివతల పడకుండా, కళ్ళు మూసుకుని జుట్టు తీసివెయ్యమన్నాను. చిన్నప్పటి నుంచి ఎంతో జాగ్రత్తగా పోషించిన బారెడు జుట్టూ వాడు గబగబా రెండు కత్తిరింపుల్లో కత్తిరించి వేశాడు. అద్దములో నా ముఖము నాకే కొత్తగా ఉంది. కడివెడు దుఃఖమూ దిగమింగి చేష్టలుడిగి అద్దములో చూసుకుంటూ ఉంటే, 'షాంపూ చేసేదా సార్ ' అన్నాడు. అదేమిటో నాకు తెలియలేదు. కాని ఇంత వరకూ వచ్చిన తరువాత ఇక ఏమిచేస్తే ఏమని గుండెరాయిచేసుకుని మొండిబ్రతుకుగనక 'కా' నిమ్మన్నాను.
నామెడచుట్టూ పెద్ద బురఖాలాంటిగుడ్డ ఒకటి కట్టినా తల పింగాళీ గిన్నెలోకి వంచి కుళాయి తిప్పాడు. తలమీదుగా నీళ్ళు పడ్డయి. తరువాత నా నెత్తి మీద ఏదో అరఖు పోసి తల రుద్దాడు. ఆపైన మళ్ళీ తలంతా శుభ్రముగా కడిగి తుడిచివేసి కొంచము సువాసన నూనెరాచి తల దువ్వాడు. అమ్మయ్య అనుకుని లేచాను. మొదట నన్నాహ్వానించిన మనిషి ఒక రసీదు నాచేతి కిచ్చి మూడు రూపాయ లిమ్మన్నాడు. నిర్ఘాంతపోయి బారెడుజుట్టూ పుచ్చుకొని పైగా పావలా కాదు, అర్ధకాదు, మూడు రూపాయలిమ్మంటా డేమిటా అనుకుని ఇక వాడితో వాదనలోకి దిగితే అసలే లాభముండదు. మొదటనే నిర్ణయము చేసుకోవలసిం దనుకొని కుక్కిన పేను లాగ మాట్లాడకుండా మూడు రూపాయలూ వాడిచేతిలో పెట్టి బిక్క మొగము వేసుకుని ఇవతలకు వచ్చాను.
బండి దగ్గరకు వచ్చేటప్పటికి బండివాడు ఆలస్యము చేశానని కోప పడడము మొదలు పెట్టాడు. వాడి కేదో ఇంకొక అణో బేడో ఎక్కువిచ్చుకుంటానని చెప్పుకుని మళ్ళీ బండెక్కి 'వైటెవేలెయిడ్ లో ' అనే పెద్దషాపు కనబడితే టోపీ కొనుక్కోవచ్చుగదా అని అక్కడ దిగాను. ఆ షాపు పైనుంచి చూసేటప్పటికే నాకు బ్రహ్మానంద మైపోయింది. ఆ షాపులో దొరికే సామానులన్నీ ఎంతో ముద్దుగా, అందముగా, అమర్చి వాట్లముందు పెద్ద గాజులతలుపు గోడలా పెట్టేశారు. రోడ్డే పోయే వాళ్ళంతా అక్కడ నిలబడి వాళ్ళకే వస్తువు కావాలో చూసుకోవచ్చు. ఏమీ కొనదలుచుకోకపోయినా, ఊరికే గంటల తరబడి నిలబడి వాటికేసి చూడ బుద్ధవుతుంది. నాగరికత అంటే దొరలదే కాని మన కేమి ఉంది?
ఇలా అనుకుంటూ గుమ్మంలో అడుగు పెట్టాను. లోపల కేవలము ఇంద్రభవనమే! ఆ సౌందర్యము వర్ణించ డానికి నా బోటి వాడికి శక్యంగాదు. ఎక్కడ చూచినా దొరలూ దొరసానులూ, అమ్మేవాళ్ళూ జాతివాళ్ళే, కొనుక్కునే వాళ్ళూ జాతివాళ్లే. నడవడానికి నేలమీద తివాసులు పరచి ఉన్నాయి, షాపు పొడూక్కి సన్నని మేజా ఒకటి ఉంది. అమ్మేవాళ్లు, అమ్మే సరకులూ అన్నీ దానివెనకాల, కొనేవాళ్ళంతా దాని ఇవతల, చెప్పవద్దూ, ఆ షాపూ, ఆ సరకులూ, ఆ దొరసానులనీ చూస్తే భయంవేసింది. ఊరికే వెర్రిమొహము వేసుకుని గుడ్లు ఒప్పజెప్పి నోరు తెరుచుకుని నాలుగు మూలలూ చూస్తూ నిలబడ్డాను. కొంతసేపటికి ఒక ముసలిదొర నాదగ్గరికి వచ్చి 'మీరేమన్నా కొనడానికి వచ్చారా ' అన్నాడు. 'అవును ఒక టోపీకావా 'లన్నాను. టోపీలు మేడమీద ఉంటయి, మీకేం భయము లే ' దన్నాడు.
తిన్నగా మేడమీదికి వెళ్ళాను. ఆ అంతస్థంతా ఎక్కడ చూచినా టోపీలే. అనేక రకాలు. ఒకచోట అమ్మేవాడు మొగవాడు. ఇంకోచోట అమ్మే మనిషి ఆడది. మొగవాడి దగ్గరికి వెళ్ళి టోపీ ఒకటి కావాలన్నాను. 'ఎలాంటి ' దన్నాడు. ఎలాంటిదని చెప్పను? చెన్నపట్నంలో అందరికీ సరి పడ్డన్ని టోపీలున్నాయి. అందులో నాకు ఫలానిది కావాలని చెప్పడానికి తోచలేదు. చూడగా చూడగా ఆ ఆడమనిషి అమ్మే టోపీలు కొంచెము పెద్దవిగానూ, అందముగానూ ఉన్నట్టు కనబడ్డయి. ఆ దొరతో చెప్పాను, అక్కడి టోపీ కావాలని. తిన్నగా నన్నాదొరసాని దగ్గరికి తీసుకువెళ్ళి, 'ఈయనకు టోపీకావాలటచూడ' మన్నాడు. 'ఏ సైజ్ ' అన్నది. ఏం చెప్పటానికి తోచిందికాదు. టోపీకి సైజేమిటనుకున్నాను. నాకే అన్నాను. వాళ్ళిద్దరూ నవ్వుకున్నారు. నాకు సిగ్గేసింది. 'ఎలాంటి ' దన్న దా దొరసాని. సన్నని ఖర్జూరపాకులతో అల్లిన పెద్దటోపీ ఒకటి చూపించి, అది కావాలన్నాను. అది తీసి నా నెత్తిన ఒకసారి పెట్టి చూసి 'ఇది సరిపోయింది పుచ్చుకోం'డని ఆ టోపీ ఒక కాగితపు సంచిలో పెట్టి యిచ్చారు. దాని ఖరీదు ఇచ్చేసి టోపీ పుచ్చుకొని మాట్లాడకుండా తలవంచుకుని చక్కావచ్చాను. నా వెనకాల ఆ దొరా, దొరసానీ ఒకటే నవ్వుకోడము.
కిందికి వచ్చి, మనము స్టీమరుమీద ఉండాలి కదా, గడియారము లేకపోతే టయిము ఎలా తెలుస్తుందని రెండున్నర పెట్టి శుభ్రమైన 'టెంపసు' వాచి ఒకటి కొన్నాను. స్టీమరు మీదనుంచి మళ్లీ ఎన్నాళ్ళకు దిగుతామో, పనిచేయించుకోకుండా గెడ్డము పెంచుకుంటే బాగుండదని స్టీమరుమీద మంగలివాళ్ళుండరని తోచి, రూపాయి పావలాకి బుల్లి సేఫ్టీరేజరొకటి కొనుక్కుని బయట పడ్డాను. మూడు గంటలయింది. ఆకలిగా ఉంది. బండివాడికి డబ్బులిచ్చి పంపి వేశాను. ఈసారిమట్టుకు వా డాట్టే పేచిపెట్టలేదు. సమీపంలో ఉన్న కాఫీ హోటలులోకి వెళ్ళాను. నేనూ చాలా కాలము పట్నవాసములో ఉన్నా ఎప్పుడూ కాఫీ హోటలులోకి వెళ్ళలేదు. ఇదే మొదటిసారి. కుర్చీలూ, బల్లలూ ఉన్నాయి. చాలామంది ఫలహారాలు చేస్తున్నారు. ఒకాయన యజమాని కాబోలు, గుమ్మం దగ్గిర కుర్చీ వేసుకుని కూర్చొని డబ్బు వసూలు చేస్తున్నాడు. ఫలహారాలు చాలా రకా లున్నాయి. నేనూ వెళ్ళి ఫలహారాల బల్లకి దగ్గరగా ఉన్న కుర్చీమీద కూర్చున్నాను. నల్లని తుండులాంటి కుర్రవాడు నాదగ్గిరకు వచ్చి ఏమికావాలన్నాడు. ఏ మడగడానికీ నాకేమీ తోచలేదు. గుక్క తిప్పుకోకుండా, ఏవో యిరవై వస్తువులు ఏకరువు పెట్టాడు. ఒకటీ నాకు సరిగ్గా వినపడలేదు. ఆ బల్లకేసి చూపించి నాకు కావలసిన వస్తులేవో తెప్పించుకు తిన్నాను. కాఫీ తెమ్మన్నాను. రెండు ఇత్తడి గిన్నెలు తెచ్చి కాఫీ అందులో చల్లారబోయడము మొదలు పెట్టాడు. ఆపద్ధతి నాకు బహు తమాషాగాఉంది. ఓ గిన్నెలోనుంచి ఓగిన్నెలోకి నిలువు ఎత్తునా ఎత్తిపోయడము మొదలు పెట్టాడు. ఆ వేడి వేడి కాఫీ అంతా వాడి కాలిమీదో, నానెత్తిమీదో, పడుతుందని హడిలిపోతూ కూచున్నాను. మొత్తముమీద అటువంటి ప్రమాదమేమీలేకుండా, వేడి తుంపురులు మట్టుకు వెదజల్లి, నా కాఫీ నాకు ఒప్పజెప్పాడు.
కాఫీ పుచ్చుకుని ఎంతయిందన్నాను. 'చెపుతా లెండి. అక్కడకూచున్నాయనకు ఇవ్వం 'డన్నాడు. సరేనని ముందుకు వచ్చాను. నా వెనకాలే వచ్చి 'అంజేకాలణా' అని, ఒక ఊరంతా వినపడేటట్టు పెద్ద పొలికేక వేశాడు. నే నులిక్కిపడి వెనక్కి తిరిగి 'ఏమిటి, గాడిద గుడ్డులాగా ఝడిపిస్తావు' అన్నాను. వాడికర్ధము గాక మాట్లాడకుండా చక్కాపోయాడు. తెలుగు తెలిసిన వాళ్ళొకరో యిద్దరో నవ్వారు. యజమాని నన్ను పిలిచి డబ్బులు పుచ్చుకుని పంపివేశాడు.
నేను గుర్రపుబండి చేసుకుని తిన్నగా నా బసలోకి వచ్చి పొద్దుటి నల్ల బ్రాహ్మణ్ణి రైలుసంగతి అడిగాను. ఎక్కడికంటే, 'ఇలా యింగ్లండు వెడుతున్నాను. కొలంబో దాకా వెళ్ళే రైలెప్పుడుం' దన్నాను. సాయంత్రమారు గంటలకని చెప్పి ఫలాని స్టేషన్ కు వెళ్ళమన్నాడు. నా చేతిలో ఉన్న కాగితపు సంచి చూచి అదేమిటి అన్నాడు. టోపి అన్నాను: చూపించమంటే చూపించాను. చూసి అక్కడినుంచి ఒకటే నవ్వు. వీడికేం మతీ గితీ పోయిందా అనుకుని ఎందుకల్ల నవ్వుతావు, అన్నాను. 'ఏమయ్య, పైతకారివలె ఉన్నావు. ఇది ఆండవాళ్ళు పెట్టుకునే టోపీ అయ్యా' అన్నాడు. అనేటప్పటికి నిర్ఘాంతపోయి ఒకమాటు టోపీకేసి, ఒకమాటు ఆయనకేసి చూచి, అక్కడ షాపులో వాళ్ళిందుకే కాబోలు నవ్వారనుకున్నాను. సరే ఏమైనా కానీ, ఈ అరవవాడి ఎదుట లోకువ కాకూడదనిపించింది. 'అయితే ఏ మంటా ' నన్నాను. 'నీ కెందుకయ్యా ఈ ఆండవాళ్ళ టోపీ ' అన్నాడు. 'ఓయి వెర్రినాయనా, కొలంబోలో నే ఎరిగున్నవాళ్ళున్నారు. వాళ్ళకి బహుమతి చేయడానికి తీసుకు వెడుతున్నా' నని చెప్పాను. కాని నా మాటలు అతనుమట్టుకు నమ్మినట్టు కనబడలేదు.
టోపీ తీసుకుని నా గదిలోకి వెళ్ళి సామాను సర్దుకుని రైలుకి వెళ్ళాను. సాయంకాల మయిదున్న రయ్యేసరికి బీచిస్టేషన్ దగ్గరకు వచ్చాను. రైలు బయలు దేరడానికి అట్టే టయిము లేదన్నారు. నేను కొలంబో వెళ్ళాలి. ఎలా అన్నాను. 'మీరు సెకండుక్లాసులో వెళ్ళితే ఏకంగా టిక్కట్టు ఇస్తాము. శ్రమలేకుండా వెళ్ళవచ్చును; మూడో క్లాసులో వెడితే చాలా యిబ్బంది పడవలసి వస్తుం' దన్నాడాయన. ఇంగ్లండు వెడుతున్న వాళ్లము సెకండు క్లాసు టిక్కెటు కొనడానికి ఆలోచనేమిటని, 'సరే, అయితే సెకండుక్లాసు టిక్కట్టే ఇప్పించం' డన్నాను. టిక్కట్టిచ్చి 'మీరు రేపు సాయంకాలానికి ట్యూటికొరిన్ వెళ్తారు. అక్కడ దిగి స్టీమరెక్కినట్లయితే మరునా డుదయానికి కొలంబో చేరగలరని' చెప్పాడు. 'అయితే ఒక రాత్రి స్టీమరులో ఉండాలా. రైలు తిన్నగా కొలంబోదాకా వెళ్ళదా' అన్నాను. నా ముఖముకేసి చూసి అదివర దాకా నాతోటి మాట్లాడుతున్న గౌరవస్వరము మార్చి 'అబ్బే, వెళ్లడము లేదండి యీ మధ్య, పూర్వము రాములవారి వారధి బాగుండేటప్పుడు వెళ్ళేదిట. కాని దరిమిలా అది, సికస్తుపడి సముద్రము మామూలుగా అడ్డుగా ఉండటమువల్ల ఇప్పుడు వెళ్ళడము మానివేసింది. అది బాగుచేయడానికి మళ్ళీ ఆంజనేయులుగారికి కబురు చేద్దామనుకుంటే, వారి అడ్రసు సరిగా తెలియలేదు. అసలు తిన్నగా కొలంబోదాకా రైలు వెళ్ళవలెననే మా ఉద్దేశముకూడా' అన్నాడు.
మారు మాట లేకుండా నా టిక్కట్టు తీసుకుని రైలు దగ్గిరికి వెళ్ళాను. గార్డు స్వయంగా వచ్చి సెకండుక్లాసు పెట్టెలో ఎక్కించాడు. మీకు సౌఖ్యంగా ఉంటుందనీ, ఎవ్వళ్లూ అట్టేమంది ఎక్కరు మీరు సుఖంగా పడుకోవచ్చుననీ, చెప్పి వెళ్ళబోతున్నాడు. 'అట్టే మందేమిటి, అసలే ఎవ్వళ్ళూ ఇందులో ఎక్కగూడదు. అడ్డమయిన వాళ్ళూ ఎక్కడము మొదలుపెడితే నాకు మహా అసహ్యంగా ఉంటుంది. ప్రతి వాళ్ళతోటీ కలిసి తిరగడము నాకిష్టములేదు. ఈ రోజుల్లో ఎంతసేపూ దూరంగా వుంటే గౌరవము కాని, అంతటివారు కూడా మనతో తిరుగుతున్నారు అగౌరవము మనకే నన్నమాట ఆలోచించరు. అటువంటి మర్యాదా, అదీ, లేదు గనుకనే మావాళ్ళు అంత నీచస్థితిలో ఉండటము. ఆ గౌరవమూ అదీ మీ దొరలకే చెల్లింది. మీ మట్టుకు మీరు చూడండి. నా మర్యాదా గౌరవమూ అదీ ఆలోచించి యింత యిదిగా మాట్లాడారా? స్టేషన్ మాస్టరు చూడండి. నేటివ్ కనుక ఏమీ ఆలోచించకుండా చాలా తెలివితక్కువగా మాట్లాడాడు. నాకు చాలా కోపం వచ్చింది. తగిన సమాధానము చెప్పి పరాభవిద్దాముకున్నాను. కాని ఎందు కనవసరంగా నని ఊరుకున్నాను. బురదలో రాయి వేస్తే మనమీదికే చిందుతుందని మా మామ్మ చెప్పిన సామెత జ్ఞాపకము వచ్చింది. ముసలివాళ్ళు విద్యావిహీనులని మనము తోసివేస్తాము కాని వాళ్ళకున్నంత ప్రపంచ జ్ఞానము మరొకళ్ళకు లేదు. వాళ్ళ పాండిత్య మంతా, పాటల్లోనూ, సామెతల్లోనూ ఇమిడి వుంది.' అని ఇంకా ఏమన్నా మాట్లాడా లనుకుంటే 'మళ్ళీ దర్శనము చేస్తానండి ' అని ఆయన వెళ్ళబోతున్నాడు ధనమూల మిదం జగత్తని మాతాత చెపుతుండేవాడు. డబ్బుదగ్గిర ఏ పని బడితే ఆ పని చెయ్యగల సామర్థ్యముందని చాలామందివల్ల విన్నాను. చిన్నక్లాసు మాష్టర్లకి లక్ష్మిప్రసన్నము చేస్తే పైక్లాసులోకి సుళువుగా ప్రమోషన్ కావచ్చు నన్న సంగతి నా అనుభవంలోదే. పోలీసు వాళ్ళు కొంత మంది దొంగలకు ధనాపేక్ష చేత సహాయు లవుతారని ప్రతీతి. కొంతమంది అన్యాయ వర్తనులైన మేజెస్ట్రీటులు, ముద్దాయిల దగ్గిర లంచము పుచ్చుకుని కేసులు కొట్టి వెయ్యడము మామూలని వినికిడి. రిజిస్ట్రారాఫీసులో పదిరూపాయల నోటు జూపిస్తే నిముషములో మన పని అయి యివతల పడతాము. అనవసర ప్రశ్నలేమీ లేకుండా. పి.డబ్లియు వారికి వాళ్ళ మామూళ్లు ఇచ్చేస్తే కాలవకు ఎన్ని గండ్లు కొట్టుకున్నా వారికి కనపడవు.
ఇదంతా గ్రహించి ఏదో గార్డు పేదవాడు, కుటుంబీకుడు, మన బోటివాళ్ళొకరూపాయి ఇవ్వకపోతే వారి కెవళ్లిస్తారు గనుక, జీతము రాళ్ళతోటి సంసారము జరగడమెల్లాగా, ఇంతకీ మనకేదో సదుపాయంకూడా చేశాడని కొంచము ముందువెనుకలూ, కష్టసుఖాలు ఆలోచించేవాణ్ణి గనుక, పోబోతున్న గార్డుని పిలిచి, ఒక రూపాయి యిచ్చాను.
తీరా చెయ్యి జారినతరువాత వాడేమనుకుంటాడో కదా, వాడి స్వభావము తెలియకుండా యిచ్చాను. మనకేమి తంటా వస్తుందోను. పోనీ ఇచ్చినవాళ్ళము ఇంకొక రెండు రూపాయలన్నా ఇవ్వకుండా ఒక్క రూపాయే ఇచ్చాము. అధిక్యతవల్ల దోషము లోపిస్తుందేమో నని పరిపరివిధాల మనసు పశ్చాతాప పడడము మొదలు పెట్టింది. ఆ గార్డు నాకేసి ఒకసారి చూసి, ఒకసారి రూపాయకేసి చూసి, మాట్లాడకుండా జేబులో వేసుకుని నవ్వుకుంటూ చక్కా పోయినాడు.
ప్రపంచ మింతే కదా అనుకున్నాను. వీడేమన్న అనుకుం టాడేమో నని నేను పరితపిస్తుంటే, చడీ చప్పుడూ లేకుండా, రూపాయి జేబులో వేసుకు చక్కాపోయినాడు. ఔరా! డబ్బెంత పని చేస్తుందనుకున్నాను. సరే వెధవరూపాయి పోతే పోయింది కాని మనకి సుఖంగా వుందనుకున్నాను.

3
రైలు బయలుదేరింది. ఇంకో పది నిమిషాలకు 'ఎగ్మూరు' స్టేషనులో ఆగింది. అక్కడ బంట్రోతు నడిగితే, ఇదంతా చెన్నపట్నమే నన్నాడు. ఎంత గొప్ప పట్న మని ఆశ్చర్య పోతూ, ఊరు మధ్యనుండి కూడా రైలు వేశారు, ప్రజలకేమీ ప్రమాద ముండదుగదా అనుకున్నాను.
ఇంతట్లోకే నా పెట్టెలోకి, నలుగురు అరవవాళ్ళు రాబోయారు. 'చిలకల్లా వస్తున్నారా నాయనా, అవతలికి దయ చెయ్యం' డన్నాను. వాళ్ళు నామాట వినుపించుకోలేదు. మాట్లాడకుండా తలుపు తీస్తున్నారు. 'అబ్బాయి, మీకు తెలియదు. ఇది సెకండుక్లాసు, ఇందులో ఎక్కితే జుల్మానా వేస్తారు. అవతలికి వెళ్ళి యింకో పెట్టిలో ఎక్కం' డన్నాను. అందులో ఒకడు నా ముఖముకేసి చూసి 'నువ్వు ఇక్కడున్నావే. ఫోర్తుక్లాసు పెట్టెలో ఎక్కవలసిన మనిషివలె వున్నావు, దయ చేయ' మని వచ్చీ రాని తెలుగులో అన్నాడు. వాళ్ళ సాహసము చూస్తే నా కాశ్చర్యము వేసింది. 'చిత్తము, పెంకెతనానికి సౌందర్యానికి మీది పుట్టిల్లు. ఇంక కబుర్లకేమి లోటు గనుక, అధిక ప్రసంగము చెయ్యకు. దయ చెయ్య' మన్నాను. నేను అన్నదంతా వాళ్లకు బాగా అర్థము కాలేదని తోస్తుంది. అందుచేత నామాట వినిపించుకోనట్టు నటించారు. 'సరిగదా అయ్యా, నీవు జాస్తి వాయాడకయ్యా, మాకు తెల్సును' అన్నాడొకడు. ఇంతట్లోకే గార్డు అలా వెడుతున్నాడు. వీళ్ళ నవతలకి గెంటి వెయ్యమని చెపుదామని కేకవేశాను. వాడు నామాట వినిపించుకో కుండా చక్కా పోయాడు.
ఇంతట్లోకే వీళ్ళకు తోడు ఇంకో ఆయన చేరాడు. ఆ వచ్చినాయనతోటి వాళ్ళీసంగతంతా చెప్పారు. నాకింగ్లీషు రాదనుకున్నారు కాబోలు వాళ్ళు, 'వట్టి పల్లెటూరి దద్దమ్మలా ఉన్నాడు. గార్డుకి ఒక రూపాయో, రెండో చేతులో పెట్టినట్టున్నాడు. ఇంక పాపము పెట్టె అంతా తనదే ననుకుంటున్నాడు' అని వాళ్ళలో వాళ్ళు అనుకున్నారు. నేను గార్డుకు రూపాయ యిచ్చినట్టు వీళ్ళకెలా తెలిసిందా అనుకుని, 'అనవసరంగా అట్టే మాట్లాడకండి. చెన్నపట్నమంత ఊరు కాకపోయినా నేనూ నర్సాపురంలో చదువుకున్నాను. నేను గార్డుకేమీ ఇవ్వలేదు. మీ వైఖరి చూస్తే తెలియక పొరపాటున సెకండుక్లాసులోకి వస్తున్నారేమో ననుకొని మీ మేలు కోరే చెప్పాను. యీ టిక్కట్లే కొనుక్కున్నట్టయితే ఇందులోకే రావచ్చు. నా అభ్యంతర మేమీ లేదు' అన్నాను దర్జాగా. గార్డు రూపాయి పుచ్చుకుని మోసము చేశాడుగదా అనుకున్నాను. పైగా అనవసరంగా వీళ్ళతోటి పేచీకూడా ఎందుకనుకున్నాను. పేచీపెట్టినా ఏమీ లాభించేటట్టు కనుపించదు. నేను అనవసరంగా దెబ్బలాడే స్వభావము కలవాణ్ణికాను. అందులో లాభించేదేమీ లేదని తెలుసుకున్న తరువాత అసలే పేచీలోకిదిగను. ఒకవేళ పొరబాటున దిగినా, తక్షణము గౌరముగా ఇంగ్లీషు వాళ్ళు యుద్ధములో తమ పని మరోలా గవుతుం దనుకొన్నప్పుడు మర్యాదగా, యుక్తిగా, వెనక్కు తగ్గుతారని మా మేష్టారు చెప్పినట్లు - నేనూఅటువంటి సందిగ్ధ సమయంలో వెనకంజ వేస్తాను.
కాని రూపాయి అనవసరముగా గార్డు కిచ్చినందులకు మాత్రము చాలా విచారంగా ఉంది. ఏమీ అంటే పైకి మరో లాగు కనబడ్డా నేను బహు జాగ్రత్త మనిషిని. అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టడం నాకిష్టములేదు. అలా అని సమయము వచ్చినప్పుడు వెనక్కి తీసేవాణ్ణి కాను. కాని మంచో చెడో కొంచెం దూరాలోచన కలవాణ్ణి గనుక ఒక్కటే పద్ధతి పెట్టుకున్నాను. ఒకటి వేసి పది లాగాలనే పద్ధతిలో వాణ్ణి. అందుకనే వాడే మనుకున్నా, నేను వట్టి వెర్రివాణ్ని అనుకున్నా గార్డు కొకరూపాయి ఇచ్చాను. రూపాయి పోయినా, దూరపు ప్రయాణము గనుక ఇరుకులేకుండా సౌఖ్యంగా నలుగురెక్కే పెట్టెలో నేను ఒక్కణ్ణే కూర్చోవచ్చుగదా అనుకున్నాను. కాని నా జన్మలో ఈ ఒకసారి మట్టుకు మోసపడ్డాను. అదివర కెప్పుడూ ఇంత దొంగని చూడలేదు.
ఇప్పుడు పెట్టెలో ఇంకొకళ్ళెక్కారనే విచారము లేదు, నాకు పట్టుకున్న దేమిటంటే, నిష్కారణంగా వాడు నన్నెందుకు ద్రోహము చెయ్యాలని. కావాలంటే దేహి అని చెయ్యి జాస్తే లే దంటానా? నేనంత కష్టసుఖా లెరుగని వాడినా? కాదే! మానవ స్వభావములో ఎంత దుర్మార్గముంది. అందులోనూ వాడు దొర కూడాను. అంత మోసగాళ్ళు గనకనే వాళ్ళింతటి రాజ్యము సంపాదించ కలిగారు. లేకపోతే వాళ్ల అబ్బ తరమా? తాత తరమా? అందుకనే గొప్పగొప్ప వాళ్ళంతా బోడి నారాయణరావు ప్రభృతులు వీళ్ళను దేశములో నుంచి వెళ్ళగొట్టాలని చూస్తూ వున్నారు. పోనీ మన బోటివాళ్ళే వాళ్లూను. నాపెట్టెలో ఎక్కినందువల్ల నాకు వచ్చిన నష్టమేమీ లేదు. గార్డుకిచ్చిన రూపాయి తప్ప. అయినా ఎక్కినవాళ్ళు ఏ తెలుగువాళ్లో అయితే కాస్త మాటా మంచీ ఆడడానికీ, కష్టమూ సుఖమూ చెప్పుకోడానికి వీలుగా ఉండేది; అదేదీ లేకుండా, కలలోకి వచ్చేరూపూ, గ్రామసింహములు వాదించు కుంటున్నట్లు సంభాషణా వీళ్ళూనూ. ఈ అరవ వాళ్ళు వచ్చారేమా అని మట్టుకు మహా కష్టముగా ఉంది నాకు, చెప్పవద్దు మరి.
ఇంతట్లోకే రైలు బయలుదేరడానికి గార్డు ఈలవేశాడు. ఈ వచ్చిన నలుగురైదుగురిలోనూ ఆఖరునవచ్చి నాయన ఒక్కడే లోపలికి వచ్చాడు. తక్కినవాళ్ళంతా ఊరికే ఈయన్ని సాగనంపడానికి వచ్చినట్టు తోస్తుంది. ఒక్కడే అయినప్పుడు ఆయనలో ఆయన మాట్లాడుకోలేడు గదా. మాట్లాడితే నాతో మాట్లాడాలి. లేకపోతే మాట్లాడకుండా ఊరుకోవాలి. అందుచేత ఎలాగైనా, ఫరవాలేదనుకున్నాను.
రైలు బయలుదేరింది. చాలాదూరము వరకూ, చిన్న చిన్న స్టేషన్లు దగ్గిర దగ్గిరలో చాలా ఉన్నాయి. అక్కడెక్కడా రైలు ఆగలేదు. రైలాగనప్పుడు మధ్యనిన్ని స్టేషన్లు ఎందుకు కట్టారా అనుకొన్నాను. పెట్టెలో కూర్చున్నాయన నడుగుదా మనుకుని, ఇదివరకే పల్లెటూరు దద్దమ్మన్నాడు. ఈ ప్రశ్నవేస్తే యింకా ఏ మంటాడో అనుకుని ఊరుకున్నాను. కాని చెన్నపట్నము పొలిమేరెక్కడో మట్టుకు చెప్పండని కోరాను.
ఈ చిన్న చిన్న స్టేషను లన్నీకూడా చెన్నపట్నములో చేరి నవే అని చెప్పాడు. ఇంగ్లండుకంటెకూడా చెన్నపట్నమే తప్పకుండా పెద్దదనుకున్నాను. ఈ ఊళ్ళో బంధువులూ, స్నేహితులూ, ఒకళ్ళనొకళ్ళు చూసుకోవాలంటే పొరుగూరు ప్రయాణములాగే ఉంటుంది కదా అనిపించింది. ఊరి కొక చివర ఉద్యోగస్థులు, రెండోచివర ఆఫీసు ఉంటే, అక్కడికి వెళ్ళడమెలాగా అనుకున్నాను. పోనీ ఇన్ని స్టేషన్లు ఉన్నయికదా అని రైలు ఆగదు. ట్రాముకార్లయినా ఊరంతా ఉన్నట్టు కనుపించదు. ఇంక వీళ్ళు, ఏ ఎద్దుబండో జట్కా బండోఎక్కితే, ఆఫీసుకు వెళ్ళడ మెప్పుడు. అక్కడ పనిచెయ్యడ మెప్పుడు, మళ్ళీ ఇంటికి రావడమెప్పుడు? రాకపోకలకే వీళ్ళ జీతములోనూ, జీవితములోనూ సగము సరిపోతుందే, ఏలాగా అనుకున్నాను. పోనీ పనిపాటల సంగతి అలా ఉండగా ఇందులో పెద్ద ఉద్యోగస్థులూ, చిన్న ఉద్యోగస్థులూకూడ ఉంటారాయను. నెలకు ఏ పదిహేను రూపాయలో సంపాదించుకునే గుమాస్తా బతకడమేలాగు? ఇంతదూరము వాడు రోజూ రెండుసార్లు నడుస్తాడా, బండెక్కుతాడా? బండెక్కేటట్లయితే వాడు నెలరోజులు కష్టపడి చెమటోడ్చి సంపాదించింది ఒక్కరోజు బండికే సరిపోతుందే! పొద్దున నాదగ్గిర బండివాడు మైలుకి రూపాయి చొప్పున గూబలు వడేసి పుచ్చుకొన్నాడే! ఇంక వీళ్ళు తెచ్చింది కాస్తా బండికే పెడితే పెళ్ళాలకీ, పిల్లలకీ ఏమి మిగులుతుంది అనుకున్నాను. కావడము వాళ్ళు తినడము పులుసూ, చారు మెతుకులూ అయినా దానికికూడా కొంత కావాలికదా. ఎంతసేపాలోచించినా నా కేమీ ఉపాయము తోచలేదు. నేనైతే సూక్ష్మబుద్ధి కలవాణ్ణే కాని యీ సమస్య మాత్రము విడగొట్టలేక పోయినాను. ఏమీ తోచక నా తోటిప్రయాణము చేస్తున్న పెద్ద మనిషెవరో ఒకసారి చూద్దామనుకుని అదివరకు చూస్తున్న వాణ్ణి లోపలికి తిరిగి చూశాను. ఆయన నాకేసి అదివరకే నిదానంగా చూస్తున్నాడు. మాయిద్దరి కండ్లూ కలుసుకున్నాయి. 'మీ దేవూరండి ' అని అడిగాడు ఆయన. నర్సాపురమన్నాను. మా ఊరు నర్సాపురము కాకపోయినా, మొగిలితుర్రు అని చెప్పితే ఆయనకు తెలియకపోతుంది. మళ్ళా అదెక్కడని అడగడము, నేను చెప్పడము, ఇదంతా ఎందుకని నర్సాపురమంటే చులాగ్గా తెలుస్తుందని యిలా చెప్పాను. మీ రెందాకా వెళ్ళుతున్నారన్నాడు. ఏదో సామాన్యంగా తరచు వెడుతూనే వుంటాననే భావము కలిగేటట్టు, 'ఇక్కడికే కొలంబోదాకా వెడుతూ ఉన్నాను ' అన్నాను. అలాగా అని నాకేసి నిదానంగా చూసి 'కొంపతీసి ఇంగ్లండు వెళ్ళడములేదుకదా? వాలకముచూస్తే అలా కనుపించదు కాని అంతకంటే కొలంబో వెళ్ళవలసిన పనేమో కనుపించదు' అన్నాడు. 'అలాగా అండి, నా వాలకము ఎందుచేత అలా కనిపించడము లేదు? అందులో తమరేమి లోటు కనిపెట్టా' రన్నాను. 'అబ్బాయి, మీ తెలుగుదేశములో ఒక చిన్నకథ ఉంది. ఒక శాస్తుర్లుగారు ఊరికి వెడుతున్నారట. ఆయన్ని చూసి ఒక తుంటరి కుర్రవాడు 'ఏమండోయ్, తిమ్మన్నగారూ, ఎందాకా దయచేస్తున్నారు' అన్నాడట. 'నాయనా, నీవెవరో జ్ఞాపకము రాకుండా ఉంది. నన్నెక్క డెరుగుదువు? నాపేరెవరు చెప్పారు?' అని అడిగా డటాయన. అడుగుతే వాడు నవ్వుతూ ' అయ్యా నేనిదివర కెప్పుడూ తమదర్శనము చెయ్యలేదు. అయినా తమ ముఖము చూస్తే తమపేరు తిమ్మన్నగారే అయి వుంటుందని ఊహించాను. నా ఊహ నిజమే అయిం' దని చక్కాపోయాడట. అలాగ్గా నువ్వు వేరే అడగాలనా నాయనా.'
'సరే దాని కేమిలెండి. అసలేమి కనిపెట్టా రేమిటి?' అన్నాను, 'చెప్పనా, నిజము చెపితే నువ్వు ఏమన్నా అనుకుంటావేమో' నన్నాడు. 'పరవాలేదు చెప్పండి,' అన్నాను. 'నీ పెట్టెచూస్తే పల్లెటూరనీ, ఎప్పుడూ దూరపుప్రయాణము చేసి ఎరగవనీ తెలుస్తున్నది. నేను పెట్టెలోకి వస్తుంటే రావద్దనడము చూచి నీవు ఎప్పుడూ రైలుప్రయాణము చెయ్యలేదనీ, ఒకవేళ చేసినా, ఎప్పుడూ సెకండుక్లాసులో ఎక్కలేదనీ, ఎప్పుడూ పెద్ద మనుష్యులతో సంచరించలేదనీ తెలిసింది. అందుచేత ఇంతపల్లెటూరివాడవు నిజంగా ఇంగ్లండు వెళ్ళుతున్నావేమో అనుకున్నాను. లేకపోతే నువ్వు కొలంబో వెళ్ళడానికి తగిన కారణమేమీ కనుపించదు. ఆపైన నాటుకోటిసెట్టి తలలా వున్న నీ తలకాయ చూస్తే నీకు క్రాపింగ్ అలవాటు లేదనీ, జుట్టు వుండేదనీ, అది ఇవ్వాళే తీసివేయించావనీ తెలుస్తూవుంది. కొలంబో దాకానే ప్రయాణ మైనట్లయితే జుట్టు తీసివేయించవలసిన అవసరములేదు. అందుచేత ఇంకా పైకి వెడుతున్నావని రూఢి చేశాను. ఇంట్లోకూడా చెప్పకుండా వెళ్ళుతున్నావని నా అనుమానము. లేకపోతే బొంబాయి వెళ్ళకుండా కొలంబో ఎందుకు వెళ్ళుతావు? ఏమంటావు, నేచెప్పింది నిజమా అబద్ధమా? వున్నమాట చెప్పు. మీవాళ్ళతో చెప్పనులే' అన్నాడు.
ఆయన మాట లొక్కక్కటే వింటూంటే నాపై ప్రాణాలుపైన ఎగిరిపోయినయి. ప్రపంచములో ఇంతమందిని చూశాను కాని ఇలాటివాడిని మట్టు కెప్పుడూ చూడలేదు. ఈయన అరవ వాడైనా అఖండుడులా ఉన్నాడు. తెలుగుకూడా బాగానే మాట్లాడాడు. ఒకవేళ తెలుగు దేశములో ఉన్నాడేమో కొంతకాలము! లేకపోతే సెకండుక్లాసులో ప్రయాణము చెయ్యతగినంత డబ్బెక్కడిది అరవవాళ్లకు, తెలుగు దేశములో సంపాదించకపోతేను? అనుకున్నాను. ఏమైతే నేమి అఖండమైన తెలివి తేటలు. మన గుట్టంతా తెరచిన పుస్తకములో చదివినట్టు నిమిషములో కనిపెట్టేశాడు. ఈయనవల్ల ఏమీ ప్రమాదము రాదు కదా అనుకుని, అయినా ఈయనెవరో, ఈయన సంగతేమిటో, సందర్భమేమిటో, అడిగి తెలుసుకుందాము. ఏలాగైనా ఈయనతోటి కొంత స్నేహముగా ఉంటేనే నయమనుకున్నాను. లేకపోతే ఇంటికి మనమీద కోపంచేత ఉత్తరము వ్రాస్తే చిక్కు. ఎందుకయినా కొంచెము జాగ్రత్తగా ఉండడమే మంచిదని 'చిత్తం తమ రూహించినది చాల భాగము వాస్తవమే. నేను ఇంగ్లండే వెడుతున్నాను. తమ దే వూరు? తెలుగుకూడా బాగా మాట్లాడుతున్నారు, తెలుగుదేశములో ఎప్పుడైనా ఉన్నారా ఏమిటి ' అన్నాను. అనేటప్పటికి ఆయన కొంచము నవ్వి 'అబ్బాయీ! మాది తిరుచినాపల్లి. నేను చిన్నప్పటినుంచీ తెలుగుదేశములోనే ఉండేవాడిని. మాతండ్రి స్టేషను మాష్టరు పనిచేసి చాలాకాలము రాజమహేంద్రవరము, నిడదవోలు, ఏలూరు మొదలైన ఊళ్ళల్లో ఉండేవారు. నేను ఇంగ్లండులో చదువుకున్నాను. ఇంజనీరు పరీక్ష అయి నేనూ చాలాకాలము మీ ధవిళేశ్వరములోనూ, సెట్టిపేటలోనూ, బెజవాడలోనూ ఉన్నాను. అందుచేత నాకు తెలుగు బాగా అలవాటు ' అన్నాడు.
దానితోటి నాకాళ్ళు చల్లబడ్డయి. అదివరదాకా తొందరగా కొట్టుకుంటూ ఉన్న గుండె ఒక్కక్షణ మాగిపోయింది. ఇంక మా యింటిపేరు, మానాన్నపేరూ అడిగి తెలుసుకొని ఇంటికి ఉత్తరము వ్రాస్తాడు, నాకొంప మునిగిందనుకొన్నాను.
మరొకళ్ళయితే గుడ్లు మిటకరించేవాళ్ళే! నీనింకా కొంచెము ధైర్యము కలవాణ్ని గనుక ఆగిపోయిన గుండెను ఆడించి మళ్ళీ ఆయనతోటి సంభాషణ ఆరంభించాను. 'చిత్తము, అలాగా అండి. ఇంగ్లండు దయచేశారా అండి. అక్కడ మనవాళ్ళెవరైనా ఉంటారా అండి. బసా అదీ దొరికి భోజనము అదీ సదుపాయంగా వుంటుందా అండి' అన్నాను. 'ఆ, ఉన్నారు. ఏదో కొద్దిమంది మనవాళ్ళు ఉన్నారు. మొత్తముమీద సౌఖ్యంగానే ఉంటుంది ' అని, 'అబ్బాయి, నీకక్కడ స్నేహితు లెవరైనా ఉన్నారా? అక్కడెలా నడుచుకోవాలో. ఆ దేశాచారాలేమిటో ఏమన్నా తెలుసుకున్నావా?' అన్నాడు. అనేటప్పటికి పోనీ పెద్దమనిషిగదా, అని కొంచెము గౌరవముగా మాట్లాడితే నన్ను చిన్న కుర్రాడికింద కట్టివేసి, మాట్లాడితే అబ్బాయి అనుకుంటూ, ఏమిటో దర్జాకు పోతాడేమిటి? ఈయన ఎక్కువేమిటి నా తక్కువేమిటి? ఈయనింగ్లండు ఇదివరకు వెళ్ళాడు; నే నిప్పుడు వెడుతున్నాను. అంతే తేడా. ఈమాత్రము దానికి నన్నింత అగౌరవపరచవలసిన అవసరములేదు. కాబట్టి ఈయనతో సంభాషణ ఇంక కట్టిపెడితే బాగుంటుందని ఆయన అడిగినదాని కంతా 'ఆ' అని 'ఊ 'అనీ ఏకాక్షరముతోటి సమాధానము చెప్పి, ఆయనింకా ఏమిటో అడుగుతూంటే వినిపించుకోకుండా కండ్లు మూసుకుని నిద్దరపోతున్న వాడివలె వెనక్కి జార్లపడి కూచున్నాను. దానితో ఆయనకు కొంచెము కష్టము తోచింది కాబోలు, ఒక్కక్షణ మూరుకున్నాడు. కాని పాపము ఎంత సే పూరుకోగలడు? ఆడేనోరు, తిరిగేకాలు, ఒక్కమాటూ ఊరుకోలేవంటారు పెద్దలు. ఆమాట నిజమే. ఆయ నొక నిమిష మూరుకుని 'అబ్బాయీ, పాపము చాలా నిద్దర వస్తున్నట్లున్నది. పడుకో నాయనా ' అన్నాడు. 'ఏమిటి మీ అభిప్రాయము? నే నేమన్నా చంటిపిల్ల వాడి ననుకున్నారా? అని అడుగుదా మనుకొని ఆయనతో అకారణంగా ఘర్షణ ఎందుకని సమాధానము చెప్పకుండా నా బొంత తీసి పక్కవేసుకున్నాను. అది చూచి ఆయన ఊరికే లోపల నవ్వుకోవడము మొదలుపెట్టాడు. ఎవళ్లు నవ్వుతే లెక్కేమిటి మనకు? నవ్వినవాళ్ళమూతే వంకర పోతుందనుకొని, పోనీ మనకు మడత మంచముకూడా ఉందని చూపించడానికి అదికూడా పైకి తీద్దామా అనుకుని, అయినా కొద్దిగా ఇరుకుగా ఉంటుందేమో నని ఆ ప్రయత్నం మానేసి నా పక్కమీద కూచున్నాను. 'నాయనా, ఈ బొంత నీతోకూడా అడంగుకు తీసుకువెళ్ళుతావా?' అన్నాడు. 'ఆ తీసుకు వెళ్ళుతాను. తీసుకు వెళ్ళడానికి కాకపోతే మరి మధ్యదారిలో పారవెయ్యడానికి తెచ్చుకున్నానా? ఇందులో తమ రంత ఆశ్చర్యపోవడానికి కేమీ కనుపించదు ' అన్నాను. ఆయన నాకేసి సూటిగా చూచి 'ఎక్కడయినా పొరపాటున మరిచిపోతావేమో సుమా! ఎక్కడా మరిచిపోకు. ఆ దేశములో ఏ జమీందారైనా ఇది చూడడము తటస్థించి బహుమతి చేయమంటే ప్రాణము పోయినా, ఎవళ్ళకీ యివ్వకు. ఇటువంటివి వాళ్ళ కుండవు. అందుచేత చాలామంది అడుగుతారు. జాగ్రత్త సుమా, ప్రాణప్రదముగా కాపాడుకో. పోగొట్టుకోకు. నీ కిష్టమయితే మళ్ళీ యింటికి వచ్చే టప్పుడు బ్రిటిషు మ్యూజియముకు బహుమతి చెయ్యవచ్చు' నని నాకు సలహాయిచ్చి మళ్ళీ నవ్వడ మారంభించాడు. 'చిత్తము, ఈ విషయములో తమ హితోపదేశ మనవసర' మని ఆయన్ని మాడ్చాను.
ఆయన అలాగే గుడ్లు మిటకరించి నాకేసి చూస్తూ తనలో తను నవ్వుకుంటూ కూర్చున్నాడు. నా దారిని నేను పడుకుని సుఖంగా నిద్రపోయినాను. కాని లోపల మట్టుకు బెదురుగానే ఉంది, ఆ మడతమంచమో, పైనున్న మరచెంబో పట్టుకుపోతాడేమోనని. అయినా భయపడు తున్నట్లు కనిపించగూడ దనుకొని నిద్దరపోతూ, మధ్యమధ్య మెళకువ తెచ్చుకుంటూ, సామానుకేసి చూసుకుంటూ పడుకున్నాను. ఒకసారి లేచి చూసే టప్పటికి ఆయనెక్కడ దిగాడోకాని పెట్టెలో లేడు. సామానంతా జాగ్రత్తగానే ఉంది. శని విరగడయించి కదా అనుకున్నాను. మళ్ళీ ఎవళ్లూ ఆపెట్టెలో కెక్కలేదు.
నేను లేచేసరికి బాగా తెల్లవారింది. దంతధావన ప్రయత్నము చేశాను. నీళ్ళ సంగతెలాగా అనుకున్నాను. నేను కూచున్న గదిలో ఒక మూల 'లావెటరి ' అని తలుపుమీద వ్రాసి ఉంది. అదేమిటో చూద్దాము. అందులో ఏమైనా నీళ్లుంటాయేమో నని తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాను.
గది బహు పరిశుభ్రంగానే ఉంది. గోడకి చిన్న కుళాయి ఉంది. ఆ నీళ్లు కింద పడకుండా దానికింద ఒక చిన్న చక్కని కంచు బూర్లు మూకుడు ఉంది. ఆ పక్కనే మధ్య రంధ్రమున్న కుర్చీ పీట ఉన్నది. ఏ విధమైన దుర్వాసనా లేదు. ఏర్పాటంతా చాలా బాగా ఉంది. ఇంగ్లాండు నుంచి వచ్చిన తరు వాత మాయింట్లో కూడా ఇలాంటి ఏర్పాటు చేయిస్తే బాగుంటుందని నిశ్చయించాను. కుళాయిదగ్గరికి వెళ్ళి తిప్పబోయాను. ఎంత సేపు తిప్పినా తిరగలేదు. ఏలాగా అని ఆలోచిస్తూ మరొకమాటు గట్టిగా తిప్పవలెనని ప్రయత్నము చేశాను. చెయిజారి ముందుకు కుళాయిమీద పడ్డాను. అదివరదాకా ఎంత తంటాలు పడ్డా తిరగని కుళాయి దానిమీద చెయి జారి పడడము తోటే జయ్యని నీళ్ళు వచ్చి నావంటి నిండా పడ్డాయి. మళ్ళీ నేను లేవడముతోటే ఆగిపోయాయి. ఏమిటీ మాయ అని ఆలోచించి చూస్తే ఆ మీట లోపలికి నొక్కితే నీళ్ళువస్తయి కదా అని తెలుసుకున్నాను.
దంత ధావనాది కాలకృత్యములు తీర్చుకుని స్టేషనులోకి అమ్మతెచ్చిన నాలుగిడ్లీముక్కలు తిని కాసిని కాఫీ నీళ్ళు తాగి రైలురోడ్డు పక్కనవున్న దేశమంతా చూస్తూ కూర్చున్నాను.
అరవదేశము కూడా చాలా చక్కని దేశమే. ఇంత చక్కగా వుంటుందని ఎప్పుడూ అనుకోలేదు. ఎక్కడ చూసినా మంచి మంచి తోటలూ, పంటభూములు, గొప్ప గొప్ప దేవాలయాలు, అంతా మన డెల్టాలాగ వుంది. ఇంత తృణ కాష్ఠ జల సమృద్ధిగల దేశస్థులు అంత దరిద్రులుగా వుండి ఎనిమిది రూపాయలకూ, పదిరూపాయలకూ ఆశించి దేశాలుకాని దేశాలు ఎందుకు పోతారా అనుకున్నాను.
మధ్యాహ్నము ఒక స్టేషన్ లో గార్డువచ్చి భోజనము కావాలా అని అడిగాడు. నా భోజనము సంగతి వీడికెందుకు, వీడేమన్నా పెడతాడా ఏమన్నానా? పెడితేమట్టుకు మనము తింటాము గనుకనా అని 'అక్కర్లేదు' అన్నాను. 'అయితే మరేమి చేస్తారు? అన్నాడు. 'సరే ఏదో చేస్తాలే ' అన్నాను. వాడు నా ముఖముకేసి చూసి పెదవి విరిచి కనుబొమలూ బుజాలూ ఎగరవేసి చక్కా పోయినాడు. భోజనముసంగతి ఏమి చేయడానికీ తోచక మళ్ళీ ఏదో కాస్త చిరితిండి కొనుక్కుని కాస్సేపు పడుకుని నిద్రపోయినాను. సాయంత్రము సుమా రైదు గంటలయ్యే సరికి 'ట్యూటికొరిన్ ' చేరాను.

4
ప్లాటుఫారముమీద పోర్టర్లు, 'తూత్తు కుడై' అని కేకలు వేస్తున్నారు. కొలంబో పోయే వాళ్ళంతా ఇక్కడ దిగండి అని కొందరు కేకలువేశారు. సెకండు క్లాసులోనుంచి దిగేసరికి దర్జాగా వుండాలని నేను కొత్త సూటు తొడుక్కుని ఎర్రసిల్కు తలగుడ్డ చుట్టుకుని చెన్నపట్నంలో కొన్న దొరసాని టోపీమట్టుకు రైలులో విడిచిపెట్టి తక్కిన సామాను తీసుకుని పెట్టెలోనుంచి దిగాను. కూలివాడొకడు వచ్చి సామాను తీసుకుంటానన్నాడు. సరేనని నేను వాడితో బేరమాడి ముందుకు సాగాను. గేటుదగ్గిరికి వెళ్ళడంతోటే టిక్కట్టు కలెక్టరు చూసి, అలా దయచేయండని దారి చూపించాడు. అలా వెళ్లే టప్పటికి అక్కడొక పెద్దమనిషి సామాను చూపించమన్నాడు. కూలివాడి నెత్తిమీదవుంది, కనబడడం లేదా' అన్నాను. అలాకాదు పెట్టితీసి చూపించాలన్నాడు. మీరు కొలంబో ఎందుకు వెళుతున్నా రన్నాడు. నాగుండె బద్దలయించి. ఇంటి దగ్గర చెప్పకుండా వచ్చిన సంగతి వీడి కెలా తెలిసిందా అనుకున్నాను. అయినా కొంత ధైర్య స్థైర్యములు కలవాడిని గనుక వెర్రిమొహము వేయకుండా, ఎందుకయితే నీ కెందుకన్నాను. సరే పోనీలెండి నా కక్కరలేదు, కాని సామాను మట్టుకు చూడక తప్పదన్నాడు. ఎందుచేత నన్నాను. ఇక్కడ రూలది అన్నాడు. 'ఏమి టారూలు?'
'పన్ను విధించవలసిన వస్తువు లేమైనా దొంగతనంగా తీసుకువెడుతున్నారేమో చూడాలి.'
ఈ మాట వినగానే నాగుండెల్లో బరువు తగ్గింది, కొంచెము నవ్వు వచ్చింది. సరే అయితే చూసుకోమందా మనుకున్నాను. ఇంతటిలోకే నా సామాను మోసుకు వస్తున్న కూలివాడు నన్ను వెనక్కు పిలిచి 'ఆ పెద్దమనిషిచేతులో ఒక్క అర్ధరూపాయి పెడితే ఈ రూల్సు అన్నీ మరిచిపోతాడు. లేకపోతే మనకు స్టీమరు తప్పిపోతుంది' అన్నాడు. స్టీమరు తప్పిపోవడము ఎంత మాత్రమూ నా అభిప్రాయముకాదు. కాని వీళ్ళ దౌర్జన్యము చూస్తే నాకు కొంత నవ్వు వచ్చింది. అతని కర్ధరూపాయి చేతులో వేసేసరికి చేటంతముఖము చేసుకొని అదివరదాకా కూర్చున్నవాడు లేచి నిలుచుని సలాము చేసి 'థేంక్ యూ సర్ ' అని పెట్టె ముట్టుకుని 'ఇందులో వట్టి బట్ట లేనా సార్! అని నన్ను విడిచిపెట్టాడు. బ్రతుకుజీవుడా అనుకుని తిన్నగా స్టీమరు దగ్గిరికి నడిచాను. ఇంతలోనే వెనుకనుంచి ఒక రైలు బంట్రోతు పరుగెత్తుకొని వచ్చి నేను రైలులో విడిచిపెట్టిన ఆ దొరసాని టోపీ తీసుకువచ్చి నాకు వప్పజెప్పాడు. విధిలేక అది తీసుకొన్నాను. వాడు పోకుండా అక్కడే నిలబడ్డాడు, చేతులు నలుపుకుంటూ. సరే టోపీ నాదేలే, వెళ్ళమన్నాను. ఏ మన్నా ఇమ్మని కూచున్నాడు. నాకు స్టీమరుకు వేళ అవుతున్నది, సరేనని ఒక పావలా ఇచ్చుకుని టోపీఖరీదు కిది వడ్డీ అనుకుని ముందరికి సాగాను.
ఆ సముద్రమూ, ఆ గట్టూ, అక్కడి దీపాలూ, ఆ హడావిడీ అంతా చూస్తే నాకు చాలా సంతోషము వేసింది. కాని స్టీమరిదేనని చెప్పేటప్పటికి మట్టుకు ఎక్క బుద్ధయింది కాదు. బొత్తిగా చిన్నదిగా వుంది, మామూలు రాధారీ పడవంతయినా లేదు. స్టీమరైతే మట్టుకు అంత చిన్నదాంట్లో సముద్రం మీద వెళ్ళడము ప్రమాదము కాదా అనుకున్నాను. దీని మీదనే వెళ్ళవలసి వుంటే, ఇంతకంటే మళ్ళీ యింటికి వెళ్ళడము నయమనుకున్నాను. ఇలా ఆలోచిస్తూ నిలుచుండగానే కూలి వాడు సామాను లోపల పెట్టేసి నన్నెక్కమని తొందరపెట్టాడు. ఇదేనా ఏమిటి కొలంబో వేళ్ళే స్టీమరు అన్నాను. 'కాదండి. పెద్ద స్టీమరు అయిదారు మైళ్ళు దూరాన లోపల వుంది. ఇది దానిదగ్గరికి తీసుకువెడుతుంది. ఎక్కండి త్వరగా' అన్నాడు. అయితే ఫరవాలేదనుకుని ఎక్కాను. ఎక్కి అక్కడొక బల్ల మీద కూచున్నాను. కూచున్న కాసేపటికే అది బయలుదేరింది. మొత్తము జనము నాతోడి ప్రయాణీకులు పాతిక మంది కంటే వుండరు.
బయలుదేరిన ఒక అయిదు నిమిషలవరకూ చాలా సరదాగా వుంది. నీటితుంపురులు మీద పడుతూ, నేల అంతకంతకు దూరమైపోతూ, ఒడ్డునున్న దీపాలు దూరమైన కొద్దీ మిణుకు మిణుకు మంటూ, అన్నివైపులా చీకట్లు కమ్ముకువస్తూ, పైన నీలాకాశము, దానికి వ్రేలాడగట్టిన పాదరసపు బుడ్లలాగా అనేక కోట్ల నక్షత్రాలూ, కింద ఎటుచూచినా అగాధమైన సముద్రమూ, ఆ కెరటములమీద లేస్తూ దిగుతూ ఉయ్యాల ఊగుతున్నట్లు అంతా మాబాగా వుంది. నాకే కవిత్వమువస్తేనా అనుకున్నాను. ఇంతకూ ఆంధ్రుల అదృష్టము బాగుంది, నాకు కవిత్వము రాకపోవడము ఇప్పుడున్న కవులకి తోడు నా బోటివాడు ఇంకొకడు బయలుదేరితే భరించలేక పోయేవాళ్ళు ఆంధ్రులు.
కొంచెము సేపటికి పగల స్తమానమూ బోజనములేని కారణాన్నో, ఎందుచేతనో కాని వుపద్రవమైన తలనొప్పి ఆరంభించింది. కాస్త ఎక్కడయినా ఒరుగుదామా అంటే ఎక్కడా ఖాళీలేదు. అలాగే తల పట్టుకు కూర్చుండగా వికారముకూడా ఆరంభమైంది. ఏమిరా దేవుడా ఎలాగు, కొంపతీసి జ్వరము వచ్చి పడిపోనుకదా! ఇంతదూరము వచ్చి మళ్లీ వెనక్కు వెళ్ళవలసి రాదుకదా! అన్నిటిమాటా అలా వుంచి మళ్లీ యింటికి వెళితే నలుగురిలోనూ హాస్యాస్పదముగా వుంటుందే అని ఏమీతోచక కండ్లుమూసుకుని కూచున్నాను.
ఈ అవస్థలో ఇలావుండగా ఇంకో ఆలోచన తోచింది. దానితోటి మరీ హడిలిపోయాను. ఆ ఆలోచన మొట్ట మొదటనే తోస్తే ఎవళ్లేమన్నాసరే, నవ్వినా సరే, తిట్టినా సరే, మాట్లాడకుండా తిరుగురైలులో ఇంటికి జేరుకునేవాణ్ని. ఇప్పుడేమి చేయను! వెనక్కు తగ్గడానికి వీలు కనపడదు. ముందుకు సాగితే బతికే ఎత్తు కనుపించదు. ముందుకు వెడితే నుయ్యి, వెనక్కి వెడితే గొయ్యి లాగుంది నా బ్రతుకు. ఏమీతోచదు. ఇంకొకళ్ళ సలహా అడగడానికి మనసొప్పదు. ఒక్కసారి ఇంటిసంగతి జ్ఞాపకము వచ్చింది. ఆహా! ఎంత తెలివి తక్కువపని జరిగిందనుకున్నాను. నా కింగ్లండు వెళ్ళమని సలహా యిచ్చినవాణ్ణి నోటినిండా తిట్టాను. ఒక్కడినే కొడుకునని నామీద ఎంతో ఆశపెట్టుకున్న నా తల్లి దండ్రు లెంత విచారిస్తారోకదా అనుకున్నాను. ఏమనుకుంటే ఏమిలాభము! ఇంతకూ అసలుసంగ తేమిటంటే ఈ చిన్న స్టీమరులోనుంచి పెద్దస్టీమ రెక్కడ మెలాగా అని సందేహము కలిగింది. కొంతసేపు ఏమీ తోచలేదు. హఠాత్తుగా మా ఊళ్ళో ఒకళ్ళు చెప్పుకుంటున్న సంగతి జ్ఞాపకము వచ్చింది. చిన్న స్టీమరులోనుంచి పెద్దస్టీమరెక్కే ఉపాయము చెప్పుకుంటున్నారిద్దరు. అది నేను వినడము సంభవించింది. పెద్దస్టీమరు మీదనుంచి చిన్నదాని దగ్గరికొక తాడు నిచ్చెన దింపుతారట. చిన్నస్టీమరెప్పుడూ కెరటాలవల్ల పైకొకమాటు లేవడామూ, ఒక మాటు దిగడమూ ఉంటుంది గనుక ఆ నిచ్చెన ఎప్పుడూ అందుబాటులో ఉండదట. అందుకని ప్రయాణీకులు సమయము కనిపెట్టి కెరటమువల్ల పైకి లేచినప్పుడు ఎగిరి ఆ నిచ్చెన అందుకుని ఎక్కి పైకి వెళ్ళవచ్చునట. అట్లా చేతకాని వాళ్ళను నడుముకొక తాడుకట్టి పెద్ద స్టీమరు మీద నుంచి కొక్కెమున్న గొలుసొకటి దింపి, ఆ కొక్కానికి తాడు తగిలించి పైకి లాగుతారట. ఈ మనిషినడ్డిని ఉన్న తాడు తెగిపోయినా, ముడి ఊడిపోయినా మనిషి కిందనున్న స్టీమరులోనే బహుశా పడవచ్చుననీ, ఒకవేళ సముద్రములో తప్ప మరి యెక్కడా పడడనీ, ఒకవేళ సముద్రములో పడ్డా, కాని, ప్రాణభయ మేమీ లేకుండా వలవేసి మనిషిని మళ్ళీ త్వరలోనే పట్టుకుంటా రని చెప్పుకోగా విన్నాను ఆఖరుమాటలవల్ల, విన్నప్పుడు కొంచెము ధైర్యము కలిగినా, తీరా తరుణము వచ్చినప్పుడాలోచిస్తే అంత ధైర్యంగాలేదు, ఏమంటే ఒకవేళ స్టీమరులో పడితే తలకాయ బద్దలు కావచ్చును. లేదా మరొక విధమైన దెబ్బ లేమయినా తగలవచ్చును. అలా కాక సముద్రములో పడితే పైవాళ్ళు వలవెతికి తీసుకువచ్చే లోపల కెరటాలు మనను అవతలికి కొట్టి వెయ్యవచ్చు. పడిన చోటనే ఉంటామని నమ్మకమేమిటి? ఉంటేమట్టుకు అంత దాకా ప్రాణము నిలుస్తుందో నిలవదో? ఒకవేళ నిలిస్తే ఈ లోపల ఏ పెద్ద చేపైనా వచ్చి మన్ని ఫలహారము చేస్తే గతేమిటి? ఈ మోస్తరుగా పరి పరి విధాల ఆలోచన పోయింది. చిన్నప్పుడు ఈత నేర్చుకోక పోయినందు కిప్పుడు విచారించాను. పోనీ మాట్లాడకుండా దీని మీదనే తిరిగి వెనక్కు వెళ్ళిపోదామా అనుకున్నాను. సరే ఇంత తొందర ఎందుకు, ఒక్కక్షణము ఓపికపడితే అంతా తెలుస్తుందికదా. అప్పుడే వీలయితే అలాచేయవచ్చునుకదా అనుకున్నాను. ఇంక ఎప్పుడు పెద్ద స్టీమరు చేరుతామా అని ప్రాణాలు ఉగ్గపట్టుకొని గుండె రాయి చేసుకుని ఒక్క మాటు ఇంటిదగ్గిరున్నవాళ్ళను తలుచుకుని పొంగివస్తున్న దుఃఖాన్ని ఆపుకొని శ్రీరామ స్మరణ చేసుకుంటూ కూచున్నాను.
స్టీమరు బహు తొందరగా సముద్రాన్ని చీల్చుకుని పరుగెడుతూ ఉంది. బొంయ్ మని ఇంజనులధ్వని, హోరుమని సముద్రమూ, నాపక్క నున్నవాళ్ళ మాటల సందడితోటి నాతల నొప్పి మరింత అధికమైంది. కళ్ళు తెరిస్తే ప్రపంచమంతా గిర్రున బొంగరములా తిరిగి పోతున్నది.
ఇంతలోకే అదుగో స్టీమరంటె, అదుగో స్టీమరన్నారు. దానిమీద దీపాలుతప్ప ఇంకేమీ కనబడలేదు. ఈ చిన్నస్టీమరు కొంచెము నెమ్మదిగా వెళ్ళితే బాగుండును. లేకపోతే చీకటిచాటున దాన్ని కొట్టుకుంటుందేమోనని భయపడ్డాను. నేనను కున్నట్టు గానే కొంచెము జోరు తగ్గించారు. నెమ్మదిగా దాని దగ్గిరికి చేరాము. మాదానికంటే అది చాలా పెద్దదిగా, కొండలాగ ఎదురుగుండా ఉన్నది. మా స్టీమరు బహు నెమ్మదిగా హడిలి పోతున్నట్లు దగ్గిరికిచేరి పెద్ద స్టీమరు సరాసరినే నిలబడ్డది. పైకి చూస్తే తాడి ఎత్తున నల్లగా గొడపెట్టినట్టు పెద్ద స్టీమరు కనబడుతున్నది.
తలనొప్పితోటైతేనేమి వికారముతోటైతేనేమి భయముతోటైతేనేమి, నా ఒళ్లు కంపమెత్తిపోతున్నది. అదివరకు ఏమూలైనా కొంచెము ధైర్యముంటే అదికాస్తా యిప్పుడు భగ్నమైంది. ఇంక ఎవళ్లు ఏమన్నా, ఎన్ని అన్నా, ఎంతనవ్వినా, ఇంటికి వెళ్ళడమే మంచిదనుకున్నాను. నవ్వేవాళ్ళకేం, నవ్వుతారు. పోయేది నాప్రాణముకాని వాళ్ళది కాదుగదా. ప్రాణముపోతే నవ్వేవాళ్ళెవరూ వాళ్ళ ప్రాణమివ్వరుకదా. ఈ వచ్చింది, చూసిందీ చాలు. ఈమాత్రమేనా యిల్లు కదలడము ఈ వంకవల్ల కలిగింది. చెన్నపట్నములో ఇంకోవారము రోజులుండి సరదాగా అన్నీ చూసిపోదామని నిశ్చయము చేసుకున్నాను.
ఇంతలోకే ఆ స్టీమరువాళ్ళూ యీ స్టీమరువాళ్ళూ మాట్లాడుకోడము, ఏదో కేకలు వేసుకోడ మయినతరువార పైనుంచి ఒక నిచ్చెన దింపారు. నిచ్చెన తిన్నగా మాస్టీమరులోకంటా వుంది. నిచ్చెనకు పైన ఒక పెద్ద దీపముంది. నిచ్చెనకూడా ఏదో ఒక మోస్తరు తాడునిచ్చెనకాకుండా చక్కగా విశాలమైన మెట్లూ, పక్కల పట్టుకోడానికి కర్రకమ్ములూ అవీవుండి మామూలు మేడమెట్లలాగే వున్నాయి. మా స్టీమరుకూడా నేనుభయపడ్డట్టు కెరటాలమీద ఆకాశమండలాని కెగురుతూ పాతాళానికి దిగుతూండకుండా, కొంచె మించు మించుగా కదలకుండానే వున్నది. ఇదంతా చూస్తే నే నిదివరకు విన్నదంతా అబద్ధమని తెలిసింది. ఇప్పుడు ప్రాణభయమేమీ లేదని ధైర్యము కలిగింది. మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళవలసిన అవసరము లేదుకదా అనుకున్నాను. దానితోటి కొంత ధైర్యము తెచ్చుకుని తలనొప్పి ఇంకా బాధిస్తున్నా అందరితోటిపాటూ నేనూ లేచాను పైకెక్కడానికి. లేచి నా సామాను దగ్గిరికి వెళ్ళి తీసుకోపోయాను. అక్కడొతత నుండి నేను వెళ్ళవచ్చుననీ, సామాను వెనుకనుంచి వస్తుందనీ చెప్పాడు. సామానంతా అలా విడిచిపెట్టి వెళ్ళితే ఏమి కొంప మునుగుతుందో అని భయపడ్డాను. మళ్ళీ వాణ్ని ఒక మాటు 'సామాను జాగ్రత్తగా వస్తుందా' అంటే, 'వస్తుంది ' అని ధైర్యము చెప్పాడు. ఇది కాకుండా తక్కిన వాళ్ళంతా కూడా వాళ్ళ సామాన్లు విడిచి వెళ్లుతున్నారు. అందుచేత పరవాలేదుకదా అనుకుని అంతసేపటినుంచీ చేతులోవున్న దొరసాని టోపీ మట్టుకు పుచ్చుకుని తక్కిన వాళ్లతోటిపాటు నేనూ నిమ్మళంగా పైకెక్కాను.
ఆఖరి మెట్టెక్కి లోపలికి తొంగి చూచేటప్పటికి నాకు చాలా ఆశ్చర్యము వేసింది. స్టీమరంటే మామూలు రాధారి పడవల కంటే బాగా పెద్దదిగావుండి రెండు మూడు పెద్ద హాలులు అందులో బల్లలు వుంటాయి కాబోలు అనుకున్నాను. తీరా చూస్తే ఇదొక పెద్ద మహారాజభవనములా వున్నది. లోపలంతా చక్కని దీపాలు, నేలమీద తివాసులూ, గొప్ప గొప్ప సోఫాలూ, కుర్చీలూ, బల్లలూ సమస్తమూ వున్నాయి. ఇంకా మంచాలూ పరుపులూవేసి పడుకోడానికి వేరే గదులు, స్నానాల గదులు, పాయఖానాలు, వంటయిళ్ళు, భోజనాల సావిళ్ళు అన్నీ వేరు వేరుగా వుండేటట్లు వున్నాయి అనుకున్నాను. అయినా మళ్ళీ ఎంతపెద్ద స్టీమరైతేమట్టుకు ఇవన్నీ ఎలా వుంటాయి? ఈ ఒక్కగదిమట్టుకు పైకిరాగానే దర్జాగా కనపడడానికి, ఇలా కుర్చీలూ బల్లలూ వేసి వుంచా రనుకున్నాను.
నేనక్కడ నిలుచుని ఊరికే ఇలా ఆశ్చర్యపోతూ వుంటే, ఒక పెద్దమనిషి వచ్చి నన్ను పలకరించాడు. నే నెక్కడికి వెడుతున్నానో అడిగి తెలుసుకుని, తను నేటాలు వెళ్ళుతున్నాననీ చాలా సార్లదివరకు వెళ్లాననీ దేశాటానము చాలా మంచిదనీ ఇంకా ఏమిటో మాట్లాడాడు. నాకు తలనొప్పివల్ల అతను చెప్పేవన్నీ నా తల కెక్కలేదు. ఆపైన రోజ స్తమానమూ తిండి లేకపోవడమువల్ల కడుపులో దహించుకు పోతున్నది. రొట్టెలు కాల్చుకోడానికి ఓపికలేదు. పోనీ ఎలాగో శ్రమపడదామా అంటే వీలు కనబడదు. ఏమీ తోచడములేదు. వచ్చేటప్పుడు ఇంకా కాసిని యిడ్లీలూ అరటి పండ్లయినా తెచ్చుకొన్నాను కాను అనుకున్నాను. ఏమనుకుంటే ఏమి లాభము? ముందు దారేమీ కనబడదు. ఆ నేటాలువాడు వాడిదారి నేదో వాడు వాగుతున్నాడు. కాసేపు చేతనైతే నోరు మూసుకుని కూచోమందా మనుకున్నాను.
మా స్టీమరు కూతకూసి బయలుచేరింది. ఇంతలోకే గంట ఒకటి వినబడ్డది. ఆ గంట ఏమిటా అనుకున్నాను. నాపక్కనున్న నేటాలు సోదరుడు భోజానానికి వెళుదాము రమ్మన్నాడు. నాకా మాటలు నమ్మబుద్ధికాలేదు. 'ఏమిటి, ఎక్కడికి ' అని రెట్టించి అడిగాను. 'భోజనాల హాలులోకి, భోంచేదా' మన్నాడు. వాడి మాటలు వింటే నాకు చస్తున్నవాడి నోట్లో అమృతము పోసినట్టున్నది. పోతున్న ప్రాణము వెనక్కువచ్చింది. దేవుడింకా మన పక్షాన్ని వున్నాడనుకొన్నాను, స్టీమరుమీద మనకు భోజనము ఎవరు పెడతారు, ఎందుకు పెడతారు ఏమి పెడతారన్న సంగతేమీ ఆలోచించలేదు. ఏదో ఆహారమంటూ కొంత లోపలపడి ప్రాణమంటూ కొంత నిలిస్తే తక్కిన సంగతులు తరువాత ఆలోచించవచ్చు ననుకున్నాను.
తిన్నగా నాస్నేహితుణ్ని అనుసరించి నడిచాను. ఇప్పుడు చూసిన గదే అనుకుంటే అంతకంటే తమాషాగా ఉంది ఈ గది. గదికి మధ్య పెద్ద పొడుగాటి బల్ల వుంది.దానిపైన తెల్లనిగుడ్డ పరిచారు. దానిమీద చక్కని పింగాణీ పళ్ళాలూ, గాజు గ్లాసులూ, కత్తులూ, చంచాలూ ఇంకా ఏమేమిటో వున్నాయి. మేము ప్రవేశించేటప్పటి కప్పుడే కొంతమంది వచ్చి కుర్చీలమీద కూచున్నారు. మేమూ వెళ్ళి చెరి ఒక కుర్చీ అలంకరించాము.
కూచుని నాస్నేహితుణ్ని ఈ కత్తులూ, కఠార్లూ ఎందుకు భోజనము చేసేచోట అని అడిగాను. సిగ్గు విడిచి అడిగి తెలుసుకోకపోతే మాట దక్కేటట్లు కనబడలేదు. ఇంకోనిమిషానికి వడ్డన అవడము, భోజనానికి కూచోడము సంభవిస్తుంది. ఇంకప్పుడు వెర్రిమొహము వేస్తే బాగుండదు. అందుకని ముందే తెలుసుకునివుంటే మంచిదని యుక్తిగా నేను వట్టి అజ్ఞానుణ్ని అని అతను అనుకోకుండా గడుసుతనంగా అడిగాను. అడుగుతే పాపము ఆ పెద్దమనిషి చెప్పాడు వాట్ల వుపయోగము.
ఇంక వడ్డన ఆరంభించ బోతున్నారు. ఈ కత్తులూ అవీ వుపయోగించడము మనకు చేతవుతుందో కాదో చూదా మను కుని ఒకచేత్తోటి కత్తి పుచ్చుకుని చివర పండ్లున్న చెంచా (Fork) రెండోచేత్తో గుప్పిట్లో గట్టిగా పట్టుకుని గునపము భూమిలోకి దింపినట్లు ఎత్తి రొట్టెమీద గుచ్చబోయాను. అలా కాదు, జాగ్రత్త, కంచము బద్ధలవుతుందని నాస్నేహితుడు నిమ్మళంగా చెపుతూనే వున్నాడు. ఆ మాట నేను వినుపించుకొలేదు. ఇంతటిలోకే వచ్చే ప్రమాదమేమిటి, ఈ మాత్రము చేతకాకుండా వుంటుంది గనకనా, ఇదొక పెద్ద బ్రహ్మ విద్యా ఏమిటని రొట్టెమీదికి నా శక్తికొద్ది గభీమని దింపాను. కూర్చున్నవాళ్ళంతా ఊపిరి బిగబట్టుకుని ఏమిజరుగుతుందా అని చూస్తున్నారు. దింపేసరికి తలనొప్పిగా వుండడము చేతనో ఏమో కాని గురితప్పి రొట్టె చివరతగిలి దానిమీదనుంచి జారిపోయి కంచమంచుకు తగిలి దానిమీదనుంచికూడా జారిపోయి బల్లకు గుచ్చుకుంది. ఆ అదురుకి రొట్టెముక్క జానెడెత్తున ఎగిరి బలికి తీసుకువెళ్ళిన మేకపిల్ల వీలయితే తప్పించుకు పారిపోయినట్లు నాపక్కనున్న నాలుగు కంచాలమీదనుంచీ దాటి అయిదో కంచం పక్కన దాక్కున్నది. నాకంచముకూడా నా బోటి వాళ్ళ ననేకమందిని చూసివుండాలె. అయినా కంగారు పడి వచ్చి నావొళ్ళో పడ్డది. ఇంతవరకూ ప్రమాదమేమీ కలగలేదని సంతోషించాను. కంచము కిందపడితే రెండు చెక్కలయ్యేది. దాని ఖరీదు, ఏ అణో, బేడో అయినా వాళ్ళు వచ్చి రెండు రూపాయలో మూడురూపాయలో తెమ్మంటే చచ్చినట్లు ఇచ్చుకోవలసిందే గదా అలాంటి దేమీ లేకుండా తప్పిపోయింది. ఇవ్వాళ లేచిన వేళ మంచిదే ననుకున్నాను.
నా పక్కనున్న వాళ్ళంతా నవ్వడము మొదలు పెట్టారు. ఎందుకు వస్తుంది నవ్వు అలా అస్తమానమూ అయిన దానికీ కాని దానికీని? 'ప్రమాదో ధీమతా మపి ' అన్నారు. ఎవళ్ళకైనా వస్తుంది పొరబాటు; ఏమిటి దానికి?
ఒళ్ళో పళ్ళెము తీసి మళ్ళీ బల్లమీద పెట్టాను. అసలు దహించుకుపోతున్న ఆకలికి తోడు వాళ్ళు నవ్వడముతోటే నాకు కోపము వచ్చింది. ఇప్పుడూరుకుంటే ఇంక పరాభవముగా వుంటుందనుకుని మళ్ళీ యింకో రొట్టెముక్క చేత్తో తీసుకుని దేవుడిచ్చిన చేతులుండగా ఈ వెధవ కత్తులూ అవీ ఎందుకూ, మనయిష్టము వచ్చినట్టు తింటే వాళ్ళేం కొడతారా, తిడతారా అని నా స్వతంత్రము తెలియపరచడానికి ఆ రొట్టెముక్క వెన్నలో అద్దుకుని కొరుక్కు తినడము మొదలు పెట్టాను. నాపక్కనున్న అతను వద్దని సలహా యిస్తూనే వున్నాడు. కాని నేను లక్ష్యపెట్టలేదు. అదివరదాకా నవ్వుతున్న తక్కినవాళ్ళంతాను, వాళ్ళకేదో నేను మహాపకారము చేసినట్లు నాకేసి కోపముగా చూడడము మొదలు పెట్టారు, చూస్తే నాకేమి భయమా? నేనంత కంటే కోపముగా వాళ్ళకేసి చూసి నాపని నేను కానిచ్చాను.
రెండు ముక్కలు నోట్లో పెట్టు కున్నాను. అవింకా పూర్తిగా గొంతుకు దిగాయో లేదో మూడోసారి నోట్లో పెట్టుకుందా మని చెయ్యెత్తాను. కడుపులో చెయ్యిపెట్టి కలిపినట్టు కలవరము బయలుదేరి, పెద్ద తాడిలావున డోకు వచ్చింది. చటాలున చేతిలో రొట్టెముక్క కంచములో పారవేసి నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని లేచాను. ఎక్కడికి వెళ్ళడానికీ, ఏమి చెయ్యడానికీ తోచలేదు. అంతకంతకు లోపలినుంచి ఊరికే పెల్లగిలి వస్తున్నది; ఆపడానికి శక్యము కావడము లేదు, ముందు గదిలోనుంచి అవతలికి పోదామని గుమ్మముకేసి రెండడుగులు వేశాను. లోపలినుంచి వస్తున్న ప్రవాహము నాచేతి నవతలికి తోసి కొంత బయటపడ్డది. మళ్ళీ చెయ్యి అడ్డు పెట్టుకున్నాను. ఒక నౌకరు నా అవస్థచూసి చటుక్కున దగ్గిరికి వచ్చి నారెక్కపట్టుకొని ఒక గదిలోకి లాక్కుపోయినాడు.
అక్కడ రైలులో మొహము కడుక్కోడానికి ఉన్నట్టుగానే ఏర్పాటున్నది. పూర్తిగా వాంతి అయింది. గడచిన దినమంతా తిండి లేకపోయినా అంత పదార్థ మెక్కడినుంచి వచ్చిందో కాని వారముదినములు తిన్నంత వెళ్ళిపోయింది. నోరూ చెయ్యీ శుభ్రముగా కడిగివేసుకున్నాను. కడుపులో పేగులన్నీ నొప్పులుగా ఉన్నాయి. తల బద్దలవుతున్నది. కండ్లు తిరుగుతున్నాయి. కండ్లు తెరిస్తే ప్రపంచమంతా గిర్రున తిరిగిపోతున్నట్టున్నది. కాళ్ళు తేలిపోతున్నాయి. కింద పడిపోతా నేమోనని భయము వేసింది.
నన్ను తీసుకువచ్చిన నౌకరింకా అక్కడనే ఉన్నాడు. మళ్ళీ నన్ను చెయ్యి పట్టుకుని తిన్నగా ఇంకో గదిలోకి తీసుకువెళ్ళాడు. గది చాలా చిన్నది. కాని అందులో ఒక చిన్న మంచమున్నది. దానిమీద శుభ్రమైన పరుపువేసి పక్కవేసి ఉంది. దానిమీద పడుకోమన్నాడు. అక్కడిదాకా ఎలా నడిచివచ్చానో నాకే తెలియదు. ఈ పరుపు పాపము ఎవరిదోను? ఎలాగో తంటాలుపడి హాలులో కుర్చీలో కూర్చుంటాను, లేకపోతే ఎక్కడైనా స్థలము చూపిస్తే నామంచము వేసుకుని పడుకుంటాను, అని చెపుదామనుకున్నాను. కాని నోటివెంట మాట రాలేదు. గదిలో వస్తువులేవీ కనపడడములేదు. మాట్లాడకుండా తాగివున్న వాడికి మల్లే మంచముమీద పడ్డాను. కాలిజోడైనా విప్పుకోలేదు.
ఇదంతా భోజనముదగ్గిర కూర్చున్నవాళ్ళ దృష్టిదోషము వల్ల నేమో ననుకున్నాను. కాస్త దిగతుడిచిపోసే వాళ్ళయినా లేరుకదాఅనివిచారించాను. ఈతలనొప్పీ అదీ చూస్తే పీడజ్వరము ఏమైనా వస్తుందేమోననుకున్నాను. ఇలా అనుకుంటుండగానే కళ్ళు కూరుకు వచ్చినాయి. ఇంక నా ఒళ్ళు నాకు తెలియదు.
కొంతసేపటికి రాత్రి నౌకరు వచ్చి లేపితే మెళకువ వచ్చింది. కండ్లు తెరచిచూచేసరికి తెల్లవారింది. కొలంబో చేరాము. లేవండి, దిగా లన్నాడు. లేచాను. తలనొప్పితగ్గింది. తేలికగాఉంది. జ్వరము గిరము ఏమీరాలేదు. చులాగ్గానే తేలాను అనుకున్నాను. కులాసాగా ఉందా అని బంట్రోతు అడిగాడు. దివ్యంగా వుందన్నాను. లేచి తలగుడ్డ సవిరించుకుని, నా సామా నెక్కడ ఉంది అన్నాను. 'కిందికి వెళ్ళిపోయంది మీకంటే ముందేను. మీరుకూడా దయచేయం' డన్నాడు. రాత్రి చూసుకోలేదు. సామానులు జాగ్రత్తగా వుందో లేదో? పైనుండగా చూస్తే ఏమన్నా లోటు వస్తే అడిగిపోతానని కాబోలు అప్పుడే దించివేశాడని భయము వేసింది. లేచి నుంచుని చూసేటప్పటికి నేను చెన్నపట్నములో కొన్న దొరసాని టోపీ ఒక బల్లమీద పెట్టివుంది. రాత్రి బంట్రోతు తీసుకువచ్చి పెట్టిఉంటా డనుకొన్నాను. దానికేసి చూడకుండా మాట్లాడకుండా పైకి వచ్చాను.

5
సుమా రేడుగంట లైంది. అప్పుడే దిగవలసిన వాళ్ళంతా దిగారు. నేనే ఆఖరు. నేను నిమ్మళంగా దిగాను. కిందంతా మహా హడావిడిగా ఉంది ఇటు వెళ్ళేవాళ్ళూ అటు వెళ్ళేవాళ్లూ; స్టీమరుమీదనుంచి దిగినవాళ్ళకోసం వచ్చిన వాళ్ళూ, ఊరికే వేడుక చూడ్డానికి వచ్చినవాళ్ళూ, కూలివాళ్ళూ; ఒకళ్లేమిటి, సముద్రము ఒడ్డంతా కిటకిట లాడుతున్నది. హార్బరు నిండా స్టీమర్లు చాలా ఉన్నాయి. ఈ హడావిడి అంతా చూస్తూ నిమ్మళంగా సామాను దగ్గిరికి వెళ్ళాను. సామానంతా జాగ్రత్తగానే ఉంది. పాపము పెట్టెకూడా ఏమీ నలిగిపోకుండానే దింపారు, వాళ్ళ ధర్మాన్ని.
ఒక కూలివాడిని కేకవేసి సామాను వాడినెత్తిమీద పెట్టి బండ్లదగ్గిరికి వస్తున్నాను. వెనుకనుంచి ఎవరో పిలుస్తున్నట్టు వినబడ్డది. నన్ను కాదనుకున్నాను మొదట. ఇక్కడ నన్నుపిలిచేవా రెవరుంటారని ముందుకి నడిచాను. మళ్ళీ కేక విన బడేసరికి ఆగి వెనక్కిచూశాను. రాత్రిస్టీమరులో బంట్రోతు ఆదిక్కుమాలిన దొరసాని టోపీ తీసుకుని పరుగెత్తుకుని వస్తున్నాడు. అది నాకు వదిలే ఉపాయము కనబడలేదు. మొదటనే రైలులోనుంచి ఎక్కడైనా పారేస్తే తీరిపోయేది; ఇంతబాధ లేకపోయేది. పోనీవృధాగా పారేయడ మెందుకు, రైలులో విడిచిపెడితే ఎవళ్ళయినా తీసుకుంటారని ఆలోచిస్తే అదేమీ సాగిందికాదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళితే అక్కడికి కూడా తరుముకు వస్తున్నది. ప్రపంచములో ఇంత న్యాయబుద్ధి ఉందని ఇదివర కెప్పుడూ అనుకోలేదు. ఏ వస్తువైనా ఎక్కడైనా మరచిపోతే మళ్ళీ ఇక అది దొరకడము దుర్లభమని చాలామంది చెప్పారు. ఆ అభిప్రాయము సరికాదని ఇప్పుడే తేలింది. ఏదైనా ఎవళ్ళకైనా అనుభవములోనికి వస్తేగాని తెలియదు. ఇక ముందెప్పుడైనా ప్రపంచములో అన్యాయమూ, దొంగతనమూ ఉందని చెపితే నేను నమ్మను. ఇక ఈటోపీ ఎక్కడ మరిచిపోయినా నన్నుకూడా వెంబడించేటట్టున్నది. అందుకని మాట్లాడకుండా యీసారిమట్టుకా టోపీ తీసుకుని ఎవళ్లూ చూడకుండా ఏ అర్ధరాత్రివేళో నడిసముద్రములో గిరాటు వేస్తాను. లేకపోతే మళ్ళీ సముద్రములోనైనా, పగలు పారేస్తే ఏ దౌర్భాగ్యుడో చూసి అది వలవేసి తీసి మళ్ళీ తీసుకు వచ్చి ఇస్తాడేమోనని భయము వేస్తున్నది. ఆ టోపీ చూస్తే మట్టుకు నాకు మహా చెడ్డ అసహ్యం! బోలెడంత ఖరీదు దాని మొహాన్ని తగలెయ్యడమే కాకుండ పైగా అది పారేసి పోతూ ఉంటే వెనుకనుంచి తీసుకువచ్చి యచ్చిన ప్రతివాడికి ఏదో బహుమతిచేసి నా కమిత ప్రియతరమైన వస్తువేదో పోకుండా తీసుకువచ్చినట్టు సంతోషము కనపరచాలి. ఇంతమట్టుకి- సహించడమే చాల కష్టము. ఈ మాటుకింక తప్పదు గనుక మళ్ళీ ఆ తెచ్చినవాడి ముఖాన ఒక పావలా తగలేసి ఆ దరిద్రపు టోపీ తీసుకుని బండిదగ్గరకు వెళ్ళాను.
చెన్నపట్నములో వచ్చిన చిక్కే యిక్కడాను; అక్కడ కలిగిన సందేహమే ఇక్కడాను; ఎక్కడ బస చేయడమా అని. ఇక్కడి దరిద్రులకూ రాదు తెలుగు. చెన్నపట్నములో కొంత అనుభవమైంది గనుక కొంచము ఇంగ్లీషు వచ్చినట్టు కనబడ్డ ముఖము గల ఒకాయన్ని పిలిచి అడగ్గా, ఇక్కడకూడా దగ్గిరలో ఒక సత్రము ఉందనీ, ఆ సత్రములోనే దుడ్డు తీసుకుని భోజనము వేస్తురనీ, తెలుసుకొని నా రధాన్ని అక్కడికి తోలమని సారధితో చెప్పాను. గదులూ, అవీ విశాలంగా ఉన్నాయి. స్నానానికీ దానికీ సౌకర్యముగా ఉంది. జనసమ్మర్ధ మట్టే లేదు. బాగుందని సంతోషించి ఒక గది తీసుకుని సామానందులో పెట్టించేసి బండికి సెల విచ్చాను. చెన్నపట్నములో వాడికి మల్లే వీడు అట్టే దెబ్బలాడలేదు. కొంచెము మర్యాదస్థుడులాగనే ఉన్నాడు. అయితే వీడు సాహెబు, అందుకనే అయి ఉంటుంది.
ఇక సావకాశంగా పెట్టె తీసి పండ్లపొడి వగైరా తీసుకొని దంత ధావనాదికముకానిచ్చి స్నానముచేసి కొంతసేపు కూర్చునే సరికి పదిగంట లైంది. భోజనము చేశాను. చెన్నపట్నము లోనే నవ్వినవాళ్లు ఇక్కడింకా నవ్వుతారని పట్టుబట్ట కట్టుకోడము మానేశాను. భోజనము చేసినంతసేపూ మనసుకు చాలా కష్టముగానే ఉంది. తర్వాత కొంచెముసేపూ విశ్రమించాను. ఇంతవరకూ బాగానే ఉంది. ఇంకముందు సంగ తేమిటో, ఏమి చేయాలో తోచలేదు. లండనుకి ఏ స్టీమరు వెడుతుందో ఎప్పుడు వెడుతుందో, ఎక్కడ టిక్కట్లు ఇస్తారో ఏమీ తెలియదు. ఎవళ్ల నడగడానికీ ఇక్కడ ఎవళ్ళనూ ఎరగనుగదా! ఒకవేళ నిన్న రాత్రి స్టీమరే తిన్నగా లండనుదాకా వెళ్ళే దేమో అడిగి తెలుసుకో నన్నా తెలుసుకున్నానుకాను. ఇక్కడ కూర్చుని ఆలోచిస్తే ఏమి లాభమని నాసూటు వేసుకుని తలగుడ్డ చుట్టుకుని వీధిలోకి బయలు దేరాను. ఒకదారీ తెన్నూ తెలియదు. ఎవళ్ల నైనా అడగడానికి వాళ్లభాష తెలియదు. ఏమైనా సరే నని దైవముమీద భారంవేసి ముక్కుకు సూటిగా బయలుదేరాను. కొంతదూరము వెళ్లేసరికి పెద్దమనిషి సూటు వేసుకుని చక్కగా క్షౌరము చేసుకున్న తలకాయ మీద టోపీ పెట్టుకుని, మూడు గీతలో నాలుగు గీతలో కనపడేటట్టు గంధము పెట్టుకుని ఎదురుగుండా వస్తున్నాడు. బహుశః ఈయన కింగ్లీషు వచ్చి ఉంటుంది అనుకున్నాను. ఆయన్ని ఆపి మీ కింగ్లీషు వచ్చునా అని అడిగాను. వచ్చునన్నాడు. అయితే మీ దేవూరన్నాను. కుంభకోణము అన్నాడు. కుంభకోణమనే టప్పటికి మట్టుకు కొంచెము భయము వేసింది. మన మడిగిన దానికి సరిగ్గా జవాబు చెపుతాడో చెప్పడో అని. అయినా కుంభకోణము వాళ్లంతా మోసము చేస్తారు గనుకనా, మన్ని మోసము చేస్తే మట్టు కితని కేమివస్తుందని 'అయ్యా, మీరొక్క సహాయము చేసిపెట్టా ' లన్నాను. నేనడిగిన మాటకా పెద్దమనిషి అపార్ధము చేసుకుని అనుమానముతో నాకేసి చూసి 'నేనేమి చేయగలను వట్టి బీద వాడిని ' అని వెళ్ళి పోబోతున్నాడు. ఆయన్ని మళ్లీ ఆపి నాకాయన వల్ల ధనసహాయ మేమీ అక్కర లేదని అభయమిచ్చి 'ఒక విషయము మిమ్మల్ని అడిగి తెలుసు కోవాలని ఉంది నాకు ' అన్నాను. 'ఏమిటి ' అన్నాడు. నే చెప్పబోయే విషయముమాత్రము ఎవళ్ల దగ్గిరా మట్టుకు చెప్ప వద్దన్నాను. సరే నన్నాడు. 'నేను లండన్ వెళ్ళాలని బయలు దేరాను. ఇంటి దగ్గిర మావాళ్లకు తెలియదు. అక్కడికి వెళ్లే స్టీమ రెప్పుడు బయలు దేరుతుందో టిక్కట్లు ఎక్కడిస్తారో ఈ సంగ తేమన్నా తమకు తెలిస్తే చెపితే సంతోషిస్తాను. ఇంటి దగ్గిరే ఈ సంగతి తెలిస్తే వెళ్లనివ్వరని భయపడి వచ్చేశాను. ఇక్క డెవళ్లనూ ఎరుగను నేను. అందుకని మీకేమన్నా తెలిస్తే దయచేసి చెప్పండి' అన్నాను. 'ఓ ఇంతేగదా. దాని కభ్యంతర మేమున్నది. ఇలా ఫలాని చోటికి వెళితే టామస్ కుక్ అండ్ సన్ అని బల్ల కట్టి ఉన్న పెద్ద కంపెనీ ఒకటి కనబడుతుంది. తిన్నగా అందులోకి వెళితే టిక్కట్టూ, మీకు కావలసిన యావద్విషయాలూ తెలుస్తయి ' అని చెప్పాడు.
'సరే బాగుంది. ఈమాత్రము తెలుస్తే ఇంక లండన్ వెళ్ళామన్నమాటేను' అని తిన్నగా ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళాను. ఆ కంపెనీచూసేసరికి లోపలికి వెళ్ళడానికి భయమువేసింది. ఇంత దేశము తిరిగినా, అంతమేడ మట్టుకు ఎక్కడా కనబడలేదు. అది గాకుండా తీరా లోపలికి వెళితే స్టీమరు ఉందంటారో లేదంటారో? ఇంకోవారము రోజులదాకా రాదంటారో? లేకపోతే అసలిక్కడినుంచి వెళ్ళడము మానేశాయి అంటారేమో? ఇక్కడి నుంచి స్టీమర్లు వెళ్ళడములేదూ అంటే చచ్చినట్టు ఇంటికి వెళ్ళవలసిందే. ఇంకోవారము పదిరోజులు ఆలస్యమవుతుంది అంటే ఈ లోపున మావాళ్ళు నా సంగతెలాగో తెలుసుకుని ఇక్కడికి వచ్చి పట్టుకుంటారేమో? అంతే కాకుండా ఎవళ్ళనీ కనుక్కోకుండా ఉజ్జాయింపు నేదో కొద్దిగా తీసుకు వచ్చాను డబ్బు. ఇక్కడ తీరా చాలదంటే ఏమికాను నాగతి? ఇక్కడ మనకప్పు ఇచ్చేవాళ్ళెవరుంటారు? అని ఇన్నివిధాలుగా మనసుపోయి లోపలికి వెళ్ళడానికి కొంచెము సంకోచించాను.
ఏమైతేమట్టుకు ఇంతదూరము వచ్చినతరువాత ఇక్కడ సంకోచిస్తూ నిలబడితే లాభమేముందని ఏమైతే అవుతుందని లోపల దణ్ణము పెట్టుకుని కంపెనీలోకి వెళ్ళాను. అక్కడొక బంట్రోతు కనపడి 'ఎక్కడికి ' అన్నాడు. 'లోపలి ' కన్నాను. 'ఎందుకు ' అన్నాడు. 'ఊరకనే ' అన్నాను. 'అయితే వెనక్కు తిరగండి ' అన్నాడు. 'వెనక్కి ఎందు' కన్నాను. 'ముందు పని లేనప్పుడు వెనక్కే' నన్నాడు. 'నాకు ముందు పని ఉంది' అన్నాను, 'ఏంపని' అన్నాడు. 'ఏమైతేమట్టుకు నీతోటిచెప్పాలా ' అన్నాను. 'ఆ చెప్పా' లన్నాడు. 'ఎందు' కన్నాను. అనేటప్పటికి వాడికి కోపము వచ్చి ఒకమాటు కండ్లెర్రజేసి నాకేసి చూచి 'నిన్ను లోపలికి వెళ్ళనివ్వడాని' కన్నాడు. నీవు వెళ్ళనిచ్చే దేమిటన్నాను. 'నే వెళ్ళనివ్వక్కర లేకపోతే వెళ్ళలేదేమి ' అన్నాడు. వెడతానన్నాను. వెళ్లు చూదాము అన్నాడు. 'నా యిష్టమైనప్పుడు వెళ్ళుతాను. నీ ఆజ్ఞ ఏమిటినాకు?' అన్నాను. ఒక నిముషము వాడు మాట్లాడక ఊరు కున్నాడు. నేనూ ఏదో ఆలోచిస్తున్నట్లు గోడలకేసి, మేడ మెట్లకేసి జేబుల్లో చేతులు పెట్టుకుచూస్తూ నిలబడ్డాను. కాని లోపల మట్టుకు భయము గానే వుంది. తీరా సాహసించి ముందుకి అడుగు వేస్తే వాడు రెక్కట్టుకుని వెనక్కు లాక్కు వెడతాడేమో. ఇంగ్లండు వెడుతున్నప్పు డటువంటి పరాభవము జరగడము బాగుండదు. సరే, అయినా ఏం చేస్తాడో చూద్దామని ఒక అడుగు ముందుకు వేశాను. వెనుకనుంచి తుపాకి పేల్చినట్టు 'ఆగు' అన్నాడు. వెనక్కు తిరిగిచూసి 'ఏం అలా ఉలిక్కిపడ్డావ' న్నాను. ఇంక వాడు కోపము పట్టలేక పోయినాడు. తిన్నగా నాదగ్గిరికి వచ్చి నా బుజముమీద చెయ్యివేసి 'ఇంక నీ పెంకెవేషాలన్నీ కట్టిపెట్టి మర్యాదగా బయటికి వెళ్ళ 'మన్నాడు. వాడు బుజమ్మీద చెయ్యి వేసేసరికి నాకూ కోపమువచ్చింది. బుజమ్మీద చేయి తీసి వేసి 'నీవు బంట్రోతు వన్న సంగతి మరచిపోయి నట్లున్నావు, ఇందాకనుంచీ పోనీయనని మర్యాదగా ఊరుకున్నాను. నీబోటి వాళ్ళను లక్షమందిని చూశాను. ఇంక అట్టే నీవు పెంకితనము చేశావంటే నీ మీద రిపోర్టు చేయవలసి వస్తుంది, తీరా ఉద్యోగముపోతే అప్పుడు విచారిస్తే ఏమీ లాభముండదు. కాబట్టి జాగ్రత్త' అని ముందుకు నడవబొయ్యాను. వాడింక ఏమీ సమాధానము చెప్పకుండా నాచెయ్యి పట్టుకుని తిన్నగా వీధిలోకి తీసుకువెళ్ళి దిగబెట్టి 'దిక్కున్నచోట చెప్పుకో' మన్నాడు.
ఆలోచిస్తే దిక్కేమీ ఉన్నట్టు కనుపించలేదు. తీరా యీ బంట్రోతు ముండావాడితోటి దెబ్బలాట పెట్టుకుంటే అసలు వ్యహారము చెడుతుందేమోనని భయము వేసింది. ఇక్కడ వీడి స్నేహము చేసుకుంటేనే గాని లాభము లేదని తోచింది, అందుకని మళ్ళీవాడి దగ్గిరికి వెళ్ళి నెమ్మదిగా, వాడికో అర్ధరూపాయి చేతిలోపెట్టి 'నేను లండన్ వెళ్ళవలసిన మాట నిజమేను. టిక్కట్టుకోసము వచ్చాను, లేకపోతే ఇక్కడ నాకేమిపని గనుక. కావలిస్తే చూడు ఇదిగో సొమ్ము' అని జేబులో వున్న లెక్కతీసి వాడికి చూపించాను. వాడు అప్పుడు నా మాట నమ్మి జరిగిన పొరపాటుకు క్షమించమని లోపలికి దారి చూపించాడు.
తిన్నగా లోపలికి వెళ్ళాను. ఆ గదిలో గోడలనిండా పెద్ద స్టీమర్ల ఫొటోగ్రాపులూ, మ్యాపులూ ఉన్నాయి. అక్కడొక దొరగారు కూర్చున్నారు. ఆయన దగ్గిరకు వెళ్ళి 'అయ్యా నేను లండన్ వెళ్ళాలండి. స్టీమరెప్పుడు వెళుతుంది. వెళ్ళడానికి ఎన్నాళ్ళు పడుతుంది. టిక్కట్టెంత అవుతుంది?' అని అడిగాను. ఆయన నన్ను ఎగాదిగాచూసి 'నిజంగా లండన్ వెళుతావా ' అన్నాడు. వెళుతున్నానన్నాను. ఎందుకుఅన్నాడు. చదువుకోడాని కన్నాను. 'ఏం చదువుతావు?' ఈ పరీక్ష వీడికెందు కనిపించింది. అయినా దొర; ఆపైన టిక్కట్టుకూడా యిచ్చేవాడాయెను. వీడితోటి దెబ్బలాట ఎందుకని 'బారిష్టరు' అన్నాను. 'మీవాళ్ళువెళ్ళడానికి కొప్పుకున్నారా' అన్నాడు. కొంచెము సందేహించి 'ఆఁ' అన్నాను. 'లేకపోతే అసలు మీ వాళ్ళతోటి చెప్పలేదా ఏమి' టన్నాడు. నేను కొంచెము భయపడుతూ, వీడి కేమన్నా తెలిసిందా ఏమిటి మనసంగతి అనుకుంటూ, ఏమీ చెప్పడానికీ తోచక ఆలోచిస్తూ నిలబడ్డాను. 'కొంపతీసి నిజంగానే చెప్పకుండా వచ్చావా ఏమిటి! నాతోటి చెప్పవచ్చు, నీకేం భయము లేదులే. ఇలా చెప్పకుండా వెళ్ళేవాళ్ళు చాలామంది ఉంటారు' అన్నాడు. అనేటప్పటికి కొంచెము ధైర్యము తెచ్చుకుని 'అవును. చెపితే మావాళ్ళు వెళ్ళనివ్వరని చెప్పకుండానే వచ్చాను' అన్నాను. 'అయితే కోపమువచ్చి మీవాళ్ళడబ్బు పంపించరేమో! ఆసంగతి ఆలోచించావా?' అన్నాడు. ఫరవాలేదు పంపిస్తారు అన్నాను. పంపించకపోతే చాలాచిక్కుపడవలసి వస్తుంది సుమా! ముందే ఆలోచించుకో.' 'అంతా ఆలోచించు కున్నా లెండి. తప్పకుండా పంపిస్తారనే ధైర్యము ఉంది గనుకనే బయలుదేరివచ్చాను. ఇవ్వాళ బయలుదేరే స్టీమరేదైనా ఉందా!' 'ఒకవారం దినములవరకూ లండన్ కంటా వెళ్ళే స్టీమర్లేవీ లేవు. కాని రేపు ఒక ఫ్రెంచి స్టీమరు మార్సేల్సు వరకూ వెళుతుంది. అక్కడనుంచి రైలుమీద వెళ్ళవచ్చును. అలా అయితే మీకు చౌకగానూ ఉంటుంది, త్వరగానూ వెళ్ల వచ్చును, అలా వెళ్ళడానికి మీకేమైనా అభ్యంతరము ఉందా?' 'నా కెంతమాత్ర మభ్యంతరములేదు. ఫ్రెంచి స్టీమరుకే టిక్కట్టు ఇప్పించండి.' 'ఏక్లాసులో వెళుతావు?' 'థర్డ్ క్లాసు సౌఖ్యంగా వుంటుందా అండి?' 'ఒక మోస్తరుగా వుంటుంది, ఫరవా లేదు వెళ్ళవచ్చును.' 'అయితే థర్డ్ క్లాసు టిక్కట్టు ఒకటి యిప్పించండి.'
సరే నని టిక్కట్టు ఇచ్చి 'మార్సేల్సులో కూడా మాకంపెనీ వుంది, అక్కడే కాకుండా ప్రతి పట్టణములో వుంటుంది. ఎక్కడే విధమైన సహాయము కావలసి వచ్చినప్పటికిన్నీ మా కంపెనీకి వెళ్ళి నట్టయితే వాళ్ళ చేతనయిన సహాయము చేస్తారు. నీవేం భయపడ నక్కర లేదు.' అని అభయ మిచ్చాడు.
సరి ఇంక మన కేం ఫరవా లేదు కదా అను కున్నాను. 'నీ దగ్గర డబ్బు చాలా వున్నట్లయితే మా చేతికి ఇవ్వాల్సింది. నీదగ్గర వుంటే పోవచ్చును. నీవు దిగగానే మార్సేల్సులో మా కంపెనీ వాళ్లు నీ సొమ్ము నీకిచ్చి వేస్తారు. నీవు ఇంకా యింటికి సొమ్మూ అదీ పంపించమని మీవాళ్ళకు వ్రాసే టట్లయితే మాకంపెనీ అడ్రెసు మీవాళ్ళకు తెలియ పర్చవలసింది. నీకు సొమ్మువచ్చినా వుత్తరాలు వచ్చినా మేము జాగ్రత్తగా వప్ప జెప్పుతాము' అన్నాడు. సరే, ఈ ఏర్పాటు చాలా బాగుందని నాదగ్గిరున్న సొమ్మంతా ఆయన కిచ్చాను. ఒక ఏభై రూపాయలు మట్టుకు నా దగ్గిర అట్టె పెట్టుకో మని మిగతా సొమ్ము కొక చెక్కూ, ఈ ఏభై రూపాయలూ నా చేతికి ఇచ్చి మార్సేల్సు వాళ్ళకంపెనీ విలాసము వున్న అచ్చు చీటీ కూడా ఒక టిచ్చాడు. రేపు మధ్యాహ్నము మూడు గంటల కిక్కడికి వచ్చినట్లయితే స్టీమరు దగ్గరికి పంపిస్తా మన్నాడు. ఆయన దగ్గిర సెలవు తీసుకొని 'ఆహా? ఎంత గొప్ప కంపెనీ ప్రతీపట్టణములోనూ వుందంటున్నాడు. నాబోటి గాండ్లకిలా బోలెడెంత సహాయము చేస్తున్నాడు. వీళ్ళకు దీనివల్ల ఏమైనా లాభముంటుందా? లేకపోతే ఊరికేనే చేస్తున్నారా?' అని, ఆలోచిస్తూ వీధి గుమ్మము దగ్గిరికి వచ్చాను. ఇందాకటి బంట్రోతు లేచి నిలుచుని 'టిక్కెట్టు తీసుకున్నారా అండీ' అని, తీసుకున్నానని చెప్పగానే నాకు సలాము చేశాడు. వాడి పొగరుబోతుతనము కొంత అణిగిందిగదా అని సంతోషించాను.
అక్కడినుంచి బజారువైపుకు దారి అడిగి తెలుసుకొని బయలుదేరి వెళ్ళాను. ఈ పట్టణము బజారుకూడా చాలా బాగానే వుంది, చెన్నపట్నములో కంపెనీలాంటి కంపెనీ ఒకటి కనబడితే ఇది వరకు కొన్నది అక్కరకురాలేదు కనకను, మళ్ళీ ఒక టోపీ ఒకటి కొనుక్కున్నాను. తరువాత ఇంటికి వచ్చేసరికి ఇంకోసంగతి జ్ఞాపకమువచ్చింది! దీపమొక టవసరముగదా అని. స్టీమరులో దీపము లేకపోతే? ఒకవేళ వున్నప్పటికిన్నీ వాళ్ళు తెల్లవార్లూ వుంచుతారో వుంచరో చీకట్లో పడుకోడానికి నాకు భయము. నిన్న రాత్రి స్టీమరులో దీపాలు ఎక్కేటప్పటికున్నాయిగాని నాకు తలనొప్పి వికారము తోటి ఒళ్లు తెలియకుండా పడుకుని తెల్లవారేదాకా మెళకువ రాకపోవడమువల్ల రాత్రి తెల్లవార్లూ వున్నవో లేవో జ్ఞాపకములేదు. రాత్రి స్టీమరులో లేకపోతే అప్పుడు దొరకదుగదా! ఇంతకూ మనకోదీపము, అప్పటికైనా, అడంగుకువెళ్ళిన తరువాతనైనా కావలసిందేగదా, అందుకని ఒకస్టాండూ, రెండుడజన్లు కొవ్వొత్తులూ కొనుక్కుంటే కాలక్షేప మవుతుందిగదా అని అవి కొన్నాను. తరువాత ఇంకో సందేహము తోచింది. స్టీమరులో పాలూ మజ్జిగలూ ఏమైనా దొరుకుతాయా, దొరకవా అని. ఒకవేళఏదీ దొరక్కపోతే ఎలాగనుకుని ఇక్కడొకషాపుమీద పాలడబ్బాలు దొరుకుతవని వ్రాసివుంటే చూసి, ఇది కాస్తదగ్గిరుంటే నయము కదా అనుకుని రెండు డబ్బాలు కొనుక్కుని నిమ్మళంగా ఆ సత్రము చేరుకున్నాను.
రాత్రి భోజనము చేసి సావకాశంగా ఇంటికి ఉత్తరము వ్రాదామునుకుని పెట్టితీసేసరికి కాగితముగాని కలముగాని ఏమీ కనపడలేదు. సరే ఇదొకటిబజారు వెళ్ళి కొనుక్కోవాలిగదా అనుకుని ఆ రాత్రి సుఖంగా పడుకున్నాను.
మర్నాడు ప్రొద్దునే బజారుకు వెళ్ళి వుత్తరములు వ్రాసుకోడానికి కాకితాలూ కవర్లూ ఒక పౌంటెన్ పెన్నూ, అందులోకి సిరా, ఒక పెన్సలూ, జమాఖర్చు వ్రాసుకోవడానికి ఒక చిన్న ఎక్సరసైజు బుక్కూ, కొనుక్కుని ఇంటికి వచ్చాను.
వచ్చి ముందు వుత్తరమువ్రాసి పోస్టులో వేస్తే తీరిపోతుందని వుత్తరము వ్రాయడ మారంభించినాను.
క్షేమము కొలంబో
శ్రీ వేదమూర్తులైన బ్రహ్మశ్రీ వేమూరి రామచంద్రయ్య నాన్నగారికి;
తమ కుమారుడు పార్వతీశం అనేక నమస్కారములు చేసి చేయంగల విన్నపములు, ఉభయ కుశలోపరి, పై చిరునామా చూసి ఈ కొలంబో ఏమిటి? ఎక్కడుంది? ఎక్కడున్నా, నేనిక్కడికి వెళ్లడానికి కారణ మేమై వుంటుందని ఆశ్చర్య పడవచ్చును. ఇది సింహళద్వీపానికి ముఖ్యపట్టణము, అనగా పూర్వము మనము రావణాసురిడి లంక అనుకునేవాళ్లమే, అదే సింహళ ద్వీపము. రాక్షస కులమంతా రామరావణ యుద్ధములో అంతరించింది. కనుక ప్రస్తుత మిక్కడ రాక్షసభయ మేమీ లేదు.
నేనింతకాలమునుంచీ మనదేశ దుస్థితి చూస్తూంటే నాకు చాలా విచారంగావుంది. చూస్తూ సహించి ఊరుకోలేక పోయినాను. ఈ దేశ దుస్థితి తొలిగించడము ఏలాగాఅని చాలాదూరము ఆలోచించాను. నాకు తోచిందేమిటంటే ఒక్కసారి మన అధికారుల దేశము వెళ్ళి వాళ్ల గుట్టూ మట్టూ కొంతవరకు తెలుసుకువస్తే చాలా లాభిస్తుందనీ, అందుకని అక్కడికి ఒకసారి వెళ్ళి రావలెనని బయలుదేరాను. వెళ్ళేవాళ్ళము ఏలాగూ వెళ్ళుతున్నాముకదా! ఇదంతా ఒకటి రెండు పూటల్లో అయ్యేపనికాదాయెను. కొంతకాలము అనగా ఒక యేడాది రెండేండ్లో ఉండక తప్పదు. అందుకని ఈ లోపున బారిష్టరు పరీక్ష చదివి ప్యాసు అయితే మళ్ళీ స్వదేశానికి వచ్చిన తరువాత ఒకడికింద తలవంచుకొని పని చెయ్యనక్కర లేకుండా స్వతంత్రముగా జీవనము చేయవచ్చునని ఊహించి అక్కడ బారిష్టరు చదవ నిశ్చయించుకున్నాను. అక్కడ అయ్యేఖర్చు విషయము ఎంత కావలసిందీ అక్కడికి వెళ్ళిన తరువాత వుత్తరము వ్రాస్తాను.
ప్రస్తుతము ఖర్చుకోసం అయిదువందల రూపాయలు ఇక్కడ నర్సాపురము నాటకము కంపెనీలో రాజువేషము వేసే గజవిల్లి నారాయణగారిద్వారా రు 1-14-0 లు వడ్డీ చొప్పున బదులు పుచ్చుకున్నాను. ఆయన నాయందుండే స్నేహభావము చేతను ఇంత తక్కువ వడ్డీకి ఇప్పించా ననీ, సొమ్ము మట్టుకు త్వరగా పంపించ మనీ చెప్పారు. కాబట్టి ఆ 500 రూపాయలూ వారికి వెంటనే ఇచ్చివేసి మరో అయిదువందలు ఫ్రాన్సు దేశములోవుండే మార్సేల్సు అనే గ్రామానికి ధామస్ కుక్ అండ్ సన్ వారు చూసుకుని నాకిచ్చేటట్టుగా టిల్లిగ్రాపు మనియార్డరు ద్వారా తక్షణము పంపించగోరెదను. మీ రలా చేయనియెడల పరదేశములో చాలా యిబ్బంది పడవలసి వస్తుంది.
ఇదంతా తెలివితక్కువనీ ఇంత డబ్బు ఖర్చు అవుతున్నదనీ మీరనుకోవచ్చును. కాని నేను చాలా దూరాలోచన చేసే వెళుతున్నాను. బారిష్టరీ ప్యాసు అయి వచ్చినట్లయితే కావలసినంత డబ్బు సంపాదించగలను. మీరు నన్ను ఇంటికి రప్పించుటకు ఏవిధమైన ప్రయత్నమూ చేయవద్దు. నేను తలపెట్టిన కార్యము సఫలమయ్యే టంతవరకూ ఇంటికి రాను. ఈ రోజునే స్టీమరు ఎక్కుతున్నాను. మీరు వృధాప్రయాస పడవద్దు.
మీతోటి చెప్పకుండా మీ సెలవు లేకుండా ఇలా వెళ్ళిపోయినందుకు నాకు చాలా విచారంగా ఉంది. ఇదివరకెప్పుడూ మీరు చెప్పిన మాటకు నేను వ్యతిరేకముగా నడుచుకోలేదని మీకే తెలుసును. కాని యీ విషయములో మట్టుకు తెలుస్తే వెళ్లనివ్వరని యిల్లా చేయవలసి వచ్చింది. ముందు ముందు చాలా డబ్బు సంపాదించడమే కాకుండా దేశానికి కూడా చాలా ఉపకారము చేయగలనని నమ్మకము ఉండడము చేత ఇంత సాహసమైన పని చేస్తున్నాను. దీనివల్ల మీ రెంత కష్టపడేదీ నాకు తెలుసును అయినప్పటికీ యిలా చేయక తప్పిందికాదు. పరదేశములో ఎంతెంత కష్టపడతానో అని, సముద్రముమీద ఏమి అపాయము ఉంటుందో అనీ, మ||న|| మా అమ్మను బెంగ పెట్టుకోవద్దని చెప్పగోరెదను. మీకందరికీ యింత కష్టము కలుగజేసినందుకు నన్ను క్షమించవలెను. మార్సేల్సులో దిగగానే ఉత్తరము వ్రాస్తాను. మ||న|| మా అమ్మకు నమస్కారాలని చెప్పవలెను.
చిత్తగించవలెను.
విధేయుడు
వే. పార్వతీశము
షరా: సొమ్ముమట్టుకు తక్షణము టిల్లిగ్రాపు మనియార్డరు ద్వారా పంపించవలెను.
ఈ ఉత్తరము వ్రాయడానికి చాలా కష్టము వేసింది. మా అమ్మమాట తలుచుకునే సరికి కండ్లవెంబడి నీళ్ళు వచ్చినాయి. చెయ్యి వణకడము మొదలు పెట్టింది. కలము ముందుకు సాగింది కాదు. ఎలాగైతే నేమి, ఉత్తరము పూర్తిచేసి కవరులో పెట్టి పై చిరునామా వ్రాసి పోస్టాఫీసుకు వెళ్ళి పోస్టులో వేసివచ్చాను. ఇంటికి వచ్చి స్నానము చేసి భోజనానికి లేచాను. అన్నము ఏమీ సయించింది కాదు. ఎలాగో రెండు మెతుకులు నోట్లో వేసుకుని లేచి వచ్చి సామాను సర్దుకుని కాసేపు పడుకుని రెండుగంటలకు బయలుదేరి సామాను సహితంగా కుక్ వారి కంపెనీకి వెళ్ళాను.
అక్కడనుంచి వారు నాతోటి కూడా ఒక బంట్రోతునిచ్చి సముద్రపు ఒడ్డుకు పంపించారు. మా స్టీమరు సముద్రములో కొంచెము దూరములో ఉంది. మొన్న ఎక్కిన స్టీమరు కంటె కూడా చాలా గొప్పదిగా కనబడ్డది. నాతోటి ఉన్న బంట్రోతు ఒక చిన్న నావదగ్గిరికి తీసుకువెళ్ళి అందులో నన్నెక్కమని తను కూడా యెక్కాడు. దాంట్లో అది వరకే చాలామంది దొరలూ దొరసానులూ ఉన్నారు. ఇలాటివే ఇంకా రెండు మూడు నావలు పూటుగా జనాన్ని ఎక్కించుకొని మా స్టీమరుకేసే వెళుతున్నాయి. ఈ జనమంతా మా స్టీమరులో ఎక్కే వాళ్లేనని చెప్పాడు నాతో ఉన్న మనిషి.
నిమ్మళంగా స్టీమరుదగ్గిరికి చేరాము. మొన్నటికి మల్లేనే నిచ్చన కిందికి దింపారు. ఒక్కొక్కళ్ళమే పైకి ఎక్కాము. ఒక్క పెద్దమేడ మీద నిలుచుని కిందకి చూస్తున్నట్లుగా వుంది దాని మీద నిలుచుని చూస్తూంటే. నాతో ఉన్న మనిషి నా సామాను తీసుకు వెళ్ళి లోపలెక్కడో పెట్టేశాడు. మేమంతా చాలా మందిమి అక్కడనే నిలబడి, సముద్రముకేసి తక్కిన స్టీమర్లకేసి, దరిని ఉన్న మేడలకేసీ చూస్తున్నాము. ఇంతటిలోకే గంట వినపడ్డది. కిందకు దిగేవాళ్ళంతా దిగిపొమ్మని కేక వేశారు. పైకి వచ్చిన చాలామంది, మళ్ళీ ఆ చిన్న నావలలోకి దిగి పైనున్న వాళ్లకేసి చూస్తూ చేతులూగిస్తూ వెళుతున్నారు. వాళ్లంతా తమ వాళ్లని సాగనంపడానికి వచ్చారు గదా అనుకున్నాను. మావూరునుంచి ఎప్పుడైనా ఎక్కడికైనా వెడుతూ ఉంటే మా అమ్మా నాన్నా వద్దంటున్నా ఎంతో దూరము వచ్చి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడల్లా ఎవళ్లూ లేరుగదా అనుకున్నాను. దిక్కు లేకుండా నిరాధారినై పక్షివలె నూతన ప్రపంచములోకి వెళుతున్నాను గదా అనుకున్నాను. అక్కడ ఏమి చిక్కులు పడాలో కదా అనుకున్నాను. నా ఉత్తరము చూసుకుని యింటిదగ్గిర మా అమ్మా నాన్నా ఎంత విచారిస్తారో కదా అనుకున్నాను. ఇదంతా తలుచుకునే టప్పటికి పట్టరాని దుఃఖము వచ్చింది.
మా స్టీమరు బయలుదేరించి. చిన్న నావల్లోవాళ్లు ఇంకా స్టీమరులో వాళ్లకి మనుష్యుల ఆనవాలు తెలియక పోయినా జేబు రుమాళ్లు విసురుతున్నారు. మళ్లీ ఎన్నాళ్ళకో గదా ఈ దేశము రావడ మనుకున్నాను. వచ్చేదాకా మట్టు కు నమ్మకమేమిటి! పరదేశములోనే కడతేరుతా నేమో నని భయం వేసింది. భూమి కనపడీ కనపడకుండా ఉంది. తల్లీ దయవుంచమని ఒక్కదండము పెట్టాను. పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక బావురుమని చంటిపిల్లవాడిలాగ రాగా లెడుతూ అక్కడే నిలబడ్డాను.

6
అలా ఎంతసేపున్నానో నాకు తెలియదు. ఒక మనిషి వచ్చి నా బుజముమీద చెయ్యి వేశాడు. నిద్రలోనుంచి లేచినట్లు ఉలిక్కిపడి వెనక్కు తిరిగి చూశాను. ఒక పక్క ఒక దొర ఏమిటీ చిన్నతన మన్నట్టుగా నా కేసి చూస్తున్నాడు. ఇంకో వైపున ఒక దొరా దొరసానీ, నా దుఃఖము గ్రహించినట్టుగా, నాకేసి జాలిగా చూశారు. నా బుజము మీద చెయ్యివేసిన అతను తన తోటి కూడారమ్మని సంజ్ఞ చేశాడు. ఎందుకో తెలియకుండా కండ్లు తుడుచుకుని అతని వెంబడే వెళ్లాను. రెండంతస్థులు మెట్లుదింపి అడుగున ఒక హాలులోనుంచి ఒక చిన్నగదిలోకి తీసుకువెళ్లి నా సామానుకేసి చూపించాడు. ఇదే నే నుండవలసిన గది కాబోలు ననుకున్నాను. గది చాలా చిన్నది. అందులో ఒక పక్కను ఒక దానిమీద రెండు మూడు పొడుగాటి బల్లలున్నాయి. వాట్లపైన పరుపులు పరిచివున్నాయి. ఒక పక్క గోడకి చిన్న పింగాణీ బూర్లె మూకుడూ అందులోకి కుళాయి వున్నవి. పక్కనే ఒక సబ్బుపెట్టి వున్నది. ఇంకోపక్క రెండు తువాళ్లు వున్నాయి. నా తలాపు దిక్కు నున్న గోడకి గుండ్రని రంధ్రముమూ, దానికో గాజుతలుపూ వున్నది. అదే మాగది కిటికీ. అందులోనుంచి సముద్రము చక్కగా కనపడుతుండేది. పై బల్లలమీది కెక్కడాని కొక చిన్న నిచ్చెన వున్నది. నేను గదిలోకి వచ్చేసరికే పై రెండు బల్లలమీదా ఇద్దరు చైనా కుర్రవాళ్లు కూచుని తమ సామాను సవిరించుకుంటున్నారు. నేనూ నాపెట్టీ అదీ మంచము కిందికి తోసివేసి సముద్రము కేసి చూస్తూ కూచున్నాను.
చీకటి పడ్డది. గదిలో మొన్నటిస్టీమరులో మల్లేనే ఎలక్ ట్రిక్ దీపాలు వెలిగించారు. నాకు తొడుక్కున్న సూటు బిగువుగా వుండడము మూలాన్ని విప్పేస్తే బాగుంటుందని తోచింది. నిమ్మళంగా విడిచి ఇంటి దగ్గిరనుంచి తెచ్చిన మల్లుపంచె పెట్టెలో నుంచి తీసి కట్టుకుని షర్టుతోటే కూచున్నాను. పై కుర్రాళ్లిద్దరూ తెల్లబోయి నాకేసి చూస్తున్నారు. ఎవళ్ళు చూస్తే నాకేం?
ఇంక రాత్రి భోజనము సంగతేమిటా అనుకున్నాను. భోజనము స్టీమరు వాళ్ళు పెడతారో, ఎలాంటి భోజనము పెడతారో ఎంత పుచ్చుకుంటారో, కంపెనీ వాళ్లను అడగడము మరచి పోయాను. మొన్నరాత్రి స్టీమరు వాళ్లు నా దగ్గిరేమీ డబ్బు పుచ్చుకోలేదు. నన్ను వాళ్లడగడమే మరిచిపోయారో, లేకపోతే పాపము ఏమీ తినలేదనే విడిచిపెట్టారో, ఏ సంగతీ దిగిరావడము హడావిడిలో అడగడము మరిచిపోయాను. ఇంతకూ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొన్న గోధుమపిండి మరపొయ్యీ వగైరా వున్నాయి కదా రొట్టెలు చేసుకుందాము అని పెట్టెతీసి సామాను ఒక్కొక్కటే బయట పెడుతున్నాను. ఇంతటిలోకే ఒక గంట వినబడ్డది. పైనున్న కుర్రవాళ్లిద్దరూ కిందకు దిగి నన్ను కూడా రమ్మన్నారు. రమ్మన్నారేమోనని వాళ్ల సంజ్ఞలవల్ల నేను గ్రహించాను. వాళ్లు మాట్లాడిన భాషేమిటో నా కర్థము కాలేదు. ఎక్కడో చూద్దామని వాళ్లతోటి వెళ్ళాను. మా గది ముందున్న హాలులో బల్లమీద తెల్లని గుడ్డపరచి మామూలు పింగాణీపళ్లాలూ, కత్తులూ, కఠార్లూ అన్నీ అమర్చి వున్నవి. అది చూసేసరికి కొంత ధైర్యము వచ్చింది. సరే మనకు స్వహస్తపాకము తప్పిపోయింది కదా అనుకుని పైకి తీసిన సామగ్రి పెట్టెలో పెట్టి నేనూ పంక్తి భోజనానికి తయారయ్యాను.
మొత్తము ముప్ఫై నలభై మంది దొరలున్నారు. పది పదిహేనుగురు దొరసానులున్నారు. అంతా కులాసాగా మాట్లాడుకోవడము ఆరంభించారు. వాళ్లు ఏభాష మాట్లాడుతున్నదీ నాకు తెలియలేదు. ఫ్రెంచి స్టీమరన్నారు గనుక ఫ్రెంచేమో ననుకున్నాను. అంతా నన్నూ నా వేషమూ చూసి లోపలేమనుకున్నారో కాని వాళ్ళ భాషలో నన్నేదో అడిగారు. నేను ఇంగ్లీషున సమాధానము చెప్పాను, వాళ్ళ భాష నాకు తెలియదని వాళ్ళంతా వెర్రిమొగాలు వేసుకుని నా కేసిచూశారు పోనీ తెనుగున చెపుదామా అనుకున్నాను. అయినా వీళ్ల మొహము ఇంగ్లీషే తెలియని వాళ్లకు తెలుగేమి తెలుస్తుందనుకున్నాను. ఇక లాభము లేదనుకుని వాళ్ల ధోరణ్ణి వాళ్లు కబుర్లు చెప్పుకుంటున్నారు. నాకుమట్టుకు కొంచెము భయము వేసింది. స్టీమర్లో ఇంగ్లీషు వచ్చిన వాళ్ళు లేనట్టున్నారు, మనతోటి మాట్లాడే వాళ్లయినా ఎవళ్లూ ఉండరు కాబోలు, కాలము ఎలా గడుస్తుందా అనుకున్నాను.
ఇంకో క్షణానికల్లా వడ్డన ఆరంభమైంది. ఈ వడ్డన పద్ధతి తమాషాగానే ఉంది. ఒక మనిషి ప్రతివాళ్ళదగ్గిరికీ తీసుకురావడము, ఎవళ్ళకు కావలసినంత వాళ్ళు తీసుకుని వాళ్లు వాళ్ళ కంచాల్లో పెట్టుకొనడము.
తెచ్చిన పదార్ధము దాని ఆకారమువల్లా వాసనవల్లా బ్రాహ్మణులు ముట్టుకో తగ్గది కాదనుకున్నాను. మనదేశములో మాంసము తినేవాళ్ళయినా, కూరల్లే వండుకుని అన్నములో వేసుకొని తింటారనుకున్నాను. వీళ్ళు అన్నము లేకుండా వట్టిమాంసమే తింటున్నారు. ఆ గిన్నె తీసుకుని నాదగ్గిరికి వచ్చాడు. నాకక్కరలేదన్నాను. వాడాశ్చర్యపోయి నాకేసి చూశాడు. ఏదో అన్నాడు. నాకర్థముకాలేదు. ఏమిటా దిక్కు మాలినభాష, స్వచ్ఛమైన ఇంగ్లీషులో మాట్లాడరాదా అన్నాను. వాడికి చెపితే నేమి గోడకు చెపితేనేమి? నేనన్నది వాడికి తెలిసి ఏడిస్తేగా!
ఇంక మనకర్మము విశ్వస్తలాగ అర్థరాత్రివేళ రొట్టెలు కాల్చుకోవలసిందే కాబోలు అనుకున్నాను. లేచి వెళ్ళబోతూ వుంటే వాడు కూచోమని సంజ్ఞ చేసి వెళ్ళి యింకో దొరను తీసుకువచ్చాడు. ఆ వచ్చినాయనా ఏదోభాషలో మాట్లాడడము మొదలు పెట్టాడు. నాకు కోపము వచ్చింది. మొదటివాడివంక చూచి యీ అఘోరానికి వాణ్ణికూడా తీసుకు వచ్చావెందుకు? నీ వఘోరించావుకాదా అన్నాను తెలుగున. అవును, వాడి కర్థము కానప్పుడు ఏభాషైతే నేమి, తెలుగైతేనేం? కొత్తగా వచ్చినవాడికి ఒకముక్కో ముక్కన్నరో యింగ్లీషు వచ్చునని తోస్తుంది. సంజ్ఞలవల్ల నైతేనేమి, వాడికీ నాకూ అర్థము కాని యింగ్లీషు భాష వల్ల నైతేనేమి, భోజనము చెయ్యవా? అని ప్రశ్నించాడు. చెయ్యను అన్నాను. ఏం అన్నాడు. నేను మాంసము తినను అన్నాను. అనేటప్పటికి నా అవస్థవాడు గ్రహించుకుని కూర్చొమని సంజ్ఞ చేసి వడ్డన మనిషిని తీసుకు వెళ్ళీ చక్కగా కాల్చిన కల్లురొట్టెలు రొండూ మరికాస్త వెన్న, కాసిని వుడకేసిన బంగాళా దుంపలు పంపించాడు. కడుపునిండడానికి కేదైతేనేమి, అవే తిన్నాను. అది పూర్తి అయ్యేటప్పటికి అందరికీకూడా సగ్గుబియ్యము క్షీరాన్నము తీసుకువచ్చాడు. సరే యిదీ బాగుందనుకుని, నాకిష్టము కూడా నేమో, మరికాస్త పుచ్చుకున్నాను. రోజూ యిలా వుంటే చాలు ననుకున్నాను. నలుగురితోటి పాటూ లేచి నా గదిలోకి వచ్చాను. స్టీమరు వాళ్లే పరుపులూ అవీ వేసి వుంచడము మూలాన్ని నా మంచమూ బొంతా తీయవలసిన అవసరము లేకపోయింది. ఆ పరుపుమీదనే పడుకుని చీకట్లో ఈ మహాసముద్రములో స్టీమరుకు దారి ఎలా తెలుస్తుందా అని ఆలోచిస్తూ నిద్రపోయాను. తెల్లవారుజామున మెళుకవవచ్చింది. లఘుశంకకు వెళ్లవలసిన అనుమానంగావున్నది. ఎక్కడికి వెళ్లడానికీ తోచలేదు. ఎవళ్లను అడుగుదామన్నా ఎవళ్ళూ కనపడరు. నా గదిలో కుర్రాళ్ళను లేపి అడుగుదామా అంటే నా భాష వాళ్ళకు తెలియదు. ఏం చెయ్యడానికీ తోచలేదు. అలాగే బలవంతాన బిగబట్టుకుని ఎప్పుడు తెల్లవారుతుందా అని కనిపెట్టుకు కూర్చున్నాను. నిద్రపోదామంటే నిద్ర పట్టదు. నిమిష మొక యుగముగా వుంది.
ఎలాగైతే నేమి తెల్లవారింది. లేచి హాలులోకి వచ్చాను. అక్కడున్న ఒక దొరదగ్గిరికి వెళ్లి దొడ్డి ఎక్కడుంది అని ఇంగ్లీషున అడిగాను. వాడి కర్ధము కాలేదు నా భాష. వాడి భాషలో ఎలా చెప్పాలో నాకు తెలియదు. ఇలా నలుగురైదుగురిని అడిగి చూశాను. ఎవళ్లూ నన్ను గ్రహించుకో లేక పోయారు. నా బాధ చెప్ప శక్యము గాకుండా ఉంది. ఇంకో క్షణముంటే పొట్ట బద్దలవుతుందేమోని భయము వేసింది. పోనీ సంజ్ఞ చేద్దామా అంటే ఎలాగూ సంజ్ఞ చేయడము? సంజ్ఞ చేయడానికి మట్టుకు వాళ్ళకు ఏ సంజ్ఞ చేస్తే తెలుస్తుందో? అక్కడికే మన దేశాచారాన్ని బట్టి ఒక వేలు చూపించాను. ఎవళ్ళకూ తెలియలేదు. రెండు వేళ్లూ చూపించాను. దానికీ సమాధానము రాలేదు. వాళ్ళ దేశములో మూడువేళ్లు చూపిస్తారేమో ననుకుని మూడు వేళ్లూ చూపించాను. అదీ అర్ధము చేసు కోలేదు. ఒళ్లు మండి ఐదువేళ్లూ చూపించాను. అదీ లాభించలేదు. ఆఖరుకు ఏమి సంజ్ఞ చేశానో ఎలా వాండ్లకు తెలియ పరిచానో నా అవస్థ నాకే తెలియదు. పర్యవసానము మాత్రము ఒకడు తీసుకు వెళ్లి దొడ్డి చూపించాడు. పక్క గది తలుపు తీసి అది స్నానాలగదని కూడా చెప్పాడు. నేను అడక్కుండాను. స్నానము మాట దేవుడెరుగునని ముందు తొందరగా దొడ్లోకి పరుగెత్తి బాధ తీర్చుకుని మళ్లీ నా గదిలోకి వచ్చి దంతధావనము చేసుకుని స్నానాల గదిలోకి వెళ్లి స్నానము చేశాను.
స్నానము చేసి వచ్చేసరికి భోజనాలకి అన్నీ సిద్ధముగా అమర్చిపెట్టారు. అందరికీ కోడిగుడ్లూ, చేపలూ వడ్డించారు. నాకుమాత్ర మేదో జావా, రొట్టీ, వెన్నా ఇచ్చారు.
ప్రతిరోజూ ఇదే పద్ధతి, ప్రొద్దున్నే లేవడము, కాలకృత్యములు తీర్చుకోవటము, కాస్సేపు ఇటూ అటూ తిరగడమూ, మధ్యాహ్నము భోజనము, కాస్సేపు నిద్రపోవడమూ, టీ పుచ్చుకోవడము, ఎప్పుడు సాయంత్ర మవుతుందా అని కనిపెట్టుకు కూర్చోవడము, భోజనము చేయడము పడుకోవడము--ఇదీ కార్యక్రమము. నాల్గు దినాలు ఇలా గడచినవి. ఓడ అస్తమానమూ ఊగిసలాడడమువల్లనో, భోజనము తిన్నగా లేకపోవడము వల్లనో నాకెప్పుడూ వికారముగానూ తల నొప్పిగానూ ఉండేది. అన్న హితవు బొత్తిగా తప్పిపోయింది. అన్నహితవంటే రొట్టె హితవని అర్ధము. కొలంబోలో బయలుదేరిన తరువాత ఇంకా అన్నము కళ్ళ బడలేదు.
ఇలా నాలుగు రోజులు గడిచినవి. అయిదో రోజు ఉదయము అహర్నిశాదులూ పరిగెడుతున్న స్టీమ రాగి పోయింది. ఎందు చేతనా అని కిటికీలోనుంచి తొంగిచూచేసరికి ఊరు కనిపించింది. నాకు భోజనము సప్లై చేస్తున్న మనిషివచ్చి స్టీమరు సాయంత్రము దాకా ఆగుతుందనీ ఊళ్ళోకి వెళ్ళి చూసి రావచ్చుననీ చెప్పాడు. వాడు చెప్పడమంటే చెప్పాడు కాని తీరా ఊళ్లోకి వెళ్ళిన తరువాత హఠాత్తుగా స్టీమరు బయలుదేరి వెళ్ళిపోతేనో! అయినా ఈ నాలుగు రోజులనుంచీ నీటిమీద ప్రయాణము చేసిన మీదట భూమి కనబడగానే ఏదో ప్రాణములేచి వచ్చినట్టుంది. నాగదిలో ఉన్న చైనా కుర్ర వాళ్ళిద్దరూ దుస్తులు వేసుకుంటూ నన్ను కూడా రమ్మని సైగచేశారు. నాకూ వెళ్ళవలెనని సరదా పుట్టింది. నేనూ సూటు వేసుకొని కొలంబోలో కొన్న టోపీ పెట్టుకుని దొరగారిలాగ బయలుదేరాను. ఊరంతా ఎక్కడుందో తెలియదుగాని సముద్రపు టొడ్డునే ఒక పెద్దషాపూ ఒక హోటలూ వున్నవి. దూరాన్ని నల్లని శరీరమూ ముద్ద పెదవులూ కోతి మొహాలూ గొర్రె బొచ్చులాగ పొట్టిగా ఉంగరాలు తిరిగిన బిరుసువెంట్రుకలూ కలిగి మొలచుట్టూ పొడుగాటి ఆకులు కట్టుకుని చేతుల్లో బల్లాలు పుచ్చుకుని తిరుగుతున్న ఒకళ్లిద్దరు మనుష్యులు కనబడ్డారు. వాళ్లను చూసి పూర్వము చదివిన భూగోళ శాస్త్రము స్మృతికి దెచ్చుకుని ఇది ఆఫ్రికాదేశమై ఉంటుందని ఊహించాను. కాస్సేపు అక్కడే ఇటూ అటూ తిరిగి అక్కడున్న హోటలులో భోజనము చేసి మధ్యాహ్నము మూడుగంట లయ్యేసరికి మళ్లీ స్టీమరు మీదకి వచ్చాను. సాయంత్రము ఆరు గంటలకు బయలుదేరింది.
నా పేరు స్టీమరుమీద నున్న వాళ్లెవళ్లూ నోట పట్టలేక పోయారు. నేను కొలంబోలో ఎక్కాను గనక నన్ను కొలంబో గారు అని పిలవడము మొదలు పెట్టారు. నా తోటి మాట్లాడే వాళ్లె వరూ లేక పోవడమువల్లా, మామూలుగా వాళ్లు తినే తిండి తినక పోవడమువల్లా, వాళ్ళు తాగే కల్లు నేను తాగకపోవడమువల్లా, నాకూ లోపల ఏలాగో ఉండేది. తక్కినవాళ్లందరికీ కూడా నా అవస్థ చూసి జాలివేసిందని తోస్తుంది. ఎవళ్లో ఒకళ్లు అస్తమానం నాదగ్గిర కూర్చోడము, నాతోటి ఏదో మాట్లాడవలెనని ప్రయత్నించడమూ మొదలు పెట్టారు. ఈసారి బయలుదేరిన తరువాత నాకు వికారమూ తలనొప్పి ఎక్కువ అయింది భోజనముదగ్గిరకు వెళ్లడానికి కూడా ఓపికలేకపోయింది. నాగదిలోకే ఏ పాలో జావో తీసుకువచ్చి ఇస్తూండేవారు. ఒకరోజు మరీ వికారంగా ఉండి రాత్రి యేమీ నిద్రపట్టలేదు. తల బద్దలేస్తోంది, ఇంటిసంగతి జ్ఞాపకంవచ్చింది. కాస్త శొంఠి కొమ్మయినా లేకపోయింది గదా అనుకున్నాను. ఉంటేమట్టుకు మనకు గంధంతీసి ఇచ్చేవారెవరు? కళ్ళెంబడి నీళ్ళు వచ్చినవి. కళ్ళు తుడుచుకుని యెదురు గుండా చూచేటప్పటికి చెన్నపట్నంలో కొన్న దొరసాని టోపీ గోడకు తగిలించి ఉంది. అపరిమితమైన కోపం వచ్చింది. దాన్ని అవతల పారేస్తే తలనొప్పేమన్నా తగ్గుతుందేమో ననుకున్నాను. అంత బాధతోనూలేచి ఆ టోపీ తీసి వుండకింద నలిపి కిటికీలోనుంచి అవతల పారవేశాను.
వచ్చి పడుకున్న తర్వాత కొంచెం కలత నిద్రపట్టింది. తెల్ల వారింది. తలనొప్పి యేమీ తగ్గలేదు. కొంచెం పులకరం తగిలినట్టుకూడా ఉంది. కిందటిరేవులోనుంచి స్టీమరు బయలు దేరిన మూడోరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు దొర వచ్చి అందరినీ డాక్టరు పరీక్ష చేయవలసి వుంటుందనీ, డ్రస్సు వేసుకుని సిద్ధంగా వుండమనీ చెప్పి వెళ్ళాడు. మధ్యాహ్నం మూడుగంటలకి ఘంట కొట్టారు. మా గదిలో కుర్రవాళ్ళు నన్ను రమ్మని సంజ్ఞ చేశారు. కదలడానికైనా వోపిక లేకపోయి నప్పటికీ నెమ్మదిగా హాలులోకి వచ్చాను. అందర్నీ వరసగా నిలబడమన్నారు. ఒక డాక్టరు వచ్చి ఒక్కొక్కరినే పేర్లు పిలచి కొంచెం పరీక్షచేసి పొమ్మనడం మొదలు పెట్టాడు. కొంతసేపయిన తరువాత మిస్టరు కొలంబో అని పిలిచాడు. నాపేరు వీళ్ళకు తెలియక డాక్టర్ తోటి కూడా యీ పేరే చెప్పారనుకొని స్కూల్లో అట్టెండెన్సు పిలిచేటప్పుడు చెప్పే అలవాటు చొప్పున చటుక్కున ప్రెజంటు సార్ అన్నాను. అంతా పక్కున నవ్వారు. డాక్టరు నిన్ను కాదన్నాడు. ఇంకొక యనభై సంవత్సరముల ముసలి దొర ముందరికి వచ్చాడు. ఆయన కాబోలు కొలంబో అనుకున్నాను.
డాక్టరు వెళ్ళిపోయిన తరువాత నాకు భోజనము పెట్టే దొరను పిలిచి యేమిటీగోలంతా అని అడిగాను. వాడు స్టీమరు సూయజు దగ్గిరికి వచ్చిందనీ, ఇక్కడ వైద్యుడలా పరీక్ష చేయడము మామూలనీ, జబ్బుగా వున్న వాళ్లందరినీ ఇక్కడ దింపేస్తారనీ చెప్పాడు. సూయజు అంటే సూయజు కెనాలేమో అని అడిగినాను. ఇంకో పావుగంటకు, సూయజు కెనాల్లో ప్రవేశిస్తాము, కావలిస్తే పైకివెళ్ళి చూడవచ్చును, అని చెప్పాడు. నా గదిలో కుర్రవాణ్ని సహాయం తీసుకొని నెమ్మదిగా పైకెక్కాను. కొలంబోలో బయలుదేరిన తరువాత మొదటిసారి ఇదే టాపుమీదికి రావడము, చల్లని సముద్రపు గాలి తగిలేటప్పటికి ప్రాణంలేచి వచ్చినట్లుంది. దీపాలు పెట్టేవరకూ అక్కడే సూయజు కెనాలు చూస్తూ కూచున్నాను. చిన్నప్పుడు సూయజు కెనాలంటే ఏమిటో అనుకునే వాణ్ని. ఇదీ మామూలు పడవల కాలవగానే వుంది. ఎటొచ్చీ కొంచము వెడల్పూ లోతూ ఎక్కువ. ఒడ్డుని మన వేపుకు మల్లెనే ఈతచెట్లూ అవీ వున్నాయి. అందులో కొన్ని ఖర్జూరపు చెట్లని చెప్పారు. ఒంటెలు చాలా కనబడ్డాయి. చూడ్డానికి అంతా చాలా చక్కగా వుంది. దీపాలు పెట్టగానే మళ్ళీ నాగదిలోకి వచ్చి పడుకున్నాను. తెల్లవారే టప్పటికి పోర్టు సెడ్డు వచ్చామన్నారు.
మాగదిలో కుర్రాళ్ళు డ్రస్సు వేసుకుంటూ వున్నారు, నన్ను కూడా వూళ్లో కి వెళుదాము రమ్మని సంజ్ఞ చేశారు. సరే ఇక్కడ కూర్చుని చేసేదేమిటి, ఏదో ఓపిక చేసుకొని కాస్సేపు తిరిగి వద్దామని నేనూ డ్రస్సు వేసుకుని బయలుదేరినాను.
ఆ వూరు బాగా పెద్దదే. చక్కని షాపులూ అవీ చాలా వున్నాయి. కాని అక్కడి సంగతులు చూస్తే దుర్మార్గము ఎక్కువవున్నట్టు తోచింది. అక్కడా ట్రాముకార్లున్నాయి. కాని విశేషము ఏమిటంటే వాటంతట అవి నడవలేవు. గుర్రాలు లాగుతాయి. అది నాకు వింతగా కనపడ్డది. బజార్లంబడి తిరుగుతుండగా ఒక చోట ధామస్ కుక్ వాళ్ళ కంపెనీ కనబడ్డది. అది చూసేటప్పటికి స్నేహితుణ్ణి చూచినట్టుగా వుంది. దర్జాగా లోపలికి వెళ్ళాను. అక్కడ గుమాస్తా నన్ను చూసి, ఏం కావాలన్నాడు. ఏమీ అక్కరలేదన్నాను.
'మరి అయితే ఎందుకు వచ్చావు?'
'నేను మీ పేసెంజరును.'
'ఏ మయితే?'
'ఏమీ లేదు. ఇక్కడ మీ కంపెనీ ఎలావుందో చూసి వెళదామని వచ్చా' నన్నాను. వాడు మాట్లాడలేదు. నేనొక మాటిటూ అటూ చూసి మళ్ళీ వీధిలోకి వచ్చాను. దగ్గిరలోనే పోస్టాఫీసు కనపడ్డది. అందులోకి వెళ్ళి ఒక కార్డుకొని నేను క్షేమంగా వున్నానని ఇంటికి ఒక వుత్తరం రాసి పోస్టులోవేసి బయటకు వచ్చాను. అక్కడ ఒక షాపులో వున్నితోటి తయారుచేసిన రెండుజానల వెడల్పుగల చక్కని మెడపట్టీలు లాంటివి కనపడ్డాయి. వెళ్ళేది చలిదేశం గదా! ఇది ఒకటి కొనుక్కుంటే, చెవులకు చుట్టుకున్నా మెడకి చుట్టుకున్నా వెచ్చగా వుంటుంది. చూడ్డానికి కూడా చాలా చక్కగా వున్నాయి అని ఒక్కటి కొన్నాను. అక్కడ ఒక కాఫీహోటలు కనబడితే వెళ్ళి కాస్త ఫలహారము చేసి నిమ్మళముగా మళ్ళీ స్టీమరు చేరుకున్నాను. సాయంత్రం ఏడు గంటలకి స్టీమరు బయలుదేరింది. ఆ రాత్రి అంతా కులాసాగానే వుంది. కాని పొద్దుటి నుంచీ ఆరంభించింది నావస్థ. అది వికారముగాదు. అవి వాంతులుగావు. లోపలినుంచి డోకు వస్తూన్నట్టుండడమే గాని పైకి ఏమీ కాకపోవడము. కొలంబోలో బయలుదేరిన తరువాత ఇంత బాధ ఎప్పుడూ పడలేదు. ఇన్నాళ్ళనుంచీ కులాసాగా తిరుగుతోన్న నా గదిలో కుర్రాళ్ళు కూడా పడకలేశారు. నేను మూసిన కన్ను తెరవలేదు. తిండిలేదు సరికదా పచ్చి మంచినీళ్ళైనా ఎరగను. అలా ఎన్నాళ్ళు పడుకున్నానో తెలియదు. కాస్త గాలి అయినా రాకుండా గది కిటికీ తలుపులు మేకులు వేసి బిగించారు. ఏమిటి అలాచేస్తున్నారంటే తుఫాను వుంది. కిటికీ తలుపులు తీసి వుంటే నీళ్ళు లోపలికి వస్తాయన్నారు.
ఇలా సుమారు వారం రోజులు రాత్రింబగళ్ళు కూడా తెలియకుండా బాధపడ్డాను ఏమీ తోచక గడియారము చూస్తూవుంటే కొంత కాలక్షేపం అవుతుందని, గడియారము తలక్రింద పెట్తుకుని అస్తమానమూ చూచుకుంటూ వుండేవాడిని. మొదటి రోజు లలో బాగానే వుండేది. మంచి గడియారమేనని సంతోషించాను. కాని పోను పోను, పగలంతా బాగా వుండి రాత్రి దానికేమి వచ్చేదో కాని తెల్లవారే సరికి రోజూ పావుగంట తక్కువ తిరిగేది. ఇలా వాతం కమ్ముకు రావడానికి తగ్గ కారణం ఏమీ కనుపించదు. పోనీ ఒకరోజైతే అనుకోవచ్చును. అనుదినమూ ఇలా వెనుకంజ వెయ్యడముచూసి నాకు ఒళ్ళుమండుకొచ్చింది. ఆయన రెండున్నరా దూటబిళ్ళలులాటివి తీసుకుని ఇలాటి గడియారము నాకిచ్చాడేమా అనుకున్నాను. దొరలుకూడ వీలైనప్పుడు మోసం చెయ్యడానికి వెనుదీయరని తేలింది. ఈ వెధవ గడియరం కూడా తీసుకువెళ్ళడ మెందు కనుకున్నాను. చూసి చూసి పారెయ్యడానికి ప్రాణం ఒప్పలేదు. సరే ఏదో పోనీ ఒక అరగంట యించుమించుగా తిరుగుతోందిగదా, అసలు లేని బావకంటె గుడ్డిబావైనా మేలనుకుని పారవేయడము మానేసి పెట్టిలో పెట్టాను.
తరువాత ఒకనాడు తెల్లవారేసరికి ఈ సముద్రపు హడావిడి తగ్గింది. దొర చీకటితోటే వచ్చి నన్ను లేపి, ఇవ్వాళే దిగిపోవడము. బెంగెట్టుకోకు. ఇంకో గంటకో రెండు గంటలకో దరి చేరుతాము. భూమి కనబడుతోంది. లేచి కాస్త ఫలహారముచేసి పైకి వెళ్ళి చూడమని ఎంతో ఆదరంగా చెప్పాడు. ఈ నాలుగైదు రోజులూ తిండిలేకపోవడము మూలాన్ని చిక్కి శల్యమైపోయాను. ఒంట్లో చాలా నీరసంగా వుంది. లేస్తే కాళ్లు దడ దడ లాడుతున్నాయి. అలాగే లేచి దంత ధావనము చేసుకొని చొక్కాలు తొడుగుకుంటూవుంటే, ఆ దొర నాగదిలోకే ఫలహారము పంపించాడు. కాస్తంత తిని నిమ్మళంగా పైకెక్కాను. సుమారు ఎనిమిది గంటలవుతుంది. ఆకాశం నిర్మలముగా వుంది. సముద్రము ఎంతో చక్కగా వుంది. సూర్యు డప్పుడే ఉదయించినట్లున్నాడు. తరుణ కిరణములప్పుడే తరంగములమీద నాట్యముచేస్తూ రత్నప్రభను కల్పించాయి. దూరాన్ని తెరదీసినట్టు మంచువిడిపోతూ, ఒడ్డునవున్న పర్వతములు మొదలైనవి కొంచెము కొంచెము కనిపిస్తున్నాయి. అన్నిటికంటె స్పష్టంగా ఒక పర్వతము మీది దేవాలయ శిఖరముమీద సువర్ణవిగ్రహము ఒకటి సూర్యకాంతిలో దేదీప్యమానముగా కనపడ్డది. అంత కంతకు దరి జేరుతున్నాము. అక్కడ హార్బరులో ఎన్ని వందల స్టీమర్లున్నాయో లెక్క లేదు. ప్రపంచములోవుండే స్టీమర్లు అన్నీ ఒక్కసారి ఇక్కడకు వచ్చాయేమో అనుకున్నాను. ఇదంతా చూస్తే లోపల ఒక విధమైన భయము కలిగింది. నామనస్సు మనస్సులో లేదు. ఏదో ఆలోచిస్తూ ముందు మనగతి ఏమవుతుందా అని తెలుసుకోడానికి ప్రయత్నిస్తూ అలా నిలబడ్డాను. సుమారు పదకొండు గంటలు అయ్యేసరికి మార్సేల్సు చేరాము.