బారిష్టరు పార్వతీశం పుట్టుపూర్వోత్తరాలు
పార్వతీశం పుస్తకం చదివిన వాళ్ళు చాలామంది, 'ఈ ఆసామీ, ఎవరండి ' అనో, 'బారిష్టరు పార్వతీశం - ప్రథమ భాగము రాశారండీ? అనో, 'అసలిలా రాయాలని ఎలా తోచిందండీ' అనో, అడుగుతూ ఉండడం కద్దు, అలాగే ఆమధ్య రేడియో వారు కూడా 'వాడి పుట్టుపూర్వోత్తరాలు ఏమిటో నాలుగు ముక్కలు చెప్పండి ' అన్నారు. వారికి చెప్పిన సమాధాన సారాంశం ఈ క్రింది సమాచారం.
దేనికైనా పెట్టి పుట్టాలంటారు: లేదా ముఖాన్నివ్రాసి ఉండాలంటారు మన వాళ్ళు. ఒక్కొక్క ముఖం చూస్తే ముచ్చటవుతుంది. మరో మాటు ఆ ముఖం చూడవలెననీ, వారి పరిచయం చేసుకోవలెననీ అనిపిస్తుంది. వారి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవలెననే కుతూహలం కలుగుతుంది. అలాటి అదృష్టవంతుడు మా పార్వతీశం. అదంతా, అతని ముఖారవిందం, జన్మనక్షత్ర ఫలమూను. అతని పుట్టుపూర్వోత్తరాలు ఏమి చెప్పను, అతను చెప్పుకున్న కంటె? అతను అయోనిజుడు-స్వయంభువు. బ్రహ్మమానస పుత్రుల జాతిలోని వాడు.
పార్వతీశం తన నివాసం మొగల్తుర్రు అని వ్రాసుకున్నా, యదార్థం చేతను అతని పుట్టుక మాత్రం నర్సాపురం తాలుకా గుమ్మలూరు అనే గ్రామం. మనలో మనమాట, అది మా అత్తవారి ఊరు. అందుచేతనే నాకా ఊరుమీద అభిమానం ఎక్కువ. ఒక సారి నేను అక్కడికి వెళ్ళినప్పుడు, మామూలులాగ నా బావ మరదలూ, మరదళ్ళూ, పక్కింటి వారి అబ్బాయి మొదలైన వాళ్ళంతా నా చుట్టూ చేరారు. ఆ కబురూ ఈ కబురూ చెప్పడంలో ఒక పడవప్రయాణంలో ఉండే కష్టాలూ, తమాషాలూ, చెప్పుకొచ్చాను. వాళ్ళు చాలా సంతోషించారు. వాళ్ళంతా నన్ను ఏకగ్రీవంగా అదో కథలా వ్రాయమన్నారు. నాకప్పటికి పుస్తకం వ్రాద్దామనే సంకల్పం ఎంత మాత్రమూ లేదు. నేను అప్పటికి వ్రాసినదల్లా మూడు కథలు మాత్రమే. 'పిలక ', 'నేనూ మా ఆవిడా ' అనేవి 'సాహితి' లోనూ, 'లక్ష్మి ' భారతి పత్రికలోనూ తరువాత అచ్చుపడ్డాయి. సాహిత్య రంగంలో అతి చౌకగా ఖ్యాతి సంపాదించిన వాళ్ళలో అగ్రగణ్యుడను నేను. పిలక-లక్ష్మి అనేవి రెండూ చాలమంది దృష్టిని ఆకర్షించాయి. చాలా మంది అభిమానాన్ని పొందినాయి. కాని, నా సత్తా నాకు తెలుసు కనుక ఇకముందు మనమేమీ వ్రాయకుండా ఉంటే మర్యాదగా ఉంటుంది అనుకుంటూండగా ఈ సమావేశం తటస్థమయింది. "బాలవాక్యం బ్రహ్మవాక్యం" అన్నారు పెద్దలు! మా కుర్రాళ్ళు అడగగానే ఎందుకో నాకూ వ్రాయవలెనని ఉత్సాహం కలిగింది. కాగితంమీద శ్రీరామ చుట్టి ప్రారంభించి, ఒక కుర్రవాడిని నర్సాపురం నుంచి నిడదవోలు దాకా తీసుకు వెళ్ళాను. అక్కడ వానిని ఏమి చెయ్యాలో తోచక మద్రాసుకు తీసుకు వెళ్ళాను. అప్పటికీ కుర్రవానికి నామకరణం చెయ్యలేదు. ఇంగ్లండు పంపిద్దామని అనుకోలేదు. ఆ వ్రాసినంత వరకూ మా కుర్రవాళ్ళకు చదివి వినిపించాను. వాళ్ళు చాలా బాగుందని ఏకగ్రీవంగా నాకు సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ కుర్రవాళ్ళ సంతోషం నాకెంతో ఉత్సాహం కలిగించింది. ఈ కుర్రవాడు మద్రాసులో ఉండిపోయాడే, వాడిని మళ్ళీ ఇల్లు చేర్చవద్దా అనుకున్నాను. కథకు ఆది, మధ్య, అంతాలు సరిగా ఉంటేనే కాని నాకు తృప్తిగా ఉండదు. అందుచేతను ఆ కుర్రవాని సంగతి తేల్చక తప్పింది కాదు. అప్పుడు హఠాత్తుగా తోచింది- ఇలాటివాడిని దేశాంతరాలకు తీసుకువెడితే ఎలా ఉంటుందా అని. చాలా తమాషాగా ఉంటుందనిపించింది. సరే, ఎంత ఖర్చు అయినా ఇంగ్లండు పంపించవలసిందే ననుకున్నాను. ఆరోజుల్లో ఇంగ్లండు వెళ్ళడమన్నా, బారిష్టరు చదవడమన్నా చాలా గొప్ప.
ఈ కుర్రవాడి భవిష్యత్తు ఎప్పుడైతే నిశ్చయమయిందో, ఆ తక్షణం అతని జన్మస్థానం పేరూ, ఇంటిపేరు, చదువూ, వగైరా అవసరమైన బాక్ గ్రౌండు వ్రాశాను. అంతవరకే నా బాధ్యత. తరవాత కథంతా పార్వతీశమే చెప్పుకుపోయాడు. మన పురాణకర్తలు, సూతుడు శౌనకాది మహామునుల కిట్ల నియె అనో; దేవా వైశంపాయనుడు జనమేజయున కిట్లనియె అనో కథ అందుకునే వారు. అప్పుడు దానంతటది కొంతదూరం సాగిపోయేది. డబ్ల్యు. డబ్ల్యు. జాకబ్స్ అనే సుప్రసిద్ధ ఆంగ్ల హాస్య రచయిత, నైట్ వాచ్‌మన్ డెక్ మీద కూర్చుని ఇలా అన్నాడు అని అంటేనే కాని అతనికి కథ నడిచేది కాదట. అలాగే మాది మొగల్తుర్రు, మా ఇంటిపేరు వేమూరివారు అని స్వీయ చరిత్రలా ప్రారంభించేసరికి, తరువాయి చరిత్ర అంతా నా ప్రయోజకత్వం లేకుండా నడిచిపోయింది.
మొదటి నుంచీ నా బుద్ధికి మల్లేనే నాకాళ్ళకు కూడా స్థిరత్వం తక్కువ. తరచు తిరుగుతుంటేనే కాని తోచేదికాదు. ఈ కుర్రవాడిని మద్రాసులోనే ఉంచి, నేను గుమ్మలూరు నుంచి గుంటూరుకు ప్రయాణం కట్టాను. అక్కడ మా మిత్రులను కొందరిని-తల్లావఝ్ఝుల శివశంకర శాస్త్రి, నోరి నరసింహ శాస్త్రి, వఝ్ఝ బాబూరావు, శ్రీనివాస శిరోమణి ప్రభృతులను కూచోపెట్టి, బాలకవులు తరుముకూతపట్టి, తమ పద్యాలు వినిపించినట్లు నా కథ వినిపించాను. వారి ఆనందానికి మేరలేదు. ఇది చాలా పాప్యులర్ అవుతుందని వారు ఆశీర్వదించారు. ఇది యునీక్ వర్క్ అఫుతుందనీ, బ్రహ్మాండమైన జనదరణ పొందుతుందనీ నోరి నరసింహశాస్త్రిగారు అన్నారు. తక్కిన మిత్రులంతా అనేక రకాలుగా నన్ను స్తోత్రం చేశారు. నేను ఊరికే సమయస్ఫూర్తిగా మాట్లాడే వాడినా, హ్యూమరిష్టునా, అని సందేహిస్తున్న మిత్రులు ఒక రిద్దరు, నేను హ్యూమరిస్టునే అని నిర్ధారణ చేశారు. నీ కర్మమింతే? నువ్విలా హ్యూమరస్ స్టోరీస్ వ్రాసుకుని కాలక్షేపం చేసుకోవలసిందే నని నాలు గక్షింతలు నా మీద చల్లారు. ఏది ఎలా ఉన్నా ఈ కథ, ఇక్కడ కూర్చుని పూర్తి చేయవలసిందే నన్నారు సభాపతిగారు. ఎలాగు-నేను తొందరగా వ్రాయలేన్నాను. అందుకనీ కథ అడ్డుతుందా స్వామీ, తమరు తోచినప్పుడల్లా డిక్టేట్ చెయ్యండి. ఈ లేఖ కాధముడు వ్రాస్తాడు... అని శ్రీనివాసశిరోమణి అభయ మిచ్చాడు. ఆయన ధర్మమా అని వారం రోజులలో పూర్తి చేశాను. మిత్రులు విన్నారు. బాగుందన్నారు. బారిష్టరు పార్వతీశం అంటే బాగుంటుందని మా సభాపతి శివశంకరశాస్త్రిగారు నామకరణం చేశారు.
ఇది 1924 డిశంబరు మొదటి వారంలో. వెంటనే పుస్తకం బెజవాడలో అచ్చు కిచ్చాను. ఆ నెల 24 వ తేదీని తెనాలిలో సాహితీ సమితి ప్రధమ సమావేశం జరిగింది. నవ్యాంధ్ర సాహిత్య చరిత్రలో అది చాలా ముఖ్యదినం. ఆ సమావేశం బహిరంగ సభలో అనేక మంది సరసుల, సహృదయుల, సాహితీ వేత్తల సమక్షమందు పార్వతీశం తన స్వీయచరిత్ర చెప్పుకున్నాడు. సభికుల ఆనందం వర్ణనాతీతం. అందరూ ఏకగ్రీవంగా అద్భుతంగా ఉన్నదన్నారు. అనగా పార్వతీశానికి నెల పురుడైనా వెళ్ళకుండా బట్టకట్టి బయటపడి అల్లారు ముద్దుగా తయారయ్యాడు. నాటి సభ్యుల హర్షామోదాలు అక్షయ మయినాయి. నాటినుంచీ నేటివరకూ ఇది చాలా బాగుందన్న వాళ్ళే కాని బాగాలేదన్నవాళ్ళు లేరు-పొరపాటు క్షమించాలి... ఒకరిద్దరికి భేదాభిప్రాయం ఉన్నది; లేకపోలేదు. అందులో వింత ఏమీలేదు. ఈ సృష్టిలో సాధారణంగా దేన్ని గురించీ లేని ఏకాభిప్రాయం పార్వతీశాన్ని గురించి మాత్రం ఎందుకుంటుంది! అప్పటి భారతి పత్రికా సంపాదకులు యీ పుస్తకాన్ని సమీక్షచేస్తూ, ఇది చాలా సిల్లీగా ఉన్నదనీ, ఇంత అనాగరికులు ఈ కాలంలో ఎవ్వరూ ఉండరనీ, అందుచేత ఇటువంటి అభూతకల్పనలతో రచన సాగించి లోకాన్ని ఆనందింప చేయబోవడం తెలివి తక్కువనీ అన్నారు. ఇది 1925 లో! 1957 లో కూడా ఇంకా అంతకంటే అనాగరికులు ఉన్నారంటే నమ్మాలి మీరు. ధర్మ సాధని పక్షపత్రికా సంపాదకులు, వారిని నేను కోరక పోయినా పుస్తకం కొని సమీక్షించారు. ఈ పుస్తకం ఏమీ బాగాలేదనీ, హాస్య మనేది సుతరామూ లేదనీ, పెద్దనవ్వు రాలేదు సరికదా, చిరునవ్వేనా ఎక్కడా మాట వరసకేనా రాలేదనీ వ్రాసారు. నేనేం చెయ్యను. అందరనూ నవ్విస్తానని ఒట్టు పెట్టుకుని నేను పుస్తకం వ్రాయలేదు. ఆయనకు నవ్వు రాలేదంటే అయ్యో పాపం అనుకొన్నాను. ఇటువంటి వారికి ఒక ఆంగ్ల రచయిత వ్రాసిన సమాధానం బాగున్నదనుకున్నాను. దాని సారాంశ మేమిటంటే: ఎవరేనా నాకు నవ్వు ఎప్పుడూ రాదు అంటే, అతని శరీరతత్వంలో ఏదో జబ్బు ఉన్నదన్నమాట. లేదూ, నేను నవ్వనేమైనా సరేనని ఎవరైనా అంటే అతనికి కొంచెం దూరంలో ఉండడం మంచిదన్నాడు. ఒక వ్యక్తి కాని, సంఘం కాని మానసికంగానూ, ఆధ్యాత్మికంగానూ ఒక పరి ణతి పొంది ఉంటే తప్ప సరియైన హాస్యాన్ని చక్కగా అర్థం చేసుకోడం కష్టం.
ఇంక మూడో వారు- మొదట యీ కథ వినీ, తమరు చదివీ చాలా బాగుందన్న పెద్ద మనుష్యులు కొందరు- నాలుగు రోజులు పోయిన తరువాత-ఆయన బొంద- ఇదో పెద్ద ఇదేమిటి-ఏ డాన్ కిక్సాట్టో చదివి కాపీ కొట్టాడు. ఈయన తెలివితేటలే మేడిసినాయి అన్నారు. ఇది సామాన్యంగా ప్రతి ఆంధ్రుడు చేసే విమర్శ-ఒక చక్కని పుస్తకం వ్రాయడంగాని, ఒక చక్కని చిత్తరువును చిత్రించడం గాని, బుద్ధి కుశలతగల ఏ పని గానీ, ఏ ఆంధ్రుడూ చెయ్యలేడని ప్రతి ఆంధ్రుడుకీ ఒక గట్టి నమ్మకం. అందుకని అటువంటి అపురూపమైన రచన ఏదేనా కనపడితే ఇది ఎక్కడో చేదెబ్బ కొట్టాడని అనుకుని మనవాళ్ళు తృప్తిపడతారు. పోనీ లెండి-ఏంచేస్తాం. టాగూరంతటి విశ్వకవికే తప్పలేదు ఈ అపవాదు; ఇంక అస్మదాదులమెంత. సరే, ఎవరు ఏమన్నా, అనాలోచిత సంకల్పంలో ప్రభవించిన పార్వతీశం అందరి ఆదరాభిమానాల చేతా విశాల విఖ్యాత యశుడు అయ్యాడు. నా కది ఆనందహేతువు. ఎందుచేతనంటే, అతని యశోదీధితులు కొన్ని ప్రత్యక్షంగానూ, కొన్ని పరోక్షంగానూ నా మీదకూడా పడి నన్ను గిలిగింతలు పెడుతూంటాయి- అప్పుడప్పుడు. కాని, ఈ ఆనందంతోపాటు నాకు కొన్ని సందేహాలు కలిగి బాధించగా కొంత ఆత్మపరీక్ష చేసుకో వలసి వచ్చింది. నేను గొప్ప పుస్తకం వ్రాసి అందరనూ గొప్పగా ఆనంద పరవశులను చెయ్యవలెనని కాని, అందుకు నేను తగిన వాడనని కాని ఎప్పుడూ అనుకోలేదు. కాని, కొందరు కాదన్నా గొప్ప పుస్తకమే అయింది. అఖండ ఖ్యాతి నార్జించింది. ఆపేరు మీదనే నేను చెలామణి అవుతున్నాను. అందుచేతను నాలో లేని శక్తి ఏదో ఉన్నట్లు ప్రజలను భ్రమపెట్టి ఆ రీతిగా వారిని మోసగించడం లేదుకదా అనే సందేహం ఎప్పుడూ నన్ను బాదిస్తూ ఉంటుంది.
అది అలా ఉండగా పార్వతీశం విశిష్టత ఏమిటో, ఎందు కింత మందికి ప్రేమ పాత్రుడయ్యాడో, ఇతన్ని చూచి ఎందుకు జనం విరగబడి నవ్వుతున్నారో అనే ప్రశ్న పరంపర బయలుదేరుతూ ఉంటుంది. మనం ఏదో వ్రాశాం-వాళ్ళు నవ్వుతున్నారు; సంతోషిస్తున్నారు. ఇంకను ఈ వెర్రి సందేహాలు నాకెందుకు అని ఒక పక్క సమాధానం వచ్చినా, దానితో తృప్తి పడే స్వభావం కాదు కనుక మరి కొంచం తరచి చూచాను. దానిపైన అసలు, ఎదటి వాళ్ళను చూచి మనం ఎందుకు నవ్వుతాం-వాళ్ళలో ఏ లక్షణాలు మనల్ని నవ్విస్తాయి, అనే ఆలోచన కలిగింది. ఇది చాలా పెద్ద ప్రశ్న. సమాధానం సరిగా చెప్ప తలుస్తే సవాలక్ష గ్రంథం అవుతుంది. అందుకని సూక్ష్మంగా మనవి చేస్తాను. మనుష్యుల రూపురేఖా విలాసాల్లోనూ, వేషభాషల్లోనూ, మన కంటికి చెవికీ అలవాటైన వానికంటె హెచ్చు తగ్గు లేమాత్రం ఉన్నా మనకు నవ్వు వస్తుంది. ఎదటివాడు ఎక్కువ ఎత్తరి అయినా, కురచ అయినా, లావైనా, సన్ననైనా, పెద్దముక్కున్నా, అసలు లేకపోయినా, కండ్లు ఎగుడు దిగుడుగా ఉన్నా, మెల్ల ఉన్నా, ఇటువంటి తేడాలు ఏమి కనుపించినా నవ్వుతాం. అంటే మామూలు ప్రమాణాల కంటె హెచ్చు తగ్గు లేమున్నా మనకువికారంగా తోచి నవ్వుతాం. ఇదిగాక ప్రతి మనిషిలోనూ కొంత కదలిక, చురుకు, వివేకం, వగైరా లక్షణాలు విడిగా ఉంటా యనుకుంటాను. అని ఏ మనిషిలో నైనా లోపిస్తే ఆ మనిషి అనాగరికుడుగా మనకు కనపడి మనం నవ్వుతాం. అందుచేత కథారచనలో నాయకుడి మాటల్లోనూ, చేష్టల్లోనూ, వేషంలోను ఇటువంటివ్యత్యాసాలు చూపించగలిగితే పాఠకులు నవ్వుకుంటారని తేలింది. మనకంటే ఆంగ్లేయులు చాలా విషయాల్లో నాగరికులనీ, వారి వేషభాషలు చాలా అందంగానూ, నాజూకుగానూ ఉంటాయనీ అందరూ అనుకుంటారు కదా. ఆ పద్దతులూ, ఆ వేషమూ మనం సాధ్యమైనంత వరకూ అనుకరిస్తాం కదా. అటువంటప్పుడు ఈ పార్వతీశం కచిక, తాటాకులు, బొంత, ఎర్ర శాలువ, గులాబి రంగు సిల్కు కండువా, బంతి పువ్వు రంగు పెట్టె వగైరా సామగ్రితో బయలు దేరు తున్నాడంటే, ఇంత వెర్రి ముండాకొడుకేమిటా అని అందరూ నవ్వుకున్నా రనుకుంటాను.
అలాగే ఆడవాళ్ళ టోపీ కొన్నప్పుడూ భోజనాలదగ్గర కత్తికటారు లుపయోగించడం చేతకానప్పుడూ, ఫ్రాన్సులో షాపులో తివాసీమీద నడవ కూడదేమోననుకుని మైనం నునుపు పెట్టిన చక్కలమీద నడవపోయి పడినప్పుడూ ఇంత చేతకానితనం ఉంటుందా అని నవ్వుకున్నారు.
యదార్థం చేత నవ్వవలసిన పనిలేదు. ఏమంటారా, ఈ నవ్వే వారందరూ ఆ పరిస్థితుల్లో, ఆ సన్నివేశాల్లో, ఆ సందర్భాలలో సరిగ్గా పార్వతీశంలాగనో, అంతకంటే కొంచెం తెలివి తక్కువగానో ప్రవర్తించే వారని ధైర్యంగా చెప్పగలను. ఒక పెద్దమనిషి బి.ఎల్. చదవడానికి మద్రాసు వచ్చినప్పుడు క్షౌరశాలలో పార్వతీశానికి కలిగిన సందేహమే తనకూ కలిగిందని రహస్యంగా చెప్పాడు. ఇంగ్లండు వెళ్ళి డాక్టరు పరీక్షలో ఉత్తీర్ణుడయివచ్చిన పెద్దమనిషి, తనూ ఒక షాపులో తివాసిమీద నడవకూదనుకొని, తలకిం దుగా బోల్తాపడ్డ సంగతి చెప్పి నాసంగతి నీకెలా తెలిసిందని అడిగాడు.
మానవుడు చాలా విషయాల్లో అజ్ఞానుడు. అందుచేత అజ్ఞానజనిత అపచారాలు చాలా ఉంటాయి. ఇటువంటివి కొన్ని చేర్చి ఒక వ్యక్తిలో చూపించడం కొంతవరకు అతిశయోక్తి అయినా, తప్పక హాస్య జనకంగా ఉంటుందని తేలింది. ఈ అజ్ఞాన కృతాపరాధములకు తోడు, తన తప్పు ఒప్పుకోకుండా అదేదో తను తెలిసే చేసినట్లు నటించడం మనలో చాలా మందికి అలవాటు-పార్వతీశం ఆడటోపీ తెలియక కొని వాళ్లు నవ్వగానే తన స్నేహితురాలికోసం కొన్నానని డబాయించినట్లు. మనలో చాలా మంది కీ జబ్బు ఉన్నది. ఇది కూడా అజ్ఞాన లక్షణమే.
పర్యవసాన మేమిటంటే, మనలో అజ్ఞాతంగా ఉన్న అజ్ఞానం, అవతవకలూ, వ్యత్యాసాలూ, డాబులూ, దర్పాలు ఎదటివాడిలో ప్రదర్శితమయితే మనకు నవ్వేనా వస్తుంది; కోపమేనా వస్తుంది. ఎందుకు -నవ్వు అనేదానికి ఒక్క సమాధానంచెప్పి ముగిస్తాను. ఏ మనిషి తన తప్పు తా నెరుగడు సరికదా; ఎదటివారికా తప్పు ఆరోపిస్తాడు కూడాను. 'మనం చెయ్యని తప్పు ఎదటివాడు చేశాడు. వాడొట్టి మూర్ఖుడు. నేనే అయితేనా' అని తన వీపు తను తట్టుకొని సంతోషిస్తాడు. మా పార్వతీశం విషయంలో అంతే జరిగింది. మనలో ఉండే తెలివితక్కువ లన్నీ పార్వతీశంలో చూచి ఆ వెర్రికుంకగనక అలా చేశాడు కాని నేనైతేనా అని ఎవరిమట్టుకువారు ఆత్మ సంతృప్తితో పార్వతీశాన్ని చూచి నవ్వుతున్నారు. దీనినే ఇంగ్లీషులో ఒక తత్వవేత్త 'సుపీరియర్ ఎడాప్టేషన్ ' అన్నాడు. అనగా అది ఒక రకమైన అహంకార వికార మన్నమాట. కారణం ఏమైనా పార్వతీశం ఆంధ్ర హృదయంలో స్థిరనివాసము ఏర్పరుచుకున్నాడు. అతనిలో అలంకారికులు చెప్పిన ధీరోదాత్తాది లక్షణాలు లేకపోవచ్చు. అందుచేత మహా నాయకుడు కాడు, పోనీ నాటకాల్లో ప్రసిద్ధుడైన ప్రతి నాయకుడూ కాడు. ఏది కాకపోయినా అతను మనలాటి మానవుడు. మనలో మావవత్వమే అతనిలోనూ ఉంది. మన మంచీ, మన చెడూ అతని లోనూ ఉంది. ఇన్నెందుకు మనమే అతను, అతనే మనం. అందుకనే మన ప్రతి ఒక్కరిలోనూ ఒక్కడు కాగలిగాడు పార్వతీశం.
ఎవరు ఎంత నవ్వినా, పార్వతీశం ఏమీ అనుకోడు. మనవాళ్ళకు సామాన్య ధర్మాలైన సాహసం, ఉద్రేకం, దూరాలోచన, అజ్ఞానం, అహంకారం కార్యావసరమైన సాధన సంపత్తి చేకూర్చుకొనే ఓపిక లేకపోవడం-ఇలాటివన్నీ మూర్తీభవించిన మూర్తి మా పార్వతీశం అని నా అభిప్రాయం. మీరేమంటారు?
ఇలా నిర్మొగమాటంగా మాట్లాడానని ఏమీ అనుకోరనుకుంటాను. ఏమంటే సత్యవ్రతం హాస్య రచయితకు ప్రధాన లక్ష్యం.
ఇప్పటివలెనే ఎప్పటికినీ ఆంధ్రుల అల్లారు ముద్దు బిడ్డగా పార్వతీశం చిరంజీవిగా వర్ధిల్లాలని మీరు ఆశీర్వదించండి.