బాటసారుల అదృష్టం
అనగనగా ఒక రహదారిలో రాము, గిరి అనబడే ఇద్దరు బాటసారులు కలిసి ప్రయాణం చేస్తున్నారు.
దారిలో అనుకోకుండా గిరికి ఒక సంచి కనిపించింది. ఆ సంచి తెరిచి చూస్తే అందులో బంగారు నాణాలు ఉన్నాయి!
“నేను యెంత అదృష్టవంతుడిని, నాకు అనుకోకుండా ఇంత బంగారం దొరికింది!” అని గిరి రాముతో అన్నాడు.
“నేను అదృష్టవంతుదిని అనకు, మనం అదృష్టవంతులము” అని రాము బదులు చెప్పాడు.
“అదెలా కుదురుతుంది? సంచి నాకు దొరికింది కనుక బంగారమూ నాడదే, అదృష్టము నాదే! మనం కాదు; నేను అదృష్టవంతుడిని!” అని గిరి కోపంగా అన్నాడు.
రాము గొడవ పడడం ఎందుకులే అనుకుని ఊరుకున్నాడు.
ఇంతలో వెనక నుంచి “దొంగ! దొంగా!” అని అరుపులు వినిపించాయి. వెనక్కి తిరిగి చూస్తే కొంత మంది కోపంగా కర్రలు, కట్టెలు పట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తున్నారు!
“అరెరే! మన దెగ్గిర కనుక ఈ సంచి చూస్తే మనం దొరికిపోతాము. వాళ్ళు మనల్ని చితక్కోట్టేస్తారు!” అని గిరి ఖంగారు పడ్డాడు.
“మనం కాదు, నువ్వు దొరికిపోతావు. నిన్ను చితక్కోట్టేస్తారు. ఈ సంచితో నాకేమి సంబంధం లేదన్నావు కదా” అని కూల్ గా రాము జవాబు చెప్పాడు.
మనం ఇతర్లతో మన అదృష్టం పంచుకోనప్పుడు వాళ్ళు మన దురదృష్టంలో కలిసి వస్తారనుకోవడం మూర్ఖత్వమే కదా!
అడవిపంది దంతాలు
ఒక రోజు ఒక అడవిపంది తన దంతాలను అంటే తన కోర పన్నులను చెట్టుకి గీకి వాటిని పదును చేసుకుంటోంది.
ఈ విషయం ఒక నక్క గమనించింది. ఆ నక్కకు కొంచం వెటకారం ఎక్కువ. పక్క వాళ్ళను సూటి పోటి మాటలు అనకుండా ఉండలేదు. అందుకనే అడవి పందిని చూడగానే టైం బాగుందనుకుని ఒక ఆట పట్టిద్దాము అనుకుంది.
పక్కన నుంచుని ఇటూ అటూ చాలా ఆత్రుతతో ఏదో బద్ధ శత్రువులు దాక్కున్నట్టు, వారిని చూసి భయ పడుతున్నట్టు నటించింది.
అడవి పంది పట్టించుకోకుండా దాని పని అది చేసుకుంటూ పోయింది.
మొత్తానికి తన ఆట తనకే బోర్ కొట్టి నక్క, “ఎందుకు అలా దంతాలను పదును చేసుకుంటున్నావు? నాకేమి ఎవరు నీ మీద దాడి చేస్తున్నట్టు కనిపించట్లేదే?” అని చిరునవ్వుతో అడిగింది.
అడవి పంది చాలా కూల్ గా, “ఎవరో దాడి చేసాక నేను దంతాలను పదును పెట్టుకునేంత వీలు ఉండదు. అయినా శత్రువులు ముందే ఈ పదునైన కొమ్ములను చూసి నాతొ గొడవ పెట్టుకోరు” అని పని చేసుకుంటూనే జవాబు చెప్పింది.
నిజమే. మనలోని బలహీనతే మన శత్రువులకు బలము. వారికి మనలో ఏ బలహీనత కనిపించకపోతే వారు మన జోలికి రారు.
యుద్ధానికి సంసిద్ధత అనేది శాంతికి ఉత్తమమైన హామీ.
కోతి కుతూహలం
అనగనగా ఒక అడవిలో కొంత మంది వడ్రంగులు పని చేసుకుంటున్నారు. వారు రోజు అడవిలో చెట్లు నరికి, చక్కలు కొట్టి వాటితో చక్క సామాను చేసుకుంటూ ఉండేవారు. మధ్యాన్నం దెగ్గిర వున్న ఏటి గట్టు మీద కూర్చుని భోజనం చేసి, విశ్రాంతి తీసుకుని మళ్ళీ పని ప్రారంభించేవారు.
ఒక రోజు అలాగే మధ్యాన్నం అయ్యింది. అక్కడున్న వడ్రంగులలో ఒక్కడు ఒక చెట్టును కొట్టి అడ్డంగా చక్కలు చేస్తున్నాడు. పని మధ్యలో ఆపితే సగం కోసిన దుంగలో ముక్కలు మళ్ళీ దెగ్గిర పడిపోతాయని మధ్యలో ఒక చక్క ముక్కను చీలిక చేసి అడ్డంగా పెట్టి భోజనానికి వెళ్లి పోయాడు.
ఇంతలో అక్కడికి ఒక కోతి దళం వచ్చింది. కోతులు కార్మికులు వదిలేసిన వివిధ యంత్రాలతో ఆడుకోవడం మొదలెట్టాయి. అందులో ఒక కోతి ఆ దుంగ, దుంగ మధ్యలో చీలిక చూసింద. కోతి ఇలాంటిది ఇంతక ముందర ఎప్పుడు చూడలేదు.
కుతూహలంతో ఆ చీలికని పరీక్షించడం మొదలెట్టింది. రెండు చేతులతో లాగింది. అలా లాగ గానే చీలిక బయటికి వచ్చేసి, దుంగ లో చేసిన రంద్రం ఠక్కుమని దేగ్గిరపడి మూసుకుపోయాయి.
అందులో కోతి తోక ఇరుక్కు పోయింది. కోతి గట్టి గట్టిగా అరవడం మొదలెట్టింది. భరించలేని నొప్పి కదా! ఆ శబ్దానికి మిగితా కోతులు కూడా భయ పడి పారి పోయాయి.
శ్రామికులు అరుపులు విని చూడడానికి వచ్చి, కోతి చేసిన పని చూసారు. కోతి తోకను విడిపించారు.
పరిచయం లేని విషయాలలో ముక్కు దూర్చ కూడదని అందుకే పెద్దలు చెప్తారు.
గంట మొగించేది ఎవరు?
ఒకానోక్క గ్రామంలో ఒక దొంగ గుడిలో గంట దొంగలించి అడవిలోకి పారిపోయాడు. ఊళ్ళో వాళ్ళు వెంట పడ్డారు.
పరిగెడుతుంటే గంట చప్పుడు అవుతుంది కదా? పట్టుబడి పోతాడేమో అన్న భయంతో గంట అడవిలో దాచేసి, తనూ దాక్కున్నాడు. దొంగ దొరకకపోతే ఊళ్ళో వాళ్ళు తిరిగి వెళ్లి పోయారు.
మళ్ళీ గంటతో పాట్లు ఎవరు పడతారు అనుకుని దొంగ కూడా గంటని అడవిలో వదిలేసాడు.
కాల క్రమేణ ఈ సంఘటన అందరూ మర్చిపోయారు.
ఒక రోజు సాయంత్రం పూట హటాత్తుగా గంట మోగడం మొదలెట్టింది. అడవిలోంచి గంట చప్పుడు గ్రామంలో వినిపించింది. గ్రామస్తులు అంతా భయ పడ్డారు. గంట కొడుతున్నది ఎవరు? అని ఒకరితో ఒకరు చర్చించుకున్నారు.
చివరికి సమాధానము తోచక అడవిలో ప్రేతాలు ఉన్నాయని, అవే గంట కొడుతున్నాయని ఒక ఆధారం లేని పుకారు మొదలయ్యింది. గ్రామంలో వాళ్ళు భయ పడి అడవి వైపు వెళ్ళడం మానేశారు. కాని ఇది ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే పాత కాలంలో ఇప్పుడు దొరికినంత సులువుగా అన్నీ దొరికేవు కాదు. పొయ్యిలోకి కట్టలు కావాలన్న, వేట ఆడాలన్నా, చాపలు పట్టాలన్నా, వేరే గ్రామాలకు వెళ్ళాలన్నా అడవిలోంచి వెళ్లక తప్పదు. ఇలా గంట కొడుతున్న ప్రేతాలకు భయపడి అడవిలోకి వెళ్లక పొతే గ్రామస్తులకి ఇవన్ని ఉండవు. అది ఇబ్బందే కదా!
మాటి మాటికీ గంట వినిపించడం ఒక సాధారణ విషయం అయిపొయింది. గంట మొగి నప్పుడల్లా ఊళ్ళో వాళ్లకి చెప్పుకో లేనంత భయం. తట్టుకో లేక కొంత మంది గ్రామం వదిలి వెళ్ళిపోయారు.
ఒక రోజు గంట చప్పుడు వినిపిస్తుంటే ఒక అవ్వ “అసలు గంట ఎవరు కొడుతున్నారు? ప్రేతాలున్నాయంటే నేను నమ్మను!” అనుకుంది. అడవిలోకి వెళ్లి చూద్దామనుకుంది.
మొన్నాడు అలాగే వెళ్లి చూసింది. గంట చప్పుడు ఎటు వైపు వస్తోందో పరిశీలించి అటువైపు వెతికింది. కొంత సేపటికి చూసిన దృశ్యానికి పడీ పడీ నవ్వడం మొదలెట్టింది.
గంట ఒక చెట్టు మీద వేల్లాడుతోంది. ఆ చెట్టు మీద బోల్డన్ని కోతులు వున్నాయి. గాలి తగిలినా, కోతి తగిలినా, గంట ఊగి కొట్టుకుంటోంది.
అవ్వ నవ్వుకుంటూ తిరిగి గ్రామంలోకి వెళ్ళింది. వెళ్లి ఊరి పెద్దను కలిసి, “నాకు ఈ గంట బాధ నుంచి విముక్తి ఎలా చెందాలో, ఒక ఉపాయం తట్టింది. దానికి నాకు కొంత సామగ్రి కావాలి. మీరు కొంత డబ్బు ఇప్పిస్తే, నేను ఈ సమస్యని పరిష్కరిస్తాను. ఇంక ఎవ్వరు మన గ్రామం వదిలి పోనవసరం లేదు” అని చెప్పింది.
ఊరి పెద్ద ఆ అవ్వకి యజ్ఞమో, నోమో, పూజో అలాతిదేదో తెలుసేమో అనుకుని కొంత డబ్బు ఇచ్చి పంపించాడు. ఆవిడ ప్రయత్నం ఫలించాలని, ఊరికి మంచి జరగాలని దేవుడికి మొక్కుకున్నాడు.
మొన్నాడు అవ్వ తన పెద్ద కొడుకుని వెంట పెట్టుకుని, బజారులోకి వెళ్లి అరిటి పళ్ళు, మామిడి పళ్ళు, వేరుసెనగ పల్లీలు కొనుక్కుంది. విషయం చూసిన వాళ్ళంతా అవ్వ యే పూజ చేస్తుందో అనుకున్నారు.
అవ్వ, తన కొడుకు, ఇద్దరు సామాను తీసుకుని అడవిలోకి వెళ్ళారు. ఊళ్ళో వాళ్ళు ఊపిరి బిగించుకుని అడివి అంచున ఎదురు చూసారు.
అడవిలో అవ్వ కోతులకు పళ్ళు, పల్లీలు చూపించింది. అవి చూసిన కోతులు చెట్టు దిగి పళ్ళు తినడం మొదలెట్టాయి. చటుక్కున కుర్రాడు చెట్టు ఎక్కి గంట తీసుకుని దిగి పోయాడు.
అవ్వ, కుర్రాడు గంటతో సహా తిరిగి ఊళ్లోకి వచ్చారు.
యేమవుతుందో అని ఆత్రంగా ఎదురు చూస్తున్న గ్రామస్తులు నవ్వుకుంటూ తిరిగి వచ్చిన వాళ్ళిద్దరిని చూసి ఆశ్చర్య పోయారు.
అవ్వ జరిగినదంతా చెప్పింది. ఊళ్లోవాళ్ళు ఆమె ధైర్య సాహసాలని, తెలివి తేటలని మెచ్చుకున్నారు. “అనవసరంగా ఇంత కాలం మూఢ నమ్మకాలతో, అపోహలతో అనవసరంగా ఇబ్బంది పడ్డామే!” అని అనుకున్నారు.
అప్పటి నుంచి గ్రామంలో అందరు ప్రశాంతంగా వున్నారు.
రాజుగారి కోతి
అనగనగా ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారికి ఒక పెంపుడు కోతి ఉండేది. కోతి చాలా మూర్ఖుడు కాని రాజుగారికి కోతి అంటే చాలా ఇష్టం. ఆ కోతికి రాజుగారి గదులలోకి కూడా వచ్చే పోయే స్వేచ్ఛ ఉండేది.
ఒక రోజు రాజుగారు నిద్రపోతుంటే కోతి కాపలా కాస్తోంది. ఇంతలో రాజుగారి భుజం మీద ఒక ఈగ వాలింది.
కోతి ఈగని తోలడానికి ప్రయత్నం చేసింది. కాని ఎన్ని సార్లు తోలితే అన్ని సార్లు ఆ ఈగ కొంచం సేపు ఎగిరిపోయి మళ్ళీ వచ్చి రాజుగారు మీద వాలుతోంది.
రాజుగారికి నిద్రాభంగం అవ్వకుండా ఉండాలంటే ఎలా? కోతికి ఒక ఐడియా వచ్చింది.
ఒక కత్తిని తీసుకుని వచ్చి రాజుగారి దెగ్గిర కూర్చుంది. మళ్ళీ ఈగ రాజుగారి ముక్కు మీద వాలగానే కత్తితో దాడి చేసింది. ఈగ ఎగిరిపోయింది కాని రాజుగారికి మట్టుకు బాగా గాయాలు తగిలాయి.
అందుకే మూర్ఖులతో చనువు మంచిది కాదని పెద్దలు చెప్తారు.
గోంగూర నాడే
కథ మొదలెట్టే ముందర ఒక చిన్న మాట: ఈ బ్లాగ్లో ఇది 100వ కథ. అందుకనే కొంచం స్పెషల్ గా వుండాలి అనుకున్నాను. చిన్నప్పుడు మా అమ్మ ఎన్ని కథలు చెప్పినా, “ఇంకో కథ చెప్పమ్మా!” అని బ్రతిమాలే వాళ్లము. “ఏ కథ చెప్పమంటారు?” అని మా అమ్మ అంటే, “గోంగూర నాడే కథ చెప్పమ్మా!” అని ఆడిగే వాళ్లము. ఈ కథంటే నాకు, మా చెల్లెలికి చాలా ఇష్టం. మళ్ళీ మళ్ళీ చెప్పించుకునే వాళ్లము. ఈ కథకూడా ఒక తల్లికి తన బిడ్డలపై ఉండే ప్రభావం గురించి. “తల్లికి పిల్లల మీద యెంత ప్రేమ ఉన్నా అది కడుపులో పెట్టుకుని పిల్లలని బాధ్యతగా పెంచాలి” అని ఈ కథ చివర్లో మా అమ్మ చెప్పేది. ఈ కథ ఆ మాటకు చాలా మంచి ఉదాహరణం. అందుకనే ఈ కథను బ్లాగ్లో 100వ కథగా మీకు సమర్పిస్తున్నాను. మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తాను.
ఇప్పుడు కథ:
ఒక చిన్న పిల్లాడు స్కూల్ నుంచి వస్తూ నాయుడు గారి పొలం లోంచి కొన్ని గోంగూర కట్లు కోసుకుని ఇంటికి తీసుకుని వెళ్ళాడు.
“అమ్మ! అమ్మ! నాకు గోంగూర పచ్చడి ఇష్టం, గోంగూర కట్టలు తెచ్చాను, చేసి పెట్టవా?” అని అడిగాడు.
అమ్మ, “ఈ గోంగూర ఎక్కడిది బాబు?” అని అడిగింది.
“నాయుడుగారి పొలం లోంచి తెచ్చానమ్మా!” అని బదులు చెప్పాడు.
చేసింది దొంగతనము, అని చిన్న పిల్లాడికి తెలియక చేసాడని భావించి, తల్లి మందలించలేదు. ఆ రోజు రాత్రి గోంగూర పచ్చడి చేసి పెట్టింది. చక్కగా పిల్లాడు తినేసాడు.
కొద్ది రోజుల తరువాత, ఇంటికి వస్తూ మామిడికాయలు కోసుకుని వచ్చి మామిడికాయ పప్పు చేసి పెట్ట మన్నాడు. అమ్మ మళ్ళీ చిన్న పిల్లాడి అల్లరేకదా అనుకుని, పప్పు చేసి పెట్టింది. పిల్లాడు సంతృప్తిగా తిన్నాడు.
ఇలా రాను రాను, ఎప్పుడైనా ఏమైనా కావాలంటే ఊళ్ళోని పొలాల్లోంచి దొంగతనంగా తెచ్చుకోవడం ఆ పిల్లాడికి అలవాటు అయిపొయింది. తల్లి కూడా ఎప్పటికప్పుడు అల్లరి చేస్తున్నాడే అనుకుంది తప్ప, తప్పు చేస్తున్నాడని అనుకోలేదు, ఎప్పుడు పిల్లాడిని సరిదిద్దలేదు. పెద్ద వాడైతే తనే తెలుసుకుంటాడని వదిలేసింది.
ఒక రోజు నాయుడిగారి పోలంలోంచి ఇలాగే యేవో పళ్ళు కోస్తూ ఆ పిల్లాడు అక్కడ ఉన్న పాలేరుకి పట్టు బడ్డాడు. పాలేరు పిల్లాడిని ఇంటికి తీసుకుని వచ్చి తల్లితో జరిగినది చెప్పాడు. తల్లి వెంటనే కొడుకును వెనకేసుకుని వచ్చి, “నా కొడుకు అలాంటి పనులు చేయడు! నువ్వు ఏమి చూసి ఏమనుకున్నావో!” అని పాలేరుని తిట్టి పంపించేసింది.
పిల్లాడు తల్లి మందలించక పోవడం వల్ల తన తప్పు తెలుసుకోలేక పోయాడు. ఇలాంటి సంఘటనలు ఇంకొన్ని జరిగినప్పుడు తన ప్రవర్తన తల్లి ప్రోత్సహిస్తోందని అనుకున్నాడు.
కాలం గడిచి పిల్లవాడు పెద్ద వాడు అయ్యాడు. పెద్ద అయితే అవసరాలు మారుతాయి కదా. చిన్నప్పుడు కాయలు కోరలు దొంగాలించే పిల్లాడు, పెద్ద వాడై తన అవసరాలకు తగ్గట్టు వస్తువులు, డబ్బులు దొంగాలించడం మొదలెట్టాడు. పిల్లాడు పెద్ద వాడైపోయాడు, ఇప్పుడు నేను చెప్తే మట్టుకు వింటాడా అని అప్పుడూ తల్లి ఏమీ అనలేదు.
ఒక రోజు పోలీసులు వచ్చి దొంగకు సంకెళ్ళు వేసి, దొంగలించిన సామాను జబ్తు చేసుకున్నారు. కొడుకుని తీసుకుని వెళ్లి పోతుంటే తల్లి భోరు భోరు మని ఏడిచింది.
“ఇప్పుడు ఏడిచి ఏమి లాభం అమ్మా! నాయుడు గారి పొలంలో గోంగూర తెచ్చిన నాడే తప్పని మందలించి వుంటే నేను ఈ స్థితికి వచ్చే వాడిని కాదు కదా!” అని కొడుకు జైలుకి వెళ్ళాడు.
పిల్లలు చేసే చిన్న చిన్న పొరపాట్లను తల్లి తండ్రులు సరిదిద్దకపోతే, అవే తప్పులు ముందు ముందు అలవాట్లు, తరవాత గ్రహపాటు అవుతాయి.
గాడిద మేటు
ఒకనోక్క కాలంలో ఒక స్వగ్రామములో ఒక విక్రేత ఉండేవాడు. ఆ విక్రేత అన్ని రకాల సామాన్లూ అమ్మేవాడు. చెప్పులు, బట్టలు, గాజులు, పళ్ళు, గిన్నెలు – బజారులో చవక గా కొని, ఊళ్ళో ఇంటింటికి వెళ్లి అమ్ముకునే వాడు.
ఈ సామాన్లు మోయడానికి ఒక గాడిద ఉండేది. సామాన్లన్నీ మోట కట్టి, గాడిద మీద వేసి, బజారు నుంచి ఊళ్ళో, ఊళ్లోనుంచి తిరిగి అతని ఇంటికి తిప్పేవాడు.
రోజంతా బరువైన మోటలు మోసి ఆ గాడిద అలిసిపోతూ వుండేది.
ఒక రోజు విక్రేత బజారులో ఉప్పు కొన్నాడు. ఉప్పు మూటలు మామూలుగా కన్నా ఎక్కువ బరువుగా వున్నాయి. గాడిద పాపం బరువుని మోసుకుంటూ విక్రేత వెనుక నడిచింది.
మిట మధ్యాన్నం అయ్యింది. ఎండ బాగా ముదిరింది. గాడిద అలిసి పోయింది. కాళ్ళు లాగడం మొదలెట్టాయి. వీపు నొప్పెట్టేస్తోంది. దాహం వేస్తోంది. ఇంతలో కాలువ ఎదురయ్యింది. గాడిద గబ గబా కాలవ వైపు వెళ్ళింది. అంత పెద్ద మోట తో వంగడం కష్టంగా వుంది. వీలైనంత ముందరికి వంగి నీళ్ళు తాగడానికి గాడిద ప్రయత్నం చేసింది.
కాలవ గట్టు తడిగా, జారిపోతూ వుంది. సంతులం తప్పి గాడిద ఒప్పు మోట తో సహా నీళ్ళల్లో పడిపోయింది.
ములిగి పోతుందేమో అన్న భయంతో కాళ్ళు, చేతులూ కొట్టుకోవడం మొదలెట్టింది.
కానీ, అనుకోకుండా గాడిద తేలడం మొదలెట్టింది. వీపు మీద మోట తెలికయిపోయింది. కాలవలోంచి గట్టు మీదకు ఎక్కి నీళ్ళు దులుపుకుంది. మోట మాయం! బరువు లేదు! వీపుకి చాలా ఉపశమనం కలిగింది.
ఆ రోజు రాత్రి ఇంట్లో గాడిద ఈ అద్భుతం ఎలా జరిగిందని ఆలోచించింది. దానికి నీళ్ళల్లో ఉప్పు కరిగి పోయిందని తెలీదు. ఆ కాలువలో ఏదో మాయ జరిగింది అనుకుంది.
ఇక పైన ఎప్పుడైనా మోట బరువుగా అనిపిస్తే మళ్ళీ నీళ్ళల్లో దుంక వచ్చు అని నిశ్చయించుకుంది.
మొన్నాడు విక్రేత బట్టలు కొన్నాడు. ఆ బట్టలను గాడిద మీద వేసి ఊళ్లోకి బయలుద్యారేడు.
“నిన్న ఏమి సంపాదించుకోలేదు. ఈ రోజైనా మంచి లాభం సంపాదించాలి” అనుకుంటూ విక్రేత మామూలుగా కొనే సరుకు కన్నా ఎక్కువ కొన్నాడు. మళ్ళీ గాడిద మీద బరువు ఎక్కువ వేసాడు.
గాడిదకి మళ్ళీ కాళ్ళూ, వీపు నొప్పి పెట్టడం మొదలెట్టింది. మళ్ళీ కాలవ దెగ్గిర పడింది. కాలవ వైపు గబ గబా వెళ్లి మళ్ళీ నీళ్ళు తాగుతున్నట్టు నటించి, నీళ్ళల్లోకి దుంకేసింది. మోట మొత్తం తడిసేలా కాళ్ళు చేతులూ కొట్టుకుంది.
కాని, బరువు తగ్గే బదులు ఇంకా ఎక్కువ అయిపొయింది! ఇది ఉప్పు కాదు కదా కరిగి పోవడానికి! బట్టలు! తడిసిన కొద్దీ బరువు ఎక్కుతాయి.
ఇప్పుడు మొదటికే మోసం వచ్చింది. బరువు ఎక్కువయ్యే సరికి గాడిద నీళ్ళల్లో ములిగిపోవడం మొదలెట్టింది. చాలా భయ పడిపోయింది. విక్రేత నీళ్ళల్లోకి దుంకి జాగ్రత్తగా గాడిదని బయటికి లాగాడు.
ఆ రాత్రి గాడిద చాలా బాధ పడింది. డబల్ బరువు మోయడంతో వీపు, కాళ్ళూ మామూలుగా కన్నా ఎక్కువ నొప్పెట్టడమే కాకుండా, అంత సేపు తడిసిన బట్టలు మోయడం వల్ల జలుబు కూడా చేసింది. ఇంకెప్పుడు పని తగ్గించుకోవడానికి తప్పుడు దారులు వెతుక్కో కూడదని నిశ్చయించు కుంది.
మొండి గాడిద
ఒక గాడిదను తన యజమాని జాగ్రత్తగా ఒక కొండ మీంచి కిందికి తోల్తుంటే, ఆ మొండి గాడిద హఠాత్తుగా యజమాని మాట వినకుండా, తన దారిని తను వెళ్లాలని నిశ్చయించుకుంది.
కొండ కింద వున్న ఇల్లు కనిపిస్తోంది.
“యజమానికి ఏమీ తెలీదు – ఇంత సేపటినుంచి తోల్తున్నాడు కాని ఇంటి వైపుకి కాకుండా ఈ కొండా చుట్టూరా నడుస్తున్నాము. యజమాని యెంత మూర్ఖుడు!” అనుకుంది గాడిద. “ఒక్క గెంతు వేస్తె ఆ కొండ దిగిపోతాము కదా!” అనుకుంది.
అంచున నుంచుని దుంక పోతుంటే యజమాని వెనక్కి లాగాడు, కానీ మొండి గాడిద వినే మూడ్ లో లేదు. యజమాని యెంత వెనక్కి లాగుతుంటే అంత బలంగా గాడిద ముందరికి లాగింది.
చివరికి తప్పక యజమాని గాడిదని వదిలేయాల్సి వచ్చింది. “నిన్ను వెనక్కి లాగబోయి నేను పడిపోతాను! పొ! నీ ఖర్మ!” అని తిట్టుకున్నాడు.
యజమాని వదల గానే గాడిద ఒక గెంతు వేసింది. ఇంకేముంది? కొండ అంచు మీంచి డొల్లుకుంటూ కింద పడి ప్రాణాలు కాలిపోయింది.
శ్రేయోభిలాషుల మాట వినకుండా, వారి సలహాలను నిరాకరించి, మొండిగా ముందుకు వెళ్ళే వాళ్ళు గమ్యం చేరుకోలేరు.
పక్షుల ఐక్యత
ఒక అడవిలో ఒక పక్షుల గుంపు వుండేది. గంతులు వేస్తూ, కిచ కిచ చప్పుడు చేస్తూ అవి ఎప్పుడు కలిసి ఎగురుతూ ఉండేవి.
ఒక రోజు అలాగే కలిసి ఎగురుతుంటే, నేల మీద బోలెడన్ని ధాన్యపు గింజలు కనిపించాయి.
పక్షులంతా ధాన్యం తిందామని నేల దిగంగానే ఇద్దరు మనుషులు ఆ పక్షులను వల వేసి పట్టేశారు.
పక్షులన్నీ ఎవరికి వారు ఆందోళనగా తగిన బలంతో రెక్కలు కొట్టుకోవడం మొదలెట్టాయి. కానీ వలలోంచి బయట పడలేక పోయాయి.
పక్షుల రాజు, “ఇలా కాదు! ఎవరికి వారు రెక్కలు కొట్టుకుంటే లాభం లేదు. అందరం కలిసి, వలను మన పక్షి ముక్కులతో పట్టుకుని, ఒకటే సారి రెక్కలు ఆడిద్దాము. అప్పుడు మనం వలతో సహా ఎగిరిపోవచ్చు.” అని ఆదేశించాడు.
పక్షులంతా ఐకమత్యం తో రాజు చెప్పినట్టు చేసారు. అనుకున్నట్టే వలతో పాటు ఎగిరిపోయారు.
మనుషులు కింద ఆశ్చర్యంతో చూస్తూ ఉండి పోయారు. కాస్సేపటికి తరవడం మొదలెట్టారు కానీ అప్పటికీ పక్షులు చాలా పైకి ఎగిరిపోయాయి.
పక్షులకు మిత్రులైన ఎలుకల దగ్గిరికి ఎగురుకుంటూ వెళ్లి, ఎలుకలను సహాయం కోరాయి. ఎలుకలు చక చక వలను పళ్ళతో కొరికి ముక్కలు ముక్కలు చేసేసాయి.
ఇలా పక్షులు అన్నీ ప్రాణాపాయ స్థితి లోంచి బయట పడి పది కాలాల పాటు సంతోషంగా వున్నాయి.
కట్టెలుకొట్టేవాడి కథ
అనగనగా ఒక కట్టెలుకొట్టే వాడు ఉండేవాడు. అతను చాలా కష్టపడే వాడు. తెల్లారకుండానే అడవిలోకి వెళ్లి, కట్టెలు కొట్టుకుని, ఊరిలో ఆ కట్టెలు అమ్ముకుని జీవితం కొనసాగిస్తూ ఉండేవాడు.
అలా ఉండగా ఒక రోజు కాలవ గట్టున చెట్టు నరుకుతుంటే తన గొడ్డలి నీళ్ళల్లో పడి పోయింది. నీళ్ళల్లో చాలా సేపు గొడ్డలిని వెతుక్కున్నాడు. కానీ లాభం లేక పోయింది. ఎక్కడా గొడ్డలి దొరకలేదు.
కాలవ గట్టున కూర్చుని, అయ్యో అని బాధ పడుతూ ఎడిచాడు. రెక్క ఆడనిదే డొక్క ఆడాడు, అన్నట్టు, పని చేస్తేనే పూట గడిచే పరిస్థితి. గొడ్డలి లేకపోతే కట్టెలు కొట్ట లేడు. కట్టెలు కొట్టక పొతే, అవి అమ్మ లేడు. అమ్మక పొతే, డబ్బు ఉండదు. డబ్బు లేకపోతే, కుటుంబమంతా పస్తులు ఉండాలి. ఇవన్నీ తలుచుకుని కళ్ళు మూసుకుని గట్టిగా వన దేవతని ప్రార్థించాడు. ఎలాగైనా గొడ్డలి దొరికేలా చూడు తల్లీ, అని మనసారా మొక్కు కున్నాడు.
దేవత ప్రత్యక్షం అయ్యింది. విషయం తెలుసుకుని, నదిలోకి దిగి, ఒక బంగారు గొడ్డలి తీసింది. “ఈ గొడ్డలి నీదా?” అని అతన్ని అడిగింది.
అతను, “కాదమ్మా, ఇది నాది కాదు” అని చెప్పాడు.
దేవత మళ్ళీ నీళ్ళల్లో దిగి, ఒక వెండి గొడ్డలి తీసింది. “ఈ గొడ్డలి నీదా?”
“కాదమ్మా, ఇది కూడా నాది కాదు” అని అతను బదులు చెప్పాడు.
ఈ సారి దేవత చాలా సేపు నీళ్ళల్లో వెతికింది. వడ్డున కట్టెలుకొట్టే వాడు చాలా ఖంగారు పడుతున్నాడు. తొందరగా దొరికితే బాగుండు అని మనసులో అనుకుంటూ ఉండగా, దేవత ఒక మామూలు ఇనుప గొడ్డలి చూపించి, “ఇది నీదా?” అని అడిగింది.
సంతోషంతో అతని కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అమ్మయ్య అనుకుని, “అవునమ్మ! ఇదే నాది!” అని అందుకోవడానికి చేతులు జాపాడు.
వన దేవత అతని నిజాయితీని మెచ్చుకుని, అతని ఇనుప గోడ్డలు ఒకటే కాక, ఆ బంగారం గొడ్డలి, వెండి గొడ్డలీ కూడా అతని చేతుల్లో పెట్టింది. “నీ నిజాయతీ నాకు నచ్చింది, ఇవి కూడా ఈ రోజు నుంచి నీవే!” అని చెప్పింది.
కట్టెలు కొట్టే వాడు కళ్ళకి అద్దుకుని మూడు గోడెల్లూ తీసుకున్నాడు.
ఆ రోజు బజారులో ఒక వ్యాపారస్తుడికి వెండి గొడ్డలి, బంగారం గొడ్డలి అమ్మాడు. వచ్చిన సొమ్ముతో కుటుంబ పరిస్థితులు మార్చోవాలనుకున్నాడు.
అవి కొనుక్కున్న షావుకారు, “ఇవి నీకు ఎక్కడివి?” అని ఆశ్చర్యంగా అడిగాడు.
కట్టెలు కొట్టేవాడు జరిగిందంతా చెప్పాడు.
ఆ షావుకారుకి అత్యాశ కలిగింది. వెంటనే అతను కూడా ఒక గొడ్డలి తీసుకుని వెళ్లి, కాలవలోకి విసిరేసి, వన దేవతని ప్రార్థించాడు.
వన దేవత ప్రత్యక్షం అయ్యింది.
షావుకారు, “నా గొడ్డలి ఏట్లో పడిపోయింది, కొంచం సహాయం చేయి తల్లీ” అని ప్రాధేయ పడ్డాడు.
వన దేవత నీళ్ళల్లో దిగి, ముందర లాగానే ఒక బంగారం గొడ్డలి తీసింది. “ఇది నీదా?” అని అడిగింది.
ఆ షావుకారు కళ్ళు తిరిగాయి. అంత బహుమూల్యమైన గొడ్డలి కళ్ళెదురుగా కనిపిస్తుంటే, ఉండ పట్టలేక, “అవునమ్మ! ఇది నాదే!” అని అబద్ధం చెప్పాడు.
వన దేవతకి కోపం వచ్చింది. “అబద్ధం!” అని మాయం అయిపొయింది.
షావుకారుకి కొత్త బంగారం గొడ్డలి దొరకలేదు సరికదా, తెచ్చుకున్న పాతది కూడా కాలవలో ఎక్కడా కనిపించ లేదు.
ఇందుకే పెద్దలు ఎప్పుడు నిజం చెప్పమంటారు. నిజం చెప్పే వాళ్ళకీ ఎప్పటికో అప్పటికి మంచి జరుగుతుంది. కానీ అబద్ధం ఆడే వాళ్లకి మట్టుకు ఏదో ఒక రోజు మొదటికే మోసం వస్తుంది.
గుడ్డి నమ్మకం
ఒక పెద్ద చెరువు దెగ్గిర ఒక కొంగ వుండేది. ఆ కొంగ చెరువులోని చేపలు పట్టి, తింటూ వుండేది. కాని ఆ కొంగ కాల క్రమేణ ముసలిది అయిపోయి, ముందరిలా చేపలు పట్టలేక పోయేది. కొన్ని కొన్ని రోజులు ఆకలితోనే వుండిపోయే పరిస్థితి వచ్చేసింది.
“ఇలా అయితే కష్టం, నేను ఏదైనా ఉపాయం వేయకపోతే ఎక్కువ రోజులు బతకను,” అనుకుంది కొంగ. అలాగే ఒక ఉపాయం తట్టింది.
చెరువు గట్టున దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు, చింతిస్తున్నట్టు నాటకం ఆడుతూ కూర్చుంది.
అదే చెరువులో ఆ కొంగతో స్నేహంగా వుండే ఒక పీత ఉండేవాడు. ఆ పీత కొంగ విచారంగా ఉండడం గమనించి, “ఎందుకు ఇలా వున్నారు?” అని అడిగింది.
“ఏమి చెప్పమంటావు?” అంది కొంగ. “నాకు ఒక బాధాకరమైన విషయం తెలిసింది.”
“అదేమిటి” అని పీత ఆరాటంగా అడిగాడు.
“ఈ రోజు చెరువు దెగ్గిర ఒక జ్యోతిష్యుని చూసాను. అయిన ఈ ప్రాంతంలో పన్నిండు సంవత్సరాలు వర్షం పడదని చెప్పారు. ఈ చెరువు ఎండి పోతుంది. మనం అందరం పోతాము. నాకు నా గురించి బెంగ లేదు, నేను ఎలాగా ముసలి దాన్ని అయిపోయాను. కానీ మీరందరూ ఇంకా చినా వాళ్ళు. మిమ్మల్ని తలుచుకుంటే దుఃఖం గా వుంది.” అంది కొంగ.
పీత వెళ్లి విషయం చాపలుకు చెప్పాడు. చేపలన్నీ ఏడవడం మొదలెట్టాయి, “అయ్యో! ఎలాగా! మనం అందరం చచ్చి పోతామా?”
“పక్క ప్రాంతంలో ఒక పెద్ద చెరువు వుంది, కావాలంటే నేను మిమ్మల్ని అందరిని ఒక్కొక్కటి గా తీసుకుని వెళ్తాను” అని కొంగ ప్రస్తావించింది. వెంటనే అన్ని చేపలూ ఏడుపు ఆపి సంతోషంగా కొంగ సహాయాన్ని ఒప్పుకున్నాయి.
అలా రోజు కొంగ ఒక చాపను పక్షి ముక్కులో పెట్టుకుని యెగిరి పోయేది. కానీ వేరే చెరువు దేగ్గిరకి కాదు. కొంత దూరంలో కొన్ని బండల దెగ్గిర ఆగి, చాపను చంపి తినేసేది. సాయంత్రానికి అలిసి పోయినట్టు నాటకం ఆడుతూ మళ్ళీ ఇంటికి చేరేది.
ఇలా కొన్ని రొజూ గడిచాయి. ఒక రోజు పీత, “నన్నూ తీసుకుని వెళ్ళవా, నాకు ప్రాణం కాపాడ్కునే అవకాశం వస్తుంది” అని కొంగను ప్రాధేయ పడ్డాడు.
కొంగ, “రోజు చాపలు తిని బోర్ కొడుతోంది, ఈ రోజు పీతని తినచ్చు” అనుకుని, “దానిదేముంది, ఇవాళ నిన్నే తీసుకుని వెళ్తాను” అంది.
కానీ పీత చాలా పెద్దగా వున్నాడు. కొంగ పక్షిముక్కులో పట్టడు. అందుకే పీత కొంగ వేపుమీద ఎక్కి కూర్చున్నాడు. ఇద్దరూ ప్రయాణం మొదలెట్టారు. కొంత సేపటికి పీతకి అసహనం పట్టలేక, “ఇంకా యెంత దూరం?” అని అడిగాడు.
“మూర్ఖుడా! నిన్ను ఏ చెరువు దేగ్గిరకీ తీసుకుని వెళ్ళటం లేదు! నిన్నూ ఆ చేపల లాగా బండల దేగ్గిరకు తీసుకుని వెళ్లి తినేస్తాను” అని నవ్వుతూ కొంగ బదులు చెప్పింది.
పీతకి పిచ్చ కోపం వచ్చింది. గట్టిగా కొంగ మెడను పంజాలలో పట్టుకుని పీక నొక్కి చంపేసాడు. అలా ప్రాణాలతో సహా మళ్ళీ చెరువుకి వెళ్లి జరిగినది మిగిలిన చేపలకు చెప్పాడు.
ఇకపై మనం ఎవ్వరిని గుడ్డిగా నమ్మకూడదు. వారు చెప్పే మాటలలో స్వార్తముందా, అని ఆలోచించాలి, అని చేపలు, పీత నిశ్చయించుకున్నాయి.
ఎలుక ఆకలి
అనగనగా ఒక ఎలుకకి బాగా ఆకలి వేసింది. తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని దగ్గరలోని పొలంలో వెతికింది.
వెతకగా, వెతకగా, ఒక బుట్ట నిండా మొక్కజొన్న పొత్తులు దొరికాయి. కాని బుట్టలో ఉన్న పొత్తులను తినడం ఎలా? చుట్టూరా ప్రదక్షిణ చేస్తే ఒక చోట బుట్ట చిరిగి, చిన్న కన్నం ఏర్పడి వుంది – అది కనిపించింది.
“అమ్మయ్య!” అనుకుని, ఎలుక అందులోంచి దూరి బుట్టలోకి వెళ్లి, బోకా బోకా పొత్తులు తినడం మొదలెట్టింది.
అంత ఆకలి మీద ఇంత భోజనం దొరికేసరికి ఎలుకకి ఆకలి నిండినా మనసుకు సరిపోలేదు. పొత్తులు తింటూనే వుంది. కొంచం సేపటికి కడుపు ఉబ్బి, బద్దలయ్యే స్థితికి వచ్చింది. అప్పుడు తినడం ఆపింది. ఇంక చాలు, బయట పడదాము అని ఎలుక మళ్ళీ కన్నం లోంచి బయటికి రావడానికి ప్రయత్నం చేసింది.
లోపలికి వెళ్లినప్పుడు బానే వెళ్ళిన ఎలుక బయటికి మట్టుకు రాలేక పోయింది. ఎందుకంటే వెళ్ళే డప్పుడు సన్నంగా వుంది. ఇప్పుడు తిని, తిని, కడుపు ఉబ్బి లావయి పోయింది. ఆ కన్నంలో ఇంక పట్టటం లేదు.
“ఇప్పుడెల?” అని ఖంగారు పడుతూ చాలా ఆలోచించింది.
అప్పుడే పక్క నుంచి ఒక కుందేలు వెళ్తోంది. కుందేలుని సహాయం అడిగింది.
కుందేలు, “ఇంకేం చేస్తావు, తిన్నదంతా అరిగి, మళ్ళీ ఆకలితో పొట్ట తగ్గేదాకా ఆగు. అప్పుడు అదే విధంగా సునాయాసంగా బయటి వస్తావు” అని సలహా ఇచ్చింది.
ఎలుక అలాగే చుట్టూరా తినడానికి మంచి రుచికరమైన పొత్తులు వున్నా, తిన కుండా, బాగా ఆకలి వేసి, పొట్ట మళ్ళీ లోపలి వెళ్ళే దాకా ఆగి, ఆ రంద్రంలోంచి బయట పడి గట్టిగా ఊపిరి పీల్చుకుంది.
ఏదైనా అతిగా దొరికితే మనకి మంచిది కాదు. అవసారినికి తగ్గట్టుగా ఉంటేనే మంచిది.
ఎలుగుబంటి చెప్పిన రహస్యం
ఇద్దరు మిత్రులు జీవనోపాధి కోసం పొరుగూరికి ప్రయాణం చేయాలని నిశ్చయించుకున్నారు. కాని దారిలో ఒక అడవి వస్తుంది. అది దాటితేకాని పొరుగూరికి చేర లేరు. అడవిలో రక రకాల జంతువులు ఉంటాయని వారికి తెలుసు. అందుకే ఏ జంతువు ఎదురైనా దాన్ని ఇద్దరూ కలిసి ఎదిరించాలని ఒప్పందం చేసుకున్నారు.
అనుకున్న ప్రకారం మొన్నాడు పొరుగూరికి బయలుద్యారారు. అలాగే అడవిలోకి ప్రవేశించారు. గట్టిగా ఒకళ్ళ చేతులు మరొకరు పట్టుకుని భయం భయంగా నడుచుకుంటూ అడవి దాటుతుంటే, హటాత్తుగా ఒక ఎలుగుబంటి కనిపించింది.
వెంటనే ఇద్దరూ భయ పడిపోయారు.
“ఏం చేద్దాం?” అనుకున్నారు.
మొదటివాడు “చెట్టు ఎక్కేద్దాము,” అని సలహా ఇచ్చాడు.
“కాని నాకు ఎక్కడం రాదే!” అని రెండో వాడు అన్నాడు.
“నాకు వచ్చు కదా” అని మొదటి వాడు చేయి వదిలించుకుని గబ గబా పక్కనున్న చెట్టు ఎక్కేసాడు.
రెండో వాడికి చెట్టు ఎక్కడం రాదు కదా! ఏం చేస్తాడు? మొదటి వాడేమో ఇలాంటి పరిస్థితిలో వంటరిగా వదిలేసాడు!
వెంటనే రెండోవాడు నేల మీద శవంలా పడుక్కున్నాడు. చడి చప్పుడు చేయకుండా అలాగే పడున్నాడు.
ఎలుగుబంటి దగ్గిరకి వచ్చింది. పాపం ఊపిరి కూడా బిగించుకుని అలాగే స్థిరంగా వున్నాడు. ఎలుగుబంటి చని పోయిన జీవులని తినదు. అలా కదలకుండా పడివున్న రెండో వాడు చనిపోయాడనుకుంది. ఎలుగుబంటి రెండోవాడిని వాసన చూసి కొంత సేపటికి వదిలి వెళ్ళిపోయింది.
ఎలుగుబంటి వెళ్ళిపోయాక రెండో వాడికి ఉపశమనం కలిగింది. హమ్మయ్య! అని మళ్ళీ ఊపిరి పీల్చుకున్నాడు.
మొదటి వాడు చెట్టు మీంచి దిగాడు. ఎలుగుబంటి రెండోవాడిని వాసన చూసినప్పుడు ఏదో చెవిలో రహస్యం చెప్పిందనుకుని మొదటి వాడు అపోహ పడ్డాడు.
“ఎలుగుబంటి నీకు అంత సేపు చెవిలో ఏమి చెప్పింది” అని అడిగాడు.
“అవసరానికి ఆదుకొని వాళ్ళు స్నేహితులు కారు, అని నాతొ ఎలుగుబంటి చెప్పింది” అని రెండో వాడు జవాబు చెప్పాడు.
గుమ్మడికాయ దొంగ
ఒక ఊరిలో రైతులు కష్టపడి పండిస్తున్న గుమ్మడికాయలను ఎవేరో దొంగ రోజు దొంగలించేసేవాడు. ఆ రోజులలో గుమ్మడికాయలు ఇప్పుడు దొరికినంత సులువుగా దొరికేవి కాదు. అవి పండించడానికి రైతులు చాలా కష్ట పడే వారు.
గుమ్మడికాయ దొంగ ఊళ్లోనే ఎవరో అయ్యి ఉంటారని రైతుల నమ్మకం. దొంగ ఎవరో కనిపెట్టడం ఎలా? అందుకే రైతులంతా కలిసి ఊరి పెద్ద దెగ్గరకు వెళ్ళారు.
పెద్దాయన చాలా తెలివైన అతను. రైతుల మోర విని, “ఓస్! ఇంతేనా! గుమ్మడికాయ దొంగని పట్టుకోవడం చాలా సులువు. ఆ దొంగకి ఏ భుజం మీదైతే గుమ్మడికాయ మోసుకుని వెళ్ళడం అలవాటో, ఆ భుజం మీద గుమ్మడికాయ అంత సొట్ట వుంటుంది” అన్నాడు.
ఈ మాట విన్న వెంటనే రైతులలో ఒకడు తన కుడి భుజం తడుముకుని సొట్ట వుందో లేదో అని పరిశీలించుకున్నాడు.
పెద్దాయన వెంటనే ఇది గమనించి, “దొంగ ఇతనే!” అని అందరికి చెప్పారు. “మనం ఏదైనా నేరం చేసినప్పుడు మనకి తప్పు చేసామన్న భావం మనసులో వుంటుంది. అందుకనే ఎవరేమన్నా మనల్నే అంటున్నారేమో అని అపోహ పడతాము” అని వివరించారు.
కర్రల కట్ట
ఒక తండ్రికి ఏడుగురు కొడుకులు ఉండేవారు. ఆ ఏడుగురూ ఎప్పుడూ దెబ్బలాడు కుంటూనే ఉండేవారు.
తండ్రి అన్ని విధాలా ప్రయత్నం చేసి చూసాడు. కొడుకులకు సద్ది చెప్పి, బుద్ధి చెప్పి, తిట్టి, కొట్టి, మందలించి, బుజ్జగించి, శిక్షలు విధించి – అన్నీ చేసాడు – కానీ పిల్లలు మట్టుకు కొట్లాడుకోవడం ఆప లేదు.
ఒక రోజు మామూలు కన్నా ఎక్కువ తీవ్రంగా దెబ్బలాడుకుంటున్న కొడుకులను చూసి తండ్రి చాలా బాధ పడ్డాడు.
కొడుకులని పిలిచి తలో కర్ర ముక్కని తీసుకుని రమ్మన్నాడు. ఏడుగురూ కర్రలను వెతికి తెచ్చారు. ఆ కర్రలను ఒక తాడుతో కట్టి ఒక కట్టలా చేయమన్నాడు. కొడుకులు కర్రల కట్ట తయ్యారు చేసారు.
తండ్రి ఒకొక్క కొడుకునీ ముందుకి పిలిచి ఆ కట్టని విరక్కోట్టమని ఆదేశించాడు. వంతులు వంతులు గా ఏడుగురూ ఆ కట్టను విరక్కోట్టడానికి ప్రయత్నం చేసారు, కానీ విరక్కొట్ట లేక పోయారు.
ఇప్పుడు తండ్రి కట్టలోని కర్రలను విడతీసి ఏడుగురిని తలో కర్ర తీసుకోమన్నాడు. అలా చేసాక, ఎవరి కర్రను వాళ్ళు విరక్కొట్ట మన్నాడు. కొడుకులు సునాయాసంగా విరక్కోట్టేసారు.
అప్పుడు తండ్రి వాళ్లకు జీవితాంతం గుర్తుండే ఈ మాట చెప్పాడు: “మీరందరూ ఈ కట్టలా కలిసి వుంటే మీరు బలంగా వుంటారు – మిమ్మల్ని ఎవ్వరూ ఏమి చేయలేరు. కానీ విడి విడిగా ఈ కర్రలలా వుంటే మట్టుకు మీకు యే బలము వుండదు.”
కొంగలు, తాబేలు
ఒక చెరువులో రెండు కొంగలు, ఒక తాబేలు ఉండేవి. ఆ సంవత్సరం వర్షాలు పడక పోవడం వల్ల చెరువులోని నీళ్ళు ఎండి పోయాయి.
కొంగలు రెండూ ఒక రోజు ఎగురుతుంటే ఒక కొత్త చెరువుని చూసాయి. అందులో నీళ్ళు చాలా ఉన్నాయి. అక్కడ చుట్టూరా పచ్చగా వుంది. చెరువులో బోలెడన్ని కప్పలు, పీతలు, చేపలు, అలా నీళ్ళల్లో వుండే వేరే జీవులు వున్నాయి.
కొంగలు వుండే పాత చెరువు నుంచి పెట్టీ, బేడా సద్దుకుని, కొత్త చెరువుకి వెళ్ళిపోవాలని అనుకున్నాయి. ఈ విషయం చర్చించుకుంటుంటే పక్కనే కూర్చున్న తాబేలు వింది.
“మీ తో పాటు నన్నూ తీసుకుని వెళ్ళండి, నేను ఒక్కర్తిని ఇక్కడ ఉండలేను.” అని బ్రతిమాలింది.
కొంగలు జాలి పడి తాబేలుని తీసుకుని వెళ్ళడానికి ఒప్పుకున్నాయి. కాని ఎలా? తాబేలు ఎగర లేదు. అలాగని నడుచుకుంటూ కూడా వెళ్ళ లేదు. తాబేలు చాలా నిదానంగా నడుస్తుంది కదా. పోనీ మోసుకుని తీసుకెళ్ళి పోదామంటే తాబేలు కొంగ వీపు మీదకి ఎక్కలేదు.
చివరికి ఒక ఐడియా వచ్చింది. తాబేలు ఒక కర్రను నోట్లో గట్టిగా పట్టుకుంటే, ఆ కర్రను తలోవైపు కొంగలో పట్టుకుని అలా ఎగురుకుంటూ కొత్త చెరువుకు చేరుకోవచ్చు అని అనుకున్నారు. తాబేలుకి చాలా ఉత్తేజం కలిగింది.
“ఎట్టి పరిస్థితిలోను నువ్వు నోరు తెరవకూడదు, గట్టిగా నోటితో కర్రని పట్టుకునే వుండాలి!” అని కొంగలు తాబేలును హెచ్చరించాయి. తాబేలు దీర్ఘంగా తల ఊపింది.
మొన్నాడు తెల్లారగానే అనుకున్న ప్రకారం కొంగలు రెండూ మధ్యలో తాబేలును మోస్తూ ఎగరడం మొదలెట్టాయి. తాబేలు మొదట్లో బానే కర్రని గట్టిగా పట్టుకుంది. కాని కొంచం సేపు ఎగిరాకా కింద భూమి మీద కొంత మంది పిల్లలు కనిపించారు.
పిల్లలు ఈ దృశ్యాన్ని చూసి, ఒకరికి ఒకరు చూపించుకుంటూ ఆశ్చర్యంగా మాట్లాడుకుంటున్నారు. ఇది గమనించిన తాబేలు కొంగలకి చెప్పాలని నోరు తెరిచింది.
ఇంకేముంది. ధమ్మన కింద పడిపోయింది. దాని గుల్ల పగిలిపోయి పాపం ప్రాణాలు కోలిపోయింది.
మనకన్నా ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళు, శ్రేయోభిలాషులు, మిత్రులు, ఇటువంటి వారు, మన మంచికి ఏదైనా చెప్తే, అది మనం పరిగణలోకి తీసుకుని, సమయానుకూలంగా అనుసరించాలి.
కుందేలు, తాబేలు మధ్య పరుగు పందెం
ఒక రోజు కుందేలు తాబేలుని ఎక్కిరించింది.
“నువ్వు ఇంత నిదానంగా నడుస్తావు, అసలు ఎప్పుడైనా ఎక్కడి కైనా వెళ్ళ గలవా?” అని వెటకారం చేసింది. “నాతో పరుగు పందెం వేసుకుంటే నేను నిన్ను సులువుగా ఓడించేస్తాను!” అని గొప్పలు చెప్పుకుంది.
తాబేలు పరుగు పందెం ఆడ డానికి ఒప్పుకుంది.
నిర్ణయించిన రోజు కుందేలు, తాబేలు పోటి చూడడానికి అడవిలో జంతువులన్నీ చేరాయి. కుందేలు మహా ధైర్యంగా, గర్వంగా పందెం జరుగుతున్న చోటుకు వచ్చింది. మన తాబేలు అనుకువగా, వినయంతో పందెం గీతమీద తన స్థానం గ్రహించింది.
కోతి ని పథక కర్త గా ఎంచుకున్నారు. కోతి “వన్, టూ, థ్రీ…” అనంగానే కుందేలు తుర్రు మని పరిగెట్టడం మొదలు పెట్టింది. కుందేలు నిదానంగా తన స్టైల్ లో రేగుకుంటూ సాగింది.
కొంచం దూరం పరిగేట్టాక కుందేలు వెనక్కి తిరిగి చూస్తే తాబేలు ఎక్కడా కనిపించ లేదు. అసలు తాబేలు నెగ్గే ప్రశక్తే లేదు – ఎందుకు కష్ట పడడం? నిద్రపోయి, లేచి, సులువుగా ముగింపు గీత దాటేయవచ్చు, అనుకుంది. ఒక చెట్టుకింద నీడలో హాయిగా కళ్ళు మూసుకుని నిద్రపోయింది.
కొంత సేపటికి తాబేలు తన పద్ధతిలో అదే చెట్టుని దాటింది. నిద్రపోతున్న కుందేలుని చూసింది. కాని తన దారిని తను కొనసాగుతూ, నిదానంగా, చిన్నగా రేగుకుంటూనే ముగింపు గీత దేగ్గిరకి చేరుకుంది.
తాబేలు ముగింపు గీత దెగ్గిర ఉండగా కుందేలుకి మెలుకువు వచ్చింది. తాబేలు గీత దాకా జేరిపోయిందని చూసి వేగంగా పరిగెత్తింది. కాని, కుందేలు చేరే లోపల తాబేలు గీత దాటేసి, పోటి నేగ్గేసింది.
చుట్టూ జేరుకున్న జంతువులంతా తాబేలుని చప్పట్లు, పొగడ్తలతో అభినందించారు.
మన బలాన్ని ఎక్కువ, ఇతర్ల సామర్థ్యాన్ని తక్కువగా ఎప్పుడు అనుకోకూడదు. జీవితంలో కూడా గెలవడానికి వేగం కన్నా నిదానమే ప్రధానము అని పెద్దలు అందుకే చెప్తారు.
చీమ సహాయం
ఒక పక్షి చెరువులో నీళ్ళు తాగుతుంటే అక్కడ అకస్మాతుగా ఒక చీమ నీళ్ళల్లో పాడడం చూసింది. పాపం చిన్న చీమ నీళ్ళల్లో ఈద లేక కాళ్ళూ, చేతులు కొట్టుకుంటోంది.
జాలి పడి ఆ పక్షి చీమని ఎలాగైనా కాపాడాలి అనుకుంది. చుట్టూ పక్కల వెతికి ఒక ఆకునే తీసుకుని వచ్చి చీమ దెగ్గిరగా పడేసింది.
చీమ నీళ్ళల్లో కొట్టుకుంటూ ఎలాగో ఆకు అంచును పట్టుకుంది. చిన్నగా ఆకు మీదకి ఎక్కి ఆకు తేలుకుంటూ చెరువు వొడ్డు మీదకు చేరే దాకా ఆ ఆకుని గట్టిగా పట్టుకుంది. వొడ్డుకి చేరి పక్షికి కృతజ్ఞత తెలియ చేసింది.
రోజులు గడిచేయి. కాలా క్రమేణ పక్షి చీమకు చేసిన సహాయం మర్చిపోయింది. కానీ చీమ మట్టుకు గుర్తు పెట్టుకుంది.
ఒక రోజు అదే పక్షి చీమకి మళ్ళీ కనిపించింది. పలకరిద్దామని దేగ్గిరకి వెళ్తే చెట్టు వెనుక ఒక మనిషి పక్షిని రాయితో కొట్టి చంపాలన్నే ఉద్దేశం తో లక్ష్యం తీసుకుంటూ కనిపించాడు. గబా గబా చీమ మనిషి పాదం ఎక్కి కూర్చుంది. సరిగ్గా రాయి విసరపోతున్న సమయం చూసుకుని గట్టిగా చీమ మనిషిని కుట్టింది.
నొప్పితో మనిషి ఒకటే సారి అరిచాడు. దానితో పాటు గురి తప్పి రాయి కూడా అవతలేక్కడో పది పోయింది.
మనిషి అరుపు విని పక్షి కూడా ఎగిరిపోయింది.
అలా చీమ పక్షి ప్రాణాలు కాపాడింది.
మంచి వాళ్ళు ఎప్పుడు పొందిన సహాయం మర్చిపోరు.
విన్నవన్నీ నిజం కాదు
ఒక రోజు తోడేలు ఆహారం వెతుక్కుంటూ ఒక గ్రామం వేపు వెళ్ళింది. అక్కడ ఒక ఇంటి దెగ్గిర తినడానికి ఏదైనా దొరుకుతుందేమో అని వెతకడం తోడేలుకి అలవాటు.
ఇంట్లో ఖిడికి లోంచి ఒక పాప ఏడుపులు వినిపించాయి. కుతూహలం కొద్దీ ఏం జరుగుతోందో చూద్దామని ఖిడికి లోపలకి తొంగి చూసింది.
అక్కడ పాపని తల్లి ఎత్తుకుని, భుజం తడుతూ లాలిస్తోంది. ఏమి చేసిన పాప ఊరుకోవటం లేదు. చివరికి కొంచం విసుక్కుంటూ, “ఊరుకో పాపా, ఊరుకో – లేకపోతే మన ఇంటి చుట్టూ తిరుగుతూ వుంటుందే, ఆ తోడేలుకి నిన్ను ఇచ్చేస్తాను! అది నిన్ను తినేస్తుంది!” అని తల్లి పాపని మందలించింది.
ఇది విన్న తోడేలుకి ఆశ కలిగింది. ఎప్పటికో అప్పటికి తల్లి పిలిచి పాపని తన చేతిలో పెడుతుందని ఊహించుకుంటూ పాప ఎడుస్తున్నంత సేపు ఖిడికి బైట కూర్చుని ఎదురు చూస్తూనే వుంది.
కొంత సేపటికి పాప ఇంకా ఏడుపు ఆపక పొతే తల్లికి అన్న మాటలకు బాధగా అనిపించి, “ఊరుకో పాప, ఊరుకో. తోడేలుకి నిన్ను ఇవ్వనులే, మీ నాన్నగారికి చెప్పి తోడేలుని బాగా కొట్టమని చెప్తాను” అని బుజ్జగించడం మొదలెట్టింది.
ఈ మాట విన్న తోడేలు హడిలి పోయింది. అప్పుడే ఇంటికి పాప తండ్రి తిరిగి వస్తున్న అడుగుల చప్పుడు వినిపించింది. పరుగో పరుగుమని తోడేలు అడివిలోకి పారిపోయింది.
మనం విన్న మాటలన్నీ నిజమనుకోకూడదు. సమయానుకూలంగా వాటిని పరిశీలించాలి.
పిల్లికి గంట ఎవరు కడతారు?
ఒక అడివిలో ఎలుకల్లన్నీ విసుకెత్తిపోయి వున్నాయి. పిల్లి వచ్చి రోజు వాటిని తరిమి తరిమి ఇబ్బంది పెడుతోంది. రోజుకొక ఎలకని తినేస్తోంది. అందుకనే ఒక రోజు ఎలుకలన్నీ ఒక సమావేశం పెట్టుకున్నాయి. ముఖ్య విషయం: పిల్లి నుంచి తప్పించుకోవడం ఎలా?
ఒక ఎలుక సభ వేదిక మీదకి ఎక్కింది. ఎలుకలకు వేదిక అంటే ఏముంటుంది – పక్కన ఉన్న ఒక బండ ఎక్కి, మిగితా ఎలుకలకి ఒక సలహా ఇచ్చింది.
“పిల్లి మెడలో ఒక గంట కడితే ఎలా వుంటుంది? పిల్లి ఎటువైపు నుంచి వచ్చినా గంట చప్పుడుతో ఇట్టే పిల్లి వస్తున్నట్టు తెలిసిపోతుంది! అప్పుడు ఎలుకలన్నీ వెంటనే దాక్కోవచ్చు. కొన్ని రోజులకి ఆహారం లేక పిల్లి ఎటైన వెళ్ళిపోతుంది” అని వేదిక మీంచి ఎలుక సలహా ఇచ్చింది.
ఈ ఐడియా అందరికి చాలా నచ్చింది. వెంటనే ఎలుకలన్నీ చర్చించుకున్నాయి. గంట ఎలా వుండాలి, ఎక్కడ దొరుకుతుంది, యెంత పెద్ద దైతే బాగుంటుంది, యెంత దూరం నుంచి వినిపిస్తుంది, ఈ విషయాలన్నీ డిస్కస్ చేసుకున్నాయి.
ఇంతట్లో ఒక ముసలి ఎలుకకి ఒక సందేహం వచ్చింది. “పిల్లికి గంట ఎవరు కడతారు?” అని అడిగింది.
పిన్ డ్రాప్ సైలెన్స్. ఎలుకలన్నీ చడీ చప్పుడు చేయకుండా నిశబ్దంగా ఒకరి ఒంక ఒకరు చూసుకున్నారు. పిల్లికి గంట ఎవరు కదతారన్న ప్రశ్న కు సమాధానం ఎవ్వరికి తట్టలేదు.
సమావేశం ముగించుకుని ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్లి పోయారు.
ఉచిత సలహాలు ఇవ్వడం సులువే, కానీ అన్ని సలహాలు పాఠింప దగ్గవి కాదు.
జింక కొమ్ములు
ఒక రోజు ఒక మగ జింక చెరువులో నీళ్ళు తాగుతూ తన ప్రతిబింబం చూసుకున్నాడు. చూస్తూ ముగ్ధుడై పోయాడు.
నా కొమ్ములు యెంత అందంగా వున్నాయి, నా తలపై కిరీటంలా వున్నాయి, అనుకుంటూ చాలా సేపు చూసుకున్నాడు.
చివరికి కాళ్ళు కూడా ప్రతిబింబం లో కనిపించాయి.
“ఛీ! ఇంత అందంగా వున్న నాకు దేవుడు ఇలాంటి కాళ్ళు ఎందుకు ఇచ్చాడు!” అని తన కాళ్ళను తనే అసహ్యించుకున్నాడు.
కొంత సేపు అయ్యాక చెరువు దేగ్గిరకి నీళ్ళు తాగడానికి వస్తున్న పులి వాసన మగ జింకకు తగిలింది.
భయంతో పరిగెత్తుకుంటూ అక్కడ నుంచి అడవిలోకి పారిపోయాడు.
అప్పుడు ఆ మగ జింకకి అర్ధం అయ్యింది. అందంగా వున్న కొమ్ముల కన్నా అవలక్షణం అనుకున్న కాళ్ళే ఎక్కువ పనికొచ్చాయి, అందుకే దేవుడు కాళ్ళు ఇచ్చాడు అని.
మనం కూడా అందం కన్నా గుణం మెచ్చుకోవడం నేర్చుకోవాలి.
కొంగ కోరికలు
ఒక రోజు కొంగకి ఆకలి వేసింది. చెరువులో నుంచుని ఏ చాపను తినాలా అని చూసింది.
ఆ రోజు చెరువులో చాలా చేపలు వున్నాయి. కాని ఆ రోజు కొంగ చాలా అసంతృప్తిగా వుంది.
చూసిన ప్రతి చేపకి కొంగ ఏదో వంక పెట్టుకుంది. పక్క నుంచి ఒక చేప వెళ్తుంటే, “ఈ చేప మరీ చిన్నగా వుంది”, అనుకుని వదిలేసింది. “ఏదైనా మంచి, పెద్ద చేప పడదాము” అనుకుంది.
అలాగే, ఈ చేప మరి సన్నం గా వుంది, ఈ చేపకి చారలున్నాయి, ఈ చేపకు అస్సలు చారలు లేవు, ఇది చిన్న గా వుంది, ఇది లావుగా వుంది … ఇలా అనుకుంటూ వంకలు పెట్టుకుంటూ ఏ చాపని పట్టలేదు. అన్నిటిని వదిలేసింది. ఏదైనా “మంచి” చేప కోసం ఎదురు చూస్తూ కొంగ జపం చేస్తూ కూర్చుంది.
మధ్యాన్నం అయ్యే కొద్ది ఎండ ఎక్కువైంది. వడ్డు దెగ్గిర తక్కువ లోతు నీళ్ళల్లో ఈదుతున్న చేపలన్నీ చెరువు మధ్యలో ఉన్న లోతు నీళ్ళల్లోకి వెళ్ళిపోయాయి.
క్రమేపి కొంగకి ఏ చేపా కనిపించలేదు.
ఆ రోజు కొంగ ఆకలి గానే ఉంది. చివరికి ఒక నత్త కూడా దొరకక, ఏమి తినకుండానే పడుక్కుంది.
ఒక్కొక్క సారి మనకు దక్కిన దానితో సంతృప్తి పడడం మంచిది. మరీ కచ్చితంగా వుంటే మనకు నచ్చినది దొరక్క పోవచ్చు.
అహంభావి మేకలు
రెండు మేకలు, ఎవరి దారిన వారు వెళ్తూ ఒక కాలవకు ఇరువైపూ చేరాయి.
కాలవలో నీళ్ళు చాలా వేగంగా ప్రవహిస్తున్నాయి. అందులో చాలా రాళ్ళూ, రప్పలు వున్నాయి. అందులోంచి ఈదుకుంటూ అవతల వడ్డుకి చేరడం కష్టం.
కాలవపై ఎవరో మనుషులు ఒక చక్క ముక్క అడ్డంగా వేసారు. అదే ఆ కాలవపై వంతెన అన్న మాట. వంతెన సన్నంగా, ఇరుకుగా వుంది. ఒక సమయంలో ఒక మేక దాట డానికే స్థానం వుంది. రెండు ఉడతలు కూడా ఒకటిని ఒకటి దాటలేక జారిపోతాయేమో అని భయం వేసే అంత సన్నంగా వుంది.
రెండు మేకలూ ఒకటే సారి వంతెన మీదకి అడుగు పెట్టాయి. ఒకరిని ఒకరు చూసుకున్నాయి కాని, అహంభావంతో దేనికి వెనుకడుగు వేయడం ఇష్టం లేదు. గుర్రున ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుంటూ ముందుకి సాగుతూ కాస్సేపటికి వంతెన మధ్యలో కలుసుకున్నాయి.
ముందు నేను ఎక్కాను, నువ్వు వెనక్కి వెళ్ళూ, అంటే ముందు నేను ఎక్కాను నువ్వే వెనక్కి వెళ్ళూ అంటూ రెండూ ఘర్షణ పడ్డాయి.
కొట్టుకోవడం మొదలెట్టాయి.
ఇంకేముంది. రెండూ కాలవలో పడి కొట్టుకు పోయాయి.
ఒక్కొక్క సారి మొండిగా ముందుకు వెళ్ళడం కన్నా తెలివిగా వెనుకడుగు వేయడమే మనకు మంచిది.
గుంటనక్కకు గుణపాఠం
ఒక రోజు ఒక అడవిలో రెండు గొర్రెపోతులు ఏదో కారణంగా కొట్టుకుంటున్నాయి. ఆ కారణం ఏమిటో ఎవ్వరికీ తెలీదు.
ఒకరిని ఒకరు కొమ్ములతో కుమ్ముతున్నాయి. చాలా తీవ్రంగా పోట్లాడుకుంటున్న గొర్రెపోతులకు బాగా దెబ్బలు తగిలాయి. గాయాలలోంచి రక్తం కారడం మొదలైంది. రక్తపు చుక్కలు నేలమీదకి కారుతున్నా పట్టించుకోకుండా గొర్రెపోతులు దెబ్బలాడుతూనే వున్నాయి.
ఇంతలో అటువైపు ఒక గుంటనక్క వచ్చింది. రక్తం వాసన తగిలి విషయం చూద్దామని ఆగింది. దెబ్బలాడుతున్న గొర్రెపోతులు, కారుతున్న రక్తం చూసింది. నేల మీద పడ్డ రక్తం నాకడం మొదలెట్టింది.
నాకుతూ, నాకుతూ, చూసుకో కుండా గొర్రెపోతుల మధ్యలో తల పెట్టింది.
గొర్రెపోతులూ చూసుకోలేదు. వాటి గొడవలో అవి నిమగ్నమై కొమ్ములతో గుంట నక్కని కుమ్మేసాయి. ఇంకేముంది? గుంట నక్కకి బాగా గాయాలు తగిలాయి. ఎలాగో గొర్రెపోతుల మధ్యలోంచి బైట పడి, ప్రాణాలు కాపాడుకుని అక్కడ నుంచి పారిపోయింది.
ఇద్దరు దెబ్బలాడు కుంటుంటే ఏదో మనకి లాభం ఉంటుందేమో అని మధ్యలో మూడో వాళ్ళు తల దూర్చడం అవివేకమే కదా! అదే గుంటనక్కకి గుణపాఠం!
సికమోర చెట్టు
ఇద్దరు మిత్రుల ప్రయాణం చేస్తున్నారు. ఆ రోజు ఎండ చాలా ఎక్కువగా వుంది. ఉక్క పోస్తోంది. ఇద్దరు మిట మధ్యాన్నం ఎండలో బాగా అలిసిపోయారు.
కొంత సేపు అలసట తీర్చుకుని ప్రయాణం కొనసాగిద్దామని నిశ్చయించుకున్నారు.
దారిలో ఒక సికామోర చెట్టు (అశ్వత్ధ వృక్షము) కనిపించింది. ఆ చెట్టు విశాలంగా వుంది. పెద్ద పెద్ద శాఖలు, వాటికి ఒత్తుగా ఆకులు, ఆ చేట్టుకింద మంచి నీడ. ఎండ లోంచి ఆ చెట్టు నీడలోకి రాగాని హాయిగా, చల్లగా, ప్రశాంతంగా అనిపించింది.
ఇద్దరు మిత్రులు చెట్టుకింద ఒక దుప్పటి వేసుకుని వారితో తెచ్చుకున్న భోజనం తిని, కాస్సేపు హాయిగా కునుకు పాట్లు పట్టారు. సాయంత్రానికి కొంచం ఎండ తగ్గి చల్లారాక, వారి దారిని బయలుద్యారుతూ, “ఈ చెట్టుకి అస్సలు పూలు కాని, పళ్ళు కాని ఏమి లేవు. అసలు ఇలాంటి చెట్టు దేనికి పనికొస్తుంది” అనుకుంటూ వెళ్ళిపోయారు.
ఇది విన్న చెట్టు బాధ పడింది. ఇంత సేపు ఆశ్రయము, నీడని ఇచ్చి, తన ఆకులతో గాలి అందించినా ఆ ఇద్దరికీ కృతజ్ఞత లేదు అనుకుంది చెట్టు.
మనకి మేలు చేసిన వారిని మెచ్చుకో గలగడం కూడా ఒక గుణం. అది అందరిలో వుండదు.
ఎద్దు కొమ్ముపై ఈగ
ఒక ఎద్దు మైదానంలో గడ్డి మేస్తోంది. పచ్చని గడ్డి తింటూ, తన పని తను చేసుకుంటూ, యే ఆలోచన పెట్టుకోకుండా సంతృప్తిగా వుంది.
ఇలా హాయిగా వున్న ఎద్దు చుట్టూ కాస్సేపటికి ఒక ఈగ ముసరడం మొదలెట్టింది. ఎద్దు కొమ్ములపై వాలింది.
కొంతసేపటికి అలసట తీరాక ఈగ తన దారిని తను వెళ్తూ ఎద్దుతో, “ఇప్పుడు నేను బయలుద్యారుతున్నాను, నీ మీద వాలి అలసట తీర్చుకో నిచ్చినందుకు చాలా థాంక్స్. ఇప్పుడు నేను వెళ్తుంటే నీకు హాయిగా ఉందేమో” అంది.
ఎద్దు ఆశ్చర్యంగా ఈగవైపు చూస్తూ “అసలు నువ్వు ఇక్కడ ఉన్నట్టే నాకు తెలీదు” అంది.
కొంతమంది వాళ్ళని వాళ్ళే చాలా గొప్ప అనుకుంటారు. కాని ఇతర్ల దృష్టిలో మట్టుకు వారికి అంత ప్రాముఖ్యత వుండదు.
తుర్రుమన్న తోడేలు
అనగనగా ఒక తోడేలు ఆకలి మీద గబా గబా తింటుంటే ఒక ఎముక గొంతులో గుచ్చుకుంది.
నొప్పి తో విలవిలలాడి పోయింది. గొంతులో ఏదైనా ఇరుక్కుంటే మనం దాని గురించి తప్ప ఇంకేమి ఆలోచించ లేము. అలాగే తోడేలు కూడా ఆ ఎముకను మింగలేక, కక్క లేక, బాగా బాధ పడింది.
కొంగను వెతుక్కుంటూ వెళ్ళింది. “నా గొంతులో ఒక ఎముక గుచ్చుకుంది. అది తీసి పెడితే నేను నీకు ఒక బహుమతి ఇస్తాను” అని ప్రమాణం చేసింది.
కొంగ బహుమానం మాట విని, ఆశ పడి, తన తల తోడేలు నోట్లో పెట్టి, పొడుగు పక్షి ముక్కుతో ఎముకని బైటికి లాగింది.
ఎముక బైట పడగానే తోడేలు వెళ్ళిపోవడం మొదలెట్టింది.
కొంగ తోడేలుని పిలిచి, “మరి నా బహుమానం యేది?” అని అడిగింది.
“నీ తల నా నోట్లో పెట్టి దాన్ని నేను కోరికేయకుండా నిన్ను మళ్ళి బయటికి తీసుకోనిచ్చాను. అదే నీ బహుమానం.” అని తోడేలు తుర్రుమంది.
దుష్టులకి ఎవరైనా ఉపకారం చేసినా కృతజ్ఞత వుండదు.
పుల్లని ద్రాక్షపళ్ళు
అనగనగా ఒక నక్క తన దారిన పోతూ ఒ తీగపై గుత్తులు గుత్తులగా నిగ నిగాలాడుతున్న ద్రాక్షపళ్ళు చూసింది.
వాటిని చూడగానే నక్కకి నోరు ఊరింది. సరదాగా కొన్ని తినదామని అనుకుంది. ద్రాక్షపళ్ళు అందుకుందామని చేతులు జాపింది, కాని గుత్తులున్న తీగ చాలా ఎత్తుగా వుంది. ద్రాక్షపళ్ళు అందలేదు.
ఒక్క సారిగా ఎత్తుగా గెంతి చూసింది. ఐనా అందలేదు. కొంచం దూరం నుంచి పరిగెత్తుకుంటూ దుంకి చూసింది. ఐనా అందలేదు.
ఇలా చాలా సేపు రకరకాలగా ప్రయత్నించింది. ఎన్ని విధాలగా చూసినా ద్రాక్ష పళ్ళు అందలేదు.
అలిసి పోయి నిరాశ తో నక్క, “ఏముంది ద్రాక్షల్లో? ఎలాగా పుల్లగా ఉండుంటాయి. అందుకే చెట్టుకి ఇంకా వేళ్ళాడుతున్నాయి” అనుకుంటూ వెళ్ళిపోయింది.
కొంత మందికి ఏమైనా దొరకకపోతే దాని గురించి అలుసుగా మాట్లాడడం అలవాటు.
తెలివి తక్కువ సింహం
అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది. సింహం చాలా బలమైనది. రోజు రోజూ ఒక జంతువును చంపేసి తినేసేది. ఒకొక్క సారి ఆకలి లేకపోయినా ఆట కోసం వేరే జంతువులను చంపేసేది.
అడవిలో జంతువులన్నీ ప్రాణ భయంతో ఉండేవి. ఈ సమస్యని ఎడురుకోవడం ఎలా అని ఒక రోజు అన్ని జంతువులూ కలిసి అలోచించాయి. అందరూ సింహాన్ని కలిసి సంధి చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి.
అనుకున్న ప్రకారం నక్క చేత సింహానికి కబురు పెట్టాయి. ఒక పెద్ద చెట్టు కింద జంతువులన్నీ సింహాన్ని కలవడానికి వచ్చాయి. సింహం కూడా కొద్ది సేపటికి వచ్చింది.
ఒక ముసలి కోతి సింహంతో ఇలా అంది, “మీరు మమ్మల్ని కలవడానికి వచ్చినందుకు చాలా థాంక్స్.” సింహం దర్జాగా తల ఊపింది.
కోతి అంది, “మీరు భోజనానికి రోజుకొక్క జంతువుని చంపడం సమంజసమే. మీకు ఆహారం కావాలి. కాని అవసరానికి మించి మీరు జంతువులను చంపడం న్యాయం కాదు. మీరు ఒప్పుకుంటే ఈ రోజు నుంచి మేమే మాలో ఒక్కళ్ళని చీటీలు వేసుకుని ఎంచుకుంటాము. ఆ చీటీలో ఏ జంతువు పేరు ఉంటుందో, ఆ జంతువు నేరుగా మీ గుహకు వచ్చి మీకు ఆహరం అవుతుంది. ఈ ఒప్పందం మీరు ఒప్పు కుంటే అడవిలో జంతువులు ప్రశాంతంగా ఉండొచ్చు”
సింహం కి ఐడియా నచ్చింది. అడివిలో జంతువులు వాటంతట అవే బలవుతుంటే రోజూ వేటకి వెళ్ళే పని ఉండదు, హాయిగా ఉండచ్చు అనుకుని సింహం ఒప్పుకుంది.
రోజుకొక జంతువు అనుకున్న దాని ప్రాకారం సింహానికి బాలి అవ్వడం మొదలెట్టాయి.
కొన్ని రోజులకి ఒక కుందేలు వంతు వచ్చింది. పాపం కుందేలు చాలా భయ పడిపోయింది. దానికి బలి అవ్వాలని అస్సలు లేదు. ఎలాగ రా భగవంతుడా అని చాలా ఆలోచించింది. ఎలాగో గుండెను గట్టి చేసుకుని ఆ సింహం గుహ వైపుకు బయలుద్యారింది. దారిలో ఒక నుయ్యి కనిపించింది. నూతిలో నీళ్ళు చూస్తే ఒక ఐడియా వచ్చింది. అక్కడే పొద్దు పోయే దాకా కూర్చుని, సాయంత్రానికి ప్రశాంతంగా లేచి పరిగెత్తుకుంటూ సింహం దెగ్గిరకి వెళ్ళింది.
పొద్దుటి నుంచి ఆహారం కోసం ఎదురు చూస్తున్న సింహం బాగా రుస రుసలాడుతూ, కోపంగా గుహ ముంగిట్లో పచార్లు చేస్తోంది.
కుందేలుని చూడంగానే “ఎమిటి ఇంత ఆలస్యం?” అని కోపంగా గర్జించింది.
కుందేలు గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ, “క్షమించండి మహారాజా! నేను పొద్దున్నే మీ వద్దకు రావటానికి బయలుద్యారాను. కానీ దారిలో ఇంకొక సింహం కనిపించింది. అది నన్ను తినబోతుంటే, ఈ రోజు నేను మీకు ఆహారాన్ని అన్న విషయం చెప్పాను. ఆ సింహం అస్సలు మాట వినలేదు. ఈ అడివికి నేనే రాజుని, అని నాతొ చెప్పి నా పైకి దుంకి నన్ను పట్టుకుందామని ప్రయత్నించింది. నేను ఎలాగో ప్రాణాలు కాపాడుకుని మీ దెగ్గరకు వచ్చాను!” అని చెప్పింది.
అసలే కోపం మీద ఉన్న సింహానికి ఇంకా భగ్గున మండింది. “ఎక్కడ ఆ సింహం! చూపించు నాకు!” అంది.
కుందేలు సింహాన్ని నూతి దగ్గరకు తీసుకుని వెళ్ళింది. మరో సింహం నూతిలో ఉంటుందని చెప్పింది.
సింహం నూతిలోకి చూసింది. నీళ్ళల్లో తన ప్రతిబింబం చూసి మరో సింహం అని అపోహ పడి గర్జించింది. ఆ గర్జన నూతిలో ప్రతిధ్వనించింది. సింహం తన ప్రతిబింబం తోనే యుద్ధం చేయడానికి నూతిలోకి దుంకేసింది. అందులోని నీళ్ళల్లో మరణించింది.
కుందేలు ప్రాణాలతో ఇలా తప్పించుకుంది. అడివిలో మిగిలిన జంతువులకు జరిగినది చెప్పింది. జంతువులన్నీ కుందేలు చాతచక్యం మెచ్చుకున్నాయి. ఆ రోజునుంచి ప్రశాంతంగా అడవిలో నివసించాయి.
బలం కన్నా బుద్ధి గొప్పదని నిరూపించడానికి ఈ కథ మరో నిదర్శనం.
బంగారు పళ్ళం
ఒక ఊరిలో సాహు, శీను, అని ఇద్దరు గాజులు అమ్ముకునే వాళ్ళు ఉండేవారు. వాళ్ళిద్దరూ ఒక ఒప్పందం చేసుకున్నారు. ఇద్దరు ఊరిని రెండు భాగాలగా పంచుకున్నారు. ఇద్దరు తలో భాగంలో పొద్దున్న మొదలు పెట్టి, మధ్యాన్నం అయినప్పుడు వేరే భాగానికి చేరుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇలా ఇద్దరూ ఒక రోజులో ఊరంతా చుట్టచ్చు, కాని ఒకరితో ఒకరు వ్యాపారం కోసం పోటి పడక్కరలేదు.
ఇలా ఉండగా ఒక రోజు సాహు గాజులు అమ్ముకుంటూ ఒక గుడిసె ముందర నుంచి వెళ్ళాడు. గుదేసలో ఒక అవ్వ, ఆవిడ మనవరాలు ఉండే వారు. మనవరాలు సాహు పిలుపులని విని గాజులు కావాలని సరదా పడింది. అవ్వ సాహుని పిలిచి గాజుల వెలడిగింది. సాహు చెప్పిన ధర చాలా ఎక్కువ – అంత డబ్బు పాపం అవ్వ దెగ్గిర లేదు.
“నా దెగ్గిర ఒక పాత పళ్ళం ఉంది, డానికి మసి పట్టుకుంది, కాని నీకు పనికొస్తుందంటే అది తీసుకుని గాజులు ఇస్తావా?” అని అవ్వ సాహుని అడిగింది.
సాహు పళ్ళం తీసుకుని చూసాడు. కింద గోరు పెట్టి గీస్తే అది బంగారు పళ్ళం! చాలా విలువైనది. సాహుకి దురాశ కలిగింది. “ఈ పళ్ళమా! ఇది దేనికి పనికొస్తుంది! పూర్తిగా మసి పట్టుకు పోయింది! దీనికి గాజులు రావు కాని, కావాలంటే ఒక కాసు ఇస్తాను, తీసుకో!” అన్నాడు.
అవ్వ పాపం పళ్ళం తీసుకుని వెళ్లి పోయింది. సాహు మళ్ళీ మొన్నాడు వచ్చి చూద్దాం, అప్పటికీ ఒప్పుకోక పొతే ఇంకొంచం ధర పెంచి తీసుకోవచ్చు, అనుకుని వెళ్ళిపోయాడు.
ఒప్పందం ప్రకారం మధ్యాన్నం అటు శీను గాజులు అమ్ముకుంటూ వచ్చాడు. అవ్వ అతన్ని కూడా పళ్ళం తీసుకుని గాజులివ్వమని అడిగింది. శీను కూడా చూసి వెంటనే అది బంగారు పళ్ళం అని తెలుసుకున్నాడు. కానీ శీను మంచి వాడు. వెంటనే అవ్వతో, “ఇది బంగారు పళ్ళం అమ్మా! ఇది చాలా విలువైనది. ఇది నేను ఎలా కొంటాను? ఇంత డబ్బు నా దేగ్గిరా లేదు. కాని మన సామంత రాజు దేగ్గిరకి తీసుకుని వెళ్దాము. దీనికి మంచి వెల కట్టి ఇస్తారు. అప్పుడు నువ్వు నా దెగ్గిర గాజులు కొనుక్కుని, మిగిలిన డబ్బు తో ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకోవచ్చు, నీ మనవరాలికి బ్రతుకు తెరువు చూపించచ్చు”, అని చెప్పాడు.
అవ్వ ఒప్పుకుంది.
విషయమంతా సామంత రాజుకి చెప్పారు. సామంత రాజు అవ్వ దెగ్గిర పళ్ళం కొనుక్కుని తగిన సొమ్ము అవ్వకు ఇచ్చాడు. అలాగే శీను నిజాయితిని మెచ్చుకుని, కోటలో మంచి ఉద్యోగం ఇప్పించాడు.
ఇక సాహు సంగేంటంటే, ఊరిలో అందరికి సాహు చేసిన మోసం సంగతి తెలిసిపోయి, అతని దెగ్గిర ఎవ్వరు గాజులు కొనటానికి ఇష్ట పడలేదు. కొద్ది రోజులు ప్రయత్నం చేస్సాడు కాని కిట్టుబాటు కా లేదు. వ్యాపారం లో నష్టము వచ్చి, మరే ఉద్యోగమూ దొరకక, ఊరొదిలి వెళ్లి పోవాల్సి వచ్చింది.
ఇలా మనుషులని మోసం చేసి లాభం పొందాలనుకునే వాళ్ళు ఎప్పుడూ బాగు పడరు.
పెద్ద అపాయం, చిన్న ఉపాయం
ఒక చెట్టు మీద ఒక కాకి జంట గూడు ఉండేది. ఆ కాకులు పాపం ఎప్పుడు గుడ్లు పెట్టిన ఆ చెట్టు మొదల్లో ఉండే పాము చెట్టు ఎక్కి గూటి లో గుడ్లన్నీ తినేసేది. పాపం కాకులకి ఏమి చేయాలో తెలిసేది కాదు.
ఇలా ఉండగా ఆ అడవిలోంచి ఒక రాజు ప్రయాణం చేస్తూ అక్కడ తన కుటుంబం, ఇతర అనుచరులు, వారి భట్లతో డేరా వేసారూ.
మగ కాకి ఆ డేరా వైపు ఆహారం వెతుక్కుంటూ వెళ్ళింది. అక్కడ రాజకుమార్తె, తన చెలికర్తలు, నది వొడ్డున బట్టలు, నగలు పెట్టుకుని స్నానం చేస్తూ కనిపించారు.
అది చూసి కాకికి తన బద్ధ శత్రువైన పాము ని వదిలించుకోవడానికి ఒక ఉపాయం తట్టింది. రాజకుమార్తె మెడలో వేసుకునే గొలుసు తన ముక్కులో పట్టుకుని ఎగిరి పోయింది. అది గమనించిన భట్లు తమ ఆయుధాలతో వెంట పడ్డారు.
కాకి ఎగురు కుంటూ తన గూటికి చేరి, చెట్టు మొదల్లో ఆ గొలుసు పడేసింది.
హడావిడి ఏంటా అని చూడ డానికి పాము బయటికి వచ్చింది.
వెంట పడ్డ భటులు కింద పడున్న గొలుసు తెస్సుకోవడానికి వెళ్లి నప్పుడు ఆ పాము కనిపించింది.
పాము కరుస్తుందేమో అన్న భయంతో భటులు పాముని చంపేశారు. గొలుసు తీసుకుని రాజకుమార్తె కి తిరిగి ఇచ్చేసారు.
ఆ తరువాత కాకి జంట హాయిగా ఉన్నారు.
బలం కన్నా బుద్ధి గొప్పది. పెద్ద పెద్ద కష్టాలని కూడా చిన్న ఉపాయంతో తొలిగించవచ్చు.
నక్క ఆహ్వానం
ఒక రోజు ఒక నక్క తన మిత్రుడైన కొంగను భోజనానికి ఆహ్వానించింది. కొంగ సంతోషంగా ఒప్పుకుంది.
సాయంత్రం నక్క భోజనం తయారు చేయడం మొదలు పెట్టింది. నక్కకు అత్యాశ ఎక్కువ. కొంగని భోజనానికి పిలిచింది కాని కొంగ ఎక్కువ తినేస్తుందేమో అని భయం. అందుకనే ఒక ప్లాన్ వేసింది.
నిర్దారించుకున్న సమయానికి కొంగ తలుపు తట్టింది. నక్క ఇంట్లోంచి మంచి మంచి వాసనలు వస్తున్నాయి. కొంగకు నోరూరింది. ఇద్దరు మిత్రులు భోజనానికి రెడీ అయ్యారు.
నక్క ఇద్దరికి భోజనం చదునైన పళ్ళాలలో తీసుకుని వచ్చింది. పళ్ళం అలా ఫ్లాట్ గా వుంటే కొంగ పక్షిముక్కుతో ఎక్కువ తినలేక పోయింది. పాపం ఏదో కష్ట పడుతూ కొంచం కొంచం తినగలిగింది. నక్క మట్టుకు పళ్ళం నాక్కుని నాక్కుని మొత్తం తినేసింది. కొంగ ఆకలితోనే ఇంటికి వెళ్లి పోయింది.
కొద్ది రోజులు గడిచాయి.
ఈ సారి కొంగ నక్కని భోజనానికి పిలిచింది. నక్క వస్తానని మాట ఇచ్చింది.
అనుకున్న సమయానికి నక్క కొంగ ఇంటికి వెళ్ళింది. కొంగ ఇల్లు వంట సువాసనలతో ఘుమ ఘుమలాడి పోతోంది. కొంగ డిన్నర్ కి సూప్ చేసింది. చేసిన సూప్ని రెండు కూజాలలో తీసుకుని వచ్చింది. కూజా మెడ పొడూగ్గా వుంటుంది కదా? అందులోని సూప్ నక్క ఎలా తింటుంది. తిన లేక పోయింది. కాని కొంగ మట్టుకు పక్షిముక్కు కూజలోకి ముంచుకుని హాయిగా సూప్ అంతా లాగించేసింది. అలా ఆ రోజు నక్క ఆకలితో ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది.
మనం ఇతర్లతో ఎలా ఉంటామో, వారు మనతో అలాగే ప్రవర్తిస్తారు.
ఉల్లిపాయి దొంగ
ఒక అబ్బాయిని ఉల్లిపాయలు దొంగలిస్తుంటే ఊళ్ళో వాళ్ళు పట్టుకున్నారు. న్యాయమూర్తి దెగ్గిరకు తీసుకుని వెళ్ళారు.
న్యాయమూర్తి ఆ అబ్బాయిని మూడు శిక్షలలో ఒకటి ఎంపిక చేసుకో మన్నాడు – ఒకటే సారి దొంగలించిన ఉల్లిప్పాయలన్నీ తినడమా; వంద కొరడా దెబ్బలు భరించడమా, జురుమానా చెల్లించడమా?
ఆ అబ్బాయి వెంటనే ఎక్కువ తక్కువ ఆలోచించ కుండా ఉల్లిపాయలు తినేస్తాను అన్నాడు.
ఉల్లిపాయలు తినడం మొదలుపెట్టాడు. కాని అది అనుకున్నంత సులువైన పని కాదు. ఒక్కటి కూడా పూర్తి గా తినకుండానే కళ్ళల్లోంచి, ముక్కు లోంచి నీళ్ళు కారడం మొదలైంది. ఐనా మొండి గా ఇంకో రెండు తిన్నాడు, కాని ఇక వీలు కాలేదు.
సరే ఇది కాదు, కొరడా దెబ్బలే తింటాను అని న్యాయమూర్తికి చెప్పాడు. సైనికులు కొరడాతో కొట్టడం మొదలు పెట్టారు. కొరడా దేబ్బాలంటే మాటలా? నొప్పి తట్టుకో లేక పోయాడు.
బాబోయి! బాబోయి! జరిమానా కట్టేస్తాను, ఆపండి! అని ఏడుపు మొదలెట్టాడు.
ఏడుస్తూనే జరిమానా చెల్లించాడు.
ఇప్పుడు ఆ అబ్బాయికి బాగా అర్ధం అయ్యింది. ఏదైనా తప్పు పని చేస్తే అది మనల్ని ముప్పు తిప్పలూ పెడుతుందని. ఆ తరువాత ఆ అబ్బాయి ఎప్పుడు దొంగతనం కాని, వేరే టప్పుడు పనులు కాని చేయలేదు.
కొంత మంది ఈ కథలో ఇంకో నీతి కూడా చెప్తారు. మనం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించి, ప్రత్యామ్నాలు పరిశీలించాలీ. అప్పుడే నిర్ణయం తీసుకోవాలి.
ఎనుగ తో స్నేహం
ఒక అడవిలో ఒక ఏనుగు స్నేహితుల కోసం వెతుకుతోంది.
చెట్టు మీద కోతిని అడిగింది, “కోతి, కోతి, నాతొ స్నేహం చేయవా?”
“నువ్వు నాలాగా చెట్టు కొమ్మల మీద వేళ్లాడ లేవు కదా, నీతో ఎలా స్నేహం చేస్తాను?” అంటూ కోతి వెళ్లి పోయింది.
ఏనుగు చెట్టు మొదల్లో వున్న కుందేలుని అడిగింది, “కుందేలు, కుందేలు, నా తో స్నేహం చేస్తావ?”
కుందేలేమో, “నువ్వు నా లాగా ఫాస్ట్ గా పరిగెత్తలేవు కదా, నీతో ఎలా స్నేహం చేయను?” అంది.
ఏనుగు కొంత దూరం వెళ్ళాక ఒక కప్పను చూసింది. “కప్పా, కప్పా, నా తో స్నేహం చేయవ?” అని అడిగింది.
“నువ్వు నా లాగా గెంత లేవు కదా, నేను నీతో ఎలా స్నేహం చేయను?” అని కప్ప కూడా స్నేహం చేయలేదు.
ఇలా నక్క, తాబేలు, జింక, నెమలి, కోకిల, కాకి, జిరాఫీ, అన్నిటిని స్నేహం చేయమని అడిగింది. కాని అన్నీ ఏనుగు ని కాదని వెళ్లి పోయాయి. ఏనుగు పెద్దగా, నిదానం గా వుంటుంది కదా, వేరే జంతువుల లాగ ఎగర లేదు, గెంత లేదు, పరిగెత్త లేదు. అందుకని ఏ జంతువూ ఏనుగుతో స్నేహం చేయడానికి ఇష్టపడ లేదు.
ఏనుగు పాపం వంటరి గానే వుండి పోయింది.
ఒక రోజు అడవిలో జంతువులన్నీ గబ గబా ప్రాణాల కోసం పరిగెడుతూ కనిపించాయి. ఏనుగుకు ఆశ్చర్యం అనిపించి ఒక జంతువును ఆపి విషయం కనుక్కుంది.
“అడవిలోకి ఒక పులి వచ్చింది, ఆ పులి అన్ని జనువులని తినేస్తోంది, అందుకనే పారిపోతున్నాము” అని హడావిడిగా జవాబు చెప్పి ఆ జంతువు పారిపోయింది.
ఏనుగు ఆ పులిని వెతుక్కుంటూ వెళ్ళింది. పులి కనిపించగానే “పులి గారు, ఈ జంతువులను తినకండి, ప్లీజ్” అని అడిగింది.
పులి వికటంగా నవ్వి, “నీ పని చూసుకో పో!” అంది.
ఏనుగుకి తప్పలేదు. పులిని గట్టిగా తన్నింది. పులి ఏనుగుపై ఎగా బడింది. ఏనుగు ఊరుకుంటుందా? తొండంతో పులిని చుట్టి దూరంగా విసిరేసింది. ఇది కుదిరే పని కాదని భయంతో పులి పారిపోయింది.
ఇది చూసిన జంతువులన్నీ ఏనుగుకు థాంక్స్ చెప్పాయి. ఆ రోజు నుంచి అన్ని జంతువులూ ఏనుగు మిత్రులై పోయాయి. అందరు కలిసి ఆడుకున్నారు.
మనలా లేని వాళ్ళను మనము ఎప్పుడు చిన్న చూపు చూడ కూడదు. ఎవ్వరిని తక్కువ అంచనా వేయకూడదు. అందరిలో ఏదో ఒక ప్రతిభ వుంటుంది.
నూతిలో నక్క
అనగనగా ఒక నక్క అడవిలో రాత్రిపూట చీకటిలో తిరుగుతూ ఒక బావిలో పడిపోయింది.
బావి చాలా లోతుగా వుంది. యెంత ప్రయత్నం చేసినా ఆ నుయ్యిలోంచి నక్క బయటికి రాలేక పోయింది. తెలారేదాక అలాగే నూతిలో ఉండిపోయింది.
మొన్నాడు ఆ బావి దేగ్గిరకి ఒక మేక వచ్చింది.
“అమ్మయ్య! మనం బయట పడచ్చు”, అనుకుని నీళ్ళల్లో ఉన్న నక్క అనుకుంది.
మేక బావిలోకి చూసింది. చూస్తే అక్కడ నక్క కనిపించింది.
“ఇదేంటి? బావిలో ఎం చేస్తున్నావు?” అని అమాయకంగా అడిగింది మేక.
“ఈ బావిలో నీళ్ళు యెంత బాగుంటాయో తెలుసా? ఆ నీళ్ళు తాగడానికే ఇక్కడికి వచ్చాను. అసలు చక్కర కలిపినంత తీయగా వున్నాయి!” అని తెలివిగా చెప్పింది నక్క.
“అవునా! నిజమా?” అని అడిగింది మేక.
“కావాలంటే నువ్వు దిగి చూడు? అసలు ఇలాంటి నీళ్ళు నువ్వు ఎప్పుడు తాగి ఉండవు” అంది నక్క.
అమాయకురాలైన మేక ముందు వెనక ఆలోచిన్కాకుండా నూతి లోకి దున్కేసింది. నీళ్ళు తాగింది. కొంత సేపటికి నక్క లానే మేక కూడా ఇరుక్కు పోయింది.
“ఇప్పుడు బయటికి వెళ్ళడం ఎలా?” అని నక్కని అడిగింది.
“ఓస్! దానిదేముంది! ముందు నీ వీపు పై ఎక్కి నేను బయటికి వెళ్లి, తరువాత నిన్ను పైకి లాగెస్తాను!” అని ఐడియా ఇచ్చింది నక్క.
సరే బాగానే ఉంది అనుకుని మేక ఒప్పుకుంది.
నక్క మేక వీపెక్కి చెంగున ఒక గెంతు వేసి నూతి లోంచి బయట పడింది! “బ్రతుకు జీవుడా!” అనుకుంది.
మేక బయటికి రావడానికి చేయి అందించ మని అడిగింది. “నేను నిన్ను ఎలా లాగుతాను, బావి లోతుగా వుంది, నువ్వు బరువుగా వున్నావు” అని నవ్వుకుంటూ నక్క వెళ్లి పోయింది.
మేకకు మొత్తానికి నక్క చేసిన మోసం అర్ధం అయ్యింది. కాని ఏమి లాభం? నూతిలో దిగే ముందరే బయటికి ఎలా వస్తామన్న విషయం ఆలోచించాల్సింది కదా?
డేరా లో ఒంటె
ఒక అరబ్ షేకు అరేబియా ఎడారిలో ఒంటె మీద ప్రయాణం చేస్తున్నాడు. దారిలో ఉండగా సాయంత్రం అయింది. రాత్రికి ఒక ఒయాసిస్ (ఎడారిలో ఏర్పడే జలాశయము) దెగ్గిర డేరా వేసుకున్నాడు. చీకటి పడ్డాక ఒంటెని బయట వదిలి, ఆ షేకు డేరాలో పక్క వేసుకుని పడుక్కున్నాడు.
ఎడారిలో పగటి పూట బాగా ఎండగా ఉంటుంది. మండే సూర్యుడు. ఎక్కడ నీడ ఉండదు. కాని రాత్రి మట్టుకు ఇసక చల్లారిపోతుంది. చాలా చలిగా ఉంటుంది.
ఆ చలిలో వొణుకుతు షేకు దుప్పటి కప్పుకుని నిద్రపోయాడు.
బయట వున్న ఒంటేకి చాలా చలి వేసింది. చివరికి డేరా లో ముక్కు దూర్చి, “షేకు, ఇవాళ చాలా చల్లగా వుంది, నువ్వు ఒప్పుకుంటే ఈ డేరాలో నేను నా ముక్కు మట్టుకు పెట్టుకుంటాను” అని దీనంగా అడిగింది.
షేకు కి జాలి వేసింది. అలాగే ముక్కు దాచుకోమని ఒప్పుకున్నాడు.
కొంత సేపటికి ఒంటె షేకుని మళ్ళి నిద్ర లేపింది. ముక్కోకటే పెట్టుకుంటే చలికి ఆగట్లేదని, అలాగే తల దాచుకోవడానికి చోటు ఇవ్వమని అడిగింది. షేకు ఒప్పుకున్నాడు.
తల పెట్టు కున్నాక కొంత సేపటికి ఒంటె షేకు ని మళ్ళి నిద్ర లేపి, తల దాచుకున్నాక మెడకు మట్టుకు యెంత స్థలం కావాలి, మెడ కూడా పెట్టుకొనా అని అడిగింది. షేకు మళ్ళి ఒప్పుకున్నాడు.
అక్కడతో ఆగిందా? ఇలా కొంచం కొంచం దేరలోకి దూరి, ముందు కాళ్ళు, వొళ్ళు, తోక కూడా దేరలోకి దూర్చింది.
ఒక్క మనిషి కోసం వేసుకున్న డేరాలో అంత పెద్ద ఒంటె ఎలా పడుతుంది? కొంచం కొంచంగా డేరా మొత్తం ఆక్రమించుకుని షేకుని డేరా బయటికి తోసేసింది. ఆ షేకు యెంత ప్రయత్నించినా కొంత చోటు కూడా ఇవ్వలేదు. అసలు ఆ షేకుని మళ్ళీ దేరలోకి కాలు పెట్టనివ్వలేదు.
పాపము, ఆ షేకు ఒంటెకు మంచి చేయబోతే చివరికి చలి ఎడారిలో రాత్రి గడపాల్సిన పరిస్థితి వచ్చింది.
మన జీవితంలో చెడు అలవాట్లు కూడా ఆ ఒంటె లాంటివే. మొదటిలో ఇది చిన్న విషయమే కదా, మనం కంట్రోల్ చేయచ్చు అనిపిస్తుంది, కానీ ఆ అలవాటు మనకి తెలీకుండానే పెద్దదిగా మారిపోయి మన జీవితమంతా ఆక్రమించు కుంటుంది. మొదటిలో అలవాటే, కాని రాను రాను గ్రహపాటు అవుతుంది. అందుకే చిన్నదే అయినా సరే, దానికి ముక్కు దూర్చే అవకాశం మనం ఇవ్వకూడదు.
మొసలి కన్నీళ్లు
అనగనగా ఒక అడవిలో ఒక కోతి, ఒక మొసలి స్నేహితులు. నీళ్ళల్లో ఉండే మొసలికి నేల మీద ఉండే కోతికి ఎలా పరిచయం అయ్యింది అంటారా? అది ఎవరికి తెలీదు. ఎలాగో పరిచయం అయ్యింది.
కోతి ఇల్లు ఒక చెట్టు మీద ఉండేది. ఆ చెట్టు పక్కనే ఒక నది ఉండేందు. నదిలో మొసలి ఇల్లు. రోజు కోతి చెట్టు మీద, మొసలి నీళ్ళల్లో ఉంటూ నే కబుర్లు చెప్పుకుంటూ ఉండేవి. ఇద్దరి స్నేహం చూసి అడవిలో జంతువులూ ఆశ్చర్య పోయేవి. కోతికి అడవిలోని వేరే కోతులు మొసలిని నమ్మద్దని సలహా ఇచ్చేవి. మొసలి మాంసం తింటుంది, ఎప్పుడైనా నిన్ను కూడా తినేస్తుంది, అంటూ జాగ్రత్త పాడమని చెప్పేవి. కాని కోతికి మొసలి మీద నమ్మకం వుండేది. అందుకనే వాళ్ళ స్నేహం చాలా రోజులు కొనసాగింది.
ఒక రోజు ఈ విషయం మొసలి భార్యకి తెలిసింది.
“ఏంటిది, నిజామా? నీకు ఒక కోతి తో స్నేహముందా?” అని ఒక రోజు మొసలిని అడిగింది.
మొసలి ఒప్పుకుంటూ, “అవును, చాలా రోజులు గా పరిచయం ఉంది. కోతి చాలా తెలివైనది, నాకు చాలా విషయాలు చెప్తుంది” అన్నాడు.
మొసలి భార్య, “కోతి గుండె చాలా బాగుంటుందట. నువ్వు ఆ కోతిని చంపేస్తే మనం ఇద్దరం కోతి గుందేకాయిని పంచుకుని తినచ్చు” అంది.
మొసలి కి భార్యమీద పిచ్చి కోపం వచ్చింది. “కోతికి నాకు చాలా మంచి స్నేహం ఉంది. స్నేహితుడిని ఎలా చంప మంటావు?” అని కోపంగా అడిగాడు.
భార్య మూతి ముడుచుని కూర్చుంది. పట్టించుకోకుండా మొసలి ఇంట్లోంచి వెళ్లి పోయాడు.
మొండి భార్య ఊరుకుంటుందా? పట్టు వదల కుండా రోజు పోరు పెట్టింది. తిండి తిప్పలు మానేసి, ఒక మూల కూర్చుని రోజు పోరు పెట్టింది. మొసలికి మనశ్శాంతి లేకుండా చేసింది.
చివరికి నస భరించలేక ఒక రోజు మొసలి ఒప్పుకున్నాడు. “సరే, ఈ రోజు సాయంత్రం కోతిని తీసుకుని వస్తాను, నీకు నచ్చినట్టు కానీ” అని కోతి ఉండే చెట్టు వైపుకి బయలుద్యారాడు.
కోతిని చెట్టు మీంచి దిగి రమ్మని ఒప్పించడం ఎలా? అందుకని ఒక పడకం వేసాడు.
చెట్టు కింద నుంచుని కోతిని పిలిచాడు. కోతి బయటికి వచ్చింది. మొసలిని చూసి సంతోషంగా పలకరించింది.
మొసలి కోతితో,”మన స్నేహం గురించి నా భార్యకు చెప్పాను, నా భార్యకి చాలా ఆనందం కలిగింది, నిన్ను ఈ రోజు భోజనానికి తీసుకు రమ్మంది,” అని ఆహ్వానించాడు.
కోతి సంబర పడింది. సరదాగా మొసలి ఇంటికి భోజనానికి వెళ్లి మొసలి భార్యను కూడా కలవచ్చని ఒప్పుకుంది. కానీ నీళ్ళల్లో వెళ్ళడం ఎలా? మొసలి తన వీపు మీద కూర్చో పెట్టుకుని తీసుకుని వెళ్లి, తిరిగి తీసుకు వస్తాను అంది.
కోతి చాలా ఉత్సాహంతో వచ్చి మొసలి వీపు ఎక్కి కూర్చుంది.
మొసలి నీళ్ళల్లో ఈదుతూ కోతిని తన ఇంటివైపుకు తీసుకు వెళ్ళాడు.
దారిలో మొసలి ఏడవడం మొదలట్టాడు. కోతికి ఆశ్చర్యం వేసింది. ఎందుకు ఎడుస్తున్నాడని మొసలి ని కనుక్కుంది. మొసలి ఏడుపు ఆప లేదు. కోతి చాలా అడిగింది. మొత్తానికి నది మధ్యలో కొన్ని రాళ్ళ మీదకి ఆగి ఇద్దరు మాట్లాడుకున్నారు.
భోజనానికి పిలిచింది అబద్ధమని, మొసలి, తన భార్యా కోతిని తిందామని ఈ పడకం వేసారని నిజం చెప్పేసాడు మొసలి.
ఈ మాట విన్న కోతికి ఒక్క సారి గుందేలాగి పోయినంత పని అయ్యింది. ఎలాగరా ఇందులోంచి బయటపడడం అని ఒక పక్క, అసలు అందరూ చెప్తున్నా వినకుండా ఈ మొసలిని ఎలా నమ్మానని అని మరో పక్క, బుర్రోలో ఒకటే సారి ఆలోచనలు తిరిగాయి. నమ్మక ద్రోహం జరిగినందుకు దుఃఖం, ప్రాణాలు పోతాయేమోనని భయం, ఎలా తప్పించుకోవాలని ఆందోళన, ఎన్ని రక రకాల భావాలు ఒకటే సారి కలిన్గుంతాయో మీరు ఆలోచించ గలరు.
కాని కోతి చాలా తెలివైనది. అంత సులువు గా ప్రాణాలు వాదులు కుంటుంద? ఈ భావాలేమి మొసలికి తెలీయనివ్వ లేదు. గట్టిగా నవ్వడం మొదలిట్టింది.
మొసలి కన్నీళ్లు నవ్వుతున్న కోతిని చూసి ఆగి పోయాయి. ఇది ఊహించలేని రియాక్షన్ కదా.
కోతి మొసలితో అంది, “ఓస్! ఇంతేనా? దీనికి ఎందుకు ఏడుస్తున్నావు? ముందు చెప్తే నేనే నీకు నా గుండె తెచ్చి ఇచ్చే వాడిని. కాని ఇప్పుడు అది నా దెగ్గిర లేదు. నా ఇంట్లో భద్రంగా దాచి వచ్చాను. మళ్ళి ఇంటికి తీసుకుని వెళ్తే, చేట్టులోంచి నా గుండె తీసుకొచ్చి నీకు ఇస్తాను. నువ్వు నీ భార్య హ్యాపీ గా తినచ్చు” అంది కోతి.
మొసలి కోతి మాటలని నమ్మేసింది. కోతిని తిరిగి ఇంటికి తీసుకుని వెళ్ళింది. కోతి “అమ్మయ్య!” అనుకుని ఒక్క గెంతు గెంతి మొసలి వీపు మీంచి చెట్టు ఎక్కేసింది. ఇంట్లోకి వెళ్లి సడి చప్పుడు చేయకుండా కూర్చుంది. అలా ప్రాణాలు కాపాడుకుంది.
మొసలి చాలా సేపు ఎదురు చూసి మొత్తానికి కోతి ని పిలిచింది.
కోతి కొమ్మ మీదే కూర్చుని, “గుండె లేదు ఏమి లేదు! అసలు నీ లాంటి మొసలితో నాకు స్నేహమే వద్దు. ఇంకెప్పుడు నాకు కనిపించకు” అని కోపంగా చెప్పింది.
మొసలి తల దించుకుని వెళ్ళిపోయింది.
చేడువాళ్ళతో స్నేహం ఎప్పుడు చెడె చేస్తుంది. అలాంటి వారితో మనం దూరంగా ఉంటేనే మంచిది.
బంగారు గుడ్లు పెట్టే కోడి
ఒకానొకప్పుడు ఒక చిన్న గ్రామంలో శివకాశి అనబడే రైతు ఉండేవాడు. ఎంత కష్ట పడిన పాపం ఎక్కువ సంపాదించలేక పోయేవాడు. పొద్దంతా పొలం పనులు చూసుకుని అలిసి పోతూ ఉండేవాడు.
ఒక రోజు అలాగే పొలం నుంచి అలిసి పోయి తిరిగి వస్తుంటే ఇంటి ముందర ఒక బాటసారి కనిపించాడు. బాటసారి ప్రయాణం చేస్తూ వుండగా దారిలో సూర్యాస్తమం అవుతోందని, ఆ రోజు రాత్రికి శివకాశి అరుగుమీద నిద్ర పోవటానికి అనుమతిని కోరాడు.
శివకాశి ఆ బాటసారికి ఆశ్రయం ఇచ్చాడు. చేతులు, కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళు తెచ్చి ఇచ్చాడు. ఇంట్లో ఇన్న ఓకే ఒక నులక మంచం తీసుకొచ్చి అరుగు మీద వేసాడు. తన దుప్పటి, తలగడ కూడా మంచం మీద వేసాడు. తన భోజనం కోరకున్న గుప్పెడు బియ్యం గింజల తోనే అన్నం వండి, బాటసారికి వడ్డించి, తనకు వీలైనంత బాగా అతిథి సత్కారం చేసాడు.
కృతజ్ఞత కలిగిన బాటసారి కూడా శివకాశి కోసం ఏమైనా చేయాలని అనుకున్నాడు.
“ఈ కోడి రోజూ ఒక బంగారు గుడ్డు పెడుతుంది. ఇక పైన నీకు ఈ పేదరికం ఉండదు.” అంటూ అతనికి ఒక కోడిని బహుమతిగా ఇచ్చాడు.
ఆరోజు నుంచి శివకాశి దాస మారింది. రోజుకొక బంగారు గుడ్డు అమ్ముకుని, దానితో జీవితం కొనసాగాడు. వంటి మీద ఉన్న పాత, చిరిగి పోయిన పత్తి బట్టలు పోయి కొత్త పట్టు వస్త్రాలు ధరించడం మొదలెట్టాడు. పాకలో ఉండేవాడు భవనంలోకి మారాడు. పట్టెడు బియ్యం మెతుకులు తింటూ పూట గడిపే శివకాశి ఇప్పుడు ప్రతి పూట పంచ పక్ష పరవాన్నాలు తినేవాడు. పొలం పనులు బొత్తిగా మానేసాడు.
పరిస్థితులు మారడంతో మనిషి ప్రవర్తన కూడా మారుతుంది. ఆలోచనా మారుతుంది. పని తక్కువా, డబ్బు ఎక్కువా ఉండే సరికి మనిషికి దుర్వ్యసనాలు అలవాటవుతాయి. ఒక్క సారి వ్యసనాలు పట్టుకున్న మనిషికి యెంత డబ్బూ సరిపోదు. ఇంకా, ఇంకా డబ్బుంటే బాగుండు అనిపిస్తుందే.
ఇదే శివకాశి కి కూడా అయ్యింది. ఒకప్పుడు ఏమి లేకపోయినా సంతోషంగా వున్న మనిషికి ఇప్పుడు ఉన్న ఐశ్వర్యం సరిపోలేదు. కొద్ది కాలంలోనే బాగా ధనం సంపాదిన్చేయాలనే కాంక్ష మొదలైంది. గతం మర్చి పోయాడు.
రోజు ఒకే ఒక్క గుడ్డు అమ్ముకునే కన్నా ఒకటే సారి కోడిలోంచి గుడ్లున్ని తీసేస్తే, ఒకటే సారి బోల్డు ధనం వస్తుందన్న దురాలోచన పీడించడం మొదలెట్టింది.
ఉండపట్ట లేక ఒక చాకు తీసుకుని ఆ కోడి పొట్ట చీల్చేసాడు. పొట్ట నిండా బంగారు గుడ్లు ఉంటాయనుకున్న శివకాశి కి ఒక షాక్ తగిలింది. కోడి పొట్టలో ఏమి లేదు. లోపల మామూలు కోడి లానే వుంది.
మొదటికే మోసం వచ్చింది.
అయ్యో! ఎందుకు దురాశ పడ్డాను! అని శివకాశి అప్పుడు బాధ పడ్డాడు. కాని ఏమి లాభం? రోజు బంగారు గుడ్లు పెట్టే కోడిని చేతులారా చంపుకున్నాడు.
పొగడ్తలతో పడగొట్టిన నక్క
ఒక రోజు ఒక కాకి ఆహారం కోసం వెతుకుతుంటే ఒక రొట్టి ముక్క దొరికింది.
కాకి చాలా సంతోషంగా ఆ రొట్టి ముక్కను నోట్లో పెట్టుకుని ఎగురుకుంటూ వెళ్లి ఒక చెట్టు మీద కూర్చుంది.
నోట్లో రోట్టిముక్క పెట్టుకుని ఎగురుతున్న కాకిని ఒక నక్క చూసింది. వెంటనే ఆ రొట్టి ముక్క కావాలనుకుంది. కానీ ఎలా? కకేమో చెట్టు మీద వుంది. నక్కేమో చెట్టు యెక్క లేదు. ఇప్పుడు నక్క ఏమి చేయాలి?
ఆ చెట్టు కింద నుంచుని కాకితో మాట కలిపింది.
“ఓహో కాకి! యెంత బాగున్నావు ఇవాళ? నిగ నిగాలాదిపోతున్నావు!” అంది నక్క.
పొగడ్త వినగానే కాకి పొంగి పోయింది. ఈ విషయం నక్క గమనించింది. పొగడ్త కొనసాగించింది.
“ఆ మిల మిల మెరిసిపోతున్న కళ్ళు, సూటిగా వున్న ముక్కు, బ్రహ్మాండమైన నీ రెక్కలు, అసలు యెంత సేపైనా రెప్ప వాల్చ కుండా చూడవచ్చు. నీ శరీరం ఇంత అందంగా వుంటే ఇంక నీ గొంతు యెంత అదిరి పోతుందో ఊహించుకుంటేనే … ఆహ! అసలు ఒక్క సారి నువ్వు పాడితే వినాలని వుంది. ఒక్క పాట పాడవా?”
పొగడ్తలతో ఉబ్బిపోయిన కాకి వెంటనే “కావు! కావు!” అని నోరు తెరిచి పాట మొదలెట్టింది. నోట్లోని రొట్టి ముక్క జారి కింద పడిపోయింది.
వెంటనే నక్క రొట్టి మిక్కను నోట్లోవేసుకుని తిరిగి వెనక్కి చూడకుండా వెళ్ళిపోయింది.
రొట్టి ముక్క కోసమే తనని నక్క పోగిడిoదన్న విషయము గ్రహించిన కాకి బాధ పడింది. ఇంకెప్పుడు పొగిడే వాళ్ళను నమ్మ కూడదని సంకల్పించుకుంది.
నిజాయితి గల ఆవు
ఒక రోజు ఒక అడవిలో వేటకు బయలుద్యారిన పులికి ఒక ఆవు కనిపించింది. ఆ ఆవు ప్రశాంతంగా అడవిలో గడ్డి మేస్తోంది. ఆ ఆవుని చూడగానే పులికి నోరూరుంది. ఈ రోజు ఆవు భోజనం బాగుంటుంది అని నిశ్చయించు కుంది. ఆ ఆవు పైబడ డానికి రెడీ అవుతుంటే ఆవు చూసింది.
“ఆగండి పులిగారు, ఆగండి!” అని గట్టిగా కేక పెట్టింది.
పులి నిర్ఘాంత పోయింది. ఇంత వరకు ఏ జంతువూ పులిని ఆగమని అడగలేదు. జంతువులు భయ పడడం, పరుగు పెట్టడం, వాటిని వేటాడడం, పులికి తెలుసు. కాని ఇలా ఆగమనడం? ఇది కొత్త విషయం.
సంగతేంటో తెలుసుకుందామని పులి ఆగింది.
“అడగ గానే ఆగినందుకు థాంక్స్, మీకు అడ్డు పడినందుకు క్షమించండి.” అంది ఆవు.
“విషయం ఏమిటో చెప్పు” అంది పులి.
“నాకు ఇంట్లో ఒక దూడ ఉంది. నేను రోజు పొద్దున్నే ఆ దూడకి పాలు ఇచ్చి, ఈ అడవిలోకి వచ్చి, రోజంతా గడ్డి మేస్తాను. సాయంత్రం మళ్ళి వెళ్లి దూడకు పాలిస్తాను. రోజు లాగానే ఈ రోజు కూడా దూడతో సాయంత్రం మళ్ళి వస్తానని, పాలు ఇస్తానని చెప్పాను. ఇప్పుడు వెళ్లక పొతే నా దూడకు పాలుండవు. జీవితమంతా అమ్మ ఏమైంది అని ఆలోచిస్తూ వుంటుంది నా బిడ్డ. మీరు నాకు ఒక్క పూట గడువిస్తే నేను ఇంటికి వెళ్లి దూడకి పాలిచ్చి, జరిగిందంతా చెప్పి, మళ్ళీ పొద్దున్నే వచ్చేస్తాను. ప్లీజ్ ఈ సహాయం చేయండి!” అని ఆవు అడిగ్గింది.
పులి నవ్వడం మొదలెట్టింది. “బాగానే చెప్పావు కథ. నా నుంచి తప్పించుకోవడానికే కదా?” అంది.
“లేదు, పొద్దున్నే వచ్చేస్తాను కదా, నన్నూ నమ్మండి” అంది ఆవు.
పులికి ఆవు మాట నమ్మాలో, నమ్మ కూడదో అర్ధం కాలేదు. ఒక విధంగా ఆలోచిస్తే ఆవు మాటల్లో చాలా నిజాయితి కనిపించింది. కాని ఇలాంటి కథ ఎవరు నమ్ముతారు? ఒక సారి పులిని తప్పించుకున్న వాళ్ళు మాళ్ళి ఆ పులి దేగ్గిరకి వెళతారా? అసలు సాధ్యమా?
యేది ఏమైనా ఆవు తెలివిని మెచ్చుకో వలసిందే. సరేలే వేరే ఆహారం ఏదైనా వెతుక్కుందాము, ఆవుని వదిలేద్దాము అని నిశ్చయించుకుంది పులి. మళ్ళీ ఆవు తిరిగి రాదని తెలిసినా ఊరికే “సరే వెళ్ళు, రేపు పుద్దున్నే ఇక్కడే నీ కోసం ఎదురు చూస్తాను” అని ఆవుతో అంది.
ఆవు మొహం మీద సంతోషం, ఆశ్చర్యం రెండు కనిపించాయి.
ఆవు, “నేను తప్పకుండా వస్తాను, నా మాట నమ్మండి” అని ఇంటికి బయలుద్యారింది.
—
ఇంట్లో దూడకి పాలు ఇచ్చి, జరిగింది చెప్పింది. అమ్మ లేకపోయినా పరవాలేదు, నీకు అందరు సహాయం చేస్తారు నువ్వు మంచిగా ఉండాలి, అని దూడకి ధైర్యం చెప్పింది.
గ్రామంలోని తన బంధువులు, మిత్రులు అయిన ఇతర ఆవుల కి కూడా జరిగిన సంగతి చెప్పి, “నేను లేనప్పుడు నా దూడని కూడా మీ బిడ్డ లాగా చూసుకోండి,” అని కోరింది.
ఇతర ఆవులన్నీ కలిసి ఈ ఆవుని తిరిగి వెళ్ళకుండా ఆపడానికి ప్రయత్నం చేసాయి. “పులినుంచి తప్పించుకుని మళ్ళి వేలతానంతావేంటి? అసలు ఇందులో అర్ధముందా?” అని చాలా నచ్చ చెప్పడానికి చూసాయి. కాని మన ఆవు, “లేదు, నేను మాట ఇచ్చాను, నా దూడకి పాలు ఇచ్చి, ఎవరికైన అప్ప చెప్పి తప్పకుండా తెల్లారగానే వచ్చేస్తానని మాట ఇచ్చాను” అని చెప్పింది.
పొద్దున్నే ఆవు దూడ విడిపోతూ బాగా ఎడిచాయి. మరొక సారి ఆలోచిన్దుకోమని బంధు మిత్రులు చెపుతున్నా తన మాట మీద నిలపదాలని ఆవు అడవిలోకి వెళ్ళింది. కాని మనసు మట్టుకు భారంగానే వుంది. బాగా భయ పడుతూ అడవి చేరుకుంది.
అడవిలో పులికి ఆవు వస్తుందని ఏ మాత్రం నమ్మకం లేదు! అయినా ఎందుకో ఒక ఉత్సుకత. ఆవు వస్తుందా రాదా అని తెలుసుకోవాలనే ఆసక్తి. అందుకని అనుకున్న సమయానికి మళ్ళి ఆ ఆవును కలుసుకున్న చోటికి వెళ్ళింది.
అక్కడ ఆవుని చూసి చాలా ఆశ్చర్య పోయింది. “నువ్వు నిజంగా వస్తావనుకో లేదు! నీ దూడకి చెప్పావా?” అని అడిగింది.
ఆవు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నా, ధైర్యంగా సమాధానము చెప్పింది, “మీరు చేసిన సహాయానికి చాలా థాంక్స్ అండి – నేను దూడకి పాలిచ్చి, జరిగినది చెప్పి, సెలవు తీసుకుని వచ్చాను.”
“మరి నేను నిన్ను తినేస్తే నీ దూడకి పాలు ఏవరు పడతారు?” అని పులి అడిగింది.
“నా బంధు మిత్రులకు అప్ప చెప్పి వచ్చాను” అంది ఆవు.
“మరి వాళ్లకి ఏం చెప్పావు?” అంది పులి.
“నిజమే చెప్పాను,” అంది ఆవు.
“వాళ్ళు నిన్ను ఆపలేద? వెళ్ళద్దని అనలేదా?” అని ఆశ్చర్యంగా అడిగింది పులి.
‘అన్నారుకాని, నేను మీకు మాట ఇచ్చాను కదా. అందుకే అందరికి సద్ది చెప్పి వచ్చాను” అంది ఆవు.
పులికి ఆవు నిజాయితి చాలా నచ్చింది. “ఇంత వరకు నేను నీ లాంటి జంతువును ఎప్పుడు కలవ లేదు. నీ లాగా ఇలా మాట మీద నిలపడ డానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను. నీ లాంటి మంచి ఆవుని నేను తినలేను. నువ్వు నిర్భయంగా రోజు ఈ అడవిలోకి వచ్చి వెళ్ళచ్చు” అని చెప్పి, ఆవుని ఏమి చేయకుండా వెళ్ళిపోయింది.
ఆవుకి బాధ, ఏడుపు, మనసులోని భారం, అన్ని టప్పున తగ్గిపోయాయి. ఆ రోజు గడ్డి మేయకుండానే పరిగెత్తుకుంటూ మళ్ళి ఇంటికి వెళ్లి దూడని గట్టిగా వాటేసుకుంది.
మనం నిజం చెబుతూ, నిజాయితీగా వుంటే పెద్ద పెద్ద ఆటంకాలు కూడా ధైర్యంగా ఎదురుకో గలము.
నాన్నా! పులి!
అనగనగా ఒక ఊరిలో చాలా మంది గొర్రెల కాపర్లు ఉండేవారు. రోజు ఆ కాపర్లు అందరు కలిసి గోరీలనిటిని ఒక కొండ మీదకి తీసుకెళ్ళే వారు. ఆ గొర్రెలు అక్కడ గడ్డి మీసేవి. కాపర్లు రోజంతా అక్కడ వుండి సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చేవారు.
ఇలా ఉండగా ఒక రోజు ఒక కాపరి అబ్బాయి “నాన్న నన్నూ నీతో తీసుకు వెళ్ళవా, నేను వస్తాను” అని ఆడిగాడు. గొర్రె కాపరి, “వద్దురా అక్కడ నీకు ఏమి ఉండదు, అస్సలు తోచదు” అని యెంత చెప్పినా విన కుండా పంతం పట్టి మొండి చేసాడు ఆ అబ్బాయి. మొత్తానికి పోరు పడలేక “సరే, రా!” అని ఆ గొర్రె కాపరి ఆ రోజు కొడుకుని కూడా తోడుగా తీసుకుని వెళ్ళాడు.
మొదట్లో అబ్బాయి కి చాలా నచ్చింది. తెల్లవార గానే బయలుద్యారారేమో, ఆ చల్లటి వాతావరణం, చుట్టూరా గొర్రెలు, ఆ కొండ, కొండమీద సూర్యోదయం, అన్ని అందంగా, ఆహ్లాదకరంగా అనిపించాయి. అబ్బాయి చాలా సంబర పడుతూ, సంతోషంగా వున్నాడు.
అదే మధ్యానం అయ్యే సరికి, మండే సూర్యుడు, పెద్దలందరూ గొర్రెలు కాస్తూ ఎవరి పనిలో వాళ్ళు ఉండడంతో ఆ పిల్లాడికి ఏమి తోచ లేదు. అక్కడ వాళ్ళ నాన్న చెప్పినట్టే అతనికి ఏ పని లేదు.
కొంత సేపు ఏదో కాలక్షేపం చేసుకున్నాడు, కాని ఆ తరువాత అంతా చాలా బోరింగ్ గా అనిపించింది. ఏదైనా జరిగితే బాగిండును అనిపించింది.
ఆకస్మికంగా ఓక ఆలోచన వచ్చింది. వచ్చిన వెంటనే మంచి, చెడు ఆలోచించ కుండా, గట్టి గా, “నాన్నా! పులి! నాన్నా! పులి!” అని కేకలు పెట్టడం మొదలెట్టాడు.
కేకలు విన్న గొర్రె కాపర్లందరూ చేతికి దొరికిన రాళ్ళు, రప్పలు, కత్తులు, కర్రలూ తీసుకుని ఆత్రుతగా పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చి చూస్తే అక్కడ ఏ పులి లేదు. అందరు ఆ అబ్బాయి వంక కోపంగా చూసారు. వాళ్ళని అలా చూస్తే అబ్బాయికి బాగా నవ్వొచ్చింది. పెద్దలు తల ఒప్పుకుంటూ వెళ్లి పోయారు.
ఇదేదో బాగందని, అందరు మళ్ళి పనుల్లో బిజీగా అయిపోయాక, మళ్ళి గట్టిగా “నాన్నా! పులి! నాన్నా! పులి!” అని అరుపులు మొదలెట్టాడు.
మళ్ళీ అందరూ ఎక్కడ పనులు అక్కడ వదిలేసి, రాళ్ళు రప్పలు, కత్తులు, కర్రలు, వేసుకుని పరిగెత్తుకుంటూ వచ్చారు. అక్కడ ఏ పులి లేదని చూడగానే ఈ సారి వాళ్ళకి చాలా కోపం వచ్చింది. అబ్బాయిని బాగా తిట్టి, మళ్ళీ ఇలా చేయొద్దని బాగా మందలించారు. వాళ్ళ కోపం చూసి, హెచ్చరిక విన్న అబ్బాయి భయ పడ్డాడు. మళ్ళీ ఇలా చేయకూడదని అనుకునాడు.
కొంత సేపటికి నిజంగా అక్కడకి పులి వచ్చింది. అబ్బాయి చాల భయ పడ్డాడు. గట్టిగా మళ్ళి “నాన్నా! పులి! నాన్నా! పులి!” అని అరిచాడు.
కపర్లంతా ఆ అబ్బాయి మళ్ళీ ఊరికే అరుస్తున్నడు అనుకున్నారు. ఈ సారి ఎవ్వరు సహాయానికి రా లేదు. ఎవ్వరి పని వాళ్ళు చేసుకుంటూ ఆ అబ్బాయిని పట్టించుకో లేదు.
ఆ అబ్బాయి దేగ్గిరున్న చెట్టు ఎక్కి పులికి అందకుండా కూర్చున్నాడు. పులి మట్టుకు దేగ్గిరలో ఉన్న ఒక గొర్రెను చంపేసింది. యెంత తినాలో అంత తిని వెళ్లి పోయింది.
భయంతో ఆ అబ్బాయి మట్టుకు రోజంతా చెట్టు మీదే ఉన్నాడు. ఆకలి, దాహం అన్ని మరిచిపోయి ఏడుస్తూ రోజంతా గడిపాడు.
సూర్యాస్తమం అవుతుంటే కాపర్లంతా తిరిగి వెళ్తూ ఆ అబ్బాయిని కూడా తీసుకు వెళ్దామని వెతుకుతూ వుంటే చెట్టు మీంచి దిగి జరిగినది అంతా చెప్పాడు. ఆ పులి చంపిన గొర్రెను చూపించాడు.
రాత్రి ఇంటి కి వెళ్లి జరిగినదంతా అమ్మతో చెప్పుకున్నాడు. “యెంత పిలిచినా ఎవ్వరు రాలేదమ్మా! చాలా భయమేసింది!” అని చెప్పుకున్నాడు.
“ఒక్క సారి నువ్వు అబద్ధాలూ ఆడతావని అనుకుంటే, తరవాత నువ్వు నిజం చెప్పినా ఎవ్వరు నామారు బాబు” అని చెప్పింది వాళ్ళ అమ్మ.
ఆ రోజు తరువాత ఆ అబ్బాయి ఎప్పుడు అబద్ధాలూ ఆడలేదు, కాని అతని కథ మట్టుకు ఈ రోజుకీ మనం అనాదరం చెప్పుకుంటున్నాము.
గొడవ పడి ఏమి లాభం?
ఒక ఊరిలో ఇద్దరు మిత్రులు ఉండే వారు. వాళ్ళు రోజూ కలిసి స్కూల్ కి వెళ్ళే వారు, కలిసి ఆడుకునేవారు, అసలు ఎప్పుడు ఒకళ్ళని వదిలి ఇంకొకళ్ళు కనిపించే వారే కాదు. ఊళ్ళో అందరికి వాళ్ళు మంచి స్నేహితులు అని తెలుసు.
ఒక రోజు ఇద్దరు మిత్రులు కలిసి బడి అయిపోయాక పార్కులో ఆడుకోవడానికి వెళ్ళారు. పార్కులో ఎవరో పడేసిన ఒక తాడు కనిపించింది. ఆ తాడుతో స్కిప్పింగ్ చేయచ్చు అని ఇద్దరు సరదా పడ్డారు. ఇద్దరు ఆ తాడు వైపుకి పరిగెత్తారు. నాది, అంటే నాది అని దేబ్బలాడుకున్నారు.
హోరా హరీ దెబ్బలాడుకుంటూ తలో అంచు పట్టుకుని లాగటం మొదలెట్టారు. ఒకడు ఒక అంచున, మరొకడు మరో అంచున పట్టుకుని ఉన్న శక్తంతా వాడి ఆ తాడు గుంజుకోవాలని ప్రయత్నించారు.
ఇలాలాగుతుంటే, తాడు పాతదేమో ఠప్పు మని విరిగి పోయింది. ఇద్దరు ఒకటే సారి ధమ్మని తలోక వైపు పడ్డారు. ఇద్దరికీ బాగా దెబ్బలు తగిలాయి.
ఆ విరిగి పోయిన తాడు ఏమి చేసుకుంటారు? అక్కడే పడేసి ఇంటికి వెళ్ళారు.
కంది పోయిన మొహాలు, మాసి పోయిన బట్టలు, రేగిన జుట్టు, వంటి మీద గాయాలు వేసుకుని వెళ్ళిన ఇద్దరికీ ఇంట్లో బాగా తిట్లు పడ్డాయి.
మొన్నాడు ఇద్దరు స్నేహితులు కలిసి సంధి చేసుకున్నారు. తాడూ దక్కలేదు, దెబ్బలూ తగిలాయి; ఇంట్లోను చివాట్లు పడ్డాయి అనుకున్నారు. అదే దేబ్బలాడుకోకుండా ఆ తాడుని పంచుకుని వుంటే ఇద్దరు వంతులేసుకుని స్కిప్పింగ్ చేసేవారని బాధ పడ్డారు.
ఇద్దరు అనుకున్నారు: అవును, గొడవ పడి ఏమి లాభము?
అలవాటు
ఒక వూళ్ళో సుబ్బమ్మ సూరమ్మ అని ఇద్దరు ఆడవాళ్ళుండేవారు. సుబ్బమ్మ పూలు అమ్ముకునేది. సూరమ్మ చేపలు అమ్ముకునేది. వేరే వాళ్ళను చూసే వారెవరూ లేకపోవడంతో కష్ట పడాల్సి వచ్చేది.
ఒక రోజు వాన పడడంతో ఆలస్యం అయిపోయింది. పూట కూళ్ళ పెద్దమ్మ ఇంట్లో ఆ రాత్రికి తలదాచుకోవాలని నిశ్చయించుకుని, పెద్దమ్మ ఇంట్లో ప్రవేశించారు. తినడానికి పెట్టి, నిద్రపోవడానికి గది చూపించింది పెద్దమ్మ.
సూరమ్మ పూల వాసన భరించలేక పోయింది. ఎంత ప్రయత్నించినా నిద్రపోలేక చాలా అవస్థ పడింది. వెళ్ళి తన చేపల బుట్ట తెచ్చుకుని, తలవైపు పెట్టుకుని హాయిగా నిద్రపోయింది. తెల్లవారి ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు.
పెద్దమ్మ ఆశ్చర్యపోయింది. సువాసనలు వెదజల్లే పూలు ఎవరికి నచ్చవు? అవి సూరమ్మకి ఎలా వెగటయ్యాయని పెద్దమ్మ చాలా సేపు ఆలోచించింది.
మీకేమైన తెలిసిందా?
సూరమ్మ పొద్దస్తమానూ చేపలతోనే గడుపుతుంది కదా! అందుకే ఆ వాసనే అలవాటు అయిపోయింది. పూల సువాసనని ఆస్వాదించలేదు.
నిరక్షర కుక్షి
అనగనగా ఒక జమీందారు పొరుగూరిలో వున్న తన కూతురికి ఒక బుట్టలో నిండా మామిడిపళ్ళు పెట్టించి, నమ్మకస్తుడైన నౌకరుకిచ్చి పంపించాడు.
దారి మధ్యలో ఆయాసం తీర్చుకోడానికి సేవకుడు బుట్టను దించి, ఒక చెట్టు నీడలో కాస్సేపు విశ్రమించాడు.
ఘుమ ఘుమలాడి పోతున్నాయి ఆ బుట్టలో మామిడిపళ్ళు. ఒక పక్క యెండా, మరో పక్క ఆకలి. ఆ పైన ఆ ఘుమ ఘుమలూ. సేవకుడు ఉండ పట్ట లేక పోయాడు.
జమీందారు పళ్ళతో ఇచ్చిన లేఖను ఒక గొయ్యి తీసి కప్పెట్టాడు. జిహ్వ చాపల్యంలో ఒకటి కాదు, రెండు కాదు, నాలుగు పళ్ళు తినేసాడు. హాయిగా ఒక చిన్న కునుకు తీసాడు.
యేమి ఎరగనట్టు గొయ్యిలోంచి లేఖని తవ్వి తీసుకుని, బుట్టనెత్తుకుని బయలుదేరాడు.
జమీందారు కూతురు బుట్టనీ, లేఖనీ తీసుకుంది. తండ్రి పంపించిన లేఖ చదివింది. పళ్ళు లెక్ఖబెట్టించింది.
“నాలుగు పళ్ళు తక్కువున్నాయేమిటి?” అని నిలదీసింది. “నువ్వేమైన తిన్నావ?”
“అయ్యో! అయ్యో! ఇదెక్కడ విడ్ఢూరం తల్లీ! నేలలో పాతిపెట్టాను కదా, ఈ లేఖ ఎలా చూసింది?” అని లబో దిబో మని తల కొట్టుకున్నాడు.
జమీందారు కూతురికి నవ్వొచ్చేసింది. సేవకుడిని క్షమించేసింది.
కాని, చూసారా పిల్లలు, మూర్ఖుడైన ఆ నౌకర్కి చదువు కూడా రాకపోతే ఎంత అనర్ఘమో?
అఙ్నానం, మూర్ఖత్వం
అనగనగా ఒక మడుగులో చాలా కప్పలు జీవిస్తూ వుండేవి. బెక బెకలతో ఆ మడుగు ధ్వనిస్తూ వుండేది.
ఒక రోజు ఒక పిల్ల కప్ప తన తల్లి కప్పని బయటికి వెళ్ళడానికి అనుమతిని అడిగింది. తల్లి కప్ప వెంటనే – “చాలా దూరం వెళ్ళితే తప్పి పోతావు. ఇక్కడిక్కడే తిరుగు – నాకు నిన్ను వెతకటం కష్టం.” అంది. పిల్ల కప్ప పట్టు వదలకుండా చాలా సేపు బతిమాలింది. చివరికి విసుకు చెంది, తల్లి కప్ప కసురుకుంది. “నేను మా అమ్మ మాట విన్నాను, ఎప్పుడూ ఈ మడుగు దాటలేదు. నువ్వూ నా మాట విను” అంది.
పిల్ల కప్ప చాలా మొండిది. అమ్మ మాటలకు ఇంకా పంతం పట్టింది. “అనుమతిని అడిగితే ఇలాగే వుంటుంది. అనుమతినే కదా అడిగాను, ఎందుకు అమ్మ అంతా విసుక్కోవాలి” అని తనలో తను గొణుగ్గుంటూ మడుగంతా తిరుగుతూ అంచుల దెగ్గిరకి వెళ్ళిపోయింది.
ఎదురుగా గట్టు మీద ఒక మనిషిని చూసింది. పిల్ల కప్ప అదే మొదటి సారి ఒక మనిషి ని చూడటం. ఆ ఎత్తూ ఆకారం చూసి చాలా జడుసుకుంది. ఖంగారుగా ఈదుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చేసి, చూసింది చెప్పింది.
తల్లి కప్ప కూడా ఏనాడూ మనిషిని చూడలేదు గా, అందుకే, “ఎంత లావున్నాడు?” – పొట్ట వుబ్బించింది. “ఇంత వున్నాడా?”
“ఊహూ” అని అడ్డంగా తల ఊపింది పిల్ల కప్ప.
“ఇంత?” అని ఇంకా పొంగించింది తల్లి.
“ఊహూ” అని మళ్ళి అడ్డంగా తల ఊపింది పిల్ల కప్ప.
“ఇంత? పోనీ ఇంతా? ఇదిగో చూడు, ఇంతా?” అంటూ పొట్ట వుబ్బించి, వుబ్బించి, పొట్ట పేలి క్రింద పడిపోయింది తల్లి కప్ప.
పల్లెటూరి ఎలుక, పట్టణం ఎలుక
ఒక రోజు ఒక పట్టణం ఎలుక తన బంధువును కలవడానికి పల్లెటూరు వెళ్ళాడు.
పట్టణం నుంచి వచ్చిన తన బంధువును చూసి పల్లెటూరు ఎలుక చాలా సంతోషించింది. అతిధి మర్యాదలు చేయడానికి ఎక్కువ ఏమి లేకపోయిన తన దెగ్గిర వున్న స్వల్పాహారంతో జున్ను ముక్క, పళ్ళు పెట్టి ఏంతో మర్యాద చేసింది.
పట్టణం ఎలుక మట్టుకు జున్ను ముక్క చూసి, “ఇదేంటి? నువ్వు ఇంకా జున్ను ముక్కల మీదే బతుకుతున్నావా? నా మాట విని నాతో పట్నం వచ్చేయి. అక్కడ రోజు విందు భోజనం తినొచ్చు. ఎంత కాలం ఇలా పేదరికంలో గడిపేస్తావు?” అని అడిగింది.
ఈ మాటలు విని ఆశ కలిగిన పల్లెటూరి ఎలుక పట్నం వెళ్ళడానికి తయ్యారు అయ్యింది. రెండు ఎలుకలూ రోజంతా ప్రయాణం చేసి బాగా ఆకలి మీద పట్నం చేరుకున్నాయి.
పట్నం ఎలుక గర్వంగా తను ఉంటున్న ఇంట్లో వంట గదికి తీసుకువెళ్ళింది. ఆకడ ఇంట్లోవాళ్ళు వండుకున్న భోజనం ఇద్దరు ఎలుకలకు పండగ రోజు తినే విందు భోజనంగా అనిపించింది.
పల్లెటూరి ఎలుక, “నువ్వు నిజమే చెప్పావు! మా వూరిలో ఎప్పుడొ పండగలకు తప్ప ఇలా వండుకోరు మనుషులు. పొద్దున్నే పొలానికి వెళ్ళే హడావిడిలో చద్దన్నం తిని వెళ్ళిపోతారు. ఇది చాలా బాగుంది” అంటూ ముందు ఏమి తిందామా అని చుట్టూరా చూసుకుంది.
కాని ఎలుకలు భోజనం ముట్టుకునే లోపల ఒక భయంకరమైన శబ్దం విని పించింది. పల్లెటూరి ఎలుక ఖంగారు పడి, “ఆ చప్పుడు ఏమిటి?” అని అడిగింది.
“ఇంటి కుక్కలోస్తాన్నాయి, త్వరగా దాక్కో!” అంటూ పట్నం ఎలుక ఒక రంద్రంలోకి దూరింది. వెనుకే పల్లెటూరి ఎలుక కూడా దూరింది. “ఇలా ఎంత సేపు?” అని అడిగింది.
“అవి అలా వస్తూనే వుంటాయి. అవి చూడనప్పుడు మనకి కావాల్సిన ఆహారం ఈ రంద్రంలోకి తెచ్చుకుని హాయిగా తినచ్చు” అని పట్నం ఎలుక జవాబు చెప్పింది.
ఇది విన్న పల్లెటూరి ఎలుక, “భయ పడుతూ విందు భోజనం తినే కన్నా ప్రశాంతంగా జున్ను తినడం మేలు!” అని ఆలస్యం చేయకుండా వెంటనే తన ఊరికి వెళ్ళిపోయింది.
అత్యాశగల కుక్క
అననగానగా ఒక కుక్క వుండేది. ఒకరోజు ఆ కుక్కకి ఒక మాంసం ముక్క దొరికింది. ఈ రోజు మంచి భోజనం దొరికింది అనుకుని సంతోషంగా ఆ కుక్క మాంసం ముక్కను
నోట్లో పెట్టుకుని తన ఇంటి వైపుకు బయలుద్యారింది.
దారిలో ఒక నది వుంది. ఆ నది గట్టున నడుస్తుంటే నీటిలో కుక్క ప్రతిబింబం కనిపించింది.
కుక్క తన ప్రతిబింబం చూసి వేరే కుక్క అని భ్రమపడింది.
“ఆ కుక్క నోట్లో కూడా మాంసం ముక్క వుంది, అది కోడా నాకే దొరికితే బాగుంటుంది” అనుకుంది. నీటిలో వున్నా కుక్క వైపు చూసి గట్టిగా మొరిగింది.
నోరు తెరిచిన వెంటనే నోట్లో ముక్క పడి నీటిపాలయ్యింది. అప్పుడు కుక్క నిజం గ్రహించి బాధ పడింది.
అత్యాశకి పోకుండా వున్న ముక్కను చక్కగా ఇంటికి తీసుకుని వెళ్లి తింటే బాగుండేది అనుకుంటూ వేరే ఆహారం వెతకడం మొదలుపెట్టింది.
అద్దం లో మనిషి
చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. ఆటను చాలా తెల్లగా, పొడుగ్గా, అందంగా ఉండేవాడు. ఊళ్ళో అందరు అతని అందాన్ని మెచ్చుకునే వారు.
అందరి పొగడ్తలు విని ఆ వ్యాపారస్తుడు బాగా గర్వం పెంచుకున్నాడు.
వయసుతో పాటు కొంచం కొంచం అందం తగ్గడం మొదలైంది. మనుషులు పెద్ద వాళ్ళు అయ్యే కొద్ది కొంచం మొహం మీద ముడతలు అవి వస్తాయి కదా! అతనికి కూడా కొంచం కొంచం మొహం మారటం మొదలైంది.
ఒక రోజు అద్దంలో చూసుకుంటే, కళ్ళ కింద నలుపులు, ముడతలు చూసి చాలా విచారించాడు. అతనే అందమే అతని అహంకారం. ఆ అందం తగ్గడం అతనికి అస్సలు ఇష్టం లేదు. అందంగా, ఎప్పుడు యౌవనంలో ఉండడానికి ఏమైనా చేయడానికి ఆటను సిద్ధ పడ్డాడు.
ఊరి చివరన ఒక తాంత్రికుడు ఉండేవాడు. అతని దేగ్గిరకు వెళ్లి ఉపాయమదిగాదు. ఆ తాంత్రికుడు వ్యాపారస్తుడకు ఒక అద్దం ఇచ్చాడు. “రోజు ఈ అద్దం చూసుకో. నీకు వయసుతో రావాల్సిన మార్పులన్నీ ఈ అద్దంలో నీ ప్రతిబింబములో కనిపిస్తాయి. నువ్వు మట్టుకు యెప్పుడు ఇలాగే ఉండిపోతావు” అన్నాడు. “కాని ఒక్క విషయం. నువ్వు ఎంత మంచి మనిషిలా వుంటే నీ ప్రతిబింబం అంత బాగా వుంటుంది. నీవు చేసే ప్రతి చెడు పని నీ ప్రతిబింబం మీద కనిపిస్తుంది.” అని హెచ్చరించాడు.
అద్దం తీసుకుని వ్యాపారస్తుడు సంతోషంగా ఇంటికి వెళ్ళాడు.
ఆ రోజునుంచి నిర్భయంగా తనకు నచ్చినట్టు పాపాలు చేసుకుంటూ, తప్పులు చేస్తూ, ఆహాన్కారిగా జీవితం కొనసాగాడు. రోజు అద్దంలో వచ్చే మార్పులు చూసి ఐదు నిమిషాలు బాధ పడ్డ ఆటను చేసే పనులు, అతని నడవడిక మార్చుకోలేదు.
కొంత కాలానికి అద్దంలో మొహం చాలా కురుపిగా మారిపోయింది. చూస్తె భరించలేనంత అసహ్యంగా తయ్యరాయ్యింది. కాని ఆ అద్దానికి ఒక రకమైన కట్టు వుంది. అతని ప్రతిబింబము చూడకుండా వుందామన్న ఉండలేక పోయేవాడు.
ఒక రోజు రాత్రి భరించలేక ఆ అద్దం గోడ మీంచి తీసి కిందికి విసిరేశాడు. అద్దం ముక్కలు ముక్కలుగా విరిగి పోయింది.
తెల్లారేసరికి అతని గదిలోకి ప్రవేశించిన సేవకుడికి మంచంపైన ఒక అసహ్యమైన, కురూపిగా ఉన్న ఒక వయసు మళ్ళిన వృద్దుడి శవం దొరికింది. ఎవరికి ఆ శవం ఎవరిదో, వాళ్ళ ఎజమాని, ఆ వ్యాపారస్తుడు ఎక్కడున్నాడు ఇప్పటికి తెలియదు.
ఊరవతల ఉన్న తంత్రికుడికి తప్ప.
పాము-స్నేహం
అనగనగా ఒక రహదారిలో నడుస్తున్న బైతుకి చలిలో వణుకుతూ, బిగుసుకు పోయిన ఒక పాము కనిపించింది.
ఆ వణుకుతున్న పామును చూసి ఆ బైతుకు చాలా జాలి కలిగింది. వెంటనే ఆ పాముకు పాలు పోశాడు. పాలు గడగడా తాగినా ఆ పాముకు చలి, వణుకు తగ్గలేదు.
జాలితో ఆ బైతు పామును తన ఛాతీ దెగ్గిరకు తీసుకుని, నెమ్మదిగా నిమిరాడు. కొద్దిసేపటికి ఆ పాముకు వణుకు తగ్గింది.
వేంటనే పాము తన అసలు స్వభావము చూపించింది. ఆ బైతును కాటువేసింది. పాపం ఆ బైతు పాముకాటుకి మరణించాడు.
దుష్టులకు ఎంత జాలి, కరుణ చూపించినా, వారికి కృతజ్ఞత వుండదు. అందుకనే పెద్ద వాళ్ళు జాగ్రత్తగా వుండి, మంచి వారితోనే స్నేహము చేయమని చెబుతారు
సింహము-ఎలుక
అనగనగా ఒక అడవిలో ఒక సింహము వుండేది. ఒక మధ్యానము ఆ సింహము కునుకు తీస్తూ వుండగా ఒక ఎలుక ఆ సింహము పంజా దెగ్గిర నుంచి వెళ్ళింది. కిసకిసా పరిగెడుతున్న ఎలుకని సింహము పట్టుకుంది. అల్పహారముగా బాగానే వుంటుందన్న ఉద్దేశంతో ఆ ఎలుకను నోట్లో పెట్టుకోబోయింది.
సింహము ఉద్దేశం గ్రహించిన ఎలుక వెంటనే – “ఓ రాజన్, నన్ను వదిలేయి. నా చిన్న శరీరంతో నీకు ఎలాగా ఆకలి తీరదు. నాన్ను వదిలేస్తే యే రోజైనా నీకు పనికివస్తాను!” అని ప్రాధేయపడింది.
“నువ్వు నాకు యెమి పనికివస్తావులే కాని, క్షేమంగా వెళ్ళు.” అని ఆ సింహము నవ్వుతూ ఎలుకను వదిలేసింది.
ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు సింహము అడవిలో వేటాడుతుంటే ఒక వేటగాడి వలలో చిక్కుకుంది. ఎంత బాధతో మెలికలు తిరిగినా వలనుంచి బయటపడలేక పోయింది. చివరికి కోపంతో, నిస్సహాయతతో గట్టిగా అడవి మొత్తం వినిపించేలా గర్జించింది. జంతువులన్ని దడుచుకుని దాక్కున్నాయి.
కొద్ది సేపటికి చిన్నగా, బింకంగా ఒక చెట్టువెనుకనుంచి ఎలుక కనిపించింది. సింహం పరిస్తిథి చూసి వెంటనే ఎలుక తన దంతాలతో ఆ వలను చిన్న చిన్నగా కొరికి తీసేసింది. చాలా సేపు కష్ట పడింది. చివరికి వలలో పెద్ద చిల్లు తయ్యారయ్యింది.
సింహం వలలోంచి బయట పడింది. ఎలుక వైపు కృతజ్ఞతతో తిరిగి ధన్యవాదాలు తెలుపాలనుకునే సమయానికి ఎలుక పారి పోయింది.
“చిన్న ఎలుక నాకు యెమి పనికివస్తుంది అనుకున్నాను – ఈ రోజు నా ప్రాణాలు కాపాడింది. నేను యే జంతువునీ తక్కువగా అంచనా వేయకోడదు!” అనుకుని తన దారిని వెళ్ళింది.
అమ్మాయి కలలు
My daughter Megha told me this story, I think she heard it from my mother. She wanted to contribute to my blog so she asked me to post it – this one is for her. Hope you enjoy it.
అనగనగా ఒక ఊరిలో ఒక అమ్మాయి వుండేది. ఆ అమ్మాయి రోజూ ఆవు పాలు పితికి ఊరిలో అమ్మడానికి వెళ్ళేది. వచ్చిన డబ్బులతో రోజులు గడుపుకునేది.
ఒక రోజు ఆవు మామూలుగా కన్నా కొంచం యెక్కువ పాలు ఇచ్చింది. అది చూసి అమ్మాయి చాల సంతోషించింది. రోజు తీసుకువెళ్ళే బిందె కన్నా పెద్ద బిందిలో పాలు నింపుకుని తలపైన పెట్టుకుని ఊరివైపు బయలుద్యారింది.
దారిలో సంతోశంగా నడుచుకుంటూ యెన్నో ఊహలు అల్లటం మొదలెట్టింది. “ఈ రోజు ఇచ్చినట్టు రోజు ఆవు పాలు ఇస్తే నాకు రోజు యెక్కువ ఆదాయం వస్తుంది.
ఆ వచ్చిన అధికపు ఆదాయం నేను ఖర్చు పెట్టకుండా ఒక మూటలో దాచేస్తాను.
కొద్ది రోజులకి ఆ మూటలో చాలా డబ్బులు జమవుతాయి. అప్పుడు ఇంకో ఆవుని కొంటాను. అలా, అలా కొద్ది రోజులలో నా దెగ్గిర చాలా ఆవులు వుంటాయి.
అవి చూసుకోటాని పాలేరాళ్ళను పెడతాను. నేను రోజూ ఇలా యెండలో ఊరికి వెళ్ళే అవసరం వుండదు. అప్పుడు నేను కూడ తెల్లగా అయిపోతాను.
వెళ్ళి ఒక కొత్త పట్టు చీర కొనుక్కుంటాను. కొత్త పట్టు చీరలో నేను చాల అందంగా కనిపిస్తాను. చీరకు తగ్గట్టు సంతలో గాజులు, గొలుసు కూడ కొనుక్కుంటాను.
ఊరిలో యెవరింట్లోనైనా పెళ్ళి ఐతే, ఆ పెళ్ళికి చక్కగా తలస్నానం చేసి, కొత్త పట్టు చీర కట్టుకుని, నగలు పెట్టుకుని, జడలో పూలు పెట్టుకుని వెళ్తాను.
అక్కడ నేను ధగ ధగా మెరిసిపోతూ చాలా అందంగా కనిపించగానే నాకు చాలా సంబంధాలు చెబుతారు. కాని నాకు నచ్చిన సంబంధం వచ్చే దాక నేను యేది ఒప్పుకోను”
నచ్చని సంబంధం ఒప్పుకోను అనుకుంటూ ఆ అమ్మయి గట్టిగా తల అడ్డంగా ఊపింది. తల మీద రోజు మోసేదానికన్నా యెక్కువ బరువు వుందన్న విషయం మరిచిపోయింది.
ఢడేలుమని బిందె తలనించి పడి ముక్కలయిపోయింది. పాలన్నీ నేలపాలయ్యాయి.
ఆ పాలూ అమ్మలేదూ, యెక్కువ డబ్బులూ సంపాదించలేదు, ఆవులూ కొనలేదూ, పాలెరాళ్ళనీ పెట్టుకోలేదు, పట్టు చీరా కొనలేదు, గాజులూ కొనలేదు – ఊహించినవన్ని ఊహలలోనే వుండి పోయాయి.
పగటి కలలు కనే బదులు చేస్తున్న పని శ్రద్ధగా చేస్తే బాగుండేదని బాధ పడుతూ ఆ అమ్మాయి తిరిగి ఇంటివైపుకు వెళ్ళి పోయింది.
కాకి దాహం
అనగనగా ఒక అడవిలో ఒక కాకికి చాలా దాహం వేసింది. ఆ రోజు బాగ యెండగా వుంది, ఆ వేడికి కాకి గొంతు పూర్తిగా యెండిప్పోయింది. యెగిరే ఓపిక అయిపోయి, నీరసంగా నీళ్ళ కోసం వెతికింది.
చాలా సేపు వెతికాక ఒక కుండలో నీళ్ళు కనిపించాయి. ఆశగా ఆ కుండలో కాకిముక్కు పెట్టింది. కాని నీళ్ళు బాగ అడుక్కి వుండడంతో కాకిముక్కుకు అంద లేదు.
కాని తెలివైన కాకి ఒటమి ఒప్పుకోలేదు. చుట్టుపక్కలు పడున్న రాళ్ళను తీసుకుని వచ్చి ఆ కుండ లో పడేసింది. కుండ లోకి రాళ్ళు ముణిగిపోయి, నీళ్ళు పైకి తేలాయి. కాకి దాహం తీరే దాకా నీళ్ళు తాగి ఆనందంగా యెగిరిపోయింది.
నిజమే, మనసు వుంటే మార్గం వుంటుంది.
ఈ కధ నేను మా అమ్మాయి మేఘా కి చెప్పాను. అప్పుడు మేఘా నాతో అంది: “పాత కాలం కాకి కనుక కష్టపడి గులకరాళ్ళు వెతికి కుండలో వెశింది. అదే ఈ రోజులలో కాకి అయితే, ఒక straw వెతికి తాగేది”.
ఈ మాట విని నాకు చాల ఆశ్చర్యం అనిపించింది. ఈ కథ వెయ్యి సార్లు విన్నా ఈ మాట నాకు తట్టలేదు. నిజమే ఈ రోజుల పిల్లలు చాలా స్మార్ట్.
నోరు జారిన మాటలు
చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో చారుమతి అనబడే ఒక అమ్మాయి వుండేది. ఆ అమ్మాయి రోజంతా గాలి కబుర్లు చెప్పుకుంటూ గడిపేసేది. తను ఇక్కడ మాట అక్కడా, అక్కడి మాట ఇక్కడా చెబుతూ వుంటే చూశి వాళ్ళ అమ్మ చాలా బాధ పడేది. ఇలా గాలి కబుర్లు చెప్పడం తప్పని అమ్మ యెంత చెప్పినా చారుమతి మట్టుకు పట్టించుకునేది కాదు.
ఒక రోజు ఆ ఊరికి తీర్థ యాత్రలు చేస్తూ ఒక సాధువు వచ్చాడు. ప్రసంగంకు వెళ్ళిన అమ్మ తన బాధ సాధువుకు చెప్పుకుంది. చారుమతికి తన తప్పు అర్ధమయ్యేలా చెప్పమని ఆ సాధువును కోరుకుంది. ఆ సాధువు మన్నాడు చారుమతిని తన దెగ్గరికి తీసుకు రమ్మని చెప్పాడు.
మన్నాడు పొద్దున్నే అమ్మ చారుమతిని ఆ సాధువు దెగ్గిరకు తీసుకుని వెళ్ళింది. ఆ సాధువు చారుమతికి ఒక కోడిని చూపించి రోజంతా ఆ కోడి ఈకలు తీసి వూరు మొత్తం జల్లమని చెప్పాడు.
“ఇంతేనా?” అనుకుంటూ అమ్మ చారుమతిని కోడి ఈకలతో వూరంతా చుట్టుకుని రమ్మంది. చారుమతి సంతోషంగా ఊరంతా తిరుగుతూ కనిపించిన వారందరికి కబుర్లు చెపుతూ ఇక్కదో ఈక, అకాడో ఈక విసిరేసింది.
సాయంత్రం సూర్యోస్తమం అవుతుంటే అమ్మ, చారుమతి మళ్ళీ ఆ సధువుదెగ్గిరకు చేరారు. ఈ రాత్రి నిద్రపోయి మళ్ళి తెల్లవారగానె ఇద్దరినీ రమ్మన్నాడు సధువు.
మొన్నాడు పొద్దున్నే సాధువు, “నిన్న రోజంతా విసిరేసిన కోడి ఈకలు వెతికి తీసుకు రా అమ్మా” అని చారుమతితో అన్నాడు.
వెంటనే చారుమతి ఊరంత వెతకడం మొదలెట్టింది. సాయంత్రం దాక ఊరిలో ప్రతి అంగుళం వెతికినా ఒక్క ఈక కూడా కనిపించలేదు. దిగాలుగా చారుమతి సూర్యోస్తమమయ్యె సమయానికి ఆ సధువు దెగ్గిరికి వెళ్ళి, “స్వామి, నన్ను క్షమిచండి. నాకు ఒక్క ఈక కూడ దొరకలేదు” అని తల దించుకుని చెప్పింది.
అప్పడు సాధువు తనకు, “చూశావా, మన మాటలు కూడా ఆ ఈకలు లాంటివే. ఒక్క సారి మన నోరు జారితే ఆ మాటలను మనం యెన్నటికి తిరిగి తీసుకోలేము.” అని చెప్పాడు.
ఆ రోజు నుంచి చారుమతి గాలి కబుర్లు చెపుతూ ఇతర్లని, తన అమ్మని, ఇబ్బందిపెట్టడం మానేసింది.
దీపావళి పోటీ
అనగనగా ఒక ఊరికి ఒక రాజుగారు వుండేవారు. ఆయనికి చుట్టు పక్కల అన్ని రాజ్యాల్లో తన రాజ్యం గొప్పదిగా గుర్తించపడాలని చాలా తాపత్రయం వుండేది.
ఒక సంవత్సరం దీపావళి పండుగ దెగ్గిర పడుతుంటే రాజుగారికి ఓ ఆలోచన వచ్చింది. అన్ని రాజ్యాలకన్న ఆయన రాజ్యం లో పండుగ బాగా జరిగింది అనిపించుకోవాలని ఒక పోటీ ప్రకటించారు. రాజ్యంలో అందరికన్న బాగ దీపాలు పెట్టిన వారికి రాజుగారు స్వయంగా బహుమానం ఇస్తారని రాజ్యమంతా ఢిండోరా వెయ్యించారు.
రాజ్యంలో ప్రజలంతా కూడా పోటీలో ఉత్సాహంగా పాలుకున్నారు. ఒకరినిమించి ఒకరు ఇంటికి దీపాలు పెట్టుకుని అలంకరించుకున్నారు. దీపావళి రోజు సాయంత్రం రాజుగారు తన పరిచారకులతో రాజ్యాన్ని పరియటించారు. యెన్నో అద్భుతమైన ఇళ్ళను చూసి చాల సంతోషించారు.
ఊరి అంచులలో మట్టుకు ఒక ఇల్లు చీకటిగా కనిపించింది. రాజుగారు ఆ ఇంటిని చూశి, “ఆ ఇంట్లో యెవరుంటారు? యెందుకు వాళ్ళు ఇల్లు అలంకరించుకోలేదు?” అంటూ ఆ ఇంటి వైపుకు అడుగులు వేశారు.
ఇంటి దెగ్గిరకు వెళ్ళి చూస్తే ఇంటి బయిట రహదారి లో ఒక చిన్న దీపం వెలుగుతోంది. ఆ దీపం వెలుగులో రహదారిలో ఒక గొయ్యి కనిపించింది. ఇంటి అరుగు మీద ఒక అవ్వ కూర్చుని ఆ దీపం ఆరిపోకుండా అందులో నూనె పోస్తోంది.
ఇది చూశిన రాజుగారు, “అవ్వ, నువ్వు ఇక్కడ యెమి చేస్తున్నావు? మీ ఇంటికి దీపలు యెందుకు పెట్టలేదు?” అని అడిగారు.
“నా దెగ్గిర రోజు ఒక్క దీపం పెట్టే అంత దబ్బే వుంది. రహదారి మీద ప్రయాణం చేసే బాటసారులు ఈ గొయ్యి కనిపించకపోతే ఇందులో పడిపోతారు. అందుకే దీపం నా ఇంటిలో పెట్టుకోకుండా నేను రోజు వచ్చి ఇక్కడ దీపం పెడతాను” అని చెప్పింది.
జవాబువిన్న రాజుగారు చాల ఆశ్చర్యపోయారు. ఊళ్ళో అందరూ వారి ఇళ్ళని దీపలతో అలంకరించికుంటే అవ్వ మట్టుకు బాటసారులకు దారి చూపించటంకోసం దీపం పెట్టిందని, రాజ్యంలో అందరికన్న బాగ దీపాలు పెట్టినది ఆ అవ్వేనని ప్రకటించి, బహుమానం కూడా ఆ అవ్వకి ఇచ్చారు.
మొన్నాడే రాజుగారి ఆదేశంపై పనివాళ్ళు వచ్చి రహదారిలో వున్న గోతిని మరమ్మత్తు కూడా చేసారు.
వేరుశనగ దొంగ
కొన్ని సంవత్సరాల క్రితం ఒక వూరిలో లక్ష్మి పేరుగల ఒకావిడ వుండేది. ఆఅవిడకు రోజు సాయంత్రం ఇంటి దెగ్గిర వున్న పార్కులో ఒక బెంచి మీద కూర్చుని తనతో తెచ్చుకున్న పుస్తకం చదవడం అలవాటు. రోజు అదే బెంచి మీద కూర్చునే అలవాటు పడిన లక్ష్మిగారికి కొద్దిరోజలకి ఆ బెంచి ప్రత్యేకించి తనదే అన్న ఒక భావం ఏర్పడిపోయింది.
అలాగే ఒక రోజు పర్కులోకి వెళ్తుంటే అక్కడ వేడి వేడి గా వేరుశనగలు అమ్ముతున్న బండివాడు కనిపించాడు. వాసనకి నోరూరిన లక్ష్మి గారు ఒక పొట్లం వేరుశనగలు కొనుక్కుని తన మామూలు పధ్ధతి లో తన బెంచి కి వెళ్ళింది. చూస్తే అక్కడ తన బెంచి మీద అప్పటికే ఒక పెద్దాయిన కూర్చుని వున్నరు.
రుసరుసలాడుతూ తన షాల్వా, పర్సు, కూడా తెచుకున్న ఇతర సామాన్లు, చేతిలో వేరుశనగల పొట్లం పక్కన పెట్టి కూర్చుని పుస్తకం తీసింది.
చదువుతూ పక్కనవున్న వేరుశనగల అందుకుని వల్చుకుంటూ తినడం మొదలుపెట్టింది. తీరా చూస్తే పక్కనున్న పెద్దాయన కూడా అదే పొట్లంలోంచి వేరుశనగలు తీసుకుని తింటున్నారు. “యెంత పొగరు, అడగకుండానే నా వేరుశెనగలు తినేస్తునాడు, ఇలాంటి వాళ్ళు వుండ బట్టే మన దేశం ఇలా వుంది” అని మనసులో లక్ష తిట్టుకుంటూ పైకి ఏమి అనలేక అలాగే కాసేపు కూర్చుంది. కొద్ది సేపటి తరువాత ఎక్కడ పెద్దాయన వేరుశనగలు అన్ని తినేస్తారో అని లక్ష్మిగారు కూడ పోటి పడి గబ గబా మిగిలిన వేరుశెనగలు వల్చుకుని తినేసింది. అన్ని అయిపోయి చివరికి ఒక్క వేరుశనగ మిగిలింది. ఫెద్దాయన చిరునవ్వుతొ “ఇది మీరు తీసుకోండి” అని లేచి చిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోయరు.
ళక్ష్మిగరు “వేరుశనగ దొంగ!” అని చికకుగా అనుకుంది.
లేచి తన సామను బెంచి మీద నుంచి తీసుకుంటు చూస్తే అక్కడ తన వేరుశనగ పొట్లం భద్రంగా తన దెగ్గిరే కనిపించింది.
“అయ్యో! ఐతే నేనే వేరుశనగ దొంగనా! పాపం అయ్యిన్ని ఎన్ని మాటలనుకున్ననో!’ అని చాలా బాధ పడింది.
మూడు చేపల కథ
అనగనగా ఒక చెరువు లొ చాల చేపలు వుండేవి. ఒక రోజు ఇద్దరు చేపలు పట్టే వాళు ఆ చెరువు దెగ్గిరనుంచి వెళ్ళారు. చెరువు లో చాలా చేపలు వున్నాయని గమనించి మన్నాడు ఆ చెరువు లో చేపలు పడదామని నిర్ణయించు కున్నారు.
వాళ్ళ మాటలు విన్న ఒక పెద్ద చేప ఈ విషయం ఇంకొ రెండు చేపలకు చెబుతూ – “మనం వెంటనే మన బంధువులను తీసుకుని ఈ చెరువు ని వదిలి వెళ్ళిపోవాలి – లేక పోతె రేపు మనం ప్రాణాలతో వుండము” అని వివరించింది.
ఈ మాటలు విన్న వేరే రెండు చేపలు ఆలొచన లో పడ్డాయి.
రెండో చేప, “వాళ్ళు రేపు వస్తే చూద్దాం” అనుకుంది.
మూడో చేప, “ఈ ముసలి చేపకు చాదస్తం ఎక్కువ – ఆ చేపలు పట్టే వాళ్ళు వచ్చినా మన అద్రుష్టం బాగుంటే వాళ్ళేమి చేస్తారు” అనుకుంది.
మొదటి చేప రాత్రి కి రాత్రి తన బంధువులతో ఈదుకుంటూ వేరే చెరువుకు వెళ్ళి పొయింది.
తెల్లవారగనే రెండో చేప నేరుగా వస్తున్న చేపలు పట్టే వాళ్ళని చూసి తన కుతుంబం తో వేరే చెరువుకు వెంటనే వెళ్ళి పొయింది.
మూడో చేప వల లో చిక్కుకుని ప్రాణాలను వదులుకుంది.
దూరదృష్టి తో ఆలోచించిన మొదటి చేప తన బంధువులునందరినీ కాపడుకో గలిగింది. ఆపాయం గ్రహించి వెంటనే చర్యలు తీసుకున్న రెండొ చేప కొంత వరకు తన కుటుంబాన్ని కాపడుకుంది.
ఆదృష్టాన్ని నమ్ముకున్న మూడో చేప మట్టుకు యేమి చేయలేక పొయింది.
అలాగే మన జీవితం లో కూడా కేవలం అదృష్టాన్ని నమ్ముకుని, మన వంతు కృషి మనం చేయకపోతే, లాభం ఫలించదు.
కోతి, అద్దం
ఒక అడివిలో ఒక కోతికి ఓ అద్దం దొరికింది. అది ఆ అద్దాన్ని అడవిలో జంతువులన్నిటికీ చూపించింది.
భల్లూకం అందులో తన ప్రతిబింబం చూసుకుని, “అయ్యో, నేను ఇంత కురూపినా” అనుకున్నాడు.
తోడేలు చూసి నేను కూడ జింకలాగా వుంటే బాగుండేది, అనుకుంది.
ఇలా ఒకటి తరవాతోకటి అన్ని జంతువులు వాటి ప్రతిమలను చూసుకుని ఇలా వుంటే బాగుండేది, అలా వుంటే బాగుండేది అనుకున్నాయి.
చివరికి కోతి ఆ అద్దం ఒక వివేకవంతమైన గుడ్లగూబ దెగ్గిరకు తీసుకుని వెళ్ళింది. ఆ గుడ్లగూబ, “వద్దు నాకు చూపించద్దు. ఆ అద్దం చూసుకున్న వాళ్ళంతా అసంతృప్తి పడడం తప్ప దాని వల్ల వాళ్ళకు వచ్చిన ఙానము లేదు, విచక్షణ లేదు. అలాంటి దాన్ని చూసి బాధ పడడం అనవసరం” అని అంది.
కోతి ఒప్పుకుని ఆ అద్దాన్ని నదిలోకి విసిరేసింది.
అద్దం, రాయి
ఒక రోజు ఒక అద్దం ముక్క ఒక రాయి తో ఇలా అంది: “నన్ను చూడు, నేను ఎంత మెరుస్తున్నానో? ఆ సూర్యుడే నన్ను మెచ్చుకుని నాకీ మెరుపునిచ్చాడు”. ఆ రాయి, “అలాగా, నా అభినందనలు” అని సమాధానమిచ్చింది.
కొన్ని రోజుల తరువాత ఒక పిడుగు అద్దం మీద పడింది. అద్దం పిడుగు మంటకు కాలిపోయి, దాని మొత్తం మెరుపును కోల్పోయింది.
ఆ రాయి, “నీ మెరుపు ఏమైంది?” అని అద్దాన్ని అడిగింది.
“ఒహ్, ఆ పిడుగు వచ్చి నా దెగ్గిర అరువు తీసుకుంది” అన్నదా అద్దం.
“ఒక్క సారి మన గొప్ప చాటుకున్నాక ఎన్ని అబద్ధాలాడాలో” అనుకుంది రాయి.
చారలు కోరిన నక్క
పులి దర్జా గా అడివిలో తిరుగుతూ వుంటే అన్ని జంతువులు ఈ పక్క, ఆ పక్కా భయంతో పారిపోతూ వుండేవి. అది చూసి ఓ నక్క చాలా కుళ్ళుకునేది. అన్ని జంతువులు పులికి భయపడతాయి, దీనికి కారణం ఏమిటి అని ఆలొచిస్తే కారణం పులి చారలే అయి వుంటాయని అనుకుంది. అనుకున్నదే తడవుగా ఓ కంసాలాడి దెగ్గిరికి వెళ్ళి అలా పులిలా చారలు పెట్టమని అడిగింది. అతను బాగా ఇనప కడ్డి కాల్చి వాత పెట్టాడు. ఒక వాత పెట్టే సరికే భరించలేక కేకలు పెట్టి, “చారలు కావాలికాని నొప్పి కాదు, ఇంకేదైన చేయి” అంది నక్క. “ఐతే రంగులు పులివించుకో” అన్నాడు కంసాలాడు.
రంగులు వేసే వాడి దెగ్గిరకు వెళ్ళి రంగులు పులవమని అడిగింది. అతను నక్క అడిగినట్టే రంగులద్దాడు. ఆ రంగులు చూసుకుని మురిసిపోయింది నక్క. వెంటనే అడివిలోకి వెళ్ళి, పులి లాగ గాండ్రించబొయి, ఒక ఊళ్ళ పెట్టింది. ఆ ఊళ్ళ విని పారిపోబోతున్న జంతువులు కూడా దాని చుట్టూరా తిరుగుతూ ఆశ్చర్యంగా చూసాయి. ఇంతలో వాన పడి నక్క తనపై అద్దించుకున్న చారలన్ని నీళ్ళల్లో కలిసి చెరిగి పోయాయి. ఇది చూసి చిన్న చిన్న జంతువులు కూడ నక్కను వెక్కిరించడం మొదలెట్టాయి.
ఒకళ్ళని చూసి మన తీరు మార్చుకోకూడదని నక్కకు ఆ రోజు బాగా తెలిసొచ్చింది.
నక్కా, పీతలు
ఒక రోజు ఓ నక్క నదీ తీరాన్న కూర్చుని భోరు భోరుమని ఎడుస్తోంది. అది విని చుట్టు పక్కల కన్నాల్లో ఉన్న పీతలు బయిటికి వచ్చి నక్కను “ఎందుకు ఏడుస్తున్నావు?” అని అడిగాయి.
“అయ్యో! నన్ను నా బృందంలోని వేరే నక్కలన్ని అడివిలోంచి తరిమేసేయి” అని ఎడుస్తూనే సమధనమిచ్చింది నక్క.
పీతలు జాలిగా ఎందుకల జరిగిందని అడిగాయి.
“ఎందుకంటే ఆ నక్కలన్ని మిమ్మల్ని తినాలని పన్నాగమల్లుంతుంటే నేను వద్దన్నాను – మీ లాంటి చక్కని జీవాలను అవి ఎలా తినాలనుకున్నాయి?” అంది నక్క.
“ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు” అని అడిగాయి పీతలు.
“తెలీదు, ఎమైనా పని చూసుకోవలి” అని దీనంగా జవబిచ్చింది ఆ నక్క.
పీతలన్ని కలిసి అలోచించాయి. “మన వల్లే దీనికీ కష్టం వచ్చింది, మనమే ఆదుకోవాలి” అని నిర్ధారించాయి. వెళ్ళి నక్కను తమకు కాపలాకి వుండమని అడిగాయి. నక్క దబ్బున ఒప్పుకుని కృతఙతలు తెలిపింది. రోజంతా పీతలతో వుండి వాటికి కథలు కబుర్లూ చెప్పి నవ్విస్తూనే వుంది.
రాత్రయి పున్నమి చంద్రుడు ఆకాశంలోకి వచ్చాడు. నదీ తీరమంత వెన్నెలతో వెలిగిపోయింది.
“ఈ చక్కని వెన్నెలలో మీరు ఎప్పుడైన విహరించారా? చాలా బగుంటుంది” అని నక్క పీతలని అడిగింది.
భయంకొద్ది ఎప్పుడు వాటి కన్నాలను దాటి దూరం వెళ్ళ లేదని చెప్పిన పీతలను నక్క వెంటనే తీస్కుని వెళ్దామని నిశ్చయించుకుంది. నేనుండగా మీకు భయమేమిటి అని నక్క నచ్చ చెప్పడంతో పీతలు కూడ బయలుద్యారాయి.
కొంత దూరమెళ్ళాక నక్క మూలగడం మొదలు పెట్టింది. పీతలన్ని ఆశ్చర్యంగా ఏమైందో అని చూస్తుండగా హటాత్తుగా అడివిలోంచి చాలా నక్కలు బయిటికి వచ్చి పీతల పైబడ్డాయి. పీతలు బెదిరిపోయి అటు ఇటూ పరిగెత్తడం మొదలెట్టాయి. కాని నక్కలు చాలా పీతలను దిగమింగేశాయి.
ఎలాగోలాగ ప్రాణాలను కాపాడుకున్న కొన్ని పీతలు అతికష్టంగా వాటి కన్నాలను చేరుకుని టక్కుగల నక్క చేసిన కుతంత్రము తలుచుకుని చాలా బాధ పడ్డాయి. దుష్టులతో స్నేహం చెడుకే దారి తీస్తుందని వాటికి అర్ధమయ్యింది.
ఇద్దరు శిశ్యుల కథ
ఒక గురువుకు ఇద్దరు శిశ్యులుండేవారు. ఆ గురువు ఒక రోజు వాళ్ళిద్దరినీ పిలిచి కొంత సొమ్మును ఇచ్చాడు. “నేను మీకు ఇస్తున్నది చాలా చిన్న మొత్తం, కాని దీనితో మీరు ఎదైన కొని ఒక గదిని నింపాలి” అన్నాడు.
మొదటి శిశ్యుడు సొమ్మంతా ఖర్చు చేసి, బోల్డంత ఎండుగడ్డిని కొని గదిలో నింపాడు. గురువును చూడమని ఆహ్వానించాడు. గురువు అది చూసి “గదిని నిరుత్సాహముతో నింపావు” అన్నారు.
రెండవ శిశ్యుడు ఒక చిన్న కాసును ఖర్చు చేసి ఒక దీపం కొన్నాడు. దాన్ని వెలిగించగానే గదంతా కాంతితో నిండిపోయింది. గురువు మెచ్చుకుని, నలుగురికీ వెల్తురు ఇద్దామనుకునే వాడే నిజమైన వివేకవంతుడని అభినందించాడు.
కుక్కా, వ్యాపారస్తుడు
ఒక ఊరిలో ఒక కుక్కల వ్యాపారస్తుడుండేవాడు. అతను కుక్కలను కొని, వాటిని పెంచాలనుకునే వాళ్ళకు అమ్ముకునేవాడు.
ఒక రోజు అతను పొలాల్లోంచి వెళ్తుంటే అక్కడొక కుక్కను చూసాడు. ఆ కుక్క అతని దెగ్గిరకు వెళ్ళి తనని కొనుక్కోమని ప్రాధేయ పడింది. ఆ వ్యాపారస్తుడు “నీలాంటి కురూపిని ఎవరు కొనుక్కుంటారు?” అని ఛీ: కొట్టాడు.
కొద్ది రోజుల తరవాత ఆ కుక్క రజగృహం దెగ్గిరకు వెళ్తే అక్కడ రక్షక భటుడు దాన్ని చూసి నిమురాడు. అప్పుడే ఆ వ్యాపారస్తుడు అటు వైపు వచ్చాడు. కుక్క అతన్ని మళ్ళీ తనను కొనుక్కొమని అడిగింది.
“నువ్వు రాజ మహలులో వుంటున్నావు, చక్రవర్తిని కాపలా కాస్తున్నావు – నీ విలువ నేను ఇచ్చుకోలేను” అని వెళ్ళి పోయాడు.
నిజమే, మనం ఎక్కడున్నామో, ఎవరితో ఉన్నామో, దాన్ని బట్టే మనుషులు మన విలువను నిర్ధారిస్తారు.
కప్పా, పాము
ఒక కప్పా, పాము మంచి స్నేహితులుగా వుండేవి. కప్ప పాముకు కప్పకూత నేర్పించింది. పాము కప్పకు భుసకొట్టడం నేర్పించింది.
పాము నీటిలోకి వెళ్ళి కప్పకూత కూస్తే చుట్టుపక్కల కప్పలు దాని దెగ్గిరకు వెళ్ళేవి. పాము చటుక్కున వాటిని తినేసేది.
కప్ప నీళ్ళల్లో భుస కొడుతుంటే దాని దెగ్గిరకు పాములు వచ్చేవి కాదు. కప్ప నిర్భయంగా వుండేది. ఇలా కొంత కాలం కొనసాగింది.
కాల క్రమేణా పాము చేసే పని కప్పలకు తెలిసి అవి పాము దెగ్గిరకు వెళ్ళడం మానేసాయి. పాము తినడానికి యేమి లేక చిక్కి క్షీణించుకు పోయింది. ఆకలి తట్టుకోలేక తన స్నేహితుడైన కప్పను తినేసింది.
చెడు స్నేహం చేస్తే అది ఎప్పటికైన మనకే చేటు.
నక్కా, సింహం, జింకా
అనగనగా ఒక అడవిలో ఒక నక్క వుండేది. ఒక రోజు ఆ నక్క ఓ జింకను చూసింది. జింకను చూడగానే ఆ నక్కకు నోరూరింది. దాన్ని ఎలా తినడమని ఆలోచిస్తుంటే కొంత దూరంలో ఒక సింహం కనిపించింది. ఆ సింహం వేటాడి జింకను పడగొడితే సింహం తిన్నాక మిగిలినది తనకే దక్కుతుందని ఆలోచించింది ఆ నక్క.
ఆ సింహం దెగ్గిరకు వెళ్ళి చాలా వినయంగా నమస్కరించింది. “రాజన్! మీరీ తుచ్చమైన సేవకుడికి అవకాశమిస్తే మీకు మంచి వేటను చూపిస్తాను. అటు కొంచెం దూరంలో ఒక కమ్మని జింక వుంది!” అని నక్క అంది.
సింహం నక్కతో బయలుద్యారింది. కాని ఈ విషయమంతా విన్న జింక ఒక మట్టి దిబ్బ పైకి యెక్కి దాక్కుంది. నక్కా, సింహం అక్కడికి వచ్చే సరికి వాటికి యేమి కనిపించలేదు.
సింహం ఆ నక్కను కోపంగా చూసి, “నన్నే ఆటపట్టించాలనుకున్నావా! జింక లేకపోతే పోని, నాకు నువ్వైనా సరే!” అని ఆ నక్కను తినేసింది.
దుష్టులెప్పుడైనా వాళ్ళ పాపాన్న వాళ్ళే పోతారు.
నక్కా, కోడి పుంజు
అనగనగా ఒక ఊరిలో ఒక నక్క రోజు కోళ్ళను, కోడి పిల్లలను తినేసేది. రోజు ఆ నక్క చేసే పనికి ఊళ్ళో జనమంతా వంచించబడ్డారు.
ఒక రోజు ఆ నక్క ఒక పొలంలో పడున్నట్టు కనబడ్డాడు. ఊళ్ళో వాళ్ళంతా మొత్తానికి ఆ నక్కను యెవరో చంపేసారని హర్షించారు. జనమంతా ఆ నక్కను చూడడానికి పొలానికి చేరుకున్నారు. ఒక కోడి పుంజు కూడా తన పిల్లలతో చూడడానికి వెళ్ళింది.
ఇంతలో ఆ నక్క లేచి, పెద్దగా ఆవలించింది. “హరే! నువ్వు చచ్చిపోయావనుకున్నామే!” అంది కోడి పుంజు.
“లేదు, అదేమి కాదు. నిన్న రాత్రి బాగ తిన్నాను, అందుకే నిద్ర పట్టేసింది” అని జవాబు చెప్పిందా నక్క.
పుంజు వెంటనే తన పిల్లలను లెక్ఖ పెట్టుకుంది. ఒక కోడి పిల్ల తక్కువ వుంది. “ఇదేమిటి, ఒక పిల్ల తక్కువ వున్నా నాకు తెలియలేదే,” అంది.
“యేమిటయ్య! నిన్న రాత్రి నీ పిల్లను తింటే నీకు తెలీలేదు కాని ఒక క్షణం క్రితం నేను చచ్చానని తెలుస్తే వెంటనె వచ్చావు” అంది నక్క వ్యంగ్యంగా.
నిజమే, ముందు మన ఇల్లు చక్కబెట్టుకుని, తరవాత ఇతరుల విషయం పట్టించుకోవాలి.
మంత్రి, సామంతరాజు
అనగనగ ఒక చక్రవర్తి ఒక సామంతరాజును సభకు చాల సార్లు ఆహ్వానించాడు. కాని ఆ సామంతరాజు చక్రవర్తి సభకు రాలేదు.
ఒక రోజు ఆ చక్రవర్తి మారు వేశం వేసుకుని తన మంత్రితో పర్యటనకు బయలుద్యారాడు. బజారును తనిఖి చేస్తున్నప్పుడు ఒక కసాయివాడి కొట్టును దాటారు. కొట్టు దాటుతున్నప్పుడు చక్రవర్తికి ఆ సామంతరాజు గుర్తుకొచ్చాడు. ఆ సామంతరాజు ఊళ్ళో కి రాగానే సభకు రప్పించమని ఆదేశించాడు.
పర్యటన ముగించుకుని రజగృహానికి తిరిగి వెళ్ళారు. చక్రవర్తి రప్పించిన సామంతరాజు ఆ మంత్రి కళ్ళబడ్డాడు. విచారిస్తే చక్రవర్తిని కలవడానికే తాము వచ్చాడని సామంతరాజు ఆ మంత్రితో అన్నాడు. అది విన్న మంత్రి ఆ సమంతరాజును వెంటనే వెళ్ళమని, తను పిలిచేదాకా రావద్దని అన్నాడు.
ఈ విషయం చక్రవర్తికి తెలిసింది. మంత్రిని పిలిచి యెందుకలా చేసాడని కన్నుక్కున్నాడు. దానికి మంత్రి, “మీరు కసాయివాడి కొట్టును చూసి ఆ సమంతరాజును రమ్మన్నారు. మీ కళ్ళల్లోని క్రొధం చూస్తే అతన్ని గొర్రెను కోసినట్టు సమ్హరిస్తారేమోనని భయపడ్డాను. మీకు కోపం చల్లారి, మీ మనస్థిథి మారేక రమ్మనదామనుకున్నాను. తప్పైతే క్షమించండి” అని జవాబు చెప్పాడు.
చక్రవర్తి ఆ వివేకంగల మంత్రి దూరదృష్టిని అభినందించాడు.
మిణుగురు పురుగు, కాకి
అనగనగా ఒక అడివిలో ఒక మిణుగురు పురుగు వుండేది. అడవిలో సంతోషంగా తిరుగుతూ వుండేది. ఒక రోజు ఒక కాకి వచ్చి ఆ మిణుగురు పురుగును తినబోయింది. నోరు తెరిచిన కాకి తనను మింగేలోపు, “ఆగు! నా మాట వింటే నీకే మేలు” అని అరిచిందా పురుగు.
కాకి “యేమిటది” అని అడిగింది.
“నీకు నా లాంటి చాలా పురుగులున్న చొటొకటి చూపిస్తాను. నన్ను తినేస్తే నీకేమీ లాభం లేదు” అన్నదా పురుగు. కాకి అత్యాశతో ఒప్పుకుంది.
ఆ పురుగు కొంత మంది మనుషులు చలిమంట కాసుకుంటున్న చోటుకు తీసుకు వెళ్ళింది. నిప్పురవ్వలను చూపించి అవన్ని మిణుగురు పురుగులని చెప్పింది.
కాకి ఆ అని నోరు తెరుచుకొని ఆ నిప్పు రవ్వలను మింగేసింది. సుర్రని నోరు కాలింది. బాబోయి, ఈ మిణుగురు పురుగలను మనం తినలేమని యెగిరిపోయింది.
ఆ పురుగు “బలం కన్నా బుద్ధి గొప్పా” అని తన సమయస్ఫూర్తిని తనే మెచ్చుకుంది!
కన్న మమకారం
చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో ఒకావిడ ఉండేది. ఆవిడ కొడుకు జబ్బు పడి ప్రాణాలను కొలిపోయాడు. ఆ బాధ తట్టుకోలేక ఆవిడ క్రుంగి పోయింది. చాలా రోజులు గడిచినా కొడుకు మీద మమకారం మట్టుకు తగ్గలేదు, యే రోజు తన చనిపోయిన కొడుకుని గుర్తు చేసుకోకుండా గడపలేదు. అదే చింతలో యెప్పుడూ వుండేది.
ఒక రోజు ఊరిలోకి ఒక బొధిసత్త్వుడు వచ్చాడు. అతను చాలా మహిమ గలవాడని, భగవంతునితో అనుసంధానముగల వాడని ఊళ్ళో వాళ్ళంతా అనుకుంటుంటే ఆమె విన్నది. కొడుకును మళ్ళీ జీవింప చేయ గలుగుతాడేమోనని ఆశ పడింది. వెళ్ళి ఆ బొధిసత్త్వుడి కాళ్ళ మీద పడి, తన కొడుకుని మళ్ళీ తనకు దక్కేలా చెయమని అడిగింది.
ఆ బొధిసత్త్వుడు ఊళ్ళో ఎవ్వరూ మరణించని ఇంటి నుంచి గుప్పెడు బియ్యం తీసుకుని రమ్మన్నాడు.
మొన్నాడు ఉదయమే లేచి, స్నానం చేసి, దేవుడికి దీపం పెట్టుకుని ఊళ్ళోకి వెళ్ళింది. ప్రతి ఇంటి వాకిటలోని నిలుచుని వాళ్ళింట్లో ఎవరైన మరణించారా అని అడిగింది. ప్రతి ఇంట్లోను యెవరో ఒకరు పోయారు. మొత్తం గ్రామంలో యముడు రాని ఇల్లు ఒక్కటి లేదు. నిరాశ చందినా అవిడకు జీవితంలో చావు కూడ ఒక భాగమని, అది ఎవ్వరు తప్పించలేరని అర్ధం అయ్యింది.
ఆ బోధి సత్త్వుడి పరీక్ష లో దాగున్న వివేకం అర్ధం చేసుకుంది.
ఆ తరువాత తన కొడుకు గుర్తు వచ్చినప్పుడు, మళ్ళి ఎలాగైనా కొడుకు జీవిస్తే బాగుండు అన్న ఆలోచన మట్టుకు రాలేదు.
మాధవ ముంగిస
ఉజ్జైని నగరంలో మాధవా అనబడే బ్రాహ్మడుండేవాడు. ఒక రోజు ఆ బ్రాహ్మడి భార్య పక్కవూరికి పేరెంటానికి వెళ్తూ వాళ్ళ పసి పాపను ఆ బ్రాహ్మడికి అప్పచెప్పి వెళ్ళింది. ఇదిలా ఉండగా ఆ రోజు మహారాజుగారు ఆ బ్రాహ్మడిని సభకు రమ్మని కబురు పెట్టారు. పసిపాపను ఇంట్లో వదిలేసి ఎలా వెళ్ళడమని ఆలోచిస్తున్న బ్రాహ్మడికి అతని ముంగిస కనిపించింది. “ఈ ముంగిస చాలా యేళ్ళగా నా దెగ్గిర నా కొడుకులానే పెరుగుతోంది, దీనికి పాపను అప్పచెప్పి వెళ్తాను” అనుకుని రజ్యసభ వైపు బయలుద్యారాడు.
ముంగిస తనను నమ్మి ఈ పనిని అప్పచెప్పినందుకు చాలా గర్వ పడింది. వెళ్ళి పాప దెగ్గిరే కూర్చింది. సమయానికి ఒక పామును పాప వైపుకు వెళ్తూ చూసింది. వెంటనే ఆ పామును చంపేసింది.
కొంత సేపటికి మాధవ రజ్యమర్యాదలన్ని స్వీకరించి, రాజు ఇచ్చిన బహుమానాలతో సంతోషంగా
ఇంటికి తిరిగి వచ్చాడు. అతన్ని చూడగానే ఆనందంతో ముంగిస అతని దెగ్గిరకు గబగబా వెళ్ళింది. మాధవ ముంగిస మూతికున్న నెత్తురును చూసాడు. పాపను చంపేసిందని అపోహ పడ్డాడు. కోపంగా ఆ ముంగిసను చంపేసాడు. బాధతో ఇంటిలోకెళ్ళాడు. ఎదురుగానే పసి పాప తన ఉయ్యాలలో హాయిగా నిద్రపోతోంది. పక్కనే చచ్చి పడున్న పామును చూసి మాధవ అన్ని అర్ధం చేసుకున్నాడు. అయ్యో తొందరపడ్డానే! అని చాలా పశ్చాతాప పడ్డాడు.
బ్రాహ్మడి మేక
అనగనగా ఒక ఊరిలో ఓ అమాయక బ్రాహ్మడు వుండేవాడు. ఆ బ్రాహ్మడు యగ్నంలో బలివ్వడానికి ఒక మేకను కొని తన ఇంటికి తీసుకుని వెళ్తుంటే ముగ్గురు దొంగలు చూసారు. ఆ మేకను ఎలాగైన దక్కించుకోవాలనుకున్నారు. ముగ్గురూ కలిసి ఒక పన్నాగమల్లేరు. ఆ బ్రాహ్మడికి కనిపించకుండా ముగ్గురూ మూడు చొట్లకెళ్ళి నిలపడ్డారు.
మొదటి దొంగ బ్రాహ్మడు దెగ్గిర పడుతుంటే చూసి యెదురొచ్చాడు. వచ్చి, “ఆచర్యా, ఈ కుక్కను ఎక్కడికి తీసుకెళ్తున్నారు?” అనడిగాడు.
బ్రాహ్మడు “మూర్ఖుడా! ఇది కుక్క కాదు, మేక” అని జవాబిచ్చాడు. “మేకను పట్టుకుని కుక్కంటాడేమిటి” అని ఆలోచిస్తూ తన దారిన కొనసాగాడు.
కొంత దూరమెళ్ళాక రెండొ దొంగ యెదురై చాలా వినయమున్నట్టు నమస్కరించాడు. “ఓ బ్రాహ్మణా! ఎందుకు కుక్కను మోస్తున్నారు?” అనడిగాడు. బ్రాహ్మడు చాలా ఆశ్చర్య పోయాడు. మేకను భుజాల మీంచి దించి చూసుకున్నాడు. “ఇది కుక్క కాదు, మేకనే. వీళ్ళిద్దరూ కుక్కంటున్నారేమిటి?” అని యొచనలో పడ్డాడు. దీర్ఘంగా ఆలోచిస్తూ మేకను మళ్ళి భుజాల మీదకు యెక్కించుకుని తన దారిన నడవడం మొదలుపెట్టాడు. కొంచెం దూరమెళ్ళాక మూడో దొంగ యెదురయ్యాడు.
“అపచారం! అపచారం! ఈ నీచమైన కుక్కను మీరు మోయడమేమిటి? మీరు అశుద్ధమైపోయారు!” అన్నాడా దొంగ.
ఇంత మంది చెపుతుంటే అది మేక కాదు కుక్కే అయివుంటుందనుకుని ఆ బ్రాహ్మడు వెంటనే మేకను పక్కకు పడేసి శుద్ధి స్నానం చేద్దామని ఇంటి వైపుకు పరుగు తీసాడు…
ఆ ముగ్గురు దొంగలు నవ్వుతూ మేకను సొంతం చేసుకున్నరు.
కోపం వచ్చిన కోతులు
అనగనగా ఒక అడివిలో ఒక పెద్ద వృక్షముండేది. ఆ వృక్షంలో చాలా పిట్టలు, పక్షులు గూళ్ళు కట్టుకుని సంతోషంగా వుండేవి. వృక్షం వాటికి గాలి, చలి, యెండా తగలకుండా కాపాడేది.
ఒక రోజు ఆకాశమంతా మబ్బు కాసి హోరున వర్షం కురిసింది. అడివంతా తడిసిపోయింది. వృక్షం పక్కనే ఆడుకుంటున్న కొన్ని కోతులు వానలో తదిచి గడ గడ వణుకుతున్నయి. వాటిని చూసిన పక్షులు నవ్వుతూ వాటితో వెటకారంగా మాట్లాడేయి. మేము ఇంత చిన్నగా ఉన్నా మా ముక్కులతో గడ్డి, చితుకులు సమకూర్చుకుని గూళ్ళు కట్టుకున్నాము, మీకు రెండు కాళ్ళు, చేతులున్నా మీరు ఇళ్ళు కట్టుకోలేదని ఎగతాళి చేసాయి.
మూర్ఖులైన కోతులకు చాలా కోపమొచ్చింది. అవి గబగబా చెట్టునెక్కి ఆ పక్షుల గూళ్ళను ధ్వంసం చేసాయి. ఆకులను కొమ్మలను విరిచేసి ఛల్లా ఛెదురు చేసాయి. గూళ్ళల్లోని గుడ్లు పగిలిపోయాయి. పక్షుల పిల్లలు భయంతో యేడుపునందుకున్నాయి. అంతా నాశనం చేసి కోతులు వెళ్ళిపోయాయి.
రూపుమాపైపోయిన గూళ్ళు, చెట్టు, వాటితో పగిలిపోయిన వాటి గుడ్లను చూసి, అయ్యో అనుకున్నయి పక్షులన్ని. అనవసరంగా మనకు సంబంధంలేని విశయంలో తలదూర్చామని పశ్చ్యాతాప పడ్డాయి.
చాకలోడి గాడిద
అనగనగా ఒక ఊరిలొ ఓ చాకలోడుండేవాడు. అతనికి ఒక కుక్క, ఒక గాడిద ఉండేవి. గాడిద చాకలిమేటలను మోసేదీ. కుక్క చాకలోడింటికి కాపల కాసి అతనెక్కడికి వెళ్తే అక్కడకెళ్ళి తోడుండేది.
ఒక రోజు రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు ఇంట్లోకొక దొంగ ప్రవేశించాడు. ఇది గమనించిన గాడిద కుక్క వేపు ఆశ్చర్యంగా చూసి, “నువ్వు దొంగను చూసి మొరగలేదెందుకు?” అనడిగింది.
“మన యెజమాని మన్ని అస్సలు పట్టించుకోడు. గత కొన్ని రోజులలో నాకు సరిగ్గా తిండి కూడ పెట్టలేదు. నేనెందుకు పట్టించుకోవలి?” అని కుక్క ఎదీ పట్టనట్టు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది.
“ఇది మనం మొరబెట్టుకునే సమయంకాదు. మన యజమానికి సహాయం చేయాలి” అని గట్టిగా గాడిద కూతపెట్టడం మొదలెట్టింది.
దెబ్బకు ఇంట్లో వాళ్ళంతా లేచారు. దొంగ పారిపోయాడు. చాకలాడికి ఎవ్వరూ కనిపించకపోయేసరికి అనవసరంగా నిద్ర చెడకొట్టిందన్న కోపంతో గాడిదను బాగా బాదేడు.
ఎవరి పని వాళ్ళే చేయాలని అప్పుడు గాడిదకు అర్ధమయ్యింది.
పులి చేతిలో గాజు
అనగనగా ఒక అడివిలో ఒక పులుండేది. ఆ పులి ముసలిదైపోయింది. దాని గోళ్ళు, పళ్ళు బలహీనంగా అయిపోయాయి. రోజు వేటాడడం కష్టమయిపోయింది. ఆకలితో బాధపడుతున్న పులి ఒక రోజు నదీతీరాన్న బాగా మెరుస్తున్న ఒక బంగారపు గాజును చూసింది. వెంటనే వెళ్ళి ఆ గాజును తీసుకుంది.
ఇటూ అటూ చూస్తుంటే ఒక చెట్టుకింద కూర్చున్న మనిషి కనిపించాడు. ఆ మనిషిని చూస్తే పులికి నొరూరింది. దెగ్గిరకెళితే ఆ మనిషి పారిపోతాడన్న భయంతో కొంచెం దూరంగా నుంచుని ఆ మనిషిని పిలిచింది. మనిషి పులిని చూసినవెంటనే పారిపోబోయాడు. కానీ ఆ పులి తనదెగ్గిరున్న గాజును చూపించి నీకిది కావలా అనడిగింది. “నీ దెగ్గిరకొస్తే నువ్వు నన్ను తినేస్తావు, నేను రాను” అన్నాడు మనిషి.
“నిన్ను చూస్తే యువకుడిలా ఉన్నావు, బలంగా కనిపిస్తున్నావు – నీకు నేనంటే భయమెందుకు? నేను చూడు ఎంత ముసలిదాన్నయిపోయాను” అంది పులి. ఈ మాటవిని ధైర్యం తెచ్చుకున్న మనిషి గాజును సంపాదించుకుందామన్న దురాశతో పులి దెగ్గిరకు వెళ్ళాడు. వెంటనే పులి మనిషి మీదకు దూకి అతన్ని చంపి తినేసింది.
నిజంగా దురాశ దు:ఖానికి చేటు.
ధనవంతురాలి గిన్ని
అనగనగా ఒక ఊరిలో ఒక ధనవంతురాలుండేది. ఒక రోజు ఆవిడ దెగ్గిర పొరుగింటామె వచ్చి ఒక గిన్న అడిగి తీసుకుంది. తిరిగిచ్చేడప్పుడు ఆ గిన్నెతో పాటు మరో చిన్న గిన్నెను కూడా ఇచ్చింది. ధనవంతురాలు చాలా ఆష్చర్యపోయింది. రెండు గిన్నెలిచ్చావేంటి? అనడిగితే గిన్నె పిల్లని పెట్టింది అందుకనే ఇస్తున్నను అని బదులు చెప్పింది.
కొన్ని రోజులు గడిచాయి. పొరుగింటామె మళ్ళీ ఒక రోజు గిన్నె కోసమొచ్చింది. ధనవంతురాలు చాలా సంతోషంగా గిన్నెను ఇచ్చింది. ఈ సారి తిరిగిచ్చేడప్పుడు ఎలాంటి గిన్నెను ఇస్తుందోనని ఆత్రుతతో ఎదురుచూసింది. కాని పొరుగింటామె అసలు గిన్నెను తిరిగివ్వలేదు. చాలా రోజులు చూసాక ఆ ధనవంతురాలే వెళ్ళి గిన్నె గురించడిగింది. పొరుగింటామె యేడుపుమొహము పెట్టి మీ గిన్నె చనిపోయిందండి అని దుఖసమాచారము చెప్పింది. గిన్నె చనిపోవడమేమిటని ధనవంతురాలు మహా ఆష్చర్యంగా అడిగింది. దానికి పొరుగింటామె గిన్ని పిల్లలిని పెట్టగా లెనిది చనిపోతె ఆష్చర్యమెందుకు? అనడిగింది.
ఇది విన్న ధనవంతురాలు యేమి మాట్లాడలేక ఇంటికి వెళ్ళిపోయింది.
పొగరుగల గొర్రెపోతు
ఒకానొకప్పుడు ఒక అడివిలో బాగా కొమ్ములు తిరిగిన ఒక గొర్రెపోతు చాలా పొగరుగా వుండేది. తన కొమ్ములతో యెవ్వరినైన ఓడించగలనన్న ధైర్యంతో చాలా దురహంకారముగల గొర్రెపోతులా తయ్యారయ్యింది. వచ్చే పొయే ప్రతి చిన్న జీవినీ తన కొమ్ములతో పొడిచి వేధించడం మొదలెట్టింది. ఈ విషయం గమనించిన ఒక నక్క గొర్రెపోతుకు పాఠం చెప్పాలనుకుంది. సమయం చూసుకుని ఆ గొర్రెపోతు దెగ్గిరకు వెళ్ళి ఆ నక్క “ఈ చిన్న ప్రాణులు నీతో పొట్లాడడానికి యోగ్యులు కారు – నీకు తగిన విరోధిని నేను చూపిస్తాను” అంది. ఈ మాట విన్న గొర్రెపోతుకు ఆసక్తి కలిగింది. “ఆ విరొధి యెవరు?” అని నక్కను అడిగింది. “అదుగో ఆ కొండను చూడు – యెంత యెత్తుగా కనిపిస్తొందో! దాన్ని ఓడిస్తే అసలీ అడివిలో నీకన్న బలమైన వాళ్ళు లేరన్న విషయం తెలిసిపోతుంది” అని నక్క తెలివిగా జవాబు చెప్పింది. పొగరుగా గొర్రెపోతు వెళ్ళి తన కొమ్ములతో ఆ కొండను కుమ్మింది. కుమ్మగానే కొంత ఇసక కొండ మీంచి రాలింది. దీనితో మరింత రెచ్చిపొయిన గొర్రెపోతు కొంత దూరం వెనక్కి జరిగి పరిగెత్తుకుంటూ వచ్చి కొండను ఢీకొట్టింది. కొమ్ములు రెండూ విరిగిపొయాయి. గొర్రెపోతు బుధ్ధి తెచ్చుకుని అందరితో వినయంగ మెలగడం నేర్చుకుంది.
ఇందిలో నీతి యేమిటంటే, యెదుటి వారి బలం తెలీయకుండ మనం విర్రవేగిపోకూడదు.
చాణక్యుని జ్ఞానోదయం
చాలా సంవత్సరాల క్రితం తక్షిల అనే ఊరిలో చాణక్య అనబడే బ్రాహ్మడు ఉండేవాడు. అతను మౌర్యుల సామ్రాజ్యాన్ని స్థాపించిన మహోన్నతుడు. ఈ సామ్రాజ్యం స్థాపించడానికి అతను చాలా కృషి చేసాడు. చాలా రాజ్యాలతో యుద్ధం చేసి, చంద్రగుప్తుడిని రాజు చేసాడు.
ఒక రోజు చంద్రగుప్తుడితో పాట్లిపుత్ర నగరం మీద దండి చేసి ఓడిపోయిన చాణక్యుడు నిరాశగా ఇంటికి బయలుద్యారాడు. దారి లో అలసటనిపించి ఒక ఇంటి అరుగు మీద కూర్చున్నాడు. ఇంట్లో ఒక అవ్వ తన పిల్లలికి అన్నం పెడుతోంది. తింటున్న పిల్లల్లో ఒకడు హటాత్తుగా కెవ్వని కేక పెట్టాడు. హడిలిపొయిన అవ్వ “యేమైంది బాబు!” అంటే ఆ బాలుడు “అన్నం వేడిగా వుంది, చేయి కాలిందమ్మ” అన్నాడు.
“అదే మరి, నువ్వూ చాణక్యుడిలానే వున్నావు,” అంది అవ్వ. “యెవరైన అన్నం మధ్యలో చేయి పెడతార? పక్కలనుంచి చిన్నగా తింటూ రవాలికాని?”
ఇదంతా అరుగుమీంచి వింటున్న చాణక్యుడికి జ్ఞానొదయమయ్యింది. తను చేసిన తప్పు తెలుసుకున్నాడు. బలవంతులైన నందులతో యుద్ధం చేసేటప్పుదు వాళ్ళకు బాగా పట్టు వున్న పాట్లిపుత్ర మీద దండి చేస్తే కలిగేది నిరాశే అని అర్ధం చేసుకున్నాడు. ఆ తరువాత చంద్రగుప్తుడితో కలిసి చుట్టు పక్కలున్న చిన్న చిన్న రాజ్యాలను ఆక్రమిస్తూ నెమ్మదిగా పాట్లిపుత్ర మీద యుద్ధం ప్రకటించి విజయాన్ని సాధించాడు.
ఈ సంఘటన భారత దేశ చరిత్రనే మార్చేసింది.
సందేహం
అనగనగా ఒక రోజు ఒక బడిలొ బాలుడికి ఒక సందేహం వచ్చింది. అతని గురువుని వెళ్ళి అడిగాడు – “గురువుగారు, యెక్కువ మాట్లాడితే మంచిదా, తక్కువ మాట్లాడితే మంచిదా?”
గురువుగారు చిరునవ్వుతొ ఈ జవాబు చెప్పారు. “కప్పకూత రాత్రి-పగలు వినిపిస్తూనే వుంటుంది, అయినా దాన్ని యెవ్వరూ పట్టించుకోరు. కాని కోడి ఒక్కే ఒక్క సారి కూస్తే ఊరంతా నిద్ర లేస్తుంది. దీని వల్ల అర్ధమయ్యేది యేమిటంటే, యెక్కువ మాట్లాడి ప్రయోజనం లేదు. మాట్లాడేది ఒక మాటే అయినా, అది సరైన సమయంలో మాట్లాడితే అందరూ వింటారు.”
సందేహం తీరిన కుర్రవాదు సంతోషంగా వెళ్ళాడు.