MJPAPBC Schools Admissions : విజయవాడ మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ బాల బాలికల గురుకుల పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి (ఇంగ్లీష్ మీడియం) స్టేట్ సిలబస్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్థుల నుంచి ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానించారు. మొత్తం 6600 సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులు మార్చి 15వ తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులను బట్టి ఆయా ఎంజేపీ పాఠశాలల్లో లేదా బీసీ హాస్టల్ లో పరీక్ష నిర్వహిస్తారు.
అర్హతలు
బీసీ, ఈబీసీ, ఇతర విద్యార్థులు 11 సంవత్సరాల వయసు మించకూడదు. ఈ విద్యార్థులు 01.09.2014 నుంచి 31.08.2016 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 12 ఏళ్లు మించి ఉండరాదు. వీరు 01.09.2013 నుంచి 31.08.2016 మధ్య జన్మించి ఉండాలి,
ఆదాయ పరిమితి
దరఖాస్తు చేసుకునే విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకుల సంవత్సర ఆదాయం రూ. 1,00,000లకు మించరాదు. పాత జిల్లాల ప్రకారం జిల్లాలోని గురుకుల పాఠశాలలో ప్రవేశానికి ఆ జిల్లాలోని పాఠశాలల్లో చదువుతూ ఉండాలి. విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో గత రెండు సంవత్సరాల నుంచి 2023-24, 2024-25 చదువుతూ ఉండాలి. విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో నాలుగో తరగతి(2024 25) విద్యా సంవత్సరంలో చదివి ఉండాలి.
ప్రవేశ పరీక్ష
ప్రవేశ పరీక్ష తెలుగు, ఇంగ్లీషు, గణితం, పరిసరాల విజ్ఞానం(సైన్స్, సోషల్)లలో 4వ తరగతి స్థాయిలో రెండు గంటల వ్యవధిలో 100 మార్కులకు నిర్వహిస్తారు. తెలుగులో 15, ఇంగ్లీషు 25, గణితం 30, పరిసరాల విజ్ఞానం 30 మార్కులకు ఆబ్జెక్టివ్ టైపులో నిర్వహిస్తారు. జవాబులను ఓఎంఆర్ షీట్ లో గుర్తించాలి.
పరీక్ష పరీక్ష తెలుగు, ఇంగ్లీషులో ఉంటుంది.
పరీక్షా కేంద్రం
విద్యార్థుల సొంత జిల్లాలోనే పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షా కేంద్రం వివరాలు హాల్ టిక్కెట్ లో ఇస్తారు. ఒక పరీక్ష కేంద్రంలో విద్యార్థుల సంఖ్య తక్కువైనప్పుడు ఆ విద్యార్థులను దగ్గరలోని ఇతర పరీక్షా కేంద్రాలకు కేటాయిస్తారు.
పాఠశాలల్లో ప్రవేశానికి ఎంపిక విధానం
అర్హులైన విద్యార్థులకు ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కులు, రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరి, అభ్యర్థి కోరిన పాఠశాల ప్రాధాన్యతల ఆధారంగా ఎంపిక చేస్తారు.
అర్హులైన విద్యార్థులు తమ పేమెంట్ తో ఏపీ ఆన్లైన్ కేంద్రానికి ప్రాథమిక వివరాలతో విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, తండ్రి లేదా సంరక్షకుని మొబైల్ నెంబర్ తీసుకెళ్లి రూ. 100 చెల్లించి ఒక జర్నల్ నెంబర్ పొందాలి. ఆ జర్నల్ నెంబర్ పొందినంత మాత్రాన దరఖాస్తు చేసుకున్నట్లు కాదు. అది కేవలం దరఖాస్తు రుసుము చెల్లించినట్లు తెలియజేసే నంబర్ మాత్రమే.
ఆ జనరల్ నెంబర్ ఆధారంగా ఇంటర్నెట్ సెంటర్ లేదా కంప్యూటర్ నుంచి వెబ్ సైట్ https://mjpapbcwreis.apcfss.in/paymentPage , https://mjpapbcwreis.apcfss.in/ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ దరఖాస్తును తేదీ 15.02.2025 నుంచి 15.03.2025 తేదీ వరకు
- ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న తర్వాత ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఈ కాపీని ప్రింట్ తీసుకొని ఉంచుకోవాలి.
- దరఖాస్తు సమయంలో అభ్యర్థి వద్ద కుల ధ్రువీకరణ పత్రం, పుట్టిన తేదీ, ఆదాయ ధ్రువీకరణ, ప్రత్యేక కేటగిరి ధ్రువీకరణ, స్టడీ, బోనఫైడ్ సర్టిఫికెట్ మొదలగు ధ్రువపత్రాల (ఒరిజినల్) పొంది ఉండాలి. ఒరిజినల్ ధ్రువపత్రాలను కౌన్సిలింగ్ సమయంలో సమర్పించాలి.
- హాల్ టికెట్లు పరీక్ష తేదీకి 7 రోజులు ముందుగా విడుదల చేస్తారు. విద్యార్థులు తమ రెఫరెన్స్ నెంబర్ ద్వారా హాల్ టికెట్లు ఆన్లైన్ సెంటర్ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.