TG EAP CET 2025: తెలంగాణ ఈఏపీ సెట్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదల, నాన్‌ లోకల్‌ కోటా రద్దు యోచనలో ప్రభుత్వం

TG EAP CET 2025: తెలంగాణ ఈఏపీ సెట్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదల, నాన్‌ లోకల్‌ కోటా రద్దు యోచనలో ప్రభుత్వం

P Madhav Kumar

TG EAP CET 2025: తెలంగాణ ఈఏపీ సెట్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఫిబ్రవరి 25 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ మొదలవుతుంది. ఏప్రిల్ 4వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ ఏడాది నాన్‌ లోకల్ కోటా రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది.

నేడు తెలంగాణ ఈఏపీ సెట్‌ 2025 నోటిఫికేషన్‌
నేడు తెలంగాణ ఈఏపీ సెట్‌ 2025 నోటిఫికేషన్‌

TG EAP CET 2025: తెలంగాణలో ఇంజనీరింగ్‌ అగ్రికల్చర్‌, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీ సెట్ 2025 నోటిఫికేషన్‌ విడుదలైంది. జేఎన్‌టీయూ హైదరాబాద్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

తెలంగాణలో ఈఏపీ సెట్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ఫిబ్రవరి 25న ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ 4వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తులు స్వీకరిస్తారు. 2025-26 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీ సెట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డిటైల్డ్ నోటిఫికేషన్‌ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది. ఈఏపీ సెట్‌ 2025 లింకు కోసం అనుసరించండి...

https://eapcet.tgche.ac.in/

ఈఏపీ సెట్‌ 2025 సిలబస్‌, కోర్సుల వివరాలు, పరీక్ష విధానం, ఆన్‌లైన్‌ దరఖాస్తు సమాచారం, దరఖాస్తుల గడువు, ఆలస్య రుసుముతో దరఖాస్తుల స్వీకరణ వివరాలు ఆన్‌లైన్‌లో ఉంటాయి.

పరీక్ష తేదీలు...

ఈఏపీ సెట్‌కు దరఖాస్తు చేసే అభ్యర్థులు ప్రభుత్వం నిర్దేశించిన మేరకు అర్హతలు కలిగి ఉండాలి. ఏప్రిల్ 29, 30 తేదీలలో అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఓ సెషన్‌ మధ్యాహ్నం మూడు నుంచి ఆరు వరకు మరో సెషన్‌లో పరీక్ష జరుగుతుంది.ఇంజనీరింగ్ విభాగంలో ప్రవేశ పరీక్ష మే 2 నుంచి 5వ తేదీ వరకు జరుగుతాయి.

ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.500 దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇతర క్యాటగిరీల విద్యార్థులు రూ.900 చెల్లించాలి. రిజిస్ట్రేషన్‌ పీజును టీజీ ఆన్‌లైన్‌ సెంటర్ల ద్వారా చెల్లించవచ్చు. లేదా నెట్‌ బ్యాంకింగ్‌, క్రెడిట్ కార్డు, డెబిట్‌ కార్డుతో కూడా చెల్లించవచ్చు. ప్రవేశ పరీక్ష కంప్యూటర్ బేస్డ్‌ విధానంలో ఉంటుంది.

తెలంగాణ వారికే కన్వీనర్‌ కోటా…!

తెలంగాణలో 2025-26 కన్వీనర్ కోటా బీటెక్ సీట్లు మొత్తం రాష్ట్రానికి చెందిన విద్యార్థులకే కేటాయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. 15 శాతం నాన్‌ లోకల్‌ కోటా ఈ ఏడాది నుంచి రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని విద్యా శాఖ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం ఇంజినీరింగ్ సీట్లను 70 శాతం కన్వీనర్ కోటాలో.. 30 శాతం మేనేజ్‌మెంట్‌ కోటాలో భర్తీ చేస్తున్నారు. కన్వీనర్ కోటాలోని సీట్లలో 85 శాతం సీట్లను తెలంగాణ స్థానికత కలిగిన విద్యార్థులకు కేటాయించే వారు. మిగిలిన 15 శాతం సీట్లకు తెలంగాణతో పాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీపడే అవకాశం ఉండేది. రాష్ట్ర విభజన గడువు పదేళ్లు గత ఏడాదితో పూర్తవడంతో నాన్‌లోకల్‌ కోటా గడువు ముగిసింది.

స్థానిక, స్థానికేతర కోటా అంశాలపై అధ్యయనం కోసం ప్రభుత్వం గత ఏడాది డిసెంబరులో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి నేతృత్వంలో కమిటీని నియమించింది. కమిటీ నివేదిక ప్రభుత్వానికి చేరింది. కన్వీనర్ కోటా సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే కేటాయించడంతో పాటు అందులో 95 శాతం రాష్ట్ర విద్యార్థులకు, మిగిలిన 5 శాతం వివిధ అవసరాల రీత్యా ఇతర రాష్ట్రాల్లో ఉంటూ తెలంగాణ స్థానికత కలిగిన వారికి ఇవ్వాలని సిఫార్సు చేసింది.

దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తుది నిర్ణయానికి లోబడి ప్రవేశాలు ఉంటాయని తాజా నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు. కమిటీ సిఫారసును ప్రభుత్వం ఆమోదిస్తే రాష్ట్ర విద్యార్థులకు మరిన్ని ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. 15 శాతం నాన్‌లోకల్ కోటాలో మొత్తం 12 వేల సీట్లు ఉన్నాయి. వాటిలో దాదాపు 4-5 వేల సీట్లు మెరిట్ ఆధారంగా ఏపీ విద్యార్థులకు దక్కుతున్నాయి.

విజయవాడ, కర్నూలులో పరీక్షా కేంద్రాలు..

ఈఏపీ సెట్‌ నోటిఫికేషన్ గురువారం మధ్యాహ్నం నుంచి వెబ్‌‌సైట్‌లో అందుబాటులోకి వస్తుంది. ఏపీ సరిహద్దులోని తెలంగాణ విద్యార్థులు సమీపంలోనే పరీక్షలు రాసేందుకు విజయవాడ, కర్నూలులో కూడా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో విశాఖపట్నం, గుంటూరు, తిరు పతిలో కూడా కేంద్రాలు ఏర్పాటు చేసేవారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభమయ్యేలోపు నాన్‌లోకల్‌ కోటాపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కోటా రద్దైతే ఏపీ నుంచి పరీక్షకు హాజరయ్యే వారి సంఖ్య తగ్గొచ్చు.


Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow