Telangana SSC Exams 2025 : పదో తరగతి విద్యార్థులకు టీ-శాట్ కీలక అప్డేట్ ఇచ్చింది. త్వరలో వార్షిక పరీక్షలు జరగనున్న నేపథ్యంలో… ఇవాళ ప్రత్యేక పాఠాలు ప్రసారం కానున్నాయి. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వీటిని వీక్షించవచ్చు.
వార్షిక పరీక్షలకు పదో తరగతి విద్యార్థులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠాశాలల్లో ప్రత్యేక తరగతులను కూడా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది అన్ని జిల్లాల్లోనూ అధిక ఉత్తీర్ణత శాతం నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేయగా.. ఆ దిశగా ప్రధానోపాధ్యాయులు చర్యలు చేపడుతున్నారు.
టీశాట్ ప్రత్యేక పాఠాలు…
పది పరీక్షలకు సమయం దగ్గరపడిన వేళ… టీ శాట్ కీలక అప్డేట్ ఇచ్చింది. విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులను ప్రసారం చేయనుంది. పలు సబ్జెకుల నిపుణుల చేత వీటిని చెప్పించనుంది. వార్షిక పరీక్షలకు సంబంధించి మెలకువలు, పాటించాల్సిన టిప్స్, ప్రశ్నల సరళి వంటి అంశాలు ఇందులో ఉండనున్నాయి.
టీశాట్ ఛానెల్‌లో ఇవాళ( శనివారం) ఉదయం 9.30 నుంచి ఈ పాఠాలు ప్రారంభమవుతాయి. సాయంత్రం 5 గంటల వరకు ప్రసారమవుతాయని ఎస్‌సీఈఆర్‌టీ సంచాలకుడు రమేశ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు ఈ ప్రసారాలను వీక్షించేలా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రత్యేక పాఠాలు.. విద్యార్థులకు ఎంతో ఉపయోగపడే అవకాశం ఉంటుందని.. ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని మంచి ఫలితాలను సాధించే దిశగా ముందుకెళ్లాలని తెలిపారు. టీశాట్ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ పాఠాలను వీక్షించవచ్చు.
మార్చి 21 నుంచి టెన్త్ పరీక్షలు:
తెలంగాణ పదో తరగతి పరీక్షలు మార్చి 21 నుంచి ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 4వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.
మార్చి 21న ఫస్ట్ లాంగ్వేజ్, 22న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 24న ఇంగ్లీష్, 26న మ్యాథ్స్ పరీక్ష జరగనుంది. మార్చి 28న ఫిజిక్స్, 29న బయోలాజికల్ సైన్స్, ఏప్రిల్ 2న సోషల్ స్టడీస్ పరీక్ష జరగనుంది.