UPI payments: భారతదేశంలో యూపీఐ చెల్లింపులు సర్వ సాధారణం. జీ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్ లేని స్మార్ట్ ఫోన్స్ ఉండవు. యూపీఐ చెల్లింపుల కోసం ఇప్పటివరకు పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండేది. ఇకపై, యూపీఐ పేమెంట్స్ లో అదనపు భద్రత కోసం ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ ఐడీ తో యూపీఐ చెల్లింపులు చేయవచ్చు.
అభివృద్ధిలో బయోమెట్రిక్ ఆథెంటికేషన్
ఫేస్ ఐడి లేదా ఫింగర్ ప్రింట్ సెన్సార్ల వంటి బయోమెట్రిక్ అథెంటికేషన్ ను యూపీఐ సిస్టమ్ లోకి ఇంటిగ్రేట్ చేయాలని ఎన్పీసీఐ భావిస్తోంది. అందువల్ల, త్వరలో, యూపీఐ చెల్లింపులు మరింత సురక్షితంగా మారవచ్చు. యూపీఐ లావాదేవీల కోసం బయోమెట్రిక్ వెరిఫికేషన్ పద్ధతులను అమలు చేయడానికి ఎన్పీసీఐ (NPCI) పలు కంపెనీలతో చర్చలు జరుపుతోంది. డిజిటల్ లావాదేవీల్లో అదనపు ఫ్యాక్టర్ అథెంటికేషన్ (AFA) కోసం ప్రత్యామ్నాయ పద్ధతులను అన్వేషించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల చేసిన ప్రతిపాదన నేపథ్యంలో ఎన్పీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. మెరుగైన భద్రత కోసం బయోమెట్రిక్ ఆప్షన్లతో సహా సంప్రదాయ పిన్ లు, పాస్ వర్డ్ లకు మించిన సురక్షిత పద్ధతులను పరిగణనలోకి తీసుకోవాలని ఆర్బీఐ సూచించింది.
పిన్, బయోమెట్రిక్స్
ప్రస్తుతం యూపీఐ చెల్లింపుల కోసం పిన్ ను కచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే, కొన్ని యూపీఐ లు యూపీఐ లైట్ పేరుతో రూ. 500 లోపు చిన్న మొత్తాల చెల్లింపులకు పిన్ అవసరం లేని పద్ధతులను ప్రారంభించాయి. త్వరలో యూపీఐ చెల్లింపులకు బయో మెట్రిక్ ధ్రువీకరణలను ప్రారంభించాలని ఎన్సీపీఐ యోచిస్తోంది. అయితే, ప్రారంభంలో, పిన్ ఆధారిత, బయోమెట్రిక్ ఆథెంటికేషన్ పద్ధతులు రెండూ వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని భావిస్తున్నారు. లావాదేవీలను సురక్షితం చేయడానికి ఇలా బహుళ ఎంపికలను అందిస్తుంది.
సైబర్ మోసాలు తగ్గుతాయి..
ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ ఐడీ వంటి బయోమెట్రిక్ ఆథెంటికేషన్ వల్ల సైబర్ మోసాలు తగ్గుతాయని భావిస్తున్నారు. యూపీఐ (UPI)చెల్లింపుల కోసం బయోమెట్రిక్ వెరిఫికేషన్ ప్రవేశపెట్టడం మోసాలను తగ్గించే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు. అయితే, ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ఎన్పీసీఐ స్పష్టంగా చెప్పడం లేదు. అలాగే, ఏ యూపీఐ యాప్స్ (UPI apps) దీనిని సపోర్ట్ చేస్తాయో కూడా కచ్చితంగా తెలియదు. గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే, పేటీఎం వంటి పాపులర్ ప్లాట్ ఫామ్ లు మార్కెట్లో ముందంజలో ఉన్నందున, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ వినియోగదారులు పిన్ లేదా బయోమెట్రిక్స్ లో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది.