JEE Mains 2025 results: జేఈఈ మెయిన్స్ 2025 ఫలితాలను ఫిబ్రవరి 11, 2025న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. జేఈఈ మెయిన్స్ 2025 లో మొత్తం 14 మంది 100 పర్సంటైల్ సాధించారు. వారిలో ఇద్దరు తెలుగువారున్నారు.

JEE Mains 2025 results: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్స్ సెషన్ 1కు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.in నుంచి తమ స్కోర్ కార్డులను చెక్ చేసుకుని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఫలితాలను చెక్ చేసుకోవడానికి అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్, కాప్చా కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. జేఈఈ మెయిన్స్ 2025 పరీక్షలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల వివరాలను ఎన్టీఏ వెల్లడించింది.
మొత్తం 14 మంది..
జేఈఈ మెయిన్స్ 2025 పరీక్షలో మొత్తం 14 మంది 100 పర్సంటైల్ సాధించారు. వారిలో ఇద్దరు తెలుగువారున్నారు. ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన గుత్తికొండ సాయి మనోజ్ఞ, తెలంగాణకు చెందిన మణిబ్రత మజీ 100 పర్సంటైల్ సాధించారు. ఈ సంవత్సరం జేఈఈ మెయిన్ పేపర్ 1 కు మొత్తం 12,58,136 మంది హాజరయ్యారు.
జనవరిలో పరీక్షలు
జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పేపర్ 1 (బీఈ/బీటెక్)ను జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు షిఫ్టుల్లో ఎన్టీఏ నిర్వహించింది. జేఈఈ మెయిన్స్ (బీఆర్క్/బీప్లానింగ్) పేపర్-2ను జనవరి 30న మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు రెండో షిఫ్టులో నిర్వహించారు.
ఫిబ్రవరి 4న ప్రొవిజనల్ ఆన్సర్ కీ
ఈ జేఈఈ మెయిన్స్ 2025 ప్రొవిజనల్ ఆన్సర్ కీని 2025 ఫిబ్రవరి 4న విడుదల చేయగా, అభ్యర్థులు 2025 ఫిబ్రవరి 6 వరకు ప్రాథమిక కీని సవాలు చేసే అవకాశం కల్పించారు. అందుకు అభ్యర్థులు ప్రతి ప్రశ్నకు రూ.200 నాన్ రిఫండబుల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జేఈఈ మెయిన్స్ 2025 ఫైనల్ ఆన్సర్ కీని 2025 ఫిబ్రవరి 10న ఎన్టీఏ విడుదల చేసింది. తుది ఆన్సర్ కీలో జేఈఈ మెయిన్ సెషన్ 1, పేపర్ 1లో వివిధ షిఫ్టుల్లో అడిగిన 12 ప్రశ్నలను ఎన్టీఏ తొలగించింది. ఆ షిఫ్ట్ ల్లో పరీక్షకు హాజరైనవారికి ఫుల్ మార్క్స్ ఇవ్వనున్నారు.