Hyderabad NIMS Courses : హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెన్స్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 27వ తేదీ లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం దరఖాస్తుల హార్డ్ కాపీలను నిమ్స్ అడ్రస్ కు పంపాలి.
Hyderabad NIMS Courses : హైదరాబాద్ లోని నిమ్స్ మెడికల్ కాలేజీలో 2024-25 విద్యా సంవత్సరానికి బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, హెల్త్ సైన్సెస్ లో బీఎస్సీ డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా బీఎస్సీ నర్సింగ్ లో 100 సీట్లు, బీపీటీలో 50 సీట్లు, బీఎస్సీ డిగ్రీ(అలైడ్ హెల్త్ సైన్సెస్) కోర్సుల్లో 100 సీట్లు భర్తీ చేయనున్నారు. ఈఏపీసెట్ లో అర్హత సాధించిన వారు ఆగస్టు 23వ తేదీ లోపు ఆన్ లైన్ (https://www.nims.edu.in/)లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే దరఖాస్తుల హార్డ్ కాపీలను ఆగస్టు 27వ తేదీ లోపు నిమ్స్ (The Associate Dean, Academic-2, 2nd floor, Old OPD Block, Nizam’s Institute of Medical Sciences, Hyderabad 500 082) సంబంధిత అడ్రస్ కు పంపాలి. జనరల్, బీసీ అభ్యర్థులు రూ.2,500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. తెలంగాణ ఈఏపీసెట్ లో ర్యాంకు, ఇంటర్ మార్కుల ఆధారంగా కోర్సులకు సంబంధించి మెరిట్ జాబితా విడుదల చేస్తారు. అనంతరం కౌన్సెలింగ్ చేపట్టారు.
బీఎస్సీ నర్సింగ్ కోర్సు
బీఎస్సీ నర్సింగ్ కోర్సు (మహిళలకు మాత్రమే). ఈ కోర్సులో 100 సీట్లు ఉన్నాయి. కోర్సు వ్యవధి నాలుగేళ్లు. ఇంటర్ లో బైపీసీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. సంబంధిత సబ్జెక్టులో జనరల్ అభ్యర్థులు 45 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు 40 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఓపెన్ స్కూల్ నుంచి సైన్స్ సబ్జెక్టులలో ఇంటర్ పాస్ అయినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓపెన్ ఇంటర్ విద్యార్థులు ఇంగ్లిష్ సబ్జెక్టు తప్పనిసరిగా చదివి ఉండాలి. డిసెంబర్ 31, 2024 నాటికి 17-35 సంవత్సరాల మధ్య గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులకు వయో సడలింపు ఉంటుంది.
బీపీటీ కోర్సు
ఫిజియోథెరపీ(బీపీటీ)లో 50 సీట్లను భర్తీ చేయనున్నారు. ఈ కోర్సు వ్యవధి 4.5 సంవత్సరాలు. ఇంటర్మీడియట్ లో బైపీసీ గ్రూప్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్న వారు అర్హులు. లేదా ఒకేషనల్ ఫిజియోథెరపీ బ్రిడ్జ్ కోర్సు చేసిన వారు అర్హులే. అభ్యర్థులు తెలంగాణ ఈఏపీసెట్ లో అర్హత సాధించి ఉండాలి. ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు డిసెంబర్ 31, 2024 నాటికి 17 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు వారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులకు వయోసడలింపు ఉంటుంది.
బీఎస్సీ(హెల్త్ సైన్సెస్) కోర్సు
4 ఏళ్ల బీఎస్సీ (అలైడ్ హెల్త్ సైన్సెస్) కోర్సులో 100 సీట్లు ఉన్నాయి. అనస్తీషియా టెక్నాలజీ 10, డయాలసిస్ థెరపీ 20, కార్డియోవ్యాస్కూలర్ టెక్నాలజీ 12, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ 12, న్యూరో టెక్నాలజీ 6, పర్‌ఫ్యూషన్ టెక్నాలజీ 4, ఎమర్జెన్సీ, ట్రామాకేర్ టెక్నాలజీ 8, రేడియోగ్రఫీ, ఇమేజింగ్ టెక్నాలజీ 10, రేడియేషన్ థెరపీ టెక్నాలజీ 4, రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ 10, ట్యాన్స్ ఫ్యూషన్ మెడిసిన్ 4 సీట్లు ఉన్నాయి. ఇంటర్మీడియట్ లో బైపీసీ గ్రూప్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. తెలంగాణ ఈఏపీసెట్ లో అర్హత సాధించి ఉండాలి.