BBS Notification: ఏపీలో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. పలు కాలేజీల్లో యాజమాన్య కోటాలో సీట్లను భర్తి చేయనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. అప్లికేషన్ లాస్ట్ డేట్ ఆగస్టు 21గా నిర్ణయించారు.
రాష్ట్రంలోని ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి.. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో యాజమాన్య కోటా (మేనేజ్‌మెంట్ కోటా), గతేడాది ప్రారంభించిన ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ ఎంబీబీఎస్ సీట్లు.. తిరుపతిలోని స్వీమ్స్ కింద ఉన్న పద్మావతి మహిళా మెడికల్ కాలేజీలో ఎన్ఆర్ఐ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఆయా కాలేజీల్లో సీటు కోసం దరఖాస్తు దాఖలు చేసేందుకు గడువు ఆగస్టు 21గా నిర్ణయించారు. ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
నీట్ యూజీ-2024 అర్హత సాధించిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 21 తేదీ రాత్రి 9 గంటల వరకు గడువు ఉంది. అదనపు ఫీజుతో ఆగస్టు 23వ తేదీ సాయంత్ర 6 గంటల వరకు సమయం ఉంది. అయితే.. ఆగస్టు 16 (శుక్రవారం) సాయంత్రం 7 గంటల నుంచి ఆగస్టు 18 (ఆదివారం) రాత్రి 9 గంటల వరకూ ఆన్‌లైన్ అప్లికేషన్ అందుబాటులో ఉండదు. ఈ సమయంలో కన్వీనర్ కోటాలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలుండదని ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు వివరించారు. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ( https://apuhs-ugadmissions.aptonline.in/MBBSMQ/Home/Home ) ద్వార అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫీజు..
యాజమాన్య కోటా సీట్లలో ప్రవేశాల కోసం దరఖాస్తు దాఖలు చేసే సమయంలో అప్లికేషన్ ఫీజు రూ.10,620 చెల్లించాల్సి ఉంటుంది. అదనపు ఫీజు రూ.30,620తో ఆగస్టు 21 తేదీ రాత్రి 9 గంటల నుంచి ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. షెడ్యూల్ ప్రకారం.. ఫేజ్-II, ఫేజ్-III వెబ్‌ఆప్షన్‌ల కోసం నోటీసు జారీ చేయడానికి ముందు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
యూనివర్సిటీ, ట్యూషన్ ఫీజులు ఇలా..
ప్రభుత్వ కాలేజీల్లో సెల్ఫ్‌ఫైనాన్సింగ్‌ల్లో కేటగిరీ-బీ1, కేటగిరీ-బీ2ల్లో సీట్లకు యూనివర్సిటీ ఫీజు ఎంబీబీఎస్‌కు రూ.25,100, డెంటల్‌కు రూ.16,100 ఉంటుంది. ప్రభుత్వ కాలేజీల్లో ఎన్‌ఆర్ఐ కేటగిరీ-సీ, స్వీమ్స్‌లో యూనివర్శిటీ ఫీజు ఎంబీబీఎస్‌కు రూ.65,600, డెంటల్‌కు రూ.40,100గా ఉంది. ట్యూషన్ ఫీజు సెల్ఫ్ పైనాన్సింగ్ సీట్లకు రూ. 12 లక్షలు, ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్లకు రూ.20 లక్షలు ఉంటుంది.
మేనేజ్‌మెంట్ కోటాల్లో ట్యూషన్ ఫీజు కేటగిరీ- బీ సీట్లకు ఏడాదికి ఎంబీబీఎస్‌కి రూ.13.20 లక్షలు, బీడీఎస్‌కు రూ.4.40 లక్షలు ఉంటుంది. అలాగే కేటగిరీ-సీ (ఎన్ఆర్ఐ) ఏడాదికి ఎంబీబీఎస్‌కి రూ.39.60 లక్షలు, బీడీఎస్‌కు రూ.13.20 లక్షలు ఉంటుంది. దరఖాస్తు సమయంలో నియమ నిబంధనల్లో సందేహాల నివృత్తి చేసుకోవడానికి 8978780501, 7997710168 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చని వర్సిటీ అధికారులు వెల్లడించారు. సాంకేతిక సమస్యలపై 9000780707 ఫోన్ నెంబర్‌ను సంప్రదించాల్సి ఉంటుందని రిజిస్ట్రార్ డాక్టర్ రాధికా రెడ్డి వివరించారు.
( రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు )