AP EAPCET Counselling 2024: ఏపీలో ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఆగస్టు 19వ తేదీ నుంచి ఇంజనీరింగ్ తుది విడత ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు ప్రకటించారు. ఆగస్టు 26వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు.
ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్దేశించిన ఏపీఈఏపీసెట్ 2024కు సంబంధించి అధికారులు కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 19వ తేదీ నుంచి తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ మేరకు సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు, ప్రవేశాల కన్వీనర్ గణేష్ కుమార్ వివరాలను వెల్లడించారు.
ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు ప్రక్రియను విద్యార్ధులు ఆగస్టు 19 నుంచే చేసుకోవచ్చని తెలిపారు. ఆగస్టు 21 లోపు పూర్తి చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆగస్టు 19 నుండి ఆగస్టు 22 వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుందని పేర్కొన్నారు.
ఆగస్టు 20 నుంచి 22 వరకు 3 రోజుల పాటు వెబ్ ఆప్షన్ల ఎంపిక పూర్తి చేసుకోవాలని కన్వీనర్ స్పష్టం చేసారు. ఐచ్చికాల మార్పునకు ఆగస్టు 23వ తేదీని నిర్దేశించామన్నారు. ఆగస్టు 26 వతేదీన సీట్ల కేటాయింపును పూర్తి చేస్తామని తెలిపారు.
సెల్స్ జాయినింగ్, కళాశాలలో రిపోర్టింగ్ కోసం ఆగస్టు 26 నుంచి ఆగస్టు 30 వరకు ఐదు రోజుల పాటు అవకాశం ఉంటుందన్నారు. ఇప్పటికే జులై 19వ తేదీ నుండి తరగతులు ప్రారంభం అయ్యాయని కన్వీనర్ వివరించారు. విద్యార్థులు ఐచ్ఛికాల ఎంపిక సందర్భంలో ఓటీపీలను ఇతరులకు ఇవ్వవద్దని సూచించారు. అది సమస్యలకు దారి తీస్తుందని హెచ్చరించారు. https://eapcet-sche.aptonline.in/EAPCET/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
AP EAMCET Seat Allotment : ఇలా చెక్ చేసుకోండి
- ఏపీ ఎంసెట్ మొదటి, రెండో విడత కౌన్సెలింగ్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు https://eapcet-sche.aptonline.in/EAPCET/# వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలో కనిపించే Download of Allotment Order అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
- సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ అలాట్ మెంట్ అర్డర్ కాపీ డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి అలాట్ మెంట్ కాపీని పొందవచ్చు.
ఏపీ ఈఏపీసెట్-2024 పరీక్షలను కాకినాడ జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 142 పరీక్ష కేంద్రాల్లో మే 16 నుంచి 23 వరకు పరీక్షలు జరిగాయి.
ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 3,62,851 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 3,39,139 మంది పరీక్షలకు హాజరయ్యారు. అంటే 93.47 శాతం మంది పరీక్షలు రాశారు. ఈఏపీసెట్‌లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ కల్పించి వీటి ఆధారంగా ర్యాంకులు ప్రకటించారు.
ఈ ఏడాది ఇంజినీరింగ్ విభాగంలో 2,74,213 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,58,374 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,95092 మంది ఉత్తీరణ సాధించారు. అగ్రికల్చర్ విభాగంలో 88,638 మంది దరఖాస్తు చేసుకోగా 80,766 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 70,352 మంది ఉత్తీర్ణత సాధించారు.
AP EAMCET Rank 2024: మీ ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి?
- Step 1 : అభ్యర్థులు ముందుగా ఈ వెబ్ సైట్ https://cets.apsche.ap.gov.in/ లింక్ పై క్లిక్ చేయండి.
- Step 2 : అనంతరం హోంపేజీలో ఏపీ ఈఏపీసెట్ 2024 పై క్లిక్ చేయండి.
- Step 3 : హోంపేజీలో రిజల్ట్స్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- Step 4 : విద్యార్థి రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ నమోదు చేసి ఫలితాలు పొందవచ్చు.