రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వివరాలను వెల్లడించింది. ఆగస్టు 16వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో కన్వినర్ కోటా ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ శుక్రవారం ప్రకటనను జారీ చేసింది. కన్వీనర్ కోటా సీట్లతోపాటు తిరుపతి శ్రీపద్మావతి మహిళా వైద్య కళాశాలలో ప్రవేశాలకు సంబంధించిన సీట్లను భర్తీ చేయనున్నారు.
నీట్ లో అర్హత సాధించిన విద్యార్థులు ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు ఆగస్టు 16వ తేదీని తుది గడువుగా పేర్కొన్నారు. https://drntr.uhsap.in/index/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు. ఈ ఏడాది రాష్ట్రం నుంచి 43,788 మంది నీట్ యూజీ–2024లో అర్హత సాధించారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే 89787 80501, 79977 10168 నంబర్లను సంప్రదించవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు.
రాష్ట్రంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం పరిధిలో 10 ప్రభుత్వ, 11 ప్రైవేటు వైద్య కళాశాలలుండగా… ఎస్వీయూ పరిధిలో 6 ప్రభుత్వ, 7 ప్రైవేటు వైద్య కళాశాలలున్నాయి. మొత్తం 35 వైద్య కళాశాలల్లో 6,210 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, కన్వీనర్ కోటా కింద 3,856 సీట్లు భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 15 శాతం సీట్లు ఆల్ ఇండియా కోటా కింద భర్తీ చేయనున్నారు. మిగిలిన 85 శాతం సీట్లు రాష్ట్ర కోటాలో భర్తీ చేస్తారు.
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునే ఓసీ, బీసీ విద్యార్థులు రూ.2,950 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలు రూ.2,360 దరఖాస్తు రుసుం చెల్లించాలి. విద్యార్థుల దరఖాస్తుల పరిశీలన తర్వాత… మెరిట్ మెరిట్ జాబితాను వెల్లడించనుంది. ఈ ఏడాది నుంచి 36 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకు కాకుండా ఏపీ విద్యార్థులకే కేటాయించనున్నారు. మెరిట్ ఆధారంగానే భర్తీ చేయనున్నారు.
బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలు - కాళోజీ వర్శిటీ నోటిఫికేషన్
మరోవైపు తెలంగాణలోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నుంచి అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా బీడీఎస్, ఎంబీబీఎస్ కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు. వైద్య కళాశాల్లో కన్వీనర్((కాంపీటెంట్)) కోటా సీట్లను భర్తీ చేస్తారు. నీట్ 2024లో అర్హత సాధించిన అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. https://www.knruhs.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ పూర్తి చేయాలి.
హెల్త్ వర్శిటీ షెడ్యూల్ ప్రకారం…. ఆగస్టు 3వ తేదీన నోటిఫికేషన్ విడుదలైంది. ఇవాళ్టి (ఆగస్టు) నుంచి ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సంబంధింత సర్టిఫికెట్లను స్కాన్ చేసి అప్ లోడ్ చేయటం తప్పనిసరి. ఆగస్టు 13వ తేదీతో ఈ గడువు ముగుస్తుంది.
ధ్రువపత్రాల పరిశీలన తర్వాత… ప్రొవిజనల్ మెరిట్ జాబితాను ప్రకటిస్తారు. తరగతులతో నిర్వహణతో పాటు మరిన్ని వివరాలను త్వరలోనే విడుదల చేస్తామని షెడ్యూల్ పేర్కొన్నారు. https://www.knruhs.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి తాజా వివరాలను తెలుసుకోవచ్చని సూచించారు.
అభ్యర్థులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే 9392685856, 9059672216 నెంబర్లను సంప్రదించవచ్చు. tsmedadm2024@gmail. com మెయిల్ ద్వారా కూడా సమస్యలను చేరవయవచ్చు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ కోసం రూ.3500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2900 చెల్లించాలి.