హిందువుల ముఖ్యమైన పండగల్లో ముక్కొటి లేదా వైకుంఠ ఏకాదశి ఒక్కటి. ఏకాదశులు ఒక సంవత్సరంలో 24 వస్తాయి. అయితే సూర్యుడు ఉత్తరాయణములోకి వచ్చే ముందు ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని అంటారు.
ఈ వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవ దేవాలయాలలో గల ఉత్తర ద్వారము ద్వారా తెల్లవారుజాము నుంచే భక్తులు భగవంతుని దర్శించుకుంటారు.
ఈ వైకుంఠ ఏకాదశి రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై ముక్కోటి దేవతలతో భూలోకానికి దిగివచ్చి తమ భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. అంతే కాదు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందున దీనిని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా ఆధ్యాత్మిక పెద్దలు చెబుతారు.
విష్ణుపురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్నా మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడనీ, తమ కథ విని, వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠం ప్రవేశం కల్పించాలనీ వారు కోరారు. అందుజేతనే ఆ రోజును వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజు భక్తులు ఆ ఉత్తరద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకొంటారు.
ఈ ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి రోజు పూజ, జపం, ధ్యానం, ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి. వైకుంఠ ఏకాదశి రోజు పూర్తిగా రోజు మొత్తం ఉపవాసం ఉండాలి.
- అసత్య మాడరాదు.
- చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు.
ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. తులసి తీర్థం తప్ప ఏదీ తీసుకోకూడదలని చెపుతారు. ఈరోజు ఉపవసించినవారు పాప విముక్తులవుతారంటారు. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం. దైవానికి దగ్గరవాలనేదే ఉపవాసంలోని ముఖ్య ఆశయం. అంతే కాదు ఈ ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం వలన ఆరోగ్యముగా ఉంటారు.