నిజాం రాష్ట్రం ఆంధ్ర మహాసభ నాయకత్వంలో భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా నిలబడ్డది, పోరాటాలకు స్ఫూర్తినిచ్చింది, ఆమె చరిత్ర తెలంగాణకు గర్వకారణం. వరంగల్ జిల్లా రామపర్తి మండలం కిష్టాపూర్ గ్రామంలో ఓరుగంటి సాయిలు, మల్లమ్మ దంపతులకు చాకలి ఐలమ్మ 1895 సెప్టెంబర్ 26న జన్మించింది. తన 14వ ఏటనే జనగామ జిల్లా చిట్యాల గ్రామానికి చెందిన నరసయ్యతో బాల్య వివాహం జరిగింది. ఐలమ్మ సంతానం ఐదుగురు కుమారులు ఒక కుమార్తె, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం కావడంతో కులవృత్తితో పాటు వ్యవసాయం కూడా చేసేవారు.
వారికి సొంత భూమి లేకపోవడం వల్ల మల్లంపల్లి మక్తదార్ ఉత్తమ రాజు కొండలరావు దగ్గర నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకున్నారు. ఐలమ్మ చురుకైన మహిళ, ధైర్యవంతురాలు, కలుపుగోలు మనిషి, ఆమె కు ఊరి ప్రజలతో మంచి సంబంధాలు ఉండడం వల్ల ఊరి రైతులు వ్యవసాయ కూలీల సహకారంతో వ్యవసాయం చేసేవారు తిండిగింజలు పోను మిగులు ఆదాయంతో సంతోషంగా జీవిస్తున్న వారి జీవితంలోకి పెత్తందారీ భూస్వాములు అడుగు పెట్టి వారి పంటల దోచుకోడానికి అరాచకం సృష్టించారు. పాలకుర్తి పోలీస్ పటేల్ శేషగిరిరావు ఐలమ్మను కుటుంబంతో వచ్చి తన పొలంలో పని చేయాలని ఒత్తిడి చేయడంతో పని చేయడానికి నిరాకరించింది. పాలకుర్తి పట్వారీ పప్పులుడకక ఐలమ్మ కుటుంబం కమ్యూనిస్టుల్లో చేరిందని విసునూర్ దేశ్‌ముఖ్ రాపాక రాంచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అగ్రనాయకులతో పాటు ఐలమ్మ కుటుంబాన్ని ఇరికించారు. అయినప్పటికీ న్యాయస్థానంలో తీర్పు దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా వచ్చింది.
వంగి దండాలు పెట్టే రోజుల్లో సివంగిలా గర్జించింది ఐలమ్మ. ఆమె కొంగు నడుముకు చుడితే దొరతనం తోక ముడిచింది. ఆమె కొడవలి చేతబడితే పీడిత జనం కడలిలా తరలివచ్చారు. ఆడదని అలుసుగా చూసిన కంట్లో నలుసు అయింది. ఆమె తెగింపుతోనే వెట్టిచాకిరీ ముగింపునకు వచ్చింది. దొరను ఢీ కొన్న ధీర వనిత. నడీడులో గడీలను గడగడలాడించింది. ఎత్తిపట్టిన చేతిలో ఎర్రజెండా అయింది. ఆమె ఎవరో కాదు వీరనారి చాకలి ఐలమ్మ. ఆశయమే ఆశగా శ్వాసించింది. సాహసంతోనే సహవాసం చేసింది. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాగిన పోరులో మమేకమైంది. భూమి లేకపోతే జిందగీ లేదని రక్తతర్పణం చేసిన బందగి దారిలో నడిచింది. పోరుదారిలో అయినవాళ్లను పోగొట్టుకొని అందరికీ అయినదానిలా నిలిచింది. సంఘముల చేరితే సంగతి చెప్తానన్న దొరకు ఏ గతీ లేకుండా చేసింది.
‘బాంచెన్ నీ కాల్మొక్తా’ అన్న జనం చేత బందూకు చేతబట్టించింది. వెట్టిచాకిరీ చేసేవారు అలగా జనం కాదు, సహస్ర వృత్తులు చేసే సకల జనం అని చాటి చెప్పింది. ఐలమ్మ కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బతీస్తే సంఘం పట్టు కోల్పోతుందని భావించిన రాంచంద్రరెడ్డి దేశ్‌ముఖ్, పోలీస్ పటేల్‌ను పిలిపించుకొని, ఐలమ్మ కౌలుకు తీసుకున్న భూమిని అక్రమంగా తన పేరున రాయించుకున్నాడు. భూమి తనదని, పండించిన ధాన్యం తనదేనని పంటను కోసుకు రమ్మని వంద మందిని దేశ్‌ముఖ్ పంపాడు. ఆంధ్రమహాసభ కార్యకర్తలు వరిని కోసి, వరికట్టం కొట్టి ధాన్యాన్ని ఐలమ్మ ఇంటికి చేర్చారు. భీం రెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల రాంచంద్రారెడ్డి, చకిలం యాదగిరిలు సైతం ధాన్యపు బస్తాలను భుజాలపై మోశారు. ధాన్యాన్ని ఎత్తుకెళ్లారు.
ఎల్లమ్మ చేతిలో రెండు సార్లు పరాజయం పాలైన రామచంద్రారెడ్డి దేశముఖ్ ఐలమ్మ ఇంట్లో ఉన్న ధనాన్ని, ధాన్యాన్ని దోచుకొని, ఇల్లు కూడా తగుల బెట్టించారు. ఐలమ్మ కూతురు సోమ నరసమ్మపై అత్యాచారం కూడా చేశారు. ‘ఈ దొరగాడు ఇంతకంటే ఇంక నన్ను ఏ విధంగా నష్టపెట్టగలడు’ అని తనలో తాను ప్రశ్నించుకొన్నది. నీ దొరోడు ఏం చేస్తాడ్రా’ అని మొక్కవోని ధైర్యంతో రోకలి బండ చేతబూని గూండాలను తరమి కొట్టింది. కాలినడకన వెళ్లి దొరకు సవాలు విసిరింది. ఐలమ్మ భూపోరాటం విజయంతో పాలకుర్తి దొర ఇంటిపై కమ్యూనిస్టులు దాడిచేసి ధాన్యాన్ని ప్రజలకు పంచారు. అలాగే 90 ఎకరాల దొర భూమిని కూడా ప్రజలకు పంచారు. ఐలమ్మ భూపోరాటంతో మొదలుకొని సాయుధ పోరాటం చివరి వరకు నాలుగు వేల మంది ఉత్పత్తి కులాల వారు అమరులయ్యారు.
10 లక్షల ఎకరాల భూమి పంపకం జరిగింది. ఆమె తెగువ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి బలం పెంచింది, కమ్యూనిస్టు పార్టీని బతికించింది ఎంతో మంది పేదలకు మేలు చేసింది. ఐలమ్మ త్యాగం వల్ల, పోరాటం వల్ల ఎన్నో ఫలితాలు సాధించింది. కానీ ఫలితాలు ఆమెకు దక్కలేదు. స్వాతంత్య్ర సమరయోధుల పింఛను రాలేదు. పోరాట యోధురాలిగా గుర్తింపు రాలేదు. తాను కౌలుకు చేసిన భూమి కూడా తనకు దక్కలేదు. ఆమె ముసలితనంలో కూడా బతుకు పోరాటమే చేసింది. గొప్ప పోరాట యోధురాలు అనామకురాలు గానే బతుకు వెళ్లదీసింది. చివరి రోజుల్లో తిండి లేక తిప్పలు పడింది. కుటుంబ సభ్యులు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఆమెను ప్రభుత్వాలు పట్టించుకోలేదు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ పేరు చాకలి ఐలమ్మది. 10 సెప్టెంబర్, 1985 వీరవనిత 37వ వర్ధంతి సందర్భంగానైనా ప్రభుత్వం ఆమె జీవిత చరిత్రను పాఠ్యాంశంలో చేర్చి జయంతి, వర్ధంతులను రాష్ట్ర ప్రభు త్వం అధికారికంగా నిర్వహించాలి. కేంద్ర ప్రభుత్వం ఆమె కు భారతరత్న ప్రకటించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి.