TG SET Exam 2024 Results : తెలంగాణ సెట్ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీలు ఇటీవలే విడుదలయ్యాయి. వీటిపై అభ్యంతరాల గడువు సెప్టెంబర్ 26వ తేదీతో ముగియనుంది. అభ్యంతరాల పరిశీలన తర్వాత త్వరలోనే ఫలితాలను ప్రకటించనున్నారు.
తెలంగాణ సెట్ 2024 ప్రిలిమినరీ కీలు విడుదలయ్యాయి. అయితే వీటిపై సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. ఈ గడువు సెప్టెంబర్ 26వ తేదీతో పూర్తి కానుంది. ఆయా సబ్జెక్టుల్లో ఉన్న అభ్యంతరాలను http://telanganaset.org/ వెబ్ సైట్ ద్వారా పంపాలని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత ఫైనల్ కీలను ప్రకటిస్తారు. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత తుది ఫలితాలను వెల్లడించనున్నారు. త్వరలోనే రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఆగస్టు 28, 29, 30, 31వ తేదీల్లో ఈ పరీక్షలును నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈ ఏడాది కూడా తెలంగాణ సెట్ - 2024 పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించింది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తారు.
అభ్యంతరాలను తెలిపే ప్రాసెస్….
- అభ్యర్థులు ముందుగా http://telanganaset.org/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి,
- హోం పేజీలో కనిపించే Login For Answer Key Objection (Online) లింక్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్, మీ పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
- ఆ తర్వాత ప్రాథమిక కీలపై ఉన్న అభ్యంతరాలను తెలపాలి.
తెలంగాణ సెట్ ను 2 పేపర్లలో నిర్వహిస్తారు. పేపర్-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. ఇక పేపర్-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులతో నిర్వహిస్తారు. కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో మూడు గంటల పాటు పరీక్ష నిర్వహిస్తారు.
జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రిసెర్చ్ ఆప్టిట్యూడ్ -పేపర్-1 గా ఉంటుంది. పేపర్ - 2 అనేది అభ్యర్థి పీజీ పూర్తి చేసిన సబ్జెక్టుపై రాసుకోవాల్సి ఉంటుంది. ఇందులో జాగ్రఫీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్ సైన్స్, లైఫ్ సైన్సెస్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, మేనేజ్‌మెంట్, హిందీ, హిస్టరీ, లా , మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, సంస్కృతం, సోషల్ వర్క్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, లింగ్విస్టిక్స్ సబ్జెక్టులు ఉంటాయి.
ఆబ్జెక్టివ్ తరహాలో 50 ప్రశ్నలకు పేపర్–1 ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కులు కేటాయిస్తారు. ఇందులో అభ్యర్థుల బోధన/పరిశోధన ఆప్టిట్యూడ్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలుంటాయి. అలాగే తార్కిక సామర్థ్యం, గ్రహణశక్తి, భిన్నమైన ఆలోచనల దృక్పథాన్ని పరిశీలించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. ఈ పేపర్ 2 లో అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్టు నుంచి ఆబ్జెక్టివ్ తరహాలో ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కుల చొప్పున 100 ప్రశ్నలను అడుగుతారు.