గుంపు గుంపు గునుగుల్లా నేరియాలో
గుంపు గునుగు పూల నేరియాలో
తెంపరాదే నాయన్న నేరియాలో
గుల్లల్ల నింపరాదే నేరియాలో
పచ్చపచ్చ తంగేళ్ల నేరియాలో
పచ్చ తంగేడి పూల నేరియాలో
తెంపరాదు నాయన్న నేరియాలో
గంపల్ల కెత్తరాదే నేరియాలో
అడవిలున్న చెట్ల పూల నేరియాలో
తీగవారే కట్లపూలు నేరియాలో
తెంపరాదే నాయన్న నేరియాలో
మొంటెల్ల నింపరాదే నేరియాలో
మాయింటి వదినలు నేరియాలో
పువ్వులన్నీ ఏరినారు నేరియాలో
సక్కాని పువ్వులన్నీ నేరియాలో
సాపలల్ల పోసినారె నేరియాలో
తీరోక్క రంగులద్ది నేరియాలో
తీరితీరి పువ్వులాయే నేరియాలో
నూటొక్క వరుసల్లో నేరియాలో
పేర్చినారు బతుకమ్మ నేరియాలో
రవ్వాల గాజులేసి నేరియాలో
చెక్కుడు బిల్లలు పెట్టి నేరియాలో
చుక్కబొట్టు పెట్టుకొని నేరియాలో
దిద్దినారు కాటుక నేరియాలో
సిద్ధిపేట చీరల్లో నేరియాలో
సిరిసిల్లా రవికాలు నేరియాలో
ముక్కూకు ముక్కెరమ్మ నేరియాలో
ముత్యాల దండలమ్మ నేరియాలో
బతుకమ్మలెత్తుకొని నేరియాలో
బజారులన్నీ కదిలే నేరియాలో
ఆడినారు బతుకమ్మ నేరియాలో
ఆడపిల్లలంతా కూడి నేరియాలో
మలీద ముద్దాలు నేరియాలో
మంచి శనిగెలు పులిహోర నేరియాలో
తీరోక్క వంటలతో నేరియాలో
బతుకమ్మ సద్దులు నేరియాలో
మావూరి బతుకమ్మ నేరియాలో
మళ్ళీ మళ్ళీ రావే బతుకమ్మ నేరియాలో
ఎల్లి రావే బతుకమ్మ నేరియాలో
తల్లి సిరులనిచ్చే బతుకమ్మ నేరియాలో