హిమవంతునింట్ల పుట్టి ఉయ్యాలో
హిమంతునింట్ల పెరిగి ఉయ్యాలో
విదియ పోయి తదియ నాడు ఉయ్యాలో
కాంతలంతా కూడి ఉయ్యాలో
గన్నేరు కొమ్మ తెచ్చి ఉయ్యాలో
గౌరి పూజలు చేసి ఉయ్యాలో
వత్తి పొత్తులు పెట్టి ఉయ్యాలో
ఒడిబియ్యం పోసి ఉయ్యాలో
ఒప్పైన సద్ది కట్టి ఉయ్యాలో
శంభునికి అప్పగించి ఉయ్యాలో
మాయమ్మ గౌరి దేవి ఉయ్యాలో
పోయీ రావమ్మా ఉయ్యాలో
అత్తవాడల్లకు ఉయ్యాలో
పోయీ రావమ్మా ఉయ్యాలో
చీరెలు కొదవనమ్మా ఉయ్యాలో
సారెలు కొదవనమ్మ ఉయ్యాలో
ఆరు నెలలున్నాది ఉయ్యాలో
సంక్రాంతి పండుగ ఉయ్యాలో
పండుగ నాటికి ఉయ్యాలో
నిను తొలుకొస్తమ్మా ఉయ్యాలో
కూర్చుండ పీటెస్త ఉయ్యాలో
కుదుర్ల దొంతులేస్తా ఉయ్యాలో
ఆదేటి దొంతులేస్తా ఉయ్యాలో
అపరంజి మెట్లేస్తా ఉయ్యాలో
మల్లెమొగ్గ చీరెలిస్తా ఉయ్యాలో
అద్దాల రవికలిస్తా ఉయ్యాలో
నీకు దగ్గ సొమ్ములిస్తా ఉయ్యాలో
గంధం గిన్నెలిస్తా ఉయ్యాలో
నీలాల కమ్మలిస్తా ఉయ్యాలో
నిలువుటద్ధమిస్తా ఉయ్యాలో
ఎక్కే అందలాలిస్తా ఉయ్యాలో
పట్టపుటేనుగు లిస్తా ఉయ్యాలో
పది నూర్ల రూకలిస్తా ఉయ్యాలో
పంచ కల్యాణి నిస్తా ఉయ్యాలో
మాయమ్మ గౌరమ్మ ఉయ్యాలో
పోయిరా గౌరమ్మా ఉయ్యాలో
పోయిరా గౌరమ్మా ఉయ్యాలో
మళ్ళీ రా గౌరమ్మా ఉయ్యాలో