Indian Army Recruitment: ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్‌ కావాలా? జేఈఈ స్కోరుతో TES-56 ద్వారా మంచి అవకాశం..!

 భారత సైన్యంలో అధికారిగా చేరాలని కలలు కనే ఇంటర్‌ విద్యార్థులకు ఇండియన్ ఆర్మీ సువర్ణావకాశాన్ని ప్రకటించింది. 12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థుల కోసం టెక్నికల్ ఎంట్రీ స్కీమ్‌ (TES-56) 2027 కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇటీవల నిర్వహించిన జేఈఈ మెయిన్‌ 2026 పరీక్షలో అర్హత సాధించిన అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చని ఆర్మీ వెల్లడించింది.

ఎవరు అర్హులు?

2027 జనవరి నుంచి ప్రారంభమయ్యే TES-56 కోర్సుకు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ (PCM) సబ్జెక్టులతో 10+2 లేదా సమాన విద్యార్హత పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు. అదనంగా జేఈఈ మెయిన్‌ 2026లో మంచి స్కోరు సాధించి ఉండాలి. మొత్తం 90 ఖాళీలకు నియామకాలు చేపడుతున్నారు.

ఎంపికైన అభ్యర్థులకు నాలుగేళ్లపాటు సాంకేతిక శిక్షణ అందించనున్నారు. ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఇంజినీరింగ్ డిగ్రీతో పాటు భారత సైన్యంలో ‘లెఫ్టినెంట్’ హోదాలో శాశ్వత ఉద్యోగం లభిస్తుంది.

అర్హత కలిగిన అభ్యర్థులు జూన్‌ 12, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హతలు మరియు వయోపరిమితి

  • గుర్తింపు పొందిన విద్యా బోర్డు నుంచి కనీసం 60 శాతం మార్కులతో PCM సబ్జెక్టుల్లో 10+2 ఉత్తీర్ణత తప్పనిసరి.
  • జేఈఈ మెయిన్‌ 2026 స్కోరు తప్పనిసరిగా ఉండాలి.
  • నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
  • 2027 జనవరి 1 నాటికి అభ్యర్థుల వయసు 16½ సంవత్సరాల నుంచి 19½ సంవత్సరాల మధ్య ఉండాలి.
  • శిక్షణ కాలంలో మిలటరీ సర్వీస్ పే కింద స్టైపెండ్‌ అందిస్తారు.

ఎంపిక విధానం ఇలా..

మొదటగా జేఈఈ మెయిన్‌ 2026 స్కోరు ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (SSB) ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి మెడికల్‌ పరీక్షలు నిర్వహించి, తుది మెరిట్‌ లిస్ట్‌ విడుదల చేస్తారు. చివరగా ఎంపికైన అభ్యర్థులకు జాయినింగ్ లెటర్లు జారీ చేస్తారు.

దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి, అవసరమైన డాక్యుమెంట్లను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు.

f