టీజీ ఈఏపీసెట్ 2025 ఫలితాలు విడుదలకు ముహుర్తం ఫిక్స్ అయింది. మే 11వ తేదీన ఉదయం 11 గంటలకు ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు.

ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఈఏపీసెట్ - 2025 పరీక్షలు ముగిశాయి. అయితే ఫలితాల విడుదలపై అధికారికంగా ప్రకటన విడుదలైంది. మే 11వ తేదీన ఉదయం 11 గంటలకు ఫలితాలను ప్రకటించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు జేఎన్టీయూ హైదరాబాద్ నుంచి ప్రకటన విడుదలైంది.
టీజీ ఈఏపీసెట్ 2025 రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలంటే ..?
తెలంగాణ ఈఏపీసెట్-2025 ఫలితాలు ప్రకటించిన తర్వాత https://eapcet.tgche.ac.in/ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థి సాధించిన మార్కులతో పాటు ర్యాంకులు అందుబాటులో ఉంటాయి. ప్రాసెస్ ఎలాగో ఇక్కడ తెలుసుకోండి…
- టీజీ ఈఏపీసెట్-2025 పరీక్షలు రాసిన అభ్యర్థులు https://eapcet.tgche.ac.in/ వెబ్ సైట్లోకి వెళ్లాలి.
- టీజీ ఈఏపీసెట్ రిజల్ట్స్- 2025 లింక్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ, రిజిస్ట్రేషన్ నెంబర్ ను నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
- ఇక్కడ మీ ర్యాంక్(స్కోర్) డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డ్లౌనోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి రిజల్ట్స్ కాపీని పొందవచ్చు.
- ఈఏపీసెట్ అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు చాలా కీలకం. భవిష్యత్ అవసరాల కోసం జాగ్రత్తగా ఉంచుకోవాలి.
ఏప్రిల్ 29 నుంచి మే 4, 2025 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్ విధానంలో తెలంగాణ ఈఏపీసెట్ ప్రవేశ పరీక్షలు నిర్వహించబడ్డాయి. ఇప్పటికే అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ పరీక్షల కీలపై అభ్యంతరాల ప్రక్రియ పూర్తిగా.. ప్రస్తుతం ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలను స్వీకరించారు. మూల్యాంకనంతో పాటు సాంకేతిక అంశాల పరిశీలన ప్రక్రియ పూర్తి కావటంతో ఫలితాలను మే 11వ తేదీన ప్రకటించనున్నారు.
గతేడాది చూస్తే మే 7వ తేదీన ఈఏపీసెట్ పరీక్షలు ప్రారంభం కాగా… 11వ తేదీతో ముగిశాయి. ఆ వెంటనే మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేశారు. మే 18వ తేదీన తుది ఫలితాలను ప్రకటించారు. ఈసారి మే 4వ తేదీనే పరీక్షలు పూర్తికాగా… మే 11వ తేదీన విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు.
టీజీ ఈఏపీసెట్-2025 ఆధారంగా రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ర్యాంక్ తో పాటు రిజర్వేషన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. ఫలితాలను ప్రకటించిన తర్వాత…కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రకటిస్తారు. విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలి. వీటి ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.