KGBV Admissions: ఆంధ్రప్రదేశ్ కస్తుర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో ప్రవేశాలకు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 22 నుంచి కేజీబీవీల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు సమగ్ర శిక్ష ఎస్పీడీ ప్రకటించారు.

KGBV Admissions: ఆంధ్రప్రదేశ్ కస్తుర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాలకు మార్చి 22 నుండి ఆన్ లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. రాష్ట్రంలోని 352 కేజీబీవీల్లో 2025 – 26 విద్యా సంవత్సరానికి 6, 11 తరగతుల్లో ప్రవేశాల కోసం, 7, 8, 9, 10, 12 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం బాలికల నుండి ఆన్ లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు తెలిపారు. ఆన్ లైన్ దరఖాస్తులు మార్చి 22 నుండి ఏప్రిల్ 11 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
ఏపీ కేజీబీవీల్లో అడ్మిషన్లకుే అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్ ( బడి మానేసిన వారు) పేద, ఎస్.సి, ఎస్.టి, బిసి, మైనారిటీ, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు మాత్రమే అడ్మిషన్ కొరకు పరిగణిస్తారు. ఈ దరఖాస్తులను https://apkgbv.apcfss.in/ సైట్ ద్వారా పొందగలరు.
కేజీబీవీల్లో ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం అందుతుంది. సంబంధిత పాఠశాల నోటిఫికేషన్ బోర్డులో నేరుగా చూడవచ్చు. ఏవైనా సమస్యలు, సందేహాలకు 70751 59996, 70750 39990 నంబర్లు సంప్రదించాలని కోరారు.
సమగ్ర శిక్షాకు రూ. 2361 కోట్లు బడ్జెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవతో సమగ్ర శిక్షా ప్రాజెక్టుకు రూ. 2361 కోట్లు, పీఏంశ్రీ పథకానికి రూ. 454 కోట్లు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ నిధులు సమగ్ర శిక్షా పథకంలో అమలవుతున్న కార్యక్రమాలు, భవిత కేంద్రాలను బలోపేతం చేయడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆటిజంతో ఇబ్బంది పడుతున్న దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేకంగా 125 ఆటిజం కేంద్రాలను ఏర్పాటు చేయడానికి వినియోగిస్తామని వెల్లడించారు.
ఆటిజం కేంద్రాల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే తొలిసారి ముందడుగు వేసిందని, ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రశంసిస్తూ.. ‘ప్రారంభం తర్వాత అధ్యయనం చేసి ఇతర రాష్ట్రాల్లో కూడా అమలుపర్చేందుకు కృషి చేస్తామని’ పేర్కొన్నారు.
పాఠశాలల్లో వృత్తి విద్య అభివృద్ధి దిశగా ఒకేషనల్ టీచర్లకు ట్రైనింగ్ వంటి కార్యక్రమాల కోసం నాలుగు జోనల్ సెంటర్లు (రీజనల్ ఒకేషనల్ హబ్) స్థాపించే యోచనలో ఉన్నామన్నారు. రాష్ట్రంలో అన్ని కేజీబీవీల్లో సోలార్ గీజర్లు, బాలికల భద్రత దృష్టిలో ఉంచుకుని కేజీబీవీల్లో, పీఎంశ్రీ పాఠశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. 679 మండలాల్లో కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్లను నియామకం కోసం చర్యలు తీసుకుంటున్నారు.