TGRJC CET Notification 2025: టీఎస్ఆర్జేసీ సెట్ - 2025 నోటిఫికేషన్ జారీ అయింది. ఈ ఎంట్రెన్స్ పరీక్ష ద్వారా గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో(ఫస్ట్ ఇయర్) అడ్మిషన్లు కల్పిస్తారు. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రక్రియ మార్చి 24వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.

తెలంగాణ గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో 2025 - 26 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు పొందేందుకు ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. అర్హులైన విద్యార్థులు… మార్చి 24వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు అధికారులు వివరాలను పేర్కొన్నారు.
చివరి తేదీ ఎప్పుడంటే…?
రాష్ట్రంలో మొత్తం 35 టీఎస్ఆర్జేసీ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో 15 బాలురు, 20 బాలికల కాలేజీలు. ఆన్ లైన్ దరఖాస్తులు మార్చి 24న ప్రారంభం కాగా… ఏప్రిల్ 23వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఎంట్రెన్స్ ద్వారా ఇంటర్ ఫస్ట్ ఇయర్ లోని ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు.
దరఖాస్తు ఫీజు కింద రూ. 200 చెల్లించాలని నోటిఫికేషన్ లో తెలిపారు.ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో విద్యార్థుల ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సీట్ల కేటాయింపు కోసం కౌన్సెలింగ్ ప్రక్రియను కూడా నిర్వహిస్తారు. పూర్తిస్థాయి నోటిఫికేషన్ ను http://tsrjdc.cgg.gov.in/ వెబ్ సైట్ లో పొందుపర్చినట్లు అధికారులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం 040-24734899 నెంబర్ ను సంప్రదించవచ్చు.
పరీక్షా విధానం…!
టీఎస్ఆర్జేసీ సెట్ 2025 ద్వారా 3 వేల వరకు సీట్లను భర్తీ చేసే అవకాశం ఉంది. టీఎస్ఆర్జేసీ ప్రవేశపరీక్షను మల్టీపుల్ ఛాయిస్ విధానంలో మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. విద్యార్థులు ఎంచుకున్న కోర్సు ఆధారంగా సబ్జెక్ట్ ప్రశ్నలు అడుగుతారు. ఎంపీసీ విద్యార్థులకు మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్,బైపీసీ విద్యార్థులకు బయోలజీ, ఫిజిక్స్, ఇంగ్లీష్, ఎంఈసీ విద్యార్థులు ఇంగ్లిష్, సోషల్ స్టడీస్, మ్యాథ్స్‌లో ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రవేశ పరీక్షను హైదరాబాద్ , రంగారెడ్డితో పాటు మరికొన్ని జిల్లాల్లో నిర్వహించనున్నారు. ఈ వివరాలను అధికారిక వెబ్ సైట్ లో చూడొచ్చు..