RRB ALP CBT 2 Schedule : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) సీబీటీ -2 పరీక్షల కొత్త షెడ్యూల్ ను విడుదల చేసింది. మార్చి 19, 20 తేదీలలో జరగాల్సిన పరీక్షను మే 2, 6 తేదీలకు రీషెడ్యూల్ చేసింది. మార్చి 19న మొదటి షిఫ్ట్ లో పరీక్షలు పూర్తి చేసినవారికి కొత్త షెడ్యూల్ నుంచి మినహాయింపు ఇచ్చారు. మార్చి 19న 2వ షిఫ్ట్‌లో, మార్చి 20న మొదటి షిఫ్ట్‌లో పరీక్షలు రాయాల్సిన అభ్యర్థులకు కొత్త షెడ్యూల్ ప్రకటించారు.
అభ్యర్థులు పరీక్షా కేంద్రాలలో మొదటి షిఫ్ట్‌కు ఉదయం 7:30 గంటలకు, రెండో షిఫ్ట్‌కు 12:30 గంటలకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. పరీక్షకు 10 రోజుల ముందు అభ్యర్థుల పరీక్ష సిటీ ఇంటిమేషన్ స్లిప్, పరీక్షకు నాలుగు రోజుల ముందు అడ్మిట్ కార్డులను ఆన్ లైన్ లో ఉంచుతారు. నియామక ప్రక్రియపై తాజా వివరాలను అభ్యర్థులు ఆర్ఆర్బీ అధికారిక వెబ్‌సైట్ లో మాత్రమే చూడాలని అధికారులు సూచించారు.
ఆర్ఆర్బీ ఏఎల్పీ పరీక్ష విధానం
ఆర్ఆర్బీ ఏఎల్పీ సీబీటీ-2ను రెండు భాగాలుగా నిర్వహిస్తారు. పరీక్షకు రెండు గంటల 30 నిమిషాలు సమయం కేటాయిస్తారు. ఈ పరీక్షలో మొత్తం 175 ప్రశ్నలు ఉంటాయి. మొదటి భాగంలో 100 ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు 90 నిమిషాల్లోపు పూర్తి చేయాలి. రెండో భాగంలో 75 ప్రశ్నలు ఉంటాయి. వీటిని 60 నిమిషాలలో పూర్తి చేయాలి. పరీక్షను ఇంగ్లీష్, హిందీతో పాటు 12 ప్రాంతీయ భాషలలో నిర్వహిస్తారు.
పరీక్షలో ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. సీబీటీ-2 బహుళ షిఫ్టులలో నిర్వహిస్తారు. కాబట్టి ఆర్ఆర్బీలు మార్కులను నార్మలైజ్ చేస్తాయి. పార్ట్-ఏలో, జనరల్, ఈడబ్ల్యూయూ కేటగిరీ అభ్యర్థులకు కనీస ఉత్తీర్ణత శాతం 40 కాగా, ఓబీసీ (NCL), ఎస్సీ అభ్యర్థులకు 30 శాతం, ఎస్టీలకు 25 శాతం మార్కులు రావాలి. నియామక ప్రక్రియ తదుపరి దశలకు, అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయడానికి ఆర్ఆర్బీలు పార్ట్ ఏలో సాధించిన మార్కులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. అయితే వర్గాలతో సంబంధం లేకుండా అభ్యర్థులందరూ పార్ట్ బిలో కనీసం 35 శాతం మార్కులను పొందాల్సి ఉంటుంది.
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ లో మొత్తం 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు RRBల అధికారిక వెబ్‌సైట్‌లను తనిఖీ చేయవచ్చు.